26న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నోటిఫికేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 26న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నోటిఫికేషన్

26న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నోటిఫికేషన్

Written By news on Tuesday, November 15, 2011 | 11/15/2011

6,063 వీఆర్‌ఏ, 1,172 వీఆర్‌ఓ పోస్టుల భర్తీకి వచ్చే నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ 
జనవరి 2 వరకు జాబితా తయారీ, 8న కాల్ లెటర్లు
జనవరి 18 నుంచి 28 వరకు ఇంటర్వ్యూలు
30న ఫలితాల ప్రకటన మంత్రి రఘువీరారెడ్డి వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి ఈనెల 26న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. జనవరి 31లోగా ఈ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు వెల్లడించారు. ఇతర వివరాలు ఆయన మాట ల్లోనే...

మొత్తం 7,235 పోస్టులు: 1,172 వీఆర్‌ఓ, 6,063 వీఆర్‌ఏ పోస్టుల భర్తీ కోసం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఈనెల 26న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈనెల 26 నుంచి డిసెంబర్ 17 వరకు అభ్యర్థులనుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబరు 26 వరకు దరఖాస్తులు, అభ్యర్థులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తారు. జనవరి 2 వరకు విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూల కోసం 1:3 రేషియోలో షార్ట్ లిస్టు తయారు చేస్తారు. వీటి తయారీలో వెయిటేజీ ఆఫ్ నార్మలైజేషన్ పాటిస్తారు. 8న కాల్ లెటర్లు పంపుతారు. జనవరి 18 నుంచి 28 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 30న ఫలితాలు ప్రకటిస్తారు.

నార్మలైజేషన్ పద్ధతిలో వెయిటేజీ: అభ్యర్థి నిర్ణీత విద్యార్హతకు సంబంధించి ఆ ఏడాదిలో వచ్చిన అత్యధిక మార్కులతో అతడు సాధించిన మార్కులను లెక్కించి అభ్యర్థి వెయిటేజీని నిర్ణయిస్తారు. ఎందుకంటే గతంలో పదో తరగతిలో 400 మార్కులు వస్తే ఎక్కువ. ఇపుడు 550 వచ్చినా తక్కువే. ఇంటర్‌లోనూ అదే పరిస్థితి. ప్రస్తుత మార్కులతో గతంలో అభ్యర్థులు సాధించిన మార్కులను పోల్చి వెయిటేజీ నిర్ణయిస్తే... అప్పట్లో పాసైన అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అభ్యర్థి పాసైన ఏడాది మార్కుల ఆధారంగానే నార్మలైజేషన్ చేసి సాధించిన స్కోర్‌కు వెయిటేజీ ఇస్తారు.

ఇవీ విద్యార్హతలు: ఇంటర్ పూర్తయినవారు వీఆర్‌ఓ పోస్టులకు, పదో తరగతి పాసైనవారు వీఆర్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర శాఖల్లో ఉద్యోగాల్లాగే రిజర్వేషన్లు, వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి. షెడ్యూలు ఏరియాలో మాత్రం ఎస్టీ అభ్యర్థులతోనే పోస్టులను భర్తీ చేస్తారు. వీఆర్‌ఏ పోస్టులకు ఆ గ్రామానికి చెందిన వారే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర గ్రామాల వారికి అవకాశం లేదు. వీఆర్‌ఓలకు ఆ జిల్లాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. వీఆర్‌ఓ పోస్టుల్లో విద్యార్హతకు 75 శాతం వెయిటేజీ ఇస్తారు. మరో 5 శాతం డిప్లమో ఇన్ కంప్యూటర్, అంతకంటే ఎక్కువ అర్హతలకు ఇస్తారు. ఇంకో 5 శాతం వెయిటేజీ పూర్వానుభవానికి కేటాయిస్తారు. 15 వెయిటేజీ పాయింట్లను ఇంటర్వ్యూకు ఇస్తారు. ఇక వీఆర్‌ఏ పోస్టులకు 85 శాతం వెయిటేజీ పదో తరగతి మార్కులకు కేటాయిస్తారు. 15 శాతం వెయిటేజీ ఇంటర్వ్యూకు ఉంటుంది. అయితే పారా లీగర్ వర్కర్, కమ్యూనిటీ సర్వేయర్, రెవెన్యూ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసిన వారు జాయింట్ కలెక్టర్ నుంచి, సెర్ప్‌లో పనిచేసిన వారు డీఆర్‌డీ ఏ పీడీ నుంచి పూర్వనుభవ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. వీఆర్‌ఓ పోస్టులకు జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ) ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తుంది. ఇంటర్వ్యూ బోర్డులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్తు సీఈఓ ఉంటారు. వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఆర్‌డీఓ నేతృత్వంలో తహసీల్దార్, ఎంపీడీఓ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఎవరినీ నమ్మి మోసపోవద్దు: రఘువీరా

ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని రఘువీరా చెప్పారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, ఎవరినీ నమ్మి మోసపోవద్దని చెప్పారు. అలాంటి సంఘటనలు దృష్టికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించామన్నారు. నియామకాలకు సంబంధించిన వివరాలను సంబంధిత జిల్లా వెబ్‌సైట్‌లో అందుబాటు ఉంచుతామని చెప్పారు.
Share this article :

0 comments: