రిలయన్స్ మరో షాక్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిలయన్స్ మరో షాక్!

రిలయన్స్ మరో షాక్!

Written By news on Saturday, November 19, 2011 | 11/19/2011




హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రానికి రిలయన్స్ మళ్లీ ‘షాక్’ ఇచ్చింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాసు ఉత్పతి తగ్గిపోయిందనే సాకుతో.. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు రోజుకు ఒక మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) చొప్పు న గ్యాసు సరఫరాను తగ్గించింది. దీంతో 200 మెగావాట్ల (సుమారు 5 మిలియన్ యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఈ మేరకు విద్యుత్ కొరతను తీర్చేందుకు బయటి మార్కెట్ నుంచి అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్‌కు అదనంగా రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉండటంతో రోజుకు 5 ఎం.యూలకు గాను సుమారు కోటి రూపాయల వ్యయం అవుతుంది. రోజుకు కోటి చొప్పున నెలకు రూ. 30 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతుందన్న మాట. 

70% పీఎల్‌ఎఫ్‌కు తగ్గిన గ్యాసు సరఫరా
రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ ప్లాంట్లకు (జీవీకే, వేమగిరి, ల్యాంకో, కోనసీమ) ఫాల్ బ్యాక్ (తాత్కాలిక ప్రాతిపదికన) కింద కేటాయించిన 2.36 ఎంసీఎండీల గ్యాసుకు గత ఏడాది అక్టోబర్‌లో రిలయన్స్ కోత కోసింది. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. తాజాగా ఒక ఎంసీఎండీ చొప్పున గ్యాసు సరఫరా తగ్గడంతో మరో 200 మెగావాట్ల విద్యుత్‌కు నష్టం వాటిల్లింది. రాష్ర్టంలోని నాలుగు విద్యుత్ ప్లాంట్లకు 75 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు రిలయన్స్ గ్యాసు సరఫరా చేస్తోంది. మరో 15 శాతం పీఎల్‌ఎఫ్‌కు ఫాల్ బ్యాక్ గ్యాసును కేటాయించింది. తొలుత ఈ ఫాల్ బ్యాక్ గ్యాసుకు కోత విధించింది. ప్రస్తుతం 75 శాతం పీఎల్‌ఎఫ్ గ్యాసులో కోత కోసింది. దీంతో ఇప్పుడు కేవలం 70 శాతం పీఎల్‌ఎఫ్‌కు మాత్రమే ప్రస్తుతం గ్యాసు సరఫరా అవుతోంది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ గ్యాసు లేకపోవడంతో విద్యుత్ ప్రాజెక్టులు తక్కువ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కావాల్సి వస్తోంది. 

రబీ సాగుపైనా ప్రభావం!: కేజీ బేసిన్‌లో గ్యాసు ఉత్పత్తి 48 ఎంసీఎండీల నుంచి 41 ఎంసీఎండీలకు తగ్గిపోయిందని రిలయన్స్ చెబుతోంది. ఈ నేపథ్యంలో కోత పడిన గ్యాసును ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నా రు. హైదరాబాద్‌లో 3 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6, గ్రామాల్లో 8 గంటల పాటు విద్యుత్ కోత అమలవుతోంది. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు కోత అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ గ్యాసు సరఫరా తగ్గించడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనిపక్షంలో ప్రజలు చలికాలంలోనూ విద్యుత్ కోతలతో అవస్థలు పడకతప్పదు. రబీలో రైతులు విద్యుత్ కోతలతో సతమతంకాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
Share this article :

0 comments: