సర్కారును పడగొట్టం!: చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారును పడగొట్టం!: చంద్రబాబు

సర్కారును పడగొట్టం!: చంద్రబాబు

Written By news on Friday, November 25, 2011 | 11/25/2011


విశాఖపట్నం, తుని/అన్నవరం, న్యూస్‌లైన్: ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. మాకు కావలసింది ఎన్నికలు కాదు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచన లేదు. మాకు ప్రజా సమస్యలే ముఖ్యం. ఆయారాం, గయారాంలకు బుద్ధి చెప్పడానికి, రైతు సమస్యలపై చర్చించడానికి.. అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాం. ఎవరో పెట్టమంటే పెట్టం’ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధంగా అవిశ్వాసం పెట్టే అవకాశం ప్రతిపక్షానికుంటుందని, దానిని వీలునుబట్టి వినియోగించుకుంటామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతు పోరుబాట పూర్తి చేసుకున్న ఆయన గురువారం ఉదయం అన్నవరంలో సత్యదేవుని దర్శించుకుని విశాఖ జిల్లా వచ్చారు. బుచ్చయ్యపేట మండలంలో పోరుబాట చేపట్టారు. ఇక్కడ సుమారు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. దిబ్బిడి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో, పలు రోడ్‌షోలలో, పలుచోట్ల విలేఖరులతో ఆయన మాట్లాడారు. కొంతమంది ఆయారాం, గయారాం ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారని, వైఎస్ హయాంలో ఆకర్ష్ పథకాన్ని పెడితే సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వికర్ష్ పేరిట ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ‘రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం మాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపండి. బంగాళాఖాతంలో కలపండి. మీరూ, నేనూ కలిపి పోరుబాట పట్టాలి. ఇందుకోసం నెలకు రెండు రోజులు ఉద్యమానికి కేటాయించండి’ అని పిలుపునిచ్చారు. ఇంకా ఆయనేమన్నారంటే..

కిరణ్‌కు సిగ్గులేదు: ఈ సీఎంకు సిగ్గులేదు. రాష్ట్రంలో రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే నిద్రమత్తులో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాదుకే పరిమితమవుతున్నారు. వరదలు వచ్చినా, క్రాప్ హాలిడే ప్రకటించినా, పంటలు ఎండిపోతున్నా ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. రచ్చబండ ఓ రొచ్చుబండగా మారింది. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు. గత ఎన్నికల్లో నేను తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ హామీని ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవాడిని. అలా ఇవ్వకే ఓటమి పాలయ్యాం. 

పందికొక్కుల్లా.. మంత్రులు: నా తర్వాత అవినీతిపరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుని ప్రజలు కష్టాలు కొనితెచ్చుకున్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు అందినకాడికి పందికొక్కుల్లా ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఐఏఎస్‌లు సైతం భయంతో తప్పులు చేసి, కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. 
కక్రూ నియామకం సమంజసమే: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవికి రెండు పేర్లు ప్రతిపాదించారు. రెండో వ్యక్తి ఈ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో కక్రూ పేరును బలపర్చాల్సి వచ్చింది. తెలుగులో ఎవరైనా ఫిర్యాదు చేయడం ఇబ్బందికాదా అంటే.. చీఫ్ జస్టిస్‌గా పని చేసినప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడేంటి?
(‘న్యూస్‌లైన్’ ప్రశ్నకు జవాబుగా ఈ వ్యాఖ్యలు చేశారు)

నన్నేం చేయలేరు..
‘పదవీ కాలం పూర్తయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు నాపై అభియోగాలు మోపుతారా? అయినా మాకు ముందుగా నోటీసులివ్వకుండా హైకోర్టు మాపై సీబీఐ విచారణకు ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మా వాదనలు వినిపిస్తాం. నాపై గతంలో 25 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. 24 విచారణలు, 65 ప్రాజెక్టులపై సమీక్షలు జరిపించారు. కాంగ్రెస్ నేతలు నన్నెప్పుడూ పనిచేసుకోనీయలేదు. కాంగ్రెస్ కుతంత్రాలు నన్నేం చేయలేవు’ అని బాబు వ్యాఖ్యానించారు.

బాబు సాక్షిగా నిరుద్యోగిపై దాడి

చోడవరం, న్యూస్‌లైన్: రైతు పోరుబాటలో చంద్రబాబు సాక్షిగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులు ఒక నిరుద్యోగ యువకుడిని చితకబాదారు. బుచ్చయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో చంద్రబాబును కలిసి గోడు విన్నవించుకునేందుకు యన్నంశెట్టి రాజు అనే నిరుద్యోగి వచ్చాడు. దీంతో బాబు భద్రతాసిబ్బంది అతడిని బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. సమస్యలు చెప్పుకోనివ్వాలంటూ అతడు ఎదురుతిరగడంతో నలుగురు సిబ్బంది పక్కకు తీసుకెళ్లి కిందేసి తన్నడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరు దూసుకొచ్చి వారుకూడా ఆ యువకుడిని కొట్టారు.
Share this article :

0 comments: