తప్పు జరిగిందా? లేదా? అని వెతకడం మానేసి వైఎస్సార్‌ను ఇరికించేలా దర్యాప్తు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తప్పు జరిగిందా? లేదా? అని వెతకడం మానేసి వైఎస్సార్‌ను ఇరికించేలా దర్యాప్తు

తప్పు జరిగిందా? లేదా? అని వెతకడం మానేసి వైఎస్సార్‌ను ఇరికించేలా దర్యాప్తు

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011



ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే అర్థం పోయి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారింది. అది కాంగ్రెస్ కనుసన్నల్లోనే పనిచేస్తోంది. తప్పు జరిగిందా? లేదా? అని వెతకకుండా.. వైఎస్సార్‌ను ఎలా ఇరికిద్దామా? అంటూ ఈ సంస్థ దర్యాప్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీబీఐని అడ్డం పెట్టుకుని దివంగత మహానేత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 19వరోజు గురువారం ఆయన రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాల్లోని పలుగ్రామాల్లో పర్యటించారు. సుమారు 34 కిలోమీటర్ల మేర పర్యటించి నాలుగు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. తాళ్లతిప్ప గ్రామంలో దండుప్రోలు రమేశ్ కుటుంబాన్ని ఓదార్చారు. రాత్రి నగరం మండల కేంద్రం చేరుకొని మాన్యం నాగరాజు ఇంట్లో బస చేశారు. యాత్రలో ప్రజల కోరిక మేరకు ఆయన ప్రతి గ్రామంలో మాట్లాడారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు..
కింది పల్లెలో ఓ అవ్వ నన్ను పలకరించింది. ఏం పని చేస్తున్నావు అవ్వా? అని అడిగితే వ్యవసాయం చేసుకుంటున్నం కోడుకా.. అని చెప్పింది. ఎలా ఉందవ్వా అని అంటే.. ‘రెండేళ్ల నుంచి వరి వేస్తున్నా.. పంట పండిన తరువాత ఏ ధరకు అమ్ముడుపోతుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. వైఎస్సార్ బతికి ఉన్న రోజులలో మాకు ఎంతో అండగా ఉండేది. ఆయన్ను తలవని గడియలేదు’ అంటూ బాధపడింది. మహానేత సువర్ణయుగాన్ని ప్రజలు తలుచుకోని రోజులేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు, రైతుల కన్నీళ్లు తీరేంతవరకు ఆయన గుర్తుకు వస్తూనే ఉంటారు.

డీజిల్ లేదని సమాధానం..
మహానేత బతికున్న రోజులలో పేదోడికి ఏమైనా ప్రమాదం జరిగితే.. 108కు ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ వచ్చి 20 నిమిషాలలో పెద్దాసుపత్రిలో చేర్పించేది. ఇవాళ 108కు ఫోన్ చేస్తే ‘మా వాహనంలో డీజిల్ లేదు. అంబులెన్స్‌కు టైర్ పంక్చర్ అయి షెడ్డుకు పోయింది’ అనే సమాధానం వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కనీసం పేదలకు వైద్యం కూడా చేయించలేని అధ్వాన పరిస్థితులలో ప్రభుత్వం ఉంది. పనిచేయలేని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న వృద్ధులను ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ఉన్నవారి వృద్ధాప్య పింఛన్‌ను ఎలా కత్తిరిద్దామా? అని కారణాలు వెతుకుతోంది. ఇవాళ రైతులు ఎరువులు కొనాలంటే.. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్‌లో టికెట్లలా కొనాల్సిన దుస్థితి వచ్చింది.

వస్త్ర వ్యాపారుల్ని కనికరించండి..
చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వస్త్ర వ్యాపారులను కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వ్యాట్ రూపంలో కోట్ల రూపాయలు వారి నుంచి గుంజుతోంది. రెండు రోజులు దుకాణాలు బంద్ చేసినా పాలకులకు పట్టడం లేదు. చిరు వర్తకుల గోడు ఒక్కసారి వినాలని ప్రభుత్వానికి చెప్తున్నా.

ఒక వ్యక్తి చేసిన తప్పుకు కరువొచ్చింది..
‘‘రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు లేక కరువొస్తే.. ఇక్కడ మాత్రం(రేపల్లె నియోజకవర్గం గ్రామాలు) ఒక వ్యక్తి చేసిన తప్పుతో కరువొచ్చింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే కూడా ఇంత కరువొస్తుందని రేపల్లె పల్లెలను చూసి తెలుసుకున్నా. నీళ్లు పారే అవకాశం ఉన్నా.. కాల్వకు నీళ్లు వదలకుండా చేస్తున్నారు. మీకు జరిగిన అన్యాయంపై ఇంజనీరింగ్ శాఖ అధికారులకు లేఖ రాస్తాను. భయపడొద్దు, త్వరలోనే మంచి రోజులు వస్తాయి’’ అంటూ తుమ్మల గ్రామ ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చిరంజీవికి ఓటు వేసినందుకు పాలక పక్షం నేత ఒకరు(పరోక్షంగా మంత్రి మోపిదేవినుద్దేశించి) కాల్వకు నీళ్లు రాకుండా చేశారంటూ తుమ్మల గ్రామానికి చెందిన రైతులు జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
Share this article :

0 comments: