రూ.50 వేలకే ఎకరం చొప్పున రాసిచ్చిన చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.50 వేలకే ఎకరం చొప్పున రాసిచ్చిన చంద్రబాబు

రూ.50 వేలకే ఎకరం చొప్పున రాసిచ్చిన చంద్రబాబు

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011


*నాలుగు రోజుల కంపెనీకి... 850 ఎకరాలు
*రూ.8,500 కోట్ల భూమి.. రూ.4 కోట్లకే అప్పగింత
*ఆపద్ధర్మ సీఎం హోదాలో బినామీ బిల్లీరావుకు పందేరం
*రూ.50 వేలకే ఎకరం చొప్పున రాసిచ్చిన చంద్రబాబు
*అప్పట్లోనే దాని మార్కెట్ విలువ రూ.2 కోట్లు
*తన భార్య భూమిని అదే ధరకు అమ్ముకున్న బాబు
*అనామక కంపెనీతో నాలుగే రోజుల్లో ఒప్పందం
*బాబు ఆజ్ఞానుసారం శరవేగంగా కదిలిన ఫైలు
*ఐఎంజీ గురించి తెలుసుకునే ప్రయత్నమే శూన్యం
*కేబినెట్‌కు కూడా తెలియకుండా కేటాయింపులు
*పారదర్శకత లోపించిందన్న నాటి ప్రభుత్వ కార్యదర్శి
*బాబుది ఆశ్రీత పక్షపాతమంటూ హైకోర్టుకు అఫిడవిట్

హైదరాబాద్, న్యూస్‌లైన్:అది 2003 ఆగస్టు 5. ‘ఐఎంజీ భారత’ అంటూ హైదరాబాద్‌లో ఓ కంపెనీ రిజిస్టరయింది. అప్పటిదాకా దానికొక ఆఫీసు లేదు. పనీపాటా లేవు. ఫక్తు అనామక కంపెనీ. కాకపోతే దానికి ఉన్నదల్లా ఒక్కటే! నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దన్ను! ఆ కంపెనీ అధిపతి అహోబలరావు అలియాస్ బిల్లీరావు కూడా వేరెవరో కాదు. చంద్రబాబు ఆత్మ. అంటే బిల్లీ చేతికి ఏదొచ్చినా... అది బాబు జేబులో వాలినట్లే. ఫక్తు బినామీ అన్నమాట. 

ఇంకేం! తెరవెనక కథలు చకచకా నడిచాయి. దస్త్రాలు శరవేగంతో కదిలాయి. ఆగస్టు 9 కల్లా ఓ ఒప్పందం కుదిరిపోయింది. ఫలితం... నాలుగు రోజుల కంపెనీకి అక్షరాలా ఎనిమిది వందల ఏభై ఎకరాల భూమిని... అది కూడా అత్యంత ఖరీదైన హైదరాబాద్ శివారు ప్రాంతంలో కట్టబెట్టేశారు. అప్పటికే ఎకరా 2కోట్లు పలుకుతున్న 850 ఎకరాలను... కేవలం ఎకరా రూ.50 వేల చొప్పున రాసిచ్చేశారు. ఇది జరిగిన మూడేళ్లకే అక్కడి భూమి ఎకరా రూ.25 కోట్లు కూడా పలకటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. బాబు ముందుచూపును ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే!!

పోనీ చంద్రబాబు అక్కడితో ఆగారా అంటే... ససేమిరా లేదు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్‌లో ఆఫీసు కోసం తన జేబు సంస్థకు మరో 5 ఎకరాలిచ్చేందుకూ సిద్ధపడ్డారు. ఇంకా చిత్రమేంటంటే... గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ వరకు ఈ మధ్యలో ఆ సంస్థ ఎక్కడ ఎంచుకుంటే అక్కడ ఐదెకరాలిస్తానని చెప్పారు. ఆ సంస్థ బంజారాహిల్స్‌ను ఎంచుకోగా... పచ్చజెండా ఊపేశారు. 
ఇక్కడిక్కూడా చంద్రబాబు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. తన జేబు సంస్థకు మరిన్ని తాయిలాలు కురిపించారు. హైదరాబాద్‌తో పాటు శివార్లలో నిర్మించిన క్రీడా మైదానాలను ఐఎంజీకి 45 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు కట్టబెట్టాలని బాబు నిర్ణయించారు. అయితే లీజు మొత్తం ఎంతన్నది మాత్రం జీవో 11లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంకా ఈ జీవోలో పేర్కొన్న దారుణమైన విషయాలేంటంటే...

*ఐఎంజీకి అప్పగించే క్రీడా మైదానాల నిర్వహణ ఖర్చులను ఐదేళ్ల పాటు ప్రతి పైసాతో సహా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అందుకోసం ఏటా రూ.2.5 కోట్ల చొప్పున రూ.12.5 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం తరఫున కేటాయిస్తారు. 

*ఈ స్టేడియంలను 45 ఏళ్ల కాలంలోపలే... అంటే తనకు ఇష్టం వచ్చినపుడు ఐఎంజీ కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోలుకు సంబంధించి పూర్తి విచక్షణ హక్కులన్నీ ఐఎంజీకే ఉంటాయి. దానిప్రకారం కొనుగోలు చేసేనాటికి ఆ స్టేడియం తాలూకు భూమి, భవనం ధర, నిర్వహణ, అభివృద్ధి ఖర్చుల ఆధారంగా ఐఎంజీనే దానికి విలువ కడుతుంది. ఆ విలువ ఆధారంగా అది తనకు నచ్చితే ఆ స్టేడియంలను సొంతం చేసుకుంటుంది. 

*ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం గానీ, ప్రభుత్వ సంస్థలు గానీ సహకరించకపోయినా సరే ఒప్పందం అమల్లోనే ఉం టుం ది. ఐఎంజీ తనకున్న హక్కుల మేరకు నిర్ణయం తీసుకోవచ్చు

*సాధారణంగా విద్యా సంస్థలకు కల్పించే రాయితీలు, సౌకర్యాలన్నిటినీ ఐఎంజీకి వర్తింపజేశారు. పదేళ్ల పాటు వినోద పన్ను మినహాయించారు. తొలి మూడేళ్లకూ కరెంటు, నీటి బిల్లులు రద్దు చేశారు. తర్వాతి నాలుగేళ్లకూ వాటిలో 25 శాతం రాయితీ ఇచ్చారు. 

చంద్రబాబు ఇవన్నీ చేసింది ఫుల్‌టైమ్ ముఖ్యమంత్రిగా కాదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ...!?

అతిక్రమణల వెల్లువ...
ఇక్కడ చంద్రబాబు తన జేబు సంస్థ కోసం ఎన్ని నిబంధనలను అతిక్రమించారని ప్రశ్నించుకుంటే... ‘అమల్లో ఉన్న అన్నిటినీ’... అని ఒక్కమాటలో చెప్పొచ్చు. ఎలాగంటే... ఎన్నికలు సమీపిస్తున్నాయి కనక ఒకవేళ చంద్రబాబు తాను తిరిగి అధికారంలోకి రాకపోతే ఎలాగన్నది ముందే ఊహించారు. అందుకే ఏ ప్రభుత్వమూ, ఏ ప్రభుత్వ సంస్థా ఈ ఒప్పందం విషయంలో జోక్యం చేసుకోకుండా... దీన్ని రద్దు చేసే అవకాశం లేకుండా ముందస్తు కళ్ళేలు వేశారు. ఐఎంజీకే అన్ని హక్కులూ ఉంటాయంటూ తన కుట్ర బుద్ధి బయటపెట్టుకున్నారు.

నిజానికి ఈ సంస్థకు చంద్రబాబు కేటాయించింది కేవలం 850 ఎకరాలు మాత్రమే కాదు. రాజధానిలో అప్పటికే వందల కోట్లు వెచ్చించి కట్టిన క్రీడా మైదానాలను కూడా. వాటితో జతపడి ఉన్న వందలాది ఎకరాల భూముల్ని కూడా. ఈ స్టేడియాల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎంతకు కావాలంటే అంతకు కొనుగోలు చేసే అవకాశాన్ని బాబు తన బినామీ సంస్థకు చాలా ఉదారంగా కల్పించేశారు. 

అంతేకాకుండా మైదానాల నిర్వహణ ఖర్చును నయాపైసాతో సహా ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరించటం. అంటే ఈ ఐదేళ్లలో ఏ మైదానం లాభసాటిదో, ఏది లాభం కాదో బిల్లీబాబుకు తెలియనే తెలుస్తుంది. దాంతో లాభసాటి మైదానాల్ని తనకు ఇష్టం వచ్చిన రేటుకు ఆ వెంటనే సొంతం చేసుకుంటారన్న మాట. ఇదీ బాబు ఒప్పందపు లోగుట్టు. అందుకే... బాబు హయాంలో జరిగిన అక్రమాల తీవ్రతను తెలుసుకోవాలంటే ఐఎంజీ కుంభకోణం ఒక్కటి చాలని అంతా చెబుతుంటారు. 

బిల్లీ పేరుప్రఖ్యాతులు బాబుకే ఎరుక...
బిల్లీరావు పెద్ద పేరున్న వ్యక్తేమీ కాదు. క్రీడా రంగంలో అనుభవశాలి కూడా కాదు. కానీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)లో 2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్ భారత రిజిస్టరయింది. అది కూడా లక్ష రూపాయల మూలధనంతో. దాన్లో 99 శాతం వాటా బిల్లీ రావుది కాగా మిగిలిన ఒక్క శాతం ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేటరావుది. రిజిస్టరైన మర్నాడే.. అంటే ఆగస్టు 6న నాటి యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి 111080/ఎస్1/03 నంబరు నోట్ ఫైల్‌ను ముసాయిదా ఎంఓయూ ఆమోదానికి పంపారు. ఆ నోట్‌ను నాటి కేబినెట్ మంత్రులు నలుగురు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదే రోజున ఆమోదించారు. మర్నాడు... అంటే 7న ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి ఓ నోట్‌ను సర్క్యులేట్ చేశారు. ఐఎంజీఏ గురించి అందులో వివరించారు. సీఎం, మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.... ఇలా పలు స్థాయిల్లో సమావేశాలు, చర్చలు జరిగినట్టు ఆ నోట్‌లో పేర్కొన్నారు. ముసాయిదా ఎంఓయూ కోసం వచ్చిన ఫైల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు 8వ తేదీన ఆమోదించారు. 

నిజానికి పలు చర్చలు, సమావేశాలు జరిగినట్లు నోట్‌లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా ఎటువంటి చర్చలు, సమావేశాలు జరగనే లేదు. పూర్తిస్థాయి చర్చల తరువాతే నిర్ణయం తీసుకున్నామని అందర్నీ నమ్మించేందుకే నోట్‌లో అలా పేర్కొన్నట్టు ప్రభుత్వమే తరువాత ఓ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియజేసింది. ఇంకో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆగస్టు 6కు ముందు అసలు ఏం జరిగిందనే విషయాలేవీ కూడా రికార్డుల్లో ఎక్కడా లేకపోవటం. అంటే అసలు ఐఎంజీ రంగప్రవేశం ఎలా జరిగింది..? ఆ కంపెనీతో ఎవరెవరు చర్చలు జరిపారు..? అసలు బిల్లీరావు ఎవరు..? అనే విషయాలేవీ అధికారులెవరికీ తెలియదన్న మాట. దీన్ని బట్టి ఐఎంజీ, బిల్లీరావుల గురించి బాబుకు మాత్రమే తెలుసని అర్థం కావటం లేదూ!

రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు... 
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గచ్చిబౌలిలో 400 ఎకరాలను కారుచౌకగా ఎకరా రూ.50 వేల చొప్పున ఐఎంజీకి విక్రయించేందుకు బాబు ప్రభుత్వం 2004 ఫిబ్రవరి 9న జీవో ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. బిల్లీరావుకు లబ్ధి చేకూర్చేలా ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం... ఆ 400 ఎకరాలకు బిల్లీ రావు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు. మామిడిపల్లిలోని మిగతా 450 ఎకరాలనూ అదే ధరకు ఐఎంజీకి విక్రయిస్తున్నట్లు జీవో 11లో ప్రభుత్వం పేర్కొంది. పైగా ఐఎంజీ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో ఐదెకరాలు కేటాయించేందుకు కూడా అనుమతినిచ్చారు.

ఎకరా రూ.10 కోట్ల భూమి.. రూ. 50 వేలకే! 
నేటి మార్కెట్ రేటును బట్టి చూస్తే గచ్చిబౌలి ప్రాంతంలో ఎకరా ధర కనీసం 10 కోట్ల రూపాయలుంది. ఒక దశలో ఇది రూ.25 కోట్ల రూపాయలు కూడా పలికింది. అంటే 400 ఎకరాల ధర ఒకదశలో రూ.10 వేల కోట్లన్న మాట. మామిడిపల్లి భూమిని కూడా కలిపితే ఇది రూ.20 వేల కోట్ల పైమాటే. బంజారాహిల్స్ ప్రాంతంలో ఐదెకరాల విలువ రూ.120 కోట్లు దీనికి అదనం. ఇంతటి విలువైన 855 ఎకరాల భూమిని బిల్లీరావు కంపెనీకి చంద్రబాబు రూ.4 కోట్లకు కట్టబెట్టేశారన్నమాట. ఐఎంజీ కుంభకోణానికి ముందు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అదే ప్రాంతంలో తనకున్న భూమిని ఎకరా రెండు కోట్ల రూపాయలకు విక్రయించారు. అంటే తమ భూములను మార్కెట్ ధరకు అమ్ముకున్న చంద్రబాబు, ప్రభుత్వ భూములను మాత్రం నామమాత్రపు ధరకే తన బినామీకి అప్పగించేశారు. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో అతి పెద్ద మోసం.

ఎక్కడిదీ ఐఎంజీ..?
తమ కంపెనీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ వరల్డ్ వైడ్ కంపెనీకి అనుబంధమని బిల్లీరావు నమ్మబలికారు. నిజానికి ఫ్లోరిడాలో ఐఎంజీ వరల్డ్‌వైడ్‌కు ఉన్న భూమే 120 ఎకరాలు! అలాంటి కంపెనీకి హైదరాబాద్‌లో 855 ఎకరాలు కట్టబెట్టేందుకు బాబు సిద్ధమయ్యారు! అంతేకాదు. ఫ్లోరిడాలోని ఐఎంజీకీ, ఇక్కడి ఐఎంజీ భారతకూ ఎలాంటి సంబంధమూ లేదని తరువాతి పరిణామాల్లో ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. కాకపోతే ఈ లోపు అబద్ధాన్ని నిజం చేయడానికి బాబు అనుయాయులు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ఎన్నో ప్రయత్నాలు చేశారు. 

ఐఎంజీ భారత సంస్థ సాక్షాత్తూ స్వర్గం నుంచి భూమ్మీదికి వచ్చినట్లు... దాని రాకతో మొత్తం క్రీడా ప్రపంచమే మారిపోతుందన్నట్లు కలర్ ఇచ్చారు. అంతేతప్ప ప్రభుత్వాధికారులు కూడా ఐఎంజీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బిల్లీరావు కాకమ్మ కథలనే గుడ్డిగా నమ్మారు. భూములు కట్టబెట్టేశారు! ఈ విషయాలన్నింటినీ నాటి యువజన వ్యవహారాల ముఖ్య కార్యదర్శి స్వయంగా ప్రమాణపూర్వక అఫిడవిట్‌లో హైకోర్టు ముందుంచారు. బాబు హయాంలో జరిగిన ఈ వ్యవహారాలన్నింటిలోనూ పారదర్శకత లోపించిందని, ఆశ్రీత పక్షపాతంతో హడావుడిగా ఐఎంజీకి భూములు కట్టబెట్టారని, తద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

ఐఎంజీ భూముల స్వాధీనం
విపక్ష నేతగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఐఎంజీ, బాబు ప్రభుత్వ అక్రమాలపై తీవ్రంగా పోరాడారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వేసిన మంత్రుల సంఘం ఐఎంజీకి భూ కేటాయింపు అక్రమమని తేల్చింది. దాంతో వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఐఎంజీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. ఐఎంజీకి భూ కేటాయింపుల్లో నాటి ప్రభుత్వం, అధికారుల తీరుపై విచారణ సందర్భంగా ధర్మాసనం పలు సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

కుప్పంలోనూ బిల్లీ సోదరుడే! 
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో చేపట్టిన ప్రాజెక్టులో రూ.19 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగింది. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో చేపట్టిన ఈ ప్రాజెక్టును బీహెచ్‌సీ ఆగ్రో (ఇండియా) లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ కంపెనీలో తన బినామీలు బిల్లీరావు, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ పేట రావు, మరికొందరు డెరైక్టర్లు. 9,572 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల పెద్ద సంఖ్యలో రైతులు దారుణంగా నష్టపోయారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. కుప్పం ప్రాజెక్టు అక్రమాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలపతి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 

పూర్తిస్థాయిలో విచారణ జరిపిన జస్టిస్ చలపతి, కుప్పం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేల్చారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. జస్టిస్ చలపతి కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించి, ఆయన సిఫారసు ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించింది. పేట రావు, బిల్లీరావు తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జస్టిస్ చలపతి తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగానే, బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లీరావు పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రోహిణి.. సీఐడీ విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చొరవ చూపకపోవడం విశేషం.

బాబు-బిల్లీ బంధం...
ఈ వ్యవహారంలో జరిగిన గోల్‌మాల్, నిబంధనల ఉల్లంఘనలతో పాటు బాబు ప్రమేయంతో పాటు, ఆయనతో తనకున్న ‘అతి సన్నిహిత’ సంబంధాలు తదితరాల గురించి స్వయంగా ఐఎంజీ డెరైక్టర్ అహోబలరావు అలియాస్ బిల్లీరావు నోట వెలువడ్డ పచ్చి నిజాలు గతంలోనే ‘సాక్షి’కి చిక్కాయి. ‘సాక్షి’ రహస్య శోధనలో బిల్లీరావు ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే...
‘‘బాబుకు ఈ కేసు పూర్తి వివరాలు తెలుసు. అర్ధరాత్రి రెండు గంటలకు లేపి అడిగినా కూడా.. ఠక్కున చెప్పేస్తారు. నేను ఏది చెప్పినా.. బాబు 110 శాతం అది కరెక్టని చెప్పి నమ్ముతారు. ఆయనకు చాలా జ్ఞాపకశక్తి ఉంది. నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేనెందుకు అబద్ధం చెప్పాలి..?’’ ‘‘నేను సాధారణంగా అన్ని విషయాలను బాబు దృష్టికి తీసుకెళ్తా.’’
‘‘ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు బాబు ప్రత్యేకంగా ఓ మనిషిని కూడా నియమించారు. బాబును ప్రతిసారీ డిస్ట్రబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆయన ఏర్పాటు చేసిన మనిషి ఎప్పటికప్పుడు మనకు సమాచారమిస్తారు. మనకు సమస్యేమీ ఉండదు.’’
‘‘బాబుకు, నాకు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. బాబుతో డెరైక్ట్‌గా ఫోన్లోనే మాట్లాడ్తాను. నా దగ్గర బాబు సెల్ నంబరుంది. అయినా సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు. బాబు దగ్గర రెండు ఫోన్లున్నాయి. ల్యాండ్‌లైన్ ఆపరేటర్ నాకు కనెక్ట్ చేస్తారు. బాబు ఎక్కడున్నా నాకు లైన్ కలిపిస్తారు. సాధారణంగా రాత్రి 9.30 గంటలలోపే ఆయనకు ఫోన్ చేస్తాను.’’ 
‘‘లోకేష్‌బాబుతో గంటలకొద్దీ గడిపాను. అతను కూడా చాలా తెలివైనవాడు. ఆయన నెంబర్ కావాలా.. తీసుకోండి. విదేశాల్లో చదువుకున్నాడు.. పనిచేశాడు. చాలా అనుభవం ఉంది. బాబుతో పోలిస్తే లోకేష్‌ది బాగా దూకుడు స్వభావం. బాబు కూడా అంత దూకుడు కాదు.’’

బిల్లీరావుకు బాబు 45 ఏళ్ల లీజుకు కట్టబెట్టిన స్టేడియాలివే...
1. జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్, గచ్చిబౌలి 
2. ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి 
3. ఆక్వెటిక్స్ స్టేడియం, గచ్చిబౌలి 
4. ఇండోర్ స్టేడియం, సరూర్‌నగర్ 
5. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం, యూసఫ్‌గూడ 
6. సాప్ వెల్‌డ్రోమ్, ఉస్మానియా యూనివర్సిటీ 
7. షూటింగ్ రేంజ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 
8. హాకీ స్టేడియం, గచ్చిబౌలి

కేబినెట్‌కే తెలియకుండా కేటాయింపులు
ఐఎంజీకి భూమి కేటాయిస్తూ ఫైల్‌పై బాబు సంతకం చేయగానే, బిల్లీరావు 2003 ఆగస్టు 9న ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే కంపెనీ రిజిస్టర్ కావడం.. ఫైల్ సిద్ధమవడం.. నలుగురు మంత్రులు ఆమోదించడం.. బాబు సంతకాలు చేయడం.. ఇలా అన్నీ మొత్తం నాలుగంటే నాలుగే రోజుల్లో జరిగిపోయాయి. కంపెనీ రిజిస్టరయిన నాలుగు రోజుల్లోనే.. అదీ లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి 20వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని, క్రీడా మైదానాల్ని అప్పగిస్తూ ప్రభుత్వం అతి కీలకమైన ఒప్పందం కుదిర్చేసుకుంది. 

బహుశా! ఓ అనామక కంపెనీకి ఇంతటి విలువైన ఒప్పందం కుదుర్చుకోవటమనేది దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు. ఒప్పందం కుదిరిన మరుక్షణం... భూమి అప్పగింతకు సంబంధించిన ఫైళ్లు శరవేగంగా కదిలాయి! బాబు హయాంలో ఆయన ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఉమా మహేశ్వరరావు ఈ బాధ్యతలన్నింటినీ భుజాలపై వేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన 400 ఎకరాలు, సరూర్‌నగర్ మండల పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న మామిడిపల్లిలో 450 ఎకరాలను ఎకరా రూ.50 వేల చొప్పున ఐఎంజీకి కేటాయించాలన్నది ఎంఓయూ ముఖ్యోద్దేశం. 

ఇది మంత్రివర్గ సమష్టి నిర్ణయమని నాటి సమాచార మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2003 సెప్టెంబర్ 1న విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారు. కానీ ఫైలును కేబినెట్ ముందు పెట్టకుండానే భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారన్నది రికార్డులను పరిశీలిస్తే స్పష్టమైంది. తరువాత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఈ విషయం స్పష్టంచేసింది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐఎంజీకి ముందే స్వాధీనం చేయాలంటూ అప్పటి రెవెన్యూ కార్యదర్శి డి.సి.రోశయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ భూమిని బదలాయించేందుకు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వర్గాలు మొదట అంగీకరించలేదు. కానీ చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి చేయటంతో సరేననక తప్పలేదు.

టీడీపీ అబద్ధాల దాడి
ఐఎంజీ భారతపై పిటిషన్లో పేర్కొన్నదంతా అసత్యమేనంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అబద్ధాల దాడి ఆరంభించింది. దీన్లో భాగంగా రెండురోజుల కిందట ఆ పార్టీ ‘ఐఎంజీ-నిజానిజాలు’ అంటూ ఓ పత్రాన్ని, దానికి జతగా ఐఎంజీ వరల్డ్ వైడ్ అధికారి టెడ్ మీక్మా రాసినట్టు చెబుతున్న లేఖను విడుదల చేసింది. దీంతో పాటు గ్రెగ్ ఛాపెల్ కూడా తమ ప్లాన్లు చూసి మురిసిపోయారని, ఐఎంజీ భారతకు స్వయంగా మెయిల్ చేశారంటూ ఒక ఈ-మెయిల్‌ను బయటపెట్టింది. ఇవన్నీ నిజమేనా? అసలు ఈ లేఖలు రాసిందెవరు? ఐఎంజీ భారతకు-ఐఎంజీకి సంబంధం ఉందా? తెలుగుదేశం ప్రచారంలో నిజమెంత? అసలు టీడీపీ ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడాల్సి వస్తోంది?
Share this article :

0 comments: