రామోజీని ప్రాసిక్యూట్ చేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీని ప్రాసిక్యూట్ చేయాలి

రామోజీని ప్రాసిక్యూట్ చేయాలి

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

రామోజీని ప్రాసిక్యూట్ చేయాలి

హైకోర్టుకు ఉండవల్లి అభ్యర్థన



హైదరాబాద్, న్యూస్‌లైన్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యకలాపాలన్నింటినీ తానే నిర్వహిస్తున్నానంటూ అటు హైకోర్టులో, ఇటు సుప్రీంకోర్టులో తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేసి, కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చిన మార్గదర్శి హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభక్త కుటుంబం)కర్త రామోజీరావును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టును అభ్యర్థించారు. ఈమేరకు ఆయన సోమవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చినందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ అధీకృత అధికారి పి.బాలాజీ 2008లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో తనపై కేసు వేశారని, ఆ సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణపూర్వక రిజాయిండర్‌లో పేర్కొన్న అంశాల కూ.. ఆ తరువాత హైకోర్టులో రామోజీరావు స్వయంగా దాఖ లు చేసిన ప్రమాణపూర్వక అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల కూ ఎటువంటి పొంతనా లేదని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ వ్యాపారాన్ని రామోజీరావు నిర్వహిస్తున్నారనటంలో వాస్తవం లేదని బాలాజీ తన ప్రమాణపత్రంలో పేర్కొనగా.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యాపారాలను తానే నిర్వహిస్తున్నానని రామోజీ స్వయంగా పేర్కొన్నారని, తద్వారా కోర్టుకు తప్పుడు సమాచారం అందించారని తెలిపారు. ఉండవల్లి అనుబంధ పిటిషన్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ప్రమాణపత్రంలో అవాస్తవాలు..

‘మార్గదర్శి చిట్‌ఫండ్ లిమిటెడ్‌ను కంపెనీల చట్టం ప్రకారం స్వతంత్ర బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ నిర్వహిస్తుంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యాపారాన్ని రామోజీరావు నిర్వహిస్తున్నారని అనటంలో వాస్తవం లేదు. ఏపీ చిట్‌ఫండ్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు పలు పేర్లతో చిట్‌ఫండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనటం కూడా అవాస్తవమని బాలాజీ స్వయంగా ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. కానీ మార్గదర్శి వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు రంగాచారి కమిషన్, విచారణ కోసం అధీకృత అధికారిగా కృష్ణరాజులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 800, 801లను సవాల్ చేస్తూ రామోజీరావు 2006లో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రమాణపూర్వకంగా దాఖలు చేసిన ఆ అఫిడవిట్‌లో అంతకుముందు బాలాజీ తన ప్రమాణపత్రంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా రామోజీ కొన్ని అంశాలను ప్రస్తావించారు. 

తాను ఏ ఏ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో కూడా అందులో వివరించారు. ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్, ఉషాకిరణ్ మూవీస్ తదితర కంపెనీలకు ప్రమోటర్‌గా ఉన్నానని రామోజీరావు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 3,000 కోట్ల టర్నోవర్ కలిగిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యాపారాన్ని కూడా తానే నిర్వహిస్తున్నట్లు అందులో స్పష్టంగా చెప్పారు. 

రామోజీ పేర్కొన్న ఈ విషయాలు.. అంతకుముందు మార్గదర్శి చిట్‌ఫండ్స్ తరఫున బాలాజీ చెప్పిన విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తనదేనని హైకోర్టులో, సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ తరఫున, తన తరఫున, హెచ్‌యూఎఫ్ తరఫున రామోజీరావు పలుమార్లు చెప్పారు. సిటీ సివిల్ కోర్టులో బాలాజీ దాఖలు చేసిన ప్రమాణపత్రంలో పేర్కొన్న అంశాలు కూడా రామోజీరావు ఆమోదంతోనే పేర్కొన్నారు. ప్రమాణపత్రంలో తప్పుడు సమాచారాన్ని తెలిసి ఇచ్చినా, తెలియక ఇచ్చినా అది నేరం అవుతుంది. అటువంటి వారిని భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 193 కింద ప్రాసిక్యూట్ చేయాలి. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారి విషయంలో కోర్టు అనుమతి లేనిదే, కోర్టు ఫిర్యాదు ఇవ్వందే.. విచారణార్హమైన నేరంగా పరిగణించరు. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని పొందుపరచినందుకు రామోజీరావు ప్రాసిక్యూషన్‌కు అర్హులు. రామోజీని ప్రాసిక్యూట్ చేసేందుకు నాకు అనుమతివ్వకపోతే తగిన న్యాయం జరగనట్లే. లేని పక్షంలో రామోజీ వ్యవహారాన్ని సంబంధిత మేజిస్ట్రేట్‌కు నివేదించి, విచారణకు ఆదేశించాలి’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్ తన అనుబంధ పిటిషన్‌లో కోర్టును అభ్యర్ధించారు. 

ఆ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చండి...

అలాగే.. రంగాచారి కమిషన్, అధీకృత అధికారి కృష్ణరాజు ల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యా ల్లో రామోజీ తనపై పలు ఆరోపణలు చేశారని, వాటికి సమాధానం చెప్పి, తన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని, అందువల్ల తనను ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చాలని కోర్టును ఉండవల్లి కోరారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో కూడా తనను ప్రతివాదిగా చేర్చాలని అభ్యర్థించారు. ఇటువంటి చట్టాలు డిపాజిటర్ల ప్రయోజనం కోసమేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును ఈ కేసుకు వర్తింపచేస్తూ కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. అరుణ్‌కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణప్రసాద్ వాదించనున్నారు. 
Share this article :

0 comments: