లీకులందించడమే లక్ష్యమా?: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లీకులందించడమే లక్ష్యమా?: అంబటి

లీకులందించడమే లక్ష్యమా?: అంబటి

Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011

జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను మసకబార్చేందుకే ప్రయత్నమా?
డెలాయిట్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చారంటూ ఎల్లో మీడియా పిచ్చిరాతలు
విచారణంటే జగన్ ఇంటి వాస్తు చూడటమేనా?
అసలు విచారణ రహస్యంగా జరుగుతోందా లేక పత్రికల సమక్షంలో జరుగుతోందా?
బాబును సమర్థించేలా లక్షీ్ష్మనారాయణ ఎందుకు మాట్లాడారు?
‘సాక్షి’ లక్ష్యంగానే ఆ రెండు పత్రికల ప్రచారం.. రూ.1,800కోట్ల నష్టాల్లో రామోజీ కంపెనీలు 
అలాంటి సంస్థ షేరు ఒక్కోటి రూ. 5.32 లక్షలకు ఎలా కొంటారు?
ఒక పత్రికలో పనిచేసిన వ్యక్తి అదే పత్రికను ఎలా కొన్నారు?
జగన్ ఏ తప్పూ చేయలేదని అందరికీ తెలుసు 
ఏం చేయలేకనే సీబీఐని ఉపయోగించుకుంటున్నారు
రాజీనామాలు ఆమోదించరు, అవిశ్వాసం ప్రవేశపెట్టరు.. 
రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితులు


హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ, పరువు ప్రతిష్టలను తగ్గించేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని, అందుకు ఎల్లోమీడియా రాతలు మరింత బలం చేకూరుస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ నిజాలు నిగ్గుతేల్చేందుకు జరుగుతోందా లేక ఎల్లో మీడియాకు లీకులందించి జగన్ ప్రతిష్టను దొంగదెబ్బ తీసేందుకు జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈనాడు, దాని తోకపత్రిక గురివిందల్లా ‘సాక్షి’ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీబీఐ విచారణ జరుగుతున్న తీరు, ఎల్లో మీడియాలో వస్తున్న విష కథనాలు చూస్తుంటే ఆశ్చర్యం వే స్తోంది. డెలాయిట్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చారని, జగన్ చక్రబంధంలో ఇరుక్కున్నార ని పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో పిచ్చి రాతలు రాశాయి. 

ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది... త్వరలో ఏదో జరగవచ్చంటూ భయాందోళనలు కలిగే రీతిలో కథనాలు ప్రచురించాయి. సీబీఐ విచారణలో వాస్తవాలు తెలుసుకోవడంకన్నా, కేవలం పత్రికల్లో ప్రచారం చేసి జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ తగ్గించేందుకే ఎల్లో మీడియా ప్రయత్నం చేసినట్లుగా ఉంది’’ అని అంబటి దుయ్యబట్టారు. ‘‘కంపెనీల విలువ లెక్కించడంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ మొదటగా ‘సాక్షి’ విలువ రూ. 2,500 కోట్లు చేసిందని, వీళ్లు పెంచమంటే మరో వెయ్యికోట్లు పెంచిందని ఎల్లో కథనాలు చెబుతున్నాయి. కార్పొరేట్ కంపెనీ స్థాపించినప్పుడు ఎవరైనా దినదినాభివృద్ధి కోరుకుంటారే కానీ, విలువ తక్కువ చేసి చెప్పమంటారా? డెలాయిట్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చారంటున్నారు... అదీనూ కంపెనీ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత అది సీబీఐ విచారణలో చెప్పారంటున్నారు. ఆయన నిజంగా చెప్పారో, లేదా చొక్కాలాగి, బెదిరించి ఆ విధంగా చెప్పమన్నారో ఎవరికి తెలుసు?’’ అని ప్రశ్నించారు. డెలాయిట్ సుదర్శన్‌ను 164 సెక్షన్ కింద సీబీఐ విచారణ నిర్వహించి రికార్డు చేశారని, నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్లు శిక్ష వేస్తారని ఎల్లోమీడియానే తీర్పునివ్వడాన్ని తప్పుబట్టారు. ఏదోవిధంగా జగన్‌పై విషప్రచారం చేసి ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని తగ్గించి సర్వేలు చేసి చూపే ప్రయత్నంగా కనిపిస్తోందని అంబటి దుయ్యబట్టారు. 

సీబీఐ ఎక్కడ విచారణ చేస్తోంది?
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబమే టార్గెట్‌గా సీబీఐ విచారణ సాగుతోందని అంబటి తప్పుబట్టారు. ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో లబ్ధిపొందిన వాళ్లే జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపైనే సీబీఐ విచారణ చేయాలనుకున్నారు. అందుకే వేశారు. కానీ సీబీఐ చేస్తున్నదేంటి? లబ్ధిపొందిన వాళ్లు ఎవరు, అన్యాయం అక్రమం ఎక్కడ జరిగిందనేది తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్తారా లేక జగన్ నివాసానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా, లోపల ఏముంది, కిటికీ విలువ ఎంతని దర్యాప్తు చేస్తారా? ఇదేనా సీబీఐ చేసే దర్యాప్తు! ఆ తర్వాత ఎల్లో మీడియాకు లీకులివ్వడం, వాళ్లు దీనికి మరింత పైత్యాన్ని జోడించి ఇంట్లో బంగారు కుర్చీ ఉందని, స్విమ్మింగ్‌పూల్, విదేశీ బారు అంటూ తలాతోక లేని కథనాలు ఇవ్వడం.. ఇదేనా సీబీఐ దర్యాప్తు? జగన్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ.. కాంగ్రెస్-టీడీపీలకు లబ్ధి చేకూర్చడమే సీబీఐ లక్ష్యమా? ప్రభుత్వమంటే వైఎస్ కుటుంబం ఒక్కటేనా?’’ అని అంబటి నిలదీశారు. అన్యాయం ఎక్కడ జరిగిందో గుర్తించడానికి కాకుండా కేవలం ఎల్లోమీడియాకు సమాచారం ఇచ్చేందుకే సీబీఐ విచారణ చేస్తున్నట్లుందని విమర్శించారు. సీబీఐ విచారణ రహస్యంగా జరుగుతోందా లేదా పత్రికల సమక్షంలో బహిరంగంగా జరుగుతోందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓఎంసీ కేసుకు సంబంధించి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ అధికారులకు ఒక జీవో ఇస్తే, సీబీఐ జేడీ లక్షీ్ష్మనారాయణ నాలుగు గంటల వ్యవధిలోనే ‘హిందూ’ పత్రికతో మాట్లాడుతూ ఆ జీవోతో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయనను సమర్థించేలా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ఓఎంసీలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మొదటి నుంచి విచారణ జరిపితే తప్పేమిటని నిలదీశారు. సీబీఐ విచారణ కాంగ్రెస్-టీడీపీల వాదనకు వత్తాసు పలికేదిగా ఉందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రవర్తించి సీబీఐకున్న పవిత్రతను మసకబార్చవద్దని ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారులకు అంబటి విజ్ఞప్తి చేశారు. 

లాభాలు పొందిన వారైతే ముఖచిత్రమెందుకు?
వైఎస్‌ఆర్ హయాంలో లబ్ధిపొందిన కంపెనీలే ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయని ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని అంబటి తప్పుబట్టారు. అదే నిజమైతే పెట్టుబడులు పెట్టేవారికి వ్యాల్యుయేషన్ రిపోర్టుతో పనేముందని ప్రశ్నించారు. లబ్ధిపొందినవారే పెట్టుబడులు పెట్టారన్నప్పుడు, ఇప్పుడేదో డొల్ల అంచనాలంటూ ఎల్లో మీడియా కొత్త నినాదం వినిపిస్తుందెందుకని నిలదీశారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలని చెప్పారు. వారెవ్వరూ ఎలాంటి ఫిర్యాదు చేయనప్పుడు ఈ విషప్రచారమెందుకని ప్రశ్నించారు. ‘‘కొండారెడ్డిది ప్రధాన సాక్ష్యమంటూ ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురిస్తోంది. ఇంతకూ ఆ కొండారెడ్డి ఎవరు? ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు. మా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి తండ్రి మా పార్టీ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆయన జగన్‌కు అనుకూలంగా చెబుతారా? ఆ వ్యక్తి చెప్పిన మాటలు సాక్ష్యంగా స్వీకరిస్తారా? ఇదెక్కడి విడ్డూరం!’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘వై.ఎస్.జగన్ ఏ విధమైన తప్పు చేయలేదని సీబీఐతోపాటు కాంగ్రెస్-టీడీపీల వారందరికీ తెలుసు. ఇంతచేసి ఏ తప్పూ తేలకపోతే ప్రజల్లో చులకనవుతామనే దురుద్దేశంతోనే కోడిగుడ్డు మీద ఈకలు లాగుతున్నారు. జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్-టీడీపీలు దుర్బుద్ధితో ఏదో ఒకచోట ఇరికించి.. జగన్‌ను అభాసుపాలు చేయడం కోసం సీబీఐని ఉపయోగించుకుంటున్నారు’’ అని అంబటి ఆరోపించారు. 

రామోజీ.. నీ గురివింద నలుపు చెప్పవేం?
ఈనాడు, దాని తోకపత్రిక గురివింద గింజల్లా వ్యవహరిస్తున్నాయని అంబటి ధ్వజమెత్తారు. తమ డొల్లతనాన్ని ఏనాడూ బయటపెట్టుకోని ఆ రెండు పత్రికలూ కలిసి ‘సాక్షి’ని నిత్యం విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన సంస్థలో ఒక్కో షేరు రూ. 350 కు కొన్నారని నానా యాగీ చేస్తున్నారు. జగన్ లేటెస్టు టెక్నాలజీతో సరికొత్త మిషన్లతో పత్రిక స్థాపించారు. అది సక్సెస్ అయి ప్రతి రోజూ ఉదయానికి 15 లక్షల ఇళ్లకు చేరుతూ... కోటికి పైగా పాఠకులను సంపాదించుకుందే కానీ మూతపడలేదుగా? సాక్షి ఉజ్వల భవిష్యత్తు ఉన్న పత్రిక. మరి రామోజీ సంగతేంటి? ఆయన 15 కంపెనీలు రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్నాయని ఆదాయపన్ను శాఖముందు అంగీకరించారు. అలా నష్టాల్లో కూరుకుపోయిన, 30 ఏళ్లనాటి పాతమిషన్లు ఉన్న సంస్థలో ఒక్కో షేరు రూ. 5 లక్షల 32 వేలు పెట్టి కొనుగోలు చేశారంటే దాంట్లో ఉన్న మర్మమేంటి రామోజీ? అనునిత్యం కోర్టు కేసులు, అనేక భూవివాదాలు కలిగిన సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఏవిధంగా ముందుకొచ్చారో టీడీపీ నేతలు వివరిస్తారా? సాక్షిలో కేవలం రూ.350లకు కొంటే నానాయాగీ చేస్తున్నా రామోజీ, మరి నీ గురివింద నలుపు చెప్పవెందుకు?’’ అని నిలదీశారు. ‘‘తెలుగునాట ఉన్న మరో తోకపత్రిక పేరు పలకడమే శుద్ధదండగ. 

సర్క్యులేషన్ పడిపోయి విపరీతమైన కష్టాల్లో కూరుకుపోయిన ఆ పత్రిక 2000లో మూతపడింది. రెండేళ్ల తర్వాత తుప్పుపట్టిన మిషన్‌లను కొనుగోలు చేసి మళ్లీ తెరిచారు. అలా చేసింది ఏ కార్పొరేట్ కంపెనీయో కాదు సుమా! అంతకుముందు అదే పత్రికలో పనిచేసిన ఒక రిపోర్టర్. ఆ పత్రిక మూతపడే సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆ వ్యక్తి మాత్రం కోట్లు కుమ్మరించి పేపర్‌ను తెరవడం విడ్డూరం. అందులోకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి? సీఎం రమేశ్, జైరమేశ్, నూజివీడు ప్రభాకర్ ఏమాశించి పెట్టుబడులు పెట్టారు? బాబు పలుకుబడి మేరకు పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ నష్టాల్లో ఉన్న ఆ సంస్థకు బాబు క్యాష్ కొట్టడం లేదా?’’ అని అంబటి ప్రశ్నించారు. ఆ రెండు పత్రికల బాగోతాలు తెలుగు ప్రజలకు తెలుసని, గిట్టనివారిపై విషం చిమ్మడమే వారి లక్ష్యమని కూడా తెలుసునని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం చిత్రమైన పరిస్థితి!
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, చాలా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని అంబటి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అధికార పక్షానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించరు. ఎమ్మెల్యేలందరూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆమోదించరు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందంటే గవర్నర్ మాత్రం.. లేదు లేదు బ్రహ్మండమైన మెజారిటీ ఉందంటారు. ప్రధాన ప్రతిపక్షాన్ని అవిశ్వాసం పెట్టమంటే... మీరు చెబితే పెడతానా, మా ఇష్టం ఉన్నప్పుడు పెడతామంటారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్య నైతికత ఉందా?’’ అని అంబటి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పరిస్థితి మరీ విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు పోరుయాత్రలంటూ రోడ్లమీద తిరుగుతూ... ఇది పనికిమాలిన ప్రభుత్వం, దద్దమ్మ, చేతకానిది, గుండెల్లో నిద్రపోతానంటారు. తీరా అవిశ్వాసం పెట్టమంటే నేనెందుకు పెడతా? అయినా ప్రభుత్వం పడిపోతే సమస్యలు పోతాయా? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు’’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నందుకే ఆయన తప్పులను కప్పిపెడుతోందని, అందుకే ఆయనపై ఆరోపణలు వస్తున్నా సీబీఐ విచారణ చేయడంలేదని అంబటి ఆరోపించారు.
Share this article :

0 comments: