రామోజీకి హైకోర్టు షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీకి హైకోర్టు షాక్

రామోజీకి హైకోర్టు షాక్

Written By news on Saturday, November 19, 2011 | 11/19/2011




విశాఖ ఈనాడు స్థల వివాదంపై మూడు పిటిషన్లు కొట్టివేత
రామోజీ లేవనెత్తిన అంశాల్లో నిజాయితీ లేదన్న వాదనలతో కింది కోర్టు ఏకీభవించే ఉత్తర్వులు జారీ చేసిందని... అందులో తప్పు ఏమీ లేదన్న న్యాయమూర్తి
లీజు స్థలం విస్తీర్ణమెంతో మొదటి నుంచీ 
రామోజీకి తెలుసునని హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, న్యూస్‌లైన్: రామోజీరావుకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో ఈనాడు కార్యాలయం ఏర్పాటు నిమిత్తం తీసుకున్న భూమిని తిరిగి అప్పగించకుండా భూయజమానిని ముప్పుతిప్పలు పెడుతున్న రామోజీరావు చర్యలను తప్పుబట్టింది. ఈనాడు కార్యాలయ స్థల వివాదంలో తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేస్తూ.. తన కేసును మరో జడ్జికి బదిలీ చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో కింది కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్, కౌంటర్లలో సవరణలకు సదరు కోర్టు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ రామోజీ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గోడా రఘురాం శుక్రవారం 74 పేజీల తీర్పును వెలువరించారు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో 1974 నుంచి ఇప్పటివరకు రామోజీరావు చేస్తూ వచ్చిన పలు అవకతవకలను, కోర్టులకు చెప్పిన అవాస్తవాలను న్యాయమూర్తి తన తీర్పులో ఎండగట్టారు. ఇదే సమయంలో కింది కోర్టు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ రఘురాం సమర్ధించారు. 

అంతేకాక మేజిస్ట్రేట్‌పై రామోజీరావు చేసిన పలు ఆరోపణలను తోసిపుచ్చారు. 1974లో ఈనాడు కార్యాలయం ఏర్పాటు నిమిత్తం మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణ వర్మ (ఎం.ఎ.ఇ.కె.కె.వర్మ) నుంచి 2.70 ఎకరాల భూమిని రామోజీరావు లీజుకు తీసుకున్నారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో వర్మ నుంచి తీసుకున్న స్థల విస్తీర్ణాన్ని తగ్గించి చూపడం.. వర్మ స్థలాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ప్రతిగా ప్రభుత్వం నుంచి ఉషోదయా పేరు మీద స్థలం పొందడం.. తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేయడం తదితర అంశాలపై రామోజీ చర్యలను న్యాయమూర్తి దుయ్యబట్టారు. స్థలాన్ని లీజుకు తీసుకునే సమయంలో దాని విస్తీర్ణం ఎంతో తనకు తెలియదంటూ రామోజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. లీజుకు తీసుకున్న స్థలం 11,034.78 చదరపు మీటర్లన్న విషయం రామోజీకి మొదటినుంచి స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. వర్మకు పంపిన నోటీసుల్లో లీజు విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లుగా రామోజీ పేర్కొనగా వర్మ దీనిపై అభ్యంతరం కూడా తెలిపారని గుర్తు చేశారు. 

వివిధ సందర్భాల్లో పలు ప్రభుత్వ సంస్థలు సర్వే చేసి, విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లకు పైనేనని తేల్చిన విషయాన్ని కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం రామోజీ తాను లీజుకు తీసుకున్న స్థలం విస్తీర్ణం 11వేల చదరపు మీటర్లని చెప్పడాన్ని కూడా గుర్తుచేశారు. దీనికి సంబంధించి రామోజీకి వ్యతిరేకంగా కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎటువంటి దోషం లేదని స్పష్టంచేశారు. మేజిస్ట్రేట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఆ తరువాత మరో కేసులో సవరణలు చేసేందుకు అనుమతివ్వాలన్న రామోజీ పిటిషన్‌ను తోసిపుచ్చిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి సవివరంగా తీర్పులో చర్చించారు.

సవరణ పిటిషన్‌ను తోసిపుచ్చడానికి మేజిస్ట్రేట్ చూపిన కారణాలు సరైనవని జస్టిస్ రఘురాం తేల్చి చెప్పారు. మేజిస్ట్రేట్ పక్షపాతంతో, ముందుగానే నిర్ణయానికి వచ్చి ఉత్తర్వులు జారీ చేయలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రామోజీ లేవనెత్తిన అంశాలు దురుద్దేశపూర్వకమని, నిజాయితీగా లేవని వర్మ చేసిన వాదనలతో కింది కోర్టు ఏకీభవించే అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిందని, అందులో తప్పేమీ కనిపించడం లేదని న్యాయమూర్తి తెలిపారు. మేజిస్ట్రేట్ పక్షపాతంతో ఉత్తర్వులు జారీ చేశారన్న రామోజీ ఆరోపణలకు ఆధారం లేదని తేల్చారు. తన ముందున్న ఆధారాలు, వాస్తవాల ఆధారంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ మూడు వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ రఘురాం తీర్పులో పేర్కొన్నారు. ఈ మూడు వ్యాజ్యాల్లో తామిచ్చిన తీర్పు కింది కోర్టుకు ఎటువంటి అడ్డంకి కాదని తేల్చి చెప్పారు.

ఇదీ రామోజీ అక్రమాల కథ...

విశాఖపట్నంలోని సీతమ్మధార సర్వే నంబర్ 50/4లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణ వర్మకు చెందిన 2.70 ఎకరాల భూమి (13,078 చదరపు గజాలు)ని 33 సంవత్సరాల లీజు ఒప్పందంతో ఉషోదయ పబ్లికేషన్స్ పేరు మీద 1974, మార్చి 30న రామోజీ తీసుకున్నారు. లీజు గడువు ముగిసిన వెంటనే భూమిని తిరిగి అప్పగించేటట్లు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి. మొదటి 14 సంవత్సరాలు రూ.2,500లను అద్దెగా, మిగిలిన సంవత్సరాలకు రూ.3వేలుగా అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆ స్థలంలో రామోజీ ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటృ చేశారు. అయితే స్థల యజమాని వర్మకు తెలియకుండానే, ఆయనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రామోజీరావు తాను లీజుకు తీసుకున్న స్థలం నుంచి 517 చదరపు మీటర్ల స్థలాన్ని రోడ్డు వెడల్పు నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దానికి ప్రతిఫలంగా సీతమ్మధార సర్వే నంబర్ 52లోని 872 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని 1985, జనవరి 17న ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆ స్థలాన్ని వర్మ పేరు మీద కాకుండా ‘‘డెరైక్టర్, ఈనాడు’’ పేరు మీద కేటాయించాలని కోరడం గమనార్హం. రామోజీ కోరిన వెంటనే, అప్పటి కలెక్టర్ ఎస్.వి. ప్రసాద్ ఆగమేఘాల మీద స్పందించారు. ఆ భూమి స్వాధీనానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ 1985, ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం భూయజమాని వర్మకు సమాచారం అందించకుండానే జరపడంలో రామోజీ దురుద్దేశం స్పష్టమవుతోంది. 

పదివేలిస్తా.. పండగ చేసుకో...

వర్మ నుంచి 33 సంవత్సరాల లీజు ఒప్పందం ద్వారా భూమిని పొందిన రామోజీరావు, తిరిగి మరో 33 సంవత్సరాలకు లీజును పొడిగించాలంటూ 2006, సెప్టెంబర్ 27న వర్మకు నోటీసులు పంపారు. 1973లో చేసుకున్న ఈ ఒప్పందం 2007, మార్చి 31తో ముగుస్తుండటంతో.. నెలకు కేవలం రూ.10వేల చొప్పున అద్దె చెల్లిస్తానని రామోజీ ప్రతిపాదించారు. మరోసారి లీజు పొడిగింపునకు వర్మ తిరస్కరించారు. అంతేకాక తనకు పంపిన నోటీసుల్లో భూమికి కొత్త సరిహద్దులుండటం గుర్తించారు. దీంతో తన భూమి సరిహద్దులు తెలుసుకునేందుకుగాను లీజుకిచ్చిన ప్రాంతాన్ని ఓసారి సందర్శిస్తానని రామోజీకి సమాచారం పంపారు. వర్మ లీజు ప్రాంతాన్ని సందర్శిస్తే, తన అక్రమాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను రామోజీ తోసిపుచ్చారు. అంతేకాక లీజు ప్రాంగణంలోకి వర్మ అడుగుపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ విశాఖపట్నం 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. దీంతో రామోజీ అసలు రంగు తెలుసుకున్న వర్మ, తన స్థలం నుంచి రామోజీరావును ఖాళీ చేయించేటట్లు ఆదేశాలు ఇవ్వాలంటూ 2007లో రెంట్ కంట్రోలర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే రామోజీ మూడు నెలలకుగాను రూ.9వేల మేర అద్దె బాకీ పడ్డారు. దీనిపై ఈనాడు చీఫ్ ఎడిటర్, చైర్మన్ హోదాలో రామోజీరావు, ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డెరైక్టర్ హోదాలో కిరణ్‌లపై 2007, సెప్టెంబర్ 19న వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వర్మ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వర్మ విధిలేని పరిస్థితుల్లో విశాఖపట్నం కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిశీలించిన విశాఖ కోర్టు.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అటు తరువాత పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైకోర్టుకు చేరింది. హైకోర్టు ఆదేశాలతో రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్‌లపై విశాఖ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

రామోజీ తీరుతో 123 సార్లు కేసు వాయిదా

విశాఖపట్నంలో ఈనాడు స్థలానికి సంబంధించి అక్కడి న్యాయస్థానంలో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థలం లీజు కాల పరిమితి 2007 మార్చితో ముగిసినా, కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ జిల్లా కోర్టులో రామోజీ కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు 9వ అదనపు జిల్లా కోర్టులో ఉంది. తన స్థలాన్ని రామోజీరావు ఖాళీ చేసి ఇవ్వాలని కోరుతూ స్థల యజమాని మంతెన ఆదిత్య బాలాజీవర్మ 2007లో కేసు వేశారు. ఈ కేసు ఈనెల 28వ తేదీన కోర్టు ముందుకు వస్తుంది. రామోజీరావు తీరు వల్ల ఇప్పటికి ఈ కేసులో 123 వాయిదాలు నడిచాయి. 2008లో రామోజీరావు తన ప్రింటింగ్‌ప్రెస్‌ను ఆటోనగర్‌కు తరలించడంతో ఆదిత్యవర్మ ఇదే కారణాన్ని చూపిస్తూ ఆర్‌సీసీ (ఆర్‌సీసీ 49/2008) కోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసులో ఇప్పటికి 110 వాయిదాలు నడిచాయి. రామోజీరావు వేసిన కేసులో కోర్టుకు సమర్పించిన పత్రాల్లో 1986, అక్టోబర్ 25వ తేదీన ఈనాడు భూమిగా చెబుతూ ప్రభుత్వానికి సమర్పించిన పత్రాలను ఉటంకిస్తూ వర్మ మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2010 దాకా ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వర్మ హైకోర్టులో రిట్ పిటిషన్ (క్రైం నం. 1160/2007) దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో కదిలిన పోలీసులు 2010, మే 18న చార్జిషీటు వేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో రామోజీరావు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు, నాల్గవ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం 9వ అదనపు జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓఎస్ 212/2007లో రామోజీరావు హైకోర్టులో దాఖలు చేసిన సీఆర్‌పీలను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వీటితో పాటు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులను ధ్రువీకరించింది.
Share this article :

0 comments: