బాబు అక్రమాస్తుల దర్యాప్తునకు ప్రత్యేక టీమ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు అక్రమాస్తుల దర్యాప్తునకు ప్రత్యేక టీమ్!

బాబు అక్రమాస్తుల దర్యాప్తునకు ప్రత్యేక టీమ్!

Written By news on Tuesday, November 15, 2011 | 11/15/2011

*‘సత్యం’ కేసు తరహాలో ఎండీఐటీ ఏర్పాటుకు సీబీఐ యోచన 
*ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించే అవకాశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాస్తులు, అవినీతి వ్యవహారాలకు సంబంధించి విచారణ జరపాల్సిందిగా హైకోర్టు ఆదే శించిన నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగనుంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా సత్యం కుంభకోణం మాదిరి వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎండీఐటీ)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఎండీఐటీలో ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) ప్రతినిధులు ఉంటారు. హైకోర్టు ఆదేశాలు తమకు అందాల్సి ఉందని, అవి పరిశీలించిన తర్వాతే కేసుపై స్పందిస్తామని సీబీఐ అధికారులు మీడియాకు తెలిపారు. సీబీఐ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు దర్యాప్తు బృందంలో ఎవరుంటారనేదీ నిర్ణయిస్తామని చెప్పారు. 

తొమ్మిదేళ్లపాటు సీఎంగా కొనసాగిన కాలంలో చంద్రబాబు ప్రభుత్వ ఆస్తుల్ని స్వాహా చేయడమే కాకుండా, బినామీల పేర్లతో విదేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టారని వైఎస్ విజయమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సీబీఐతోపాటు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) విడివిడిగా హైకోర్టుకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కారణంగా సీబీఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతోపాటు చంద్రబాబు బినామీ ఆస్తుల వ్యవహారం విదేశాలకు సైతం విస్తరించడంతో ఆయా దేశాలకూ దర్యాప్తు బృందాలు వెళ్లాల్సి ఉంటుంది. 

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మూడు కీలకమైన కేసుల్లో సీబీఐ ఏకకాలంలో దర్యాప్తు జరుపుతోంది. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో డిసెంబర్ 3నాటికి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలి. దీంతోపాటు కర్ణాటకలోని బళ్లారిలోనే కొన్ని కేసులు తాజాగా నమోదు చేశారు. ఎమ్మార్ అక్రమాల కేసులో స్టైలిష్‌హోమ్స్ ఎండీ కోనేరు ప్రసాద్‌ను అరెస్టుచేసి 12 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించినా విల్లాల కొనుగోలు దారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాలను ఎక్కడెక్కడకు తరలించారో పూర్తిస్థాయిలో సమాచారం సంపాదించలేకపోయారు. దుబాయ్, ఇండోనేసియాలకు కొంత మొత్తాలను కోనేరు తరలించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీంతో ఒక బృందం అక్కడకు కూడా వెళ్లాల్సి రావచ్చు. 

ఈ రెండు కేసులతోపాటు వైఎస్ జగన్ ఆస్తుల కేసుపైనా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయ సిబ్బందిలో అత్యధిక భాగం ఈ కేసుల దర్యాప్తులో ఉన్నారు. దీంతో చంద్రబాబు అక్రమాస్తుల కేసు వ్యవహారాన్ని మరో జాయింట్ డెరైక్టర్‌కు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్లు సీబీఐ వర్గాల నుంచి తెలుస్తోంది. చంద్రబాబు కేసులో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించే అవకాశం కూడా ఉండొచ్చని సమాచారం!
Share this article :

0 comments: