కాకినాడ ఎమ్మెల్యే పెదనందిపాడులో వైఎస్ జగన్‌ను కలిసి వెళ్లారు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాకినాడ ఎమ్మెల్యే పెదనందిపాడులో వైఎస్ జగన్‌ను కలిసి వెళ్లారు.

కాకినాడ ఎమ్మెల్యే పెదనందిపాడులో వైఎస్ జగన్‌ను కలిసి వెళ్లారు.

Written By news on Monday, November 28, 2011 | 11/28/2011

సర్కారుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
పల్లెల్లోకి వెళ్లే ధైర్యం లేక పట్టణాల్లో మీటింగులు పెడుతున్నారు
ఇవ్వదలుచుకున్నదేదో ప్రజలకు
బిచ్చమేసినట్లు విసిరేస్తున్నారు


ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘మహానేత వైఎస్సార్ ఒక స్వప్నం చూశారు.. ఆ స్వప్నం పేరు రచ్చబండ. దాని ఉద్దేశం ప్రభుత్వం గ్రామాల్లోకి వెళ్లాలి. ప్రజల కష్టసుఖాలను స్వయంగా చూడాలి. సమస్యలను పరిష్కరించాలి. అయితే ఆయన మరణించిన తరువాత ఈ ప్రభుత్వం అదే రచ్చబండ పేరుతో మహానేత స్వప్నాన్ని భ్రష్టు పట్టిస్తోంది. ఈ సర్కారుకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఇలా నిలబడి గ్రామాల్లో ప్రజల సమస్యలు అడిగే ధైర్యం అంతకన్నా లేదు. అందుకే మండల కేంద్రాల్లో, పట్టణాల్లో రచ్చబండ పెడుతున్నారు. ఇవ్వదలుచుకున్నది ఏదో బిచ్చమేసినట్లు విసిరేసి.. ఇచ్చాంపో అన్నట్లు వ్యవహరిస్తున్నారు’’ అని వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 29వ రోజు ఆదివారం ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మొత్తం ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పెదనందిపాడులో వైఎస్ జగన్‌ను కలిసి వెళ్లారు. ఆదివారం యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి పలు గ్రామాల్లో చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

అధ్వానపు పాలకుల చేతిలో రాష్ట్రం..

ఏదైనా ఒక గ్రామంలో రచ్చబండ వద్ద నిలబడి.. ‘అర్హులై ఉండి పెన్షన్, ఇళ్లు, బియ్యం కార్డు లేనివారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు లేపండి’ అని అడిగితే... ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని వైఎస్సార్ అనుకున్నారు. అంతలా.. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు, బియ్యం కార్డు అందించాలని, విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పేద వృద్ధులకూ పెన్షన్ అందాలని వైఎస్సార్ పరితపించారు. అయితే రచ్చబండకు వెళ్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో దేశం మొత్తం మీద పేదలకు 48 లక్షల ఇళ్లిస్తే.. వైఎస్సార్ ఒక్క మన రాష్ట్రంలోనే పేదలకు 48 లక్షల ఇళ్లు కట్టించారు. ఇవాళ అధ్వానపు పాలకుల చేతిలో నా రాష్ట్రం ఉంది. ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇళ్లు ఇస్తారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే ఇళ్లు కట్టిస్తారట! మిగిలిన వారిని గాలికి పోండని అంటారట. దేశం మొత్తం మీద నాలుగు వేల కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తే మన రాష్ట్రంలో వైఎస్ ఒక్కరే రెండు వేల కోట్ల పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా.. ఉన్నవాటిని ఎలా కత్తిరిద్దామా? అని చూస్తోంది.

రెండు బస్తాల వడ్లు అమ్మితేనే డీఏపీ

ఇవాళ పొలంలోకి వెళ్లి రైతన్నవైపు చూస్తే బాధనిపిస్తోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని అధ్వాన పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. చెరువులు, కాలువలో నీళ్లు ఉంటాయి. పొలానికి మాత్రం నీళ్లివ్వని అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపుకొత్త సినిమా రిలీజ్ రోజున బ్లాక్‌లో టికెట్లు కొన్నట్లుగా ఎరువులు కొనాల్సి వస్తోంది. గతంలో రూ.500 ఉన్న బస్తా డీఏపీ ధర ఇవాళ రూ.వెయ్యి ఉంది. రెండు బస్తాల వడ్లు అమ్ముకొని ఒక బస్తా డీఏపీ కొనాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి మద్దతు ధరేమో రూ.700 కూడా పలకని అధ్వానపు పరిస్థితి.


ఒక్కటంటే ఒక్కటి చెప్పు చంద్రబాబూ..

చంద్రబాబుగారు తన తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా ఢిల్లీలో చక్రం తిప్పారు. ఆ రోజుల్లో వరి మద్దతు ధరను కేవలం రూ.370 నుంచి రూ.530కి పెంచారు. ఇవాళ రైతుకు రుణ మాఫీ అంటూ రోడ్లమీదకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. తన హయాంలో కనీసం వడ్డీ కూడా మాఫీ చేయని వ్యక్తి చంద్రబాబు. నీ తొమ్మిదేళ్ల పరిపాలనలో రైతుల కోసం ఇదిగో ఇది చేశాను అని ఒక్కటంటే ఒక్కటి చూపించు చంద్రబాబూ! కూతురును ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అదే విధంగా ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు మళ్లీ బయలు దేరారు.

భవనంపైనే వైఎస్సార్ విగ్రహం

కాకుమానులోని శివాలయం సెంటర్లో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు, అభిమానులు భావించగా కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసికట్టుగా కుళ్లు రాజకీయాలు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారుల సహకారంలో పోలీసులకు ఫిర్యాదు చేసి విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారు. ‘పేదలకు ప్రాణం పోసిన దేవుడు వైఎస్సార్. ఆయన విగ్రహానికే చోటివ్వబోమంటారా? ఆ దేవుణ్ణి మా ఇంటిపైనే ప్రతిష్టించుకుంటాం’ అంటూ అదే సెంటర్లో నివాసం ఉండే ఆరుమళ్ల రామారావు, వెంకాయమ్మ దంపతులు తమ భవనం మీద వైఎస్సార్ ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆదివారం జగన్‌మోహన్‌రెడ్డి దాన్ని ఆవిష్కరించారు.

‘ఎరువుల ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. అంత ఖర్చుచేసి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదు. మీ నాయిన అధికారంలో ఉన్నప్పుడు బస్తాకు రూ.1,040 నుంచి రూ.1,250 వరకు ఇచ్చేవాళ్లు..’ అంటూ రేటూరు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ సుభాని జననేత జగన్‌మోహన్‌రెడ్డి ముందు వాపోయారు. అప్పాపురం నుంచి రేటూరు గ్రామం చేరుకున్న జగన్‌ను మార్గంమధ్యలో పొలం వద్ద నిలిపి రైతులు తమ బాధలను వివరించారు.


ఎరువులు గతంలో పొటాష్ బస్తా రూ.340 ఉండగా ప్రస్తుతం రూ.670 చెబుతున్నారన్నారు.. ఈ విధంగా పెరిగిన ధరలతో ఏం పంటలు పండిస్తాం.. ఎలా బతుకుతాం.. అని మొరపెట్టుకున్నారు. త్వరలో మంచిరోజులొస్తాయని జగన్ వారికి భరోసా ఇచ్చారు. జగన్‌ను కలిసినవారిలో బాపతు బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

వినతుల వెల్లువ
‘అన్నా.. మాకు తలదాచుకునేందుకు కనీసం గూడు కూడా లేదన్నా. దాదాపు పదేళ్ల నుంచి రోడ్డుపక్కనే జీవిస్తున్నాం. ఇళ్లు కట్టించాలని కనపడిన అధికారినల్లా వేడుకుంటున్నాం. ఏఒక్కరూ మా మొర ఆలకించలేదు..’ అంటూ రేటూరు ఎస్సీ కాలనీ వాసులు జగన్‌కు విన్నవించారు. దీనికి స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి మీ సమస్యలకు పరిష్కారం దొరికే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పారు.

వీధిదీపాలు కూడా లేవయ్యా..
‘మా కాలనీలో వీధిదీపాలు లేవు. సాయంత్రం ఆరు దాటితే ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయమేస్తోంది. ఇంతవరకు మా సమస్యలు విన్న నాథుడే లేడు..’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డికి రేటూరు ఎస్సీ కాలనీ వాసులు తమ గోడు వినిపించారు. ‘వాస్తవమేనమ్మా.. మీ సమస్యలు వింటుం టే బాధగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పనితీరే అలా ఉంది. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయి..’ అని వారికి ధైర్యం చెప్పి జగన్ ముందుకు కదిలారు.
Share this article :

0 comments: