బాబు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు

బాబు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011


* సీబీఐ విచారణకు ఆదేశించినప్పటి నుంచీ ఇదే వరస
* మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు 
* బాబూ.. నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే కోర్టుకు వెళ్లొద్దు
* ఒకవేళ హైకోర్టుకు వెళితే మీ అవినీతిని అంగీకరించినట్టే!

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు అక్రమాస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించినప్పటి నుంచి.. ఆయన చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ, మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విషయమై చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే కోర్టులకు వెళ్లకుండా ఉంటే.. గతంలో ఆయన చెప్పిన మాటలకు విలువ ఉంటుందన్నారు. సీబీఐ విచారణపై చంద్రబాబు హైకోర్టుకు వెళ్తే అవినీతిని అంగీకరించిన ట్లు ప్రజలు అర్థం చేసుకుంటారని అంబటి పేర్కొన్నారు. రాంబాబు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ... చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఆధారాలతోసహా వేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించింది. దాన్ని తిరగతోడాలని, ‘స్టే’ ఇవ్వాలని బాబు కుటుంబసమేతంగా మళ్లీ కోర్టును ఆశ్రయించనున్నట్లు తాజాగా ప్రకటించారు. న్యాయస్థానాల్లో విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రజాకోర్టులో తేల్చుకుంటామని ఇన్నాళ్లూ ప్రగల్భాలు పలికి ఇప్పుడెందుకు తోక జాడిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని, ఆయనెప్పుడూ అబద్ధాలపైనే రాజకీయాల్ని నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు. 

చంద్రబాబు పరువునష్టం దావానా..!
‘‘చంద్రబాబు మాటలు చాలా చిత్రవిచిత్రంగా ఉన్నాయి. విజయమ్మ పిటిషన్‌పై ఆయన పరువునష్టం దావా వేస్తారంట! చంద్రబాబూ.. అలాంటి దావా వేసేది ఎవరో తెలుసా? పరువు, ప్రతిష్ట, నీతినిజాయితీ ఉన్నవారికి నష్టం జరిగితే వేసేది. మరి మీకేం ఉన్నాయి? ఒకవేళ పరువు ప్రతిష్ట ఉన్నాయనుకుంటే వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధపడు. నిజాయితీ నిరూపించుకునేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరోసారి రాదు. ఆ విచారణలో మీరు నీతిమంతులో లేక మరేదో తేలుతుంది’’ అని అంబటి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ గుదిబండ
ఒక మంత్రి, ఎమ్మెల్యే మధ్య ‘కుస్తీపోటీ’ జరగటం.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వానికి బహుమతి అంటూ అంబటి ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన రచ్చబండను ప్రస్తుత ప్రభుత్వం అపవిత్రం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజలపాలిట గుదిబండలా మారిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితే వైఎస్సార్‌ను అభిమానించే ఎమ్మెల్యేలు తప్పక తీర్మానం నెగ్గేందుకు ఓటు వేస్తారని అంబటి స్పష్టంచేశారు. అప్పుడు జగన్ శిబిరంలో 21 మంది ఎమ్మెల్యేలో లేదా 73 మంది ఉంటారో మీరే(విలేకరులు) చూస్తారు అని ఆయన అన్నారు. అయితే ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా టీడీపీ కావాలనే కాంగ్రెస్‌కు సహకరిస్తోందన్నారు. 

‘‘చంద్రబాబు రైతుపోరు యాత్రలో రోజుకొక విధంగా మాట్లాడుతున్నారు. ఒకరోజు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామంటారు. మరోరోజు మీరు చెబితే పెడతానా? అయినా ప్రభుత్వం పడిపోతే సమస్యలు పరిష్కారమవుతాయా? అంటారు. ఈ ప్రభుత్వం 2014 దాకా ఉంటుందంటారు. ఇలా ఒకదానికొకటి పోలికలు లేకుండా మాట్లాడే ఆయన్ని ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు’’ అని అంబటి పేర్కొన్నారు. ‘‘టీడీఎల్పీ సమావేశానికి విప్ జారీ చేశారు. ఇలాంటివి చరిత్రలో ఎప్పుడైనా జరిగాయా? సభలో ఏవైనా ముఖ్యమైన బిల్లులు లేదా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేముందు విప్ జారీ చేస్తారు. కానీ టీడీపీ ముందే అలా చేసి రానివారిపై స్పీకర్‌తో వేటు వేసేందుకు కుట్ర చేస్తోంది. ఇది కాంగ్రెస్, టీడీపీ కలిసి ఆడుతున్న నాటకం. ఇలాంటి కుట్రపూరిత డ్రామాలకు వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను బలిచేయాలనుకుంటే.. ఎవరికి వారు ఎత్తులు వేసుకోక తప్పదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: