అవిశ్వాస తీర్మానంతో ‘సీబీఐ గండం’ గట్టెక్కాలని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాస తీర్మానంతో ‘సీబీఐ గండం’ గట్టెక్కాలని

అవిశ్వాస తీర్మానంతో ‘సీబీఐ గండం’ గట్టెక్కాలని

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011


అవిశ్వాస తీర్మానం అంటూనే సర్కారును కాపాడే యత్నం 
తీర్మానం పెట్టి.. అది చర్చకు రాకుండా ఉండేలా జాగ్రత్తలు 
తీర్మానంతో ‘సీబీఐ గండం’ గట్టెక్కాలని చంద్రబాబు పథకం 
తమ వ్యూహంపై ఇప్పటికే సీఎంతో చర్చించిన టీడీపీ నేతలు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర సర్కారును కాపాడటానికి.. అదే సమయంలో రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పడరాని పాట్లు పడుతున్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే మద్దతిస్తామని మిగతా ప్రతిపక్షాలు ముందుకొచ్చినప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఊగిసలాడుతున్నారు. అయితే.. ఏదో ఒక రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు అనిపించుకుని.. అది చర్చకు రాకుండా ‘జాగ్రత్త’ పడాలని.. అదే సమయంలో అవిశ్వాసం బూచి చూపి సీబీఐ గండం నుంచి బయటపడాలని బాబు యోచిస్తున్నట్లు టీడీపీ నేతలే చెప్తుండటం విశేషం. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో తమ సీనియర్ నేతలు సంప్రదింపులు జరిపారని కూడా వారు వెల్లడిస్తున్నారు. 

ఇంతకుముందూ ఇదే డ్రామా... 

అవిశ్వాసం లాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటంపై ఇతర విపక్షాల నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయనగానే మిత్రపక్షాలతో కలిసి వ్యూహాలను ఖరారు చేసే చంద్రబాబు ఈసారి మాత్రం కనీసం అలాంటి ప్రయత్నాలను కూడా చేయటం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇతర పక్షాల నుంచి డిమాండ్ చేసినప్పుడు ఒకరు చెబితే వినాల్సిన అవసరం లేదంటూ దాటవేశారు. చంద్రబాబు గత శాసనసభ సమావేశాల్లో కూడా ఇలాగే హడావుడి చేసినప్పటికీ చివరకు ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించారు. రాజ్యాంగపరమైన అంశాల్లో నిష్ణాతులైన నేతలు ఉన్న టీడీపీ గత శాసనసభ సమావే శాల సమయంలో అవిశ్వాసంపై ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే క్రమంలోనే కావాలని తప్పటడుగులు వేసింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు, సమావేశాలు ప్రారంభమైన రోజున నిబంధనలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి అభాసుపాలైంది. పైగా దాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం కావాలనే తమ నోటీసును తిరస్కరించిందని చెప్పింది. ప్రభుత్వాన్ని కాపాడేందుకే అలా చేశామని ఆ తర్వాత పార్టీ నేతలు చావు కబురు చల్లగా చెప్పారు. ఇక ఇటీవలి కాలంలో కొద్ది రోజులుగా ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని నాయకులు బీరాలు పలుకుతుంటే ఈసారి కూడా తూతూ మంత్రపు ఎత్తుగడతో వెళ్లటానికి రంగం సిద్ధం చేశారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అవిశ్వాసంపై మీడియా సమావేశాల్లో ఒకటికి రెండుసార్లు అడిగిన ప్రశ్నలకు మాత్రం తీర్మానం పెడతామంటూ మొక్కుబడి సమాధానమిచ్చి దాటవేస్తున్నారు. 

ఎన్నికల్లో గెలవలేమనే భయం..!

అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతగానో ఉన్నప్పటికీ ఆ పని చేయలేమని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది మళ్లీ అసెంబ్లీ చూసే అవకాశం ఉండదన్న అనుమానాలు పార్టీ అధినేతకు ఉన్నాయని వారు అంటున్నారు. ఎన్నికలకు వెళితే గెలవలేమన్న కారణం ఒకటైతే.. ఇప్పుడు సీబీఐ విచారణను ఎదుర్కొనే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సఖ్యతను చెడగొట్టుకుని మరిన్ని ఇబ్బందులు కోరితెచ్చుకునే స్థాయిలో తమ నాయకుడు లేడని సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాసం పేరుతో ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని అవిశ్వాసాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుని కొంత ఉపశమనం పొందాలని శనివారం చంద్రబాబు నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో నిర్ణయించారు. ‘కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో కొనసాగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వం కూలటం ఖాయం. ఇది ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు అవిశ్వాసాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుని సీబీఐ విచారణకు బ్రేకులు వేయాలని ఆలోచన చేస్తున్నారు’ అని ఆ సమావేశంలో పాల్గొన్న ఒక నేత చెప్పారు. తమపై విచారణను నెమ్మదింపచేస్తే అవిశ్వాసం గురించి పట్టించుకోబోమని ఎర్రన్నాయుడు, బొజ్జల భేటీలో సీఎం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. 

విపక్షాలు మద్దతిస్తామన్నా... 

చంద్రబాబు అక్రమ ఆస్తులను నిగ్గుతేల్చటానికి రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ అవిశ్వాస తీర్మానంపై మరింత అప్రమత్తమైంది. శాసనసభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్, లోకసత్తా పార్టీలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి. ‘‘శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీదే. ఆ పార్టీ ముందుకొస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలు కచ్చితంగా మద్దతునిస్తారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తుండవచ్చు. కానీ మా ఎమ్మెల్యేలు టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తారు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంగా చెప్పారు. ‘‘అయితే టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాన్ని ఆషామాషీగా కాకుండా.. తీర్మానంపై ఆ పార్టీ విప్ కూడా జారీ చేయాలి. సభలో ఓటింగ్‌కు పట్టుపట్టాలి’’ అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే పలుసార్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అయితే సీబీఐ విచారణను ఎదుర్కోవలసిన నేపథ్యంలో అవిశ్వాసంపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారని టీడీపీ నాయకుడొకరు పేర్కొన్నారు. సర్కారుకు ఎలాంటి ఢోకా లేకుండా చూస్తూనే తమకు అపప్రద రాకుండా చూసుకునే విధంగా అవిశ్వాసాన్ని ప్రతిపాదించబోతున్నామని తెలంగాణకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. శుక్రవారం ఎర్రన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఎంను కలిసి మంతనాలు జరిపినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చిందని, చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరు పార్టీ వైఖరిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వెల్లడించారని ఆ నేత తెలిపారు.
Share this article :

0 comments: