అన్నీ ‘కోత’లే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్నీ ‘కోత’లే!

అన్నీ ‘కోత’లే!

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011

రాష్ట్రమంతటా ఎడాపెడా కరెంటు వాతలు
సింగరేణి సమ్మే కారణమంటూ పాత సాకు..
సమ్మె విరమించి నెల దాటినా యథాతథంగా కోతలు
అడ్డగోలుగా అమలు చేస్తూ ప్రజలపై సర్కారు దొంగ దెబ్బ 
రాజధానిలో 3 గంటలు, శివార్లలో 5 గంటలు కట్
జిల్లా కేంద్రాల్లో 4, మండల కేంద్రాల్లో 6, 
ఊళ్లలో 8 గంటలు.. పరిశ్రమలకు వారానికి 3 రోజులు
బయటి కొనుగోళ్లకు స్వస్తి.. ఒప్పందాలూ.. రద్దు
రిలయన్స్ నుంచి గ్యాస్ రాబట్టడంలోనూ వైఫల్యమే
వచ్చే జూన్ దాకా ఇంతే.. రబీకీ కరెంటు షాక్ ఖాయం
తన హయాంలో ఎంత ధరకైనా కొనుగోలు చేసిన వైఎస్

రాష్ట్రంలో శుక్రవారం 
కరెంటు పరిస్థితి
(మిలియన్ యూనిట్లలో)
డిమాండ్ 251.6
సరఫరా 218.8
లోటు 32.8

హైదరాబాద్, న్యూస్‌లైన్: కరెంటు కోతలకు సింగరేణి సమ్మే కారణమన్న ప్రభుత్వ ప్రకటనలన్నీ వట్టి ‘కోత’లేనని తేలిపోయింది. సింగరేణి ఉద్యోగులు సమ్మె విరమించి, పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి మొదలై నెల దాటినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ కోతలు ఏమాత్రమూ తగ్గలేదు. నెల రోజుల క్రితం మాదిరిగానే యథాతథంగా అమలవుతున్నాయి! హైదరాబాద్‌లో మూడు గంటలు, శివారు ప్రాంతాల్లో నాలుగైదు గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు, గ్రామాల్లో 8 గంటలు కోత విధిస్తున్నారు. పరిశ్రమలకు కూడా వారంలో ఒక రోజు, వీక్లీ ఆఫ్ పేరుతో అదనంగా మరో రోజు కలిపి రెండు రోజులు కరెంటు కోత అమలవుతోంది. పైగా వాటికి సాయంత్రం 6 నుంచి రాత్రి 10 దాకా లైటింగ్‌కు మాత్రమే కరెంటిస్తున్నారు. వారమంతటికీ కలిపి ఇది కూడా ఒక రోజవుతుంది. అలా పరిశ్రమలకు వారంలో మూడు రోజులు కోతలు అమలవుతున్నాయి. సాధారణంగా చలికాలంలో కరెంటు కోతల అవసరముండదు. పైగా పగటి పూట డిమాండ్ ఉండక కరెంటును మార్కెట్లో విక్రయించిన సందర్భాలకూ కొదవ లేదు. ఈసారి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటే ప్రభుత్వ నిర్వాకమే అందుకు ప్రధాన కారణం! బొగ్గున్నా సాంకేతిక సమస్యలతో థర్మల్ ప్లాంట్లు పడకేసినా పట్టించుకోవడం లేదు. పైగా గతేడాది చలికాలంతో పోలిస్తే ప్రస్తుతం కరెంటు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 

2010 నవంబర్ 18న 190 మిలియన్ యూనిట్లు(ఎంయూ)న్న డిమాండ్ శుక్రవారం 251.6 ఎంయూకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ ప్రభుత్వం బయటి నుంచి ఎంత ధరకైనా కరెంటు కొని సరఫరా చేసేది! కిరణ్ సర్కారు మాత్రం బయటి నుంచి చేస్తున్న కొనుగోళ్లను కూడా పూర్తిగా ఆపేసింది. గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు కేంద్రం ఆదేశాల మేరకు గ్యాస్‌ను సరఫరా చేసేలా రిలయన్స్‌పై ఒత్తిడి కూడా తేవడం లేదు! చలికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే, అటు రబీ సీజను వ్యవసాయ డిమాండ్‌తో పాటు, ఇటు ఉక్కపోత దెబ్బకు గృహ వినియోగం భారీగా పెరిగే వేసవిలో పరిస్థితేమిటా అని అంతా ఇప్పటి నుంచే హడలిపోతున్నారు. వేసవి దాటేదాకా, అంటే 2012 జూన్ దాకా కోతలు తప్పవని ఇంధన శాఖ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఇవీ కారణాలు!: సింగరేణి సమ్మె విరమించగానే బయటి మార్కెట్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లను ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. ఇతర రాష్ట్రాలతో కుదుర్చుకున్న విద్యుత్ సరఫరా ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. దాంతో కరెంటు సరఫరా ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. ఒక్కోటి 500 మెగావాట్ల సామర్థ్యమున్న కాకతీయ (భూపాలపల్లి), కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచిపోయింది. 

రామగుండంలోని 65 మెగావాట్ల ప్లాంటుదీ ఇదే పరిస్థితైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు! జల విద్యుదుత్పత్తి కూడా 60 ఎంయూ నుంచి 9 ఎంయూకు పడిపోయింది. కేజీ బేసిన్లో ఉత్పత్తి తగ్గిందనే సాకుతో రాష్ట్ర ప్లాంట్లకు రిలయన్స్ గ్యాస్ సరఫరాను తగ్గించింది. దాంతో 2,495 మెగావాట్ల సామర్థ్యానికి గాను రాష్ట్ర గ్యాస్ ప్లాంట్లలో 1,863 మెగావాట్లే ఉత్పత్తవుతోంది. అవసరమైతే పెట్రో కెమికల్స్ ప్లాంట్లకు కోత విధించైనా ఈ ప్లాంట్లకు విధిగా 75 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) మేరకు గ్యాస్ సరఫరా చేయాలన్న కేంద్రం ఆదేశాలను రిలయన్స్ తుంగలో తొక్కి భారీగా కోత పెడుతోంది. వాటిని పాటించేలా ఒత్తిడి తేవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు కొని ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రయత్నించడం లేదు.

వేళాపాళా లేదా..

ఎన్నడూ లేని విధంగా రోజుకు ఆరు గంటలు కరెంట్ కోత విధిస్తున్నారు. కరెంటు కోతలకు వేళా పాళా ఉండటంలేదు. ఉదయం లేచినప్పటి నుంచి ఇబ్బందే. బిజినెస్ పూర్తిగా దెబ్బతింటోంది. మరీ ముఖ్యంగా పిల్లలకు ఇబ్బంది కల్గుతోంది. స్కూల్స్‌కు వెళ్లే ముందు టిఫిన్ చేయాలంటే కరెంట్ ఉండదు. బయట హోటళ్లలో నుంచి టిఫిన్స్ తెచ్చుకోవాల్సిందే. ఇంకా ఎన్ని రోజులో ఈ తిప్పలు.

- శివరాం, మెడికల్ స్టోర్ యజమాని, అనంతపురం

అరెకరమైనా పారుతలేదు

‘‘మా తండాలో ఒకే ట్రాన్స్‌ఫార్మర్ కింద 30 మోటార్లుండటంతో లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నయి. రోజుకు 15 మోటార్లు పని చేసెటట్టు ఒప్పందం చేసుకున్నం. రోజుకు నాలుగైదు గంటలకు మించి కరెంటిస్తలేరు. రెండెకరాలల్లో వరి పెడితె ఎండిపొయింది. రెండు రోజులకోసారి వచ్చే వంతుతో నాకు అరెకరం కూడా పారుతలేదు’’
- బాణావత్ మోతీలాల్, బాసోనిబావి తండా, పెద్దవూర మండలం, నల్లగొండ
Share this article :

0 comments: