www.ysrcongress.net :

80 శాతం అంగీకరిస్తేనే భూసేకరణ

Written By news on Sunday, May 1, 2016 | 5/01/2016


మంగళగిరి
రాజధాని భూ సమీకరణకు భూములు ఇవ్వని గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న సామాజిక అంచనా ప్రభావంలో ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
మంగళగిరి మండలం నిడమర్రు, బేతపూడి, తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో భూసమీకరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించగా వారికి వ్యవసాయం చేసుకునేందుకు కోర్టు తీర్పులివ్వగా మళ్లీ సేకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.


 గ్రామాల్లో ఎనభై శాతం మంది అంగీకరిస్తేనే భూసేకరణ చేయాలని 2013 చట్టం చెబుతోందని, ఆ మేరకు ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించి 80 శాతం అంగీకరించిన అనంతరమే భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందన్నారు. సామాజిక అంచనా ప్రభావం పేరుతో కేవలం పంచాయతీ కార్యాలయాల్లో భూములు ఇవ్వని సర్వే నంబర్లతో నోటిఫికేషన్ ప్రకటించి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేసి కార్పొరేట్ కంపెనీలు, బడాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు నాలుగుసార్లు ఆర్డివెన్స్ తెచ్చి మరీ ప్రయత్నించిన కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందక వెనుకడుగు వేసిందన్నారు. కిసాన్ రాజ్యం అని చెప్పుకుంటూ మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రాం ద్వారా రైతులు, కూలీలకు దగ్గర అవ్వాలని చూస్తున్న ప్రధాని నరేంద్రమోదీ యూపీఏ తెచ్చిన భూసేకరణ చట్టం 2013 మంచిదని నమ్మినా, స్వపక్ష, విపక్షంలోని ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి కొద్ది మంది రైతు వ్యతిరేక వ్యక్తుల కోసం చట్టసవరణ చేయాలనుకుని భంగపాటుకు గురయ్యారని విమర్శించారు.

భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు కేంద్రప్రభుత్వంలోని స్వపక్షంలోని రాష్ట్రాలే అంగీకరించలేదన్నది గమనించాలన్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన రైతుల్ని గతేడాది ఫిబ్రవరి 28న శాసనసభ సాక్షిగా సమీకరణకు అంగీకరించకుంటే సేకరణ చేస్తామని బెదిరించారని మండిపడ్డారు. ఒక వైపు సమీకరణకు మీ ఇష్టమైతే భూములు ఇవ్వండి లేకపోతే లేదని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు భూసేకరణకు ఎలా నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేని ప్రభుత్వం కోర్టు తీర్పులను ధిక్కరించి సేకరణకు వెళితే ఉద్యమాన్ని ఉధృతం చేసి రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు.

రేపు మాచర్లలో వైఎస్‌ జగన్‌ ధర్నా


గుంటూరు: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (సోమవారం) గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరిగే ధర్నాలో పాల్గొననున్నట్టు వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరి రేపు ఉదయం 10 గంటలకు మాచర్లకు వైఎస్‌ జగన్‌ చేరుకోనున్నట్టు చెప్పారు.

మాచర్ల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలతో కలిసి వైఎస్‌ జగన్‌ ధర్నా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు, తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్‌ జగన్‌ ధర్నా చేపడుతున్నట్టు తలశిల రఘురామ్ పేర్కొన్నారు.

చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం


చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం
‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గడికోట
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్న అవినీతిపై అమెరికాలో వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులుకు రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పేరుతో సాగుతున్న అవినీతిని, అక్రమాలను వివరిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం షెర్లాట్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రవాసుల మధ్య ‘ఎంపరర్ ఆఫ్ కర ప్షన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాషింగ్టన్ డీసీ, షికాగో, డల్లాస్, డెట్రాయిట్ నగరాల్లో కూడా పర్యటించి ప్రవాసుల మధ్య ఈ పుస్తకాన్ని విడుదల చేస్తామని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేశామని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నారని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని శ్రీకాంత్ విమర్శించారు.

జలీల్‌ఖాన్ ఆరోపణలు ఓ మైండ్ గేమ్
అధికారపక్షంలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్ తాను కూడా వస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ మైండ్‌గేమ్‌లో భాగమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాను పదిరోజులుగా కనపడలేదని టీడీపీలోకి వెళతానని మీడియాకు చెప్పడం అభ్యంతరకరమని ఆయన అన్నారు. తాను ప్రతిరోజూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తల వద్ద హాజరు వేయించుకోవాలా? అని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్లమని, పదవులకో ప్రలోభాలకో పార్టీలు మారే వాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ జన్మ ఉన్నంత కాలం తాను వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని ఆయన అన్నారు. టీడీపీ వారు దురుద్దేశ్యంతో ఇలా బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఈ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగింది.

కర్నూలులో 16,17,18 తేదీల్లో దీక్ష


దిగువ కృష్ణకు కష్టం
డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై నిరసనగా కర్నూలులో 16,17,18 తేదీల్లో దీక్ష
అన్యాయంపై ప్రశ్నించలేని సీఎం వైఖరిపై విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది నీటిని అడ్డగోలుగా మళ్లిస్తూ తెలంగాణ ప్రభుత్వం డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ... ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ.. పాలకులకు కనువిప్పు కలిగేలా ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజులపాటు కర్నూలులో తాను స్వయంగా నిరాహార దీక్షకు పూనుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఏపీకి అన్యాయం చేస్తున్నా.. చంద్రబాబు ఏమాత్రం చలించడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలే కాదు... తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతులు కూడా దారుణంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇదేమిటని కనీసం అడిగే పరిస్థితి కూడా చంద్రబాబుకు లేకుండాపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై జగన్ మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే...

 కేసీఆర్‌ను ఎందుకు నిలదీయరు?
 ‘‘రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. కరువును నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారు? అడ్డంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నైనా నిలదీసే పరిస్థితి ఉందా? పాలమూరు-రంగారెడ్డి. డిండి ప్రాజెక్టుల ద్వారా మన కళ్లెదుటే 115 టీఎంసీల నీటిని తీసుకుపోతాను అని కేసీఆర్ చెబుతూ ఉంటే ఈ విషయంపై అడగాలని చంద్రబాబుకు ఎందుకు తట్టడం లేదు? గట్టిగా పోరాటం చేయాలని ఎందుకు అనిపించడం లేదు? మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చే నీళ్లు మహబూబ్‌నగర్ గుండా శ్రీశైలంలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు చేరాలి. ఇలా వాటి ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, కృష్ణా డెల్టాకు నీళ్లు పారాలి అనే విషయం తెలిసి ఉన్నా.. నీళ్లను తోడుకుంటామని తెలంగాణ చెబుతూ ఉంటే ఈ అన్యాయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు.

 గోదావరి పరిస్థితీ అంతే...
 గోదావరి నది విషయం చూసినా ఇదే పరిస్థితి. గోదావరి నీరు తెలంగాణను దాటుకొని సీమాంధ్రలోకి రావాలన్న విషయం అందరికీ తెలుసు. ఆ నీటిని రానివ్వని పరిస్థితి కల్పిస్తూ ఉంటే మాట్లాడని చంద్రబాబు పట్టిసీమ అంటారు. ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం నీటి నిల్వ సామర్థ్యం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడే వర్షాల వల్ల తెలంగాణ నుంచి నీరు కింది వస్తుంది. ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి అవసరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు శ్రద్ధ చూపడం లేదు. 190 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఇవాళ కేవలం 2 శాతం, 4 శాతం మాత్రమే జరిగాయని సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే కేంద్ర మంత్రులు చెప్పే పరిస్థితి.

 పోలవరం.. స్కాముల ప్రాజెక్టు
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతున్నా కాంట్రాక్టర్‌ను మార్చడం లేదు. చివరకు దీన్నొక స్కాముల ప్రాజెక్టుగా మార్చేశారు. ఓ వైపున పెట్రోలు, డీజిల్, ఉక్కు, అల్యూమినియం రేట్లు తగ్గాయి. ఇసుక ఉచితంగా దొరుకుతోంది. సిమెంట్ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు. అయినా పోలవరం నిర్మాణ వ్యయాన్ని మాత్రం పెంచేశారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ అంచనా వ్యయం ఇదివరకు రూ.4,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని రూ.7,000 కోట్లకు పెంచారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఈ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాల్సింది పోయి ఇంకా ఆ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు.

పైగా ఆ కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ పద్ధతిలో తెచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పిస్తూ మంత్రివర్గ సమావేశంలోనే తీర్మానం చేశారు. వీళ్లకు (టీడీపీకి) నచ్చిన వాళ్లను సబ్ కాంట్రాక్టర్లుగా తెచ్చుకుని, పెంచిన రేటుతో వాళ్లకు పనులు అప్పగించి, కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఈ కుంభకోణాలను చూసి భయపడే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు నిధులు ఇవ్వడం లేదు. పట్టిసీమ వల్ల చంద్రబాబు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లోని క్లాజ్ 7ఇ, క్లాజ్ 7ఎఫ్ అమల్లోకి తెచ్చే వీలు కలిగించారు. ఈ క్లాజ్‌ను చూపించి కేసీఆర్ తనను దులిపేస్తారనే భయంతో కనీసం చంద్రబాబు ఆయనను అడిగే పరిస్థితే లేదు.

 రాష్ట్రంలోని పరిస్థితులు దేశం దృష్టికి వెళ్లాలి
 శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల మేరకు నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాటు ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు ఇవ్వొచ్చు. అలాంటిది ప్రస్తుతం శ్రీశైలంలో 780 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పేర్కొన్న ప్రకారం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ బోర్డులను ఏర్పాటు చేసి, ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి నీళ్లు వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి.

అయినా ఇంతవరకూ బోర్డులను ఎందుకు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు గట్టిగా అడగలేకపోతున్నారు. అందుకే ఆయన వైఖరికి నిరసనగా... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చూసే విధంగా.... నేను మే నెల 16, 17, 18వ తారీఖుల్లో కర్నూలులో మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేయబోతున్నా. ఈ దీక్ష ద్వారా అయినా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు కేంద్రం దృష్టికి, దేశం దృష్టికి వెళ్లాలి. రాష్ట్రంలో ఓ వైపు ప్రజలకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. మరోవైపు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు పనికిరాని ప్రాజెక్టులు విచ్చలవిడిగా కడుతున్నారు.

 ఎక్కడ ఉన్నా మనుషులు మనుషులే
 మనుషులు అన్నాక ఎక్కడ ఉన్నా మనుషులే. ఇక్కడున్న(తెలంగాణ) మనుషులు ఒక్కటే... అక్కడున్న(ఏపీలో) మనుషులు ఒక్కటే. ఇక్కడున్న పాలకులు అక్కడున్న మనుషులకు తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేయడానికి పూనుకోవడాన్ని ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే కనువిప్పు కలగాలి. ప్రజల కోసం రాజకీయాలను పక్కనపెట్టాలి’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

 ఆ ప్రాజెక్టుపై చాలాసార్లు మాట్లాడాం
 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మా అభ్యంతరాన్ని ఇప్పటికే చాలాసార్లు తెలియజేశాం. ఇపుడు మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ల మనసులు మారాలి. మేల్కొనాలి. కింద ఉన్న కృష్ణా డెల్టా బతకాలనే ఆలోచన వాళ్లకు రావాలి. ఎవరి ఇష్టప్రకారం వాళ్లు ప్రాజెక్టులు కట్టుకోవడం సరైంది కాదు. ఈ విషయాలన్నీ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి దృష్టికి కూడా తీసుకెళ్లాం’’ అని జగన్ పేర్కొన్నారు.

 రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేశారు
 రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా అమ్మేశారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తనపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో, వీడియో టేపుల సాక్షిగా దొరికిపోయినందున, దాని నుంచి తప్పించుకునేందుకు ఎవరినీ కూడా నిలదీసే పరిస్థితుల్లో చంద్రబాబు లేరని విమర్శించారు.

 చంద్రబాబు దేన్నీ పట్టించుకోవడం లేదు
 ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆయన ఇలా మాట్లాడగలుగుతున్నాడంటే కారణం ప్రత్యేక హోదా కావాలని అడిగే నాథుడు లేకపోవడమే. కేంద్రమంత్రి అలా మాట్లాడడం ధర్మమేనా! ఆ రోజు  రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాలు కలిశాయి. చంద్రబాబు, బీజేపీ పక్కనుంచి విభజనకు అనుకూలంగా ఓట్లు వేయిస్తే.. కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరీ ఆ పని పూర్తి చేసింది. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పెట్టుబడుల, పరిశ్రమలు వస్తాయి.

ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసి కూడా చంద్రబాబు, కేంద్రంలో ఉన్న పార్టీలు మన జీవితాలతో చెలగాటం ఆడాయి. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, నరేంద్ర మోదీ ఇద్దరూ కలిసి రాష్ట్రానికి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఊదరగొట్టారు. ఇవాళేమో చంద్రబాబు మాట మార్చారు. ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గారుస్తూ వచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానని గట్టిగా అల్టిమేటం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు’’ అని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.

 చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారో... ఎలా నీరుగార్చారో? చూడండని విలేకరుల సమావేశంలో జగన్ దృశ్య సహితంగా ప్రదర్శించారు. వీడియో క్లిప్పింగ్‌లలో చంద్రబాబు మాట్లాడిన తీరు ఇలా ఉంది.

 ఎన్నికలకు ముందు...
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలే ఇస్తామన్నారు. పదిహేను సంవత్సరాలు ఇవ్వండి అని నేనడుగుతున్నా. ఒక పరిశ్రమ రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. పని ప్రారంభమయ్యే లోపు ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వారిని(బీజేపీ) కోరుతున్నా...
 2014 ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు...

 ఎన్నికల తర్వాత...
 కొంతమంది మాట్లాడుతున్నారు.  స్పెషల్ స్టేటస్ ఇస్తే అదేదో సంజీవని లాగా ఉంటుందని... ప్రత్యేక హోదాతో ఏమొస్తాయండీ... రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ, రెండు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములు(కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పథకాలు). సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లు ఇప్పుడు తగ్గించేశారు. 62 నుంచి 52 శాతానికి తగ్గించేశారు. ఈఏపీ కోసం ఢిల్లీకి వెళ్లాలి, కేబినెట్‌లో ఆమోదం పొంది రావాలి. నా మొదటి డిమాండ్ ప్రత్యేక హోదాయే. వారు(కేంద్రం) ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తానన్నారు కదా! ఇస్తే కాదనను కదా! కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?
 ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు...

 ‘‘స్పెషల్ స్టేటస్‌తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని అంటున్నారు. పదేళ్లు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదే! వాటీజ్ ది రీజన్’’
 సీఎం హోదాలో విలేకరులతో మాట్లాడుతూ...

ప్రభుత్వానికి పట్టని కరువు


శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. సర్కార్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడేందుకు జిల్లాలోని 38 మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద సోమవారం ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహిం చనున్నట్లు ఆమె వెల్లడించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.
 
  ప్రస్తుతం రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కరువుపై జిల్లా యంత్రాంగంతో ఒక్కసారైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కళ్లబొల్లి హామీలు గుప్పించడమే తప్ప వారు కష్టాల్లో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. చాలా మండలాల్లో తాగునీటి సమస్య ఉందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు.
 
 జిల్లాలో కరువు తాండవిస్తోందని, పల్లెలు వలస బాట పడుతున్నాయన్నారు. పశుగ్రాసం కూడా లభించడం లేదన్నారు. కరువును ఎలా ఎదుర్కొంటారో ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రణాళిక రూపొందించుకోకపోవడం శోచనీయమన్నారు. కరువు, కాటకాలు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదన్నారు. దీనిపై కనీసం అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా రాదని, ఏపీ అభివృద్ధికి రూ.90 వేల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి చెప్పార ని, ఈ రూ.90 వేల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు.
 
 వీటిన్నింటికీ నిరసనగానే ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి మండవిల్లి రవి, నాయకులు తంగుడు నాగేశ్వరరావు, దుంగ శిమ్మన్న పాల్గొన్నారు.

5న పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Saturday, April 30, 2016 | 4/30/2016


5న పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు: వచ్చే నెల 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. విలీన మండలమైన కుక్కునూరులో వైఎస్ జగన్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. గిరిజనులతో భేటీ అవుతారని, పోలవరం ప్యాకేజీ, నిర్వాసితుల సమస్యపై జగన్ చర్చిస్తారని చెప్పారు.

వచ్చే 2న పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కరువు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనలు ఉంటాయని చెప్పారు. ఏలూరు వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయాలు తెలిపారు.

రాజధానిలో ఎకరా భూమి, రూ. 20 కోట్లు క్యాష్ ఇస్తామన్నారు


'లోకేష్, రమేష్ లే ప్రలోభ వీరులు'
-వెనుక చంద్రబాబు మంత్రాంగం
-మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు
-రాజధానిలో ఎకరా భూమి, రూ. 20 కోట్లు క్యాష్ ఇస్తామన్నారు
-నీతిమాలిన ఎమ్మెల్యేగా నిలవదల్చుకోలేదువిశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ఆయన తనయుడు లోకేశ్, ఎంపీ సీఎం రమేశ్ లు ప్రలోభాల పర్వాన్ని కొనసాగిస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వారిరువురూ తననూ ప్రలోభ పెట్టారని, టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఫిరాయింపులకు బ్రోకరేజ్ చేస్తున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో ఎకరా భూమి, రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు డబ్బు, పెద్దఎత్తున కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఎర వేశారన్నారు.

'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రస్తుతం నేను నిజాయితీ కలిగిన ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉన్నాను. మీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా మిగిలిపోతాను' అని వారికి స్పష్టం చేశానన్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు కూడా ఎంపీల నుంచి ఫోన్లు వచ్చాయని.. తాము చెప్పిన ప్యాకేజీలు నచ్చకపోతే.. కావాల్సినవి చెప్పుకునేందుకు లోకేశ్‌తో భేటీ ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. తాను వారిని ఒక్కటే అడిగానని, లోకేశ్ వాళ్ల నాన్న కుర్చీ నాకు ఇవ్వగలడా?.. ఇస్తానంటే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పగానే ఫోన్ కట్ చేశారని.. ఆ రోజు నుంచి మళ్లీ ఫోన్లు రాలేదన్నారు.

ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి రావద్దని ఆ పార్టీకి చెందిన ఒక సర్పంచ్ తనకు సలహా ఇచ్చారని, అంటే చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఎంతలా అసహ్యించుకుంటున్నారో దాన్ని బట్టి అర్థమవుతోందని ముత్యాలనాయుడు అన్నారు. వచ్చే మూడేళ్ల ఆస్తులు సంపాదించుకోవడమే లక్ష్యంగా కొందరు వంచన బాబు పంచన చేరుతున్నారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారన్నారు. చంద్రబాబు అండతో బాక్సైట్ గనులను తవ్వుకోవచ్చున్న ఆశతో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరితే.. ఏజెన్సీలో వైఎస్సార్‌సీపీ ఖాళీ అయిపోయిందని పత్రికల్లో కధనాలు రాయించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కిడారితో కలసి అరకులో నువ్వు సభ పెట్టు.. అదే రోజు మేము అక్కడే మా జగన్‌తో సభ పెడతాం.. గిరిజనం ఎవరి వెంట ఉన్నారో తేలిపోతుందని ఆయన సవాల్ చేశారు. ఒక ఎమ్మెల్యే వెళ్తే.. వందమంది ఎమ్మెల్యేలను తయారుచేయగల సత్తా మా పార్టీ నాయకుడు జగన్‌కు ఉందన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు 150 ఎకరాల కోసం టీడీపీలో చేరారని విమర్శించారు.

చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది

విశాఖపట్నం: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

నీళ్ల మళ్లింపునకు నిరసనగా మూడురోజుల దీక్ష


నీళ్ల మళ్లింపునకు నిరసనగా మూడురోజుల దీక్ష
► కర్నూలులో మే 16, 17, 18 తేదీలలో నిరాహార దీక్ష
► పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే నిరశన
► కృష్ణానీళ్లను అక్కడే మళ్లిస్తే శ్రీశైలానికి నీళ్లు వచ్చేదెలా
► ఆ తర్వాత నాగార్జున సాగర్ నిండేదెలా
► కింద ఉన్నవాళ్ల గొంతులు, పొలాలు ఎండిపోతున్నాయి
► ఇంత జరిగినా చంద్రబాబు నోట్లోంచి ఒక్క మాట రాదు
► అందరికీ కనువిప్పు కలగాలనే దీక్ష చేపడుతున్నా
► వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెల్లడి


హైదరాబాద్
అడ్డగోలు నీళ్ల మళ్లింపునకు నిరసనగా మే 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు కర్నూలులో తాను స్వయంగా నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కృష్ణాడెల్టాకు నీళ్లు వచ్చే వీలు లేకుండా మహబూబ్‌నగర్ నుంచే ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లను తోడేసుకుంటే.. దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు కూడా నీళ్లు రావని ఆయన చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...
 • కరువు తాండవిస్తున్నా, చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. కనీసం ఇక్కడ కేసీఆర్‌నైనా నిలదీసే పరిస్థితి లేదు
 • పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ అంటారు, డిండి ప్రాజెక్టు అంటారు
 • మన కళ్లెదుటే 115 టీఎంసీల నీళ్లు కేసీఆర్ తీసుకుపోతామంటున్నారు
 • చంద్రబాబుకు కనీసం అడగాలని ఎందుకు తట్టడం లేదు?
 • శ్రీశైలంలోకి నీళ్లు రావాలంటే మహబూబ్‌నగర్ నుంచి రావాలని అందరికీ తెలుసు
 • పైనుంచి వచ్చే నీళ్లు మహబూబ్‌నగర్ మీదుగా శ్రీశైలం వరకు రావాలి. ఆ తర్వాత కింద నాగార్జున సాగర్‌కు పోవాలి
 • మహబూబ్‌నగర్‌లోనే లిఫ్ట్‌ పెట్టి నీళ్లు తోడుకుంటాం, రంగారెడ్డికి.. డిండి ప్రాజెక్టుకు నీళ్లు పంపుతామంటే కనీసం ఒక్క మాట కూడా చంద్రబాబు నోట్లోంచి రావట్లేదు
 • శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏమవుతాయి.. కింద ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటని అడిగే పరిస్థితి లేదు
 • దీనివల్ల నిజానికి తెలంగాణలో ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కూడా నష్టపోతాయి.
 • శ్రీశైలం నుంచి సాగర్‌లోకి నీళ్లు వెళ్లకపోతే కృష్ణాడెల్టా పరిస్థితి దారుణం అయిపోతుంది
 • గోదావరి నీళ్ల పరిస్థితి కూడా అంతే
 • నీళ్లు వచ్చే మార్గంలోనే అడ్డుకుంటే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు అంటాడు.. నీళ్లు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే ఎలా అని నిలదీయడు
 • పట్టిసీమలో నిల్వ సామర్థ్యం లేదు.. వరద వచ్చినప్పుడు కిందకు రావాల్సిందే.
 • జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో వచ్చే నీళ్లను నిల్వచేసుకోగలిగితే, తర్వాత కిందకు పంపగలం, అప్పుడే రైతులు బాగుపడతారు
 • పోలవరం 190 టీఎంసీల లైవ్ స్టోరేజితో ఉండే ప్రాజెక్టు.. దాని పనులు 2, 4 శాతమే పూర్తయినట్టు కేంద్రమే చెబుతున్నా కాంట్రాక్టర్లను మార్చరు
 • ఓవైపు పెట్రోలు, డీజిల్, స్టీల్, అల్యూమినియం రేట్లు అన్నీ తగ్గాయి. ఇసుక ఉచితంగా వస్తోంది. అయినా పోలవరం హెడ్‌వర్క్ రేట్లు మాత్రం 4వేల కోట్ల నుంచి 7వేల కోట్లకు పెంచారు
 • కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకపోగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారు, సబ్ కాంట్రాక్టులు ఇచ్చుకోవచ్చని కేబినెట్‌లో తీర్మానం చేస్తున్నారు
 • అందుకే ఈ ప్రాజెక్టుకు నిధులివ్వడానికి కేంద్రం కూడా భయపడుతోంది
 • పోలవరం పూర్తి చేయడు.. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదు
 • పైగా పట్టిసీమ వల్ల గోదావరి జల వివాదాల నివారణ సెక్షన్లను ఉల్లంఘిస్తున్నారు
 • కేసీఆర్ ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా నీళ్లను తీసుకుపోతుంటే చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు?
 • శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే కిందకు పంపగలం. కానీ ఇప్పుడు 780 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి
 • ఆ నీళ్లు నిండేదెపుడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఇచ్చేదెపుడు?
 • నాగార్జునసాగర్‌కు ఎలా వెళ్తాయి, తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎలా నీళ్లిస్తారు?
 • అందుకే చంద్రబాబు వైఖరికి నిరసనగా.. మే 16, 17, 18వ తేదీలలో కర్నూలులో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాం. నేనే స్వయంగా దీక్షకు కూర్చుంటున్నాను
 • రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి పోవాలని ఈ దీక్ష చేస్తున్నా
 • చంద్రబాబు, కేసీఆర్, కేంద్రం మనసులు మారాలని నిరాహార దీక్ష చేపడుతున్నా
 • డిండి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే, అడ్డగోలుగా నీళ్లను డైవర్ట్ చేయడానికి వ్యతిరేకంగానే ఈ దీక్ష చేపడుతున్నా
 • కింద ఉన్న ఆయకట్టును కాపాడాలి, తాగడానికి నీళ్లివ్వాలి. ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి మనుషులుగా స్పందించాలనే ధ్యేయంతోనే దీక్ష చేస్తున్నాను
 • కృష్ణా డెల్టా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలే కాదు.. ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కూడా ఉన్నాయి
 • పైనుంచి నీళ్లు కిందకి రాకపోతే మేమంతా ఎలా బతుకుతాం? ఇలాంటి అంశం మీద కూడా రాజకీయాలు చేయడం సరికాదు
 •  
 • ఇక నిన్న పార్లమెంటులో జరిగిన విషయం చూద్దాం..
 • ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుందా లేదా అన్న అంశంపై మనకున్న ప్రశ్న గుర్తును, అనుమానాలను పెద్దవి చేసేలా పార్లమెంటులో మంత్రులు ప్రకటనలు చేశారు
 • కేంద్రమంత్రి నిన్న మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
 • ఆయన అంతలా మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణమేంటి, అది ధర్మమేనా?
 • ప్రత్యేక హోదా గురించి అడిగే నాథుడే లేదు
 • రాష్ట్రం విడగొట్టేటపుడు ఏమైందో అందరూ చూశాం
 • ఎన్నికల సమయంలో వాళ్లు మేనిఫెస్టోలు కూడా చూశాం
 • చంద్రబాబు, బీజేపీ అందరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు
 • మీకు అన్యాయం జరుగుతోంది, పరిహారం అందేలా ప్రత్యేక హోదా ఇస్తాం అన్నారు
 • ప్రచారంలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలోనూ పెట్టారు
 • ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, మరో ఐదేళ్లు కూడా ఇస్తామన్నారు
 • ఇప్పుడు హోదా రాని కారణంగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి తగ్గింది
 • హోదా వస్తే.. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఆదాయపన్ను, ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు, కరెంటు సగం రేటుకే వస్తుంది.
 • పరిశ్రమలు పెట్టినవాళ్లు వాళ్లు రవాణా మీద పెట్టే ఖర్చులో కూడా సగం తిరిగిస్తారు
 • ఇలాంటి రాయితీలు ఉంటే చంద్రబాబు పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడికో తిరగక్కర్లేదు. పారిశ్రామికవేత్తలే క్యూలు కడతారు. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయి
 • ఇవన్నీ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే వస్తాయని తెలిసినా, చంద్రబాబు, కేంద్రంలో ఉన్న పార్టీలు మన జీవితాలతో చెలగాటం ఆడాయి
 • ఇప్పుడు మాత్రం ప్రత్యేకహోదా సంజీవని కాదని చంద్రబాబు అంటారు
 • కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటారు
 • ఆయన ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగారుస్తున్నారు
 • అవసరం లేదని ఆయన అనబట్టే కేంద్రంలో ఉన్న మంత్రులు ఏకంగా పార్లమెంటులోనే హోదా ఇవ్వక్కర్లేదని ధైర్యంగా చెబుతున్నారు
 • పోరాడాల్సిన వ్యక్తి పోరాడకుండా వదిలేయడం భావ్యమేనా?
 • ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో, రైల్వేజోన్, పోలవరం, ఇతర హామీలు నెరవేరకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు
 • ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని అమ్మేశాడు.. తన మీద ఉన్న 'ఓటుకు కోట్లు' కేసు నుంచి తప్పించుకోడానికి ఎవరినీ చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు
 • ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు
 • ఆయన అలా చేయబట్టే కేంద్రమంత్రులకు పార్లమెంటులో కూడా అలా చెప్పే ధైర్యం వచ్చింది.

టీడీపీ నేతా.. మజాకా..!


టీడీపీ నేతా.. మజాకా..!
 సీఐ బాధ్యతలు తీసుకోవద్దంటూ టీడీపీ నేత హుకుం జారీ
► ఎస్పీని కలిసినా ప్రయోజనం శూన్యం
► కర్నూలుకు తిరిగి పయనం
► సీఐ శ్రీనివాసులుకు చుక్కెదురు 


ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు అర్బన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన శ్రీనివాసులుకు చుక్కెదురైంది. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు పైస్థాయిలో ఒత్తిడి తెచ్చి సీఐని విధుల్లో చేరనీయలేదు. దీంతో బదిలీ ఉత్తర్వులతో వచ్చిన ఆ సీఐ వెనుతిరిగి పోయారు.

వివరాల్లోకెళితే... ప్రొద్దుటూరు అర్బన్‌ సీఐ కుర్చీ మూడు నెలల నుంచి ఖాళీగా ఉంది.  కర్నూలు వీఆర్‌లో ఉన్న జె.శ్రీనివాసులును అర్బన్‌ సీఐగా నియమిస్తూ గురువారం సాయంత్రం డీఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించడానికి ప్రొద్దుటూరు వచ్చారు. రాగానే అధికార పార్టీ సీనియర్‌ నాయకుడిని కలవడానికి ప్రయత్నించగా కుదరలేదు. చేసేదేమి లేక సీఐ ఫోన్‌లో మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం.

సీఐ ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆ నేత వినిపించుకోలేదని తెలిసింది. అనంతరం పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డితో మాట్లాడారు. అనంతరం సీఐ శ్రీనివాసులు ఎస్పీని కలిసేందుకు కడప వెళ్లారు. ఆయన ఎస్పీని కలిసిన కొన్ని నిమిషాల్లోనే అర్బన్‌ సీఐగా చార్జ్‌ తీసుకోవద్దని అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. సీనియర్‌ నేత ఒత్తిడి మేరకే హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు కడప ఎస్పీ కార్యాలయానికి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీఐ కర్నూలుకు వెళ్లిపోయారు. అర్బన్‌ సర్కిల్‌కు తమకు అనుకూలమైన సీఐని వేయించుకోవడానికి మూడు నెలల నుంచి అధికార పార్టీ సీనియర్‌ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

http://www.sakshi.com/news/district/tdp-leaders-stops-ci-srinivasulu-charges-in-ysr-district-337561?pfrom=home-top-story

లోకేశ్.. మీ స్థాయి ఏమిటి?

Written By news on Friday, April 29, 2016 | 4/29/2016


లోకేశ్.. మీ స్థాయి ఏమిటి?
గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చర్చకు పిలిచే అర్హత నారా లోకేశ్ కు లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ఇద్దరు బాబులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ఎమ్మెల్యేలను కొంటుకున్నారని ఆరోపించారు. టీడీపీ అనైతిక విధానాలను జాతీయ స్థాయి నాయకులకు తెలపడానికే 'సేవ్ డెమొక్రసీ' పేరిట వైఎస్ జగన్ నాయకత్వంలో తమ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.

లోకేశ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ను చర్చకు రావాలని పిలిచే అర్హత లోకేశ్ కు లేదన్నారు. మీ స్థాయి ఏమిటి, ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి గెలిచావా అంటూ లోకేశ్ ను ప్రశ్నించారు. లోకేశ్ తో చర్చకు వైఎస్ జగన్ రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లోకేశ్ తో చర్చకు తాను వస్తానని, లేదంటే మా కార్యకర్తను పంపిస్తామని చెప్పారు. చర్చకు వస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగతామని, కళ్లకు కట్టినట్టు ప్రజలకు తెలుపుతామని చెప్పారు.

ఉత్తరకుమారుడిలా పారిపోవద్దని.. రేపు సాయంత్రంలోగా డేట్, టైమ్ చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ భవన్ లోనైనా చర్చకు సిద్ధమని చెప్పారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటనను పెద్ద డ్రామాగా అంబటి రాంబాబు వర్ణించారు. టీడీపీ కుట్రలను, కుతంత్రాలను ఛేదిస్తూ వైఎస్ జగన్ ముందుకు వెళుతున్నారని చెప్పారు.

బాబు.. ఎమ్మెల్యేల కరువు తీర్చుకుంటున్నారు

-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటన
-మాచర్ల ధర్నాలో పాల్గొననున్న జగన్‌మోహన్‌ రెడ్డి
-ప్రజల కరువు పట్టడం లేదుగానీ, బాబుకొచ్చిన ఎమ్మెల్యేల కరువును మాత్రం తీర్చుకుంటున్నారు
-బాబొస్తే జాబు రాలేదు గానీ కరువొచ్చింది


హైదరాబాద్
 : రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పట్టనట్టే వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ప్రకటించారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

'రాష్ట్రంలో ప్రజలు కరువుతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుకు వేరే రకమైన కరువు వచ్చినట్టు.. రోజూ ఎంత మంది ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చారో లెక్క చూసుకొని సంతోషపడుతున్నారే గానీ, కరువు దెబ్బకు ఎన్ని ప్రాణాలు పోతున్నాయో పట్టడం లేదు. పశుగ్రాసం, నీటి కొరతతో రోజూ ఎన్ని పశువులు చనిపోతున్నాయో కూడా విస్మరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తీవ్ర సమస్యలను పక్కదారి పట్టించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు' అని  పార్ధసారధి దుయ్యబట్టారు. వేసవిలో వచ్చే కరువును ఎలా ఎదుర్కొవాలన్నదానిపై మార్చి నెలలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు సర్కారు ఏప్రిల్ ఆఖరులోనూ ప్రజల సమస్యల పరిష్కరానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోకపోవడం శోచనీయమన్నారు.

కలల విహారం
ప్రజలను కలలో విహరింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది గానీ, వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి సర్కారు వద్ద ఒక విధానం అంటూ లేదని దుయ్యబట్టారు. 'నిన్ననే అధికార పార్టీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో అనంతపురం జిల్లాను చంద్రబాబు కోనసీమ కంటే పచ్చగా తయారు చేస్తారని చెబుతున్నారు. చాలా సంతోషం. కానీ, ఈ రోజు కరువును ఎలా ఎదుర్కోవాలి. ఈ రోజు అనంతపురం జిల్లాలో తాగునీటి లేక ప్రజలు, పశువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారో ఆ ఎంపీ మాత్రం మాట్లాడలేదు' అని పార్ధసారధి గుర్తు చేశారు.

పట్టిసీమ కట్టాం, కష్ణా జిల్లాలో నీటికి ఎటువంటి సమస్య ఉండదంటారు. కానీ, కష్ణా నది ఎండిపోతే ఇపుడు అక్కడి ప్రజలకు ఏ విధంగా మంచినీటి సమస్య తీర్చాలన్న దానిపై ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక లేదని విమర్శించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కరువు ప్రాంతాల్లో పంపిణీ చేశారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షం ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి.. ఫిరాయింపులను పోత్సహించడానికి పరిమితమైంది తప్పితే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. బాబొస్తే జాబులు రాలేదుగానీ, కరువు, వర్షాలు లేని వాతావరణం మాత్రం చూస్తున్నామన్నారు.

జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలం
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న, అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని ప్రతిపక్ష నేతగా ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి వివరించడం తప్పు ఎలా అవుతుందని టీడీపీ నేతల విమర్శలకు పార్థసారధి బదులిచ్చారు. గతంలో చంద్రబాబుపై కూడా కేసులున్నాయని, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిని, రాజ్యాంగ ఉల్లంఘలను జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సఫలీకతమైందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

పార్టీ వీడి వెళ్లేటప్పుడు తక్కినవారు చేసే విమర్శల లాంటివే మైసూరారెడ్డి కూడా చేశారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. అధినేత వైఖరి నచ్చక పార్టీ మారుతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నారని.. ఎన్నికలు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయమని జగన్‌ మోహన్‌ రెడ్డి అడగడం వారికి నచ్చలేదా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ


'ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు బిజీ'
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలన్నారు. శుక్రవారం మేకపాటి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లులో చంద్రబాబు చాలా బిజీ అయిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని ఎంపీ మేకపాటి ఆరోపించారు.

గిరిజనుల మనోభావాలను తాకట్టు పెట్టారు

విశాఖ : గిరిజనుల మనోభావాలను అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 20 కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే అమ్ముడుపోయి 50 ఎకరాలు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. గిరిజనుల హక్కులను తాకట్టు పెట్టి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. లక్షలు ఎర చూపి ఎంపీపీ, జడ్పీటీసీలను కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేర్పించారని ఆమె అన్నారు. కిడారి సర్వేశ్వరరావు వైఎస్సార్ సీపీకి నమ్మకద్రోహం చేశారని,  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నుపోటుపొడిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ వీధుల్లో పోరాటానికి మేం సిద్ధం


'ఢిల్లీ వీధుల్లో పోరాటానికి మేం సిద్ధం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న కేంద్రమంత్రి ప్రకటనతోనైనా చంద్రబాబు స్పందించాలని అన్నారు. శుక్రవారం ఆయన వైఎస్ ఆర్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని చెప్పారు.

విజయవాడ కేంద్రంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్న రాజకీయ వ్యభిచారాన్ని పక్కనపెట్టి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సూచించారు. ప్రత్యేక హోదాపై తాము ఢిల్లీ వీధుల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు లాంటి అసమర్థ సీఎం కారణంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని జోగి రమేష్ విమర్శించారు.

కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం


కబ్జా స్థలంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం
 లీజు వెయ్యి గజాలు.. ఆక్రమణ 1,637 గజాలు
► 17 ఏళ్లుగా టీడీపీ ఆక్రమణలోనే ప్రభుత్వ స్థలం
► 1999 నుంచి ఆ స్థలానికి పైసా కూడా చెల్లించని వైనం
► ‘సాక్షి’ కథనంతో హడావుడిగా కదిలిన లీజు ఫైల్
► పెండింగ్‌లో ఉండగానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
► కబ్జా స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ ఒత్తిళ్లు


సాక్షి, గుంటూరు: అక్రమాన్ని సక్రమం చేయడంలో అధికార టీడీపీ నేతలు ఆరితేరారు. అనుమతుల్లేని కట్టడమైన ముఖ్యమంత్రి రెస్ట్‌హౌస్‌పై ఇప్పటికే సక్రమ ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మార్చి దాన్ని సక్రమం చేసే పనిలో పడ్డారు. టీడీపీ కార్యాల యం కోసం గుంటూరు నగర పాలక సంస్థకు చెందిన 1,667 గజాల స్థలా న్ని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించారు.

దీనిపై సాక్షి ‘అధికార పార్టీ కార్యాలయానికి అక్రమ పునాది’ శీర్షికన గతేడాది ఆగస్టులో కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆక్రమణ స్థలాన్ని తమకు లీజుకివ్వాలంటూ టీడీపీ నాయకులు హడావుడిగా నగర పాలక సంస్థకు దరఖాస్తు చేశారు. అధికారులు ఆ ఫైల్‌ను జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు పంపగా ఆయన దాన్ని ఆమోదించి నిర్ణయం కోసం రాష్ట్ర పురపాలక శాఖకు పంపారు. దీనిపై పురపాలక శాఖ అధికారులు ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.  అయినా టీడీపీ పెద్దలు మాత్రం ఆక్రమిత స్థలంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకొనేందుకు పార్టీ పెద్దలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
 
కార్పొరేషన్ ఆదాయానికి గండి
టీడీపీ అధికారంలో ఉండగా 1999లో గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం నగరంలో ఖరీదైన ప్రాంతమైన అరండల్‌పేట పిచుకలగుంటను ఎంపిక చేశారు. టీఎస్ నంబర్ 826లో వెయ్యి చదరపు గజాల(20 సెంట్ల) స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ స్థలాన్ని 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం 1999 జూలై 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి కేవలం రూ.25 వేల చొప్పున నగర పాలక సంస్థకు అద్దె చెల్లించాలని, ప్రతి మూడేళ్లకోసారి లీజును రెన్యూవల్ చేస్తూ 33 శాతం అద్దె పెంచాలని పేర్కొంది. ఇక్కడివరకు సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ టీడీపీ నేతలు లీజుకు తీసుకున్న స్థలం పక్కనే ఉన్న మరో 1,637 చదరపు గజాల(34 సెంట్లు) స్థలాన్ని సైతం ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మిం చారు. అప్పట్లో ఈ విషయాన్ని నగర పాలక సంస్థ అధికారులు గుర్తించినప్పటికీ అధికార పార్టీకి చెందిన కార్యాలయం కావడంతో దాని జోలికి వెళ్లలేదు. 2008లో దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కదిలారు.

భూ ఆక్రమణ జరిగినట్లు తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తమ కార్యాలయం పక్కన గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఆక్రమించామని ఒప్పుకుంటూ అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నగర పాలక సంస్థకు లేఖ రాశారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపలేదు. అయినా ఆ స్థలం టీడీపీ కార్యాలయం ఆక్రమణలోనే ఉండిపోయింది. లీజుకు తీసుకున్న స్థలానికి ప్రస్తుతం ఏడాదికి రూ.89,881 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ 17 ఏళ్లుగా టీడీపీ కబ్జాలో ఉన్న ఈ  స్థలానికి సంబంధించి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. లీజుకు అనుమతి లేకపోవడంతో డబ్బు చెల్లించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండిపడింది
నేడు టీడీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
 టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్ ప్రారంభించనున్నారు.

ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి


కొనుగోళ్ల పర్వాన్ని వివరించాంఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
♦ ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి
♦ మూడు నెలల కాలవ్యవధి పెట్టి ఈసీకి అప్పగించాలి
♦ 10 ప్రధాన హామీలు నెరవేర్చని పార్టీని పోటీనుంచి నిషేధించాలి
♦ సీమాంధ్ర, జీహెచ్‌ఎంసీలో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి
♦ ఎన్నికలను అర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీకి మూడు సూచనలిచ్చాం
♦ చంద్రబాబు అనైతిక రాజకీయాలపై ప్రధానికి లేఖ రాస్తాం
♦ న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో.. నిరాకరణ ఉండదు
♦ పోరాటం ఇంతటితో ఆగదు.. న్యాయస్థానాలకూ వెళతాం
♦ ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంపై వైఎస్ జగన్ సంతృప్తి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక రాజకీయాలను, అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా సాగిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల  తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసి ప్రజల ఆకాంక్షలకు రక్షణ కవచంగా మార్చాలని వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయం జరగడంలో ఆలస్యం ఉండవచ్చే మో కానీ.. న్యాయం తప్పకుండా జరుగుతుందంటూ తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గురువారం ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘రూ. 20-30 కోట్ల అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేని అధికార టీడీపీ కొనుగోలు చేస్తున్న తీరును వివరించాం. కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఎర చూపుతున్న పరిస్థితిని విడమరిచి చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికలను మరింత అర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గాలను సూచించాలని వివిధ రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో తమ పార్టీ తరఫున మూడు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించామని చెప్పారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక తదితరులతో కూడిన బృందం జగన్ నేతృత్వంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదిని కలిసి ఈ వినతిపత్రం సమర్పించారు.
 ప్రధానమంత్రికి లేఖ రాస్తాం
ఏపీలో సాగుతున్న అక్రమాలు, అవినీతి, అనైతిక రాజకీయాలను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాస్తానని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు. ‘‘ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ అడిగాం. మీరన్నట్లుగా (బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదా? అని అడిగిన విలేకరిని ఉద్దేశించి) మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదోమో! మా వాదనలు, విజ్ఞప్తులు వివరిస్తూ ప్రధానికి లేఖ రాస్తాం. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపిస్తాం’’ అని తెలిపారు. ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర సంతృప్తికరంగా సాగిందా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘‘వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే మన వాదన గట్టిగా వినిపించాలి.
సాధ్యమైనంత మేర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది’’ అని సమాధానమిచ్చారు. మీ పోరాటం ఫలిస్తుందనే నమ్మకం ఉందా? అని మరో విలేకరి ప్రశ్నించగా... ‘‘ఇదో పోరాటం. న్యాయం జరుగుతుందా, జరగదా అనే విషయం పక్కనబెడితే.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చాం. దేశంలోని ముఖ్య నాయకులు, ముఖ్యమైన సంస్థలు, వ్యవస్థల దృష్టికి ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అనైతిక రాజకీయాల తీరును వివరించగలిగాం’ అని జవాబు చెప్పారు. ‘ఇంతటితో ఆగం. కోర్టులకూ వెళతాం. అక్కడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ... నిరాకరించడం మాత్రం జరగదు’ అని మరో ప్రశ్నకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు.
గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వినతి
కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను జగన్ గురువారం మధ్యాహ్నం ఇక్కడి శాస్త్రిభవన్‌లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘‘హోం మంత్రి, ఆర్థిక మంత్రికి ఇచ్చిన వినతిపత్రాలను ఇక్కడ కూడా ఇచ్చాం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పర్వం, ఫిరాయింపుల పర్వాన్ని వివరించాం. అలాగే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవలే కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో ఇవ్వాలని కోరాం..’’ అని వివరించారు.
ఈసీకి వైఎస్సార్‌సీపీ ఇచ్చిన సూచనలు
సూచన-1

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకునేలా ఎన్నికల సంఘానికి అప్పగించమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. అలా చేయకుంటే ప్రజాస్వామ్యం బతకదు. అనైతిక రాజకీయాలతో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆకాంక్షలను ఖూనీ చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి... అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయరు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు. ఇటు అనర్హత వేటు పడకుండా, అటు రాజీనామాలు చేయకుండా.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ మంత్రి పదవులూ చేపట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.
సూచన-2
ఎన్నికల మేనిఫెస్టోలోని 10 ముఖ్యమైన హామీలను అన్ని పార్టీలను అడగండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 హామీలను నెరవేర్చలేకపోతే.. తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీలు పోటీ చేయకుండా నిషేధం విధించండి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో చూస్తే అర్థమవుతుంది.
♦ రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కింద చంద్రబాబు ఇచ్చిన సొమ్ము..  రైతుల వడ్డీలకు సరిపోలేదు. రుణాలన్నీ మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకూ పంగనామాలు పెట్టారు.
♦ జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు టీడీపీ ఊదరగొట్టింది. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇంటికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. ఉద్యోగాల ఇచ్చే సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్నారు. నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు.
♦ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాగ్రహానికి, వ్యతిరేకతకు భయపడి ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను రూ. 20-30 కోట్లకు  కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినపండకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. ఫిరాయింపుదారులతో రాజీనా మా చేయించి ఎన్నికలకు వెళ్లడానికి బాబు భయపడుతున్నారంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.
 సూచన-3
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ దాదాపు ఆరు దశాబ్దాలపాటు రాజధాని. సీమాంధ్రకు చెందిన వారు పెద్ద సంఖ్యలో జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సీమాంధ్ర, జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి. తద్వారా రెండు చోట్లా ఓట్లు వేసే (డబుల్ ఓటింగ్) అవకాశం లేకుండా చేయవచ్చు.

Popular Posts

Topics :

Popular Posts