మరో 11 మందికి పిలుపు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో 11 మందికి పిలుపు!

మరో 11 మందికి పిలుపు!

Written By news on Monday, November 14, 2011 | 11/14/2011

 ఫిరాయింపులు, అనర్హత నోటీసులందుకున్న ఎమ్మెల్యేలపై నేడో, రేపో స్పీకర్ నిర్ణయం
* జాబితాలో హరీశ్వర్‌రెడ్డి, సముద్రాల, జోగు రామన్న, గోవర్ధన్, జూపల్లి, రాజయ్య, సోమారపు 
* శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బాలనాగిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలనూ పిలిచే అవకాశం
* మిగతా రాజీనామాలపైనా వారంలోపే నాదెండ్ల నిర్ణయం?

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మిగతా రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగం, ప్రసన్నలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం తెలిసిందే. వాటిని స్పీకర్ ఏకమొత్తంగా తిరస్కరిస్తారా, లేక ఒక్కొక్కరినీ విడిగా పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా అనేది చర్చనీయంగా మారింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరినీ వ్యక్తిగతంగా పిలిచి అభిప్రాయాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నట్టు అసెంబ్లీ కార్యాలయ వర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపులు, అనర్హత నోటీసులందుకున్న ఎమ్మెల్యేలను ఒకట్రెండు రోజుల్లో పిలిచి మాట్లాడేందుకు ఆయన సిద్ధమయ్యారు. 

లిదశ విచారణలో భాగంగా మొత్తం 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి, ఆ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన జోగు రామన్న, గంపా గోవర్ధన్, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య, సోమారపు సత్యనారాయణ వీరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, అనర్హత విచారణ ఎదుర్కొంటున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాన ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, టీడీపీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన వై.బాలనాగిరెడ్డిలను స్పీకర్ మరోసారి విచారిస్తారంటున్నారు.

సంప్రదాయానికే ఓటు
సముద్రాల, కొప్పుల, జోగులనుస్పీకర్ గతంలోనే పిలిచి రాజీనామాలపై అభిప్రాయాలు తెలుసుకోవడమే గాక లిఖితపూర్వక స్టేట్‌మెంట్లనూ తీసుకున్నారు. అయినా వారిని మళ్లీ పిలిచి చివరి అవకాశమివ్వనున్నట్టు తెలిసింది. సముద్రాల, కొప్పుల రాజీనామాలకే కట్టుబడితే వాటిని ఆమోదించాలని స్పీకర్ నిర్ణయించారంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరినందున వారి విషయంలోనూ నిర్ణయం తప్పదని స్పీకర్ భావిస్తున్నారు. 

అనర్హత కేసు ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బాలనాగిరెడ్డిలను కూడా పిలిచి మాట్లాడతారని, రాజీనామాలకు కట్టుబడే పక్షంలో వాటిని ఆమోదిస్తారని చెబుతున్నారు. అనర్హత కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాజీనామా చేస్తేఆమోదించే సంప్రదాయం మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి హయాంలో మొదలైంది. ఆ ప్రకారమే తాజాగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామాను నాదెండ్ల ఆమోదించారు కూడా! ఇతరులకూ దాన్నే వర్తింపజేస్తారని భావిస్తున్నారు.

ఆమోదానికే పట్టుబడతారా?!
వివిధ కారణాలతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా నాగం మాదిరిగా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి ఆమోదింపజేసుకుంటారా, మనసు మార్చుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో వారి రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడం, వారంతా తీవ్రంగా మండిపడి మళ్లీ రాజీనామాకు సిద్ధపడటం తెలిసిందే. ఈసారి మాత్రం స్పీకర్ రాజీనామాలను ఆమోదించే పనిలో పడటంతో ఎమ్మెల్యేల వైఖరి ఇప్పుడెలా ఉండనుందనేది ఆసక్తికరం. నాగం, ప్రసన్న రాజీనామాలను ఆమోదించగానే, తమవీ ఆమోదించాల్సిందేనంటూ మిగతా వారు కూడా స్పీకర్‌పై భారీగా ఒత్తిడి తెస్తారని అంతా భావించారు. కానీ హరీశ్వర్ మినహా ఎవరూ పెద్దగా స్పందించకపోవడంపై తెలంగాణవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

విశ్వసనీయ సమాచారం మేరకు... రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో సగం మంది వాటిని ఆమోదించుకోవాలనే భావిస్తున్నా మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లడాన్నే సమస్యగా భావిస్తున్నారు. రాజీనామా చేసిన తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు అదే అన్రాను. ‘‘తెలంగాణ కోసం మేం పార్టీలను, పదవులనే వదులుకున్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లోకి వెళ్లినా బ్రహ్మండమైన మెజారిటీతో గెలుస్తామనే నమ్మకమూ ఉంది. కానీ మరో రెండేళ్లలోనే మళ్లీ ఎన్నికలున్నాయి. పైగా రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే అంతకుముందే పడిపోయినా ఏడాదిలోనే మళ్లీ ఎన్నికలొచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలా ఏడాదిలోనే రెండుసార్లు ఎన్నికల ఖర్చు మాకు తలకు మించిన భారమే అవుతుంది. పైగా అప్పటికి ప్రజల్లో మాపై ఇప్పుడున్నంత అభిమానం ఉండకపోవచ్చు. ఓసారి గెలిపించాం గనుక ఇతరులకు అవకాశమివ్వాలనుకోవచ్చు. అందుకే రాజీనామాలను ఆమోదించుకోవడంపై పునరాలోచనలో పడ్డాం’’ అని వివరించారు.

విమర్శల వల్లే స్పీకర్ ‘దూకుడు’!!
రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో చాలామంది తెలంగాణవాదుల ఒత్తిళ్లకు, భావోద్వేగాలకు లోనైన వారేనన్నది స్పీకర్ అభిప్రాయమంటున్నారు. అందుకే ఎంపీల రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ వ్యవహరించినట్టుగానే ఎమ్మెల్యేల రాజీనామాలను వీలైనంత వరకూ పెండింగ్‌లో పెట్టాలని భావించారు. అప్పుడు మనసు మార్చుకుని వారే వెనక్కు తీసుకుంటారని యోచిస్తూ వచ్చారు. కానీ బయటి పరిణామాలు, తనపై కొందరు సభ్యుల విమర్శలు స్పీకర్ పదవినే అవమానించేలా ఉన్నాయని ఆయన మనస్తాపానికి గురయ్యారంటున్నారు. సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా వారి రాజీనామాలను పెండింగ్‌లో పెడితే తననే విమర్శించడమేమిటంటూ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అందుకే రాజీనామాలపై సత్వరమే తేల్చేయాలని నిర్ణయించారని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆమోదిస్తే సర్కారు మైనారిటీలో!!
స్పీకర్ తన వద్దనున్న రాజీనామాలను ఆమోదిస్తే కిరణ్ సర్కారు మైనారిటీలో పడే ఆస్కారముంది. పీఆర్పీ (17), ఒక స్వతంత్రుడు, సొంత బలం(155)తో కలిపి అసెంబ్లీలోకాంగ్రెస్‌కు 173 మంది ఎమ్మెల్యేలున్నారు. కానీ వీరిలో 29 మంది రాజీనామా చేశారు. వారిలో 25 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు. మరో ఇద్దరు (జూపల్లి, రాజయ్య) టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇంకో ఇద్దరు (కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీహెచ్ లింగయ్య) మాత్రం శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. వీరందరి రాజీనామాలనూ ఆమోదిస్తే ప్రభుత్వ బలం మెజారిటీ (148) కంటే నాలుగు సీట్లు తగ్గి, 144కు పడిపోతుంది! ఈ నేపథ్యంలో రాజీనామాలన్నీ ఆమోదం పొందడం అనుమానమేనన్న వ్యాఖ్యలూ విన్పిస్తున్నాయి.
Share this article :

0 comments: