వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే అది సచివాలయంలో జరిగి ఉండాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే అది సచివాలయంలో జరిగి ఉండాలి

వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే అది సచివాలయంలో జరిగి ఉండాలి

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులపై హైకోర్టు ఆదేశించిందే తడవుగా అత్యుత్సాహంతో సోదాలు నిర్వహించి విచారణకు ఉపక్రమించిన సీబీఐ... టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఎందుకు జాప్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా ఆగమేఘాలపై విచారణ చేపట్టిన సీబీఐ.. బాబు అక్రమాస్తులపై మాత్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు. 

సీబీఐ తీరును అనుమానించాల్సి వస్తోందని అన్నారు. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ అయితే ఆ దిశగా సీబీఐ దర్యాప్తు జరపడం లేదని అన్నారు. ‘‘వైఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే అది సచివాలయంలో జరిగి ఉండాలి, మంత్రులకు తెలిసే జరిగి ఉండాలి. మరి సీబీఐ సచివాలయానికి వెళ్లకుండా మంత్రులను విచారించకుండా జగన్ ఇళ్లపై మాత్రం దాడులు చేస్తోంది’’ అని పేర్కొన్నారు. సీబీఐ తమను బెదిరిస్తోందనీ వారు నిర్దేశించిన విధంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందంటూ కొందరు సాక్షులే హైకోర్టును ఆశ్రయించారంటే విచారణ ఎలా జరుగుతోందో అర్థమవుతోందని గట్టు ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని తాము కోరుతున్నట్లు.. బాబు వారిస్తున్నట్లు.. టీడీపీ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన ఎద్దేవా చేశారు. 

బాబు సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు కానీ ఇంత డ్రామా దేనికని విమర్శించారు. కోర్టుపై గౌరవం ఉంటే విచారణకు సిద్ధపడాలని, భయపడితే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. జగన్‌పై విచారణ ప్రారంభమైన మరుసటి రోజున వై.ఎస్.విజయమ్మ ప్రధానికి రాసిన లేఖను చూపి టీడీపీ నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని గట్టు మండిపడ్డారు. లేఖలోని ‘వియ్ ఆర్ నాట్ ఆస్కింగ్ టూమచ్...’ అనే వ్యాఖ్యను పట్టుకుని ఎంతో కొంత చేయమని అడిగినట్లుగా యనమల రామకృష్ణుడు వితండవాదం లేవనెత్తుతున్నారని విమర్శించారు. విజయమ్మ ఈ విషయంలో ఎవరినీ దేబిరించలేదని చెప్పారు. అయితే యూపీఏ ప్రభుత్వం కొన్ని అరాచక శక్తుల (లంఫెన్) నియంత్రణలో ఉందని, వాటి నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని మాత్రమే ఆమె అన్నారని స్పష్టం చేశారు. కేంద్రం లంఫెన్ శక్తుల చేతుల్లో ఉందని విజయమ్మ చేసిన నిర్మొహమాటమైన వ్యాఖ్య టీడీపీ నేతలకు కనిపించ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. 

తప్పు నారాయణా...తప్పు!

చంద్రబాబుపై విచారణ రాజకీయ కుట్ర అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించడం పట్ల గట్టు విస్మయం వ్యక్తం చేశారు. నారాయణ అలా అని ఉండరని, ఒకవేళ అలా వ్యాఖ్యానించి ఉంటే మాత్రం బాబు అవినీతిపై 2004కు ముందు సీపీఐ చేసిన పోరాటం మరిచారా? అని ఆయన ప్రశ్నించారు. నారాయణ వ్యాఖ్యలు తప్పు అని అన్నారు.
Share this article :

0 comments: