కరువు ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ డిమాండ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరువు ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ డిమాండ్

కరువు ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ డిమాండ్

Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011


దీనికి అదనంగా ఎకరాకు రూ.2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలి... 
అన్నదాతలను ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి
కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా జరగలేదు
కరెంటు కోతలతో సర్కారే పంటలను ఎండబెట్టింది
జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న రైతన్నలు

కడప, న్యూస్‌లైన్: పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.4 వేల ఇన్‌స్టంట్ సబ్సిడీ ఇవ్వాలని, దీనికి అదనంగా రూ.2,400 ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా లేదని మండిపడ్డారు. ఈ ప్రకటనతో రైతులకు దమ్మిడీ మేలు కూడా జరగలేదన్నారు. శుక్రవారం ఆయన వైఎస్‌ఆర్ జిల్లాలోని పోరుమామిళ్ల మండలం సూరిసుద్దుపల్లె, రాజాసాహెబ్‌పేట, బద్వేలు మండలంలో కొంగళవీడులో పర్యటించారు. కరువుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పసుపు, పత్తి, వరి పంటలు దెబ్బతిన్న రైతులు, క్రాప్ హాలిడే ప్రకటించిన అన్నదాతలతో మాట్లాడారు. నష్టపోయిన పసుపు పంటను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ పసుపు భూమితో పాటు మీకళ్ల ముందరే దెబ్బతిన్న పత్తి పంటలు కనబడుతున్నాయి. వర్షం లేక వరి ఎండిపోయింది. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటకు 22 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది. కానీ ఇక్కడ వచ్చింది 1.5 క్వింటాళ్లు మాత్రమే. ఇక ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పసుపు నాలుగైదు క్వింటాళ్లు కూడా రాని దుస్థితి ఉంది. అయినా ఈ మండలాన్ని (పోరుమామిళ్ల) కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇక్కడ కరువు కనిపించలేదా? కరువు మండలాల్లో ప్రకటన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదనడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించామని చెప్పుకునేందుకే తప్ప వీటి ప్రకటన వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగలేదు’’ అని జగన్ పేర్కొన్నారు.

కరువు కాలంలో కరెంటు కోతలా..?: అసలే వర్షాలు కురవక పంటలు ఎండి రైతులు సతమతమవుతుంటే.. ప్రభుత్వం కరెంటు కోతలు విధించి వారికి గుండెకోత మిగిల్చిందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ కోతలతో బోర్లలో కొద్దో గొప్పో నీళ్లున్నా. పంటలకు వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు వెంటనే రూ.4 వేల ఇన్‌స్టంట్ సబ్సిడీ అందించాలన్నారు. ఎకరాకు రూ.2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల రైతుకు రబీ పంటలను సాగు చేసేందుకు కనీసం పెట్టుబడి ఖర్చులయినా వస్తాయన్నారు. అన్నదాతలు కష్టాల్లో చిక్కుకోవడంతో రబీ సాగు గణనీయంగా పడిపోయిందన్నారు. మరిన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు.

రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి

వరి, పత్తి, పొగాకు, పసుపు, పత్తి పంటకు సగానికి సగం కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని జగన్ అన్నారు. ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ప్రత్యేకంగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడిని కోరారు.

ఓట్లేయలేదని నీళ్లివ్వలేదు..

ఓట్లు వేయలేదన్న కారణంతో బ్రహ్మంసాగర్ నుంచి ఆయకట్టుకు నీరు ఆలస్యంగా ఇచ్చారని, రైతులకు కరువు వచ్చేలా రాజకీయ నాయకులే చేస్తుంటే బాధేస్తోందని బద్వేలు మండలం కొంగళవీడులో జగన్ పేర్కొన్నారు. ఎందుకు ఆలస్యంగా నీరు వదిలారని రైతులను జగన్ అడగ్గా.. ‘‘మీకు ఓట్లు వేశామనే కక్ష సాధింపుతోనే’’ అని వారు సమాధానమిచ్చారు. బ్రహ్మంసాగర్ రిజర్వాయరు నుంచి నీటిని ఆలస్యంగా విడుదల చేయడంతో కొంగళవీడు గ్రామంలోనే 384 ఎకరాల్లో పంట పొలాలు బీడుగా మారాయని జగన్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్ రాకపోవడంతో కక్షతో రైతులను పీల్చిపిప్పి చేసేందుకు మంత్రి డీఎల్ కంకణం కట్టుకున్నారన్నారు.

గ్రామాలే కదలివచ్చాయి..: జగన్ తమ ప్రాంతాల్లోని రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్నారని తెలిసి గ్రామాలు కదలివచ్చాయి. తమ సాదకబాధకాలను ఆయనకు చెప్పుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. రైతులు పొలాల వెంట బారులు తీరి తమ కష్టాలు చెప్పుకున్నారు. జగన్ పర్యటనలో బద్వేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డీసీ గోవిందరెడ్డి, జిల్లాపార్టీ కన్వీనర్ సురేష్‌బాబు, యువజన అధ్యక్షులు వైఎస్ అవినాష్‌రెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ మునెయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: