మలివిడత తొలిరోజు ప్రభంజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మలివిడత తొలిరోజు ప్రభంజనం

మలివిడత తొలిరోజు ప్రభంజనం

Written By news on Thursday, November 17, 2011 | 11/17/2011

జననేతకు ఘన స్వాగతం





తెనాలి అర్బన్, న్యూస్‌లైన్ : రెండో విడత ఓదార్పుయాత్ర చేపట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తెనాలి చేరుకున్నారు. ఉదయం ఐదు గంటలకు ఆయన సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్‌కు చేరుకుని నినాదాలు చేశారు. 

జగన్‌కు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు మేరుగ నాగార్జున, గుదిబండి చినవెంకటరెడ్డి స్వాగతం పలికారు. వైఎస్ జగన్ 5.10 గంటలకు రోడ్డుమార్గంలో రేపల్లెకు బయలుదేరారు. నాయకులు, అభిమానులు వాహనాల్లో ఆయన్ను అనుసరించారు.

ఆత్మీయనేతకు అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా జనప్రభంజనం కనిపించింది. నిండైన అభిమానంతో నిరీక్షించిన ప్రజలు జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. స్థానికుల కోరిక మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. 

రేపల్లె రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వేకువజామున ఐదు గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. పార్టీశ్రేణులు, పెద్దసంఖ్యలో అభిమానులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన పేటేరుకు చేరుకుని స్థానికుడు కందుల సాంబశివరావు నివాసంలో జగన్ విశ్రాంతి తీసుకున్నారు. 

యాత్ర మొదలైందిలా.. ఉదయం 9.30 కు రేపల్లె మండలం పేటేరులో జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ఓదార్పు తొలిరోజు యాత్రను ప్రారంభించారు. గ్రామ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడనుంచి మునుసుబువారిపాలేనికి చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. అనంతరం అరవపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహన్ని ఆవిష్కరించారు. బాలకోటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మార్గం మధ్యలో హేమ, హేమనందిని అనే కవలలకు జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మిఠాయి తినిపించారు. అక్కడి నుంచి ఊలుపాలేనికి చేరుకున్నారు.

నల్లూరిపాలెంలో స్వాగతం.. నల్లూరిపాలెం పొలిమేరలో జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. స్థానిక నాయకుడు యలవర్తి మోహన్‌రావు నివాసంలో ఆయన అల్పాహారం స్వీకరించారు. ఆర్‌సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయనకు గమిడివారి వీధిలో బాణసంచా పేల్చి, కనకతప్పెట్లతో స్వాగతం పలికారు. లూథరన్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద పోస్టాఫీసు వీధి మీదుగా ఐదో వార్డుకు చేరుకుని స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మసీదుల్లో ప్రార్థనలో పాల్గొన్నారు. 

పార్టీ నేత చిమటా బాలాజీ ఇంట్లో అల్పాహార విందుకు హాజరయ్యారు. రామకోటిపేట మీదగా ఇందిరానగర్ యానాదికాలనీ, ఇండియన్ బ్యాంక్, నెహ్రూ బొమ్మసెంటర్, పద్మాటాకీస్ సెంటర్ మీదుగా నిజాంపట్నం రోడ్డులో పర్యటించారు. ఇండియన్ రూరల్ ఇవాంజికల్ ఫెలోషిప్ చర్చి వద్ద విద్యార్థులు పెద్దసంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడనుంచి ఇసుకపల్లి రోడ్డు మీదుగా యాదవపాలేనికి చేరుకున్నారు. 15వవార్డులోని లూథరన్ చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న అనంతరం సెంటర్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గరువువీధి మీదగా హౌసింగ్‌బోర్డు కాలనీకి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. స్థానికుడు సుఖవాసి శాంతిశేఖర్ నివాసానికి రాత్రి బసకు వెళ్లారు.

జగన్‌తో నడిచిన చిన్నారి జ్యోతి





రేపల్లె రూరల్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌ను చూడాలనే ఏకైక కాంక్షతో ఆ చిన్నారి గంటకు పైగా నిరీక్షించింది. చివరికి జగన్ ప్రార్థనలు చేస్తున్న చర్చిలోకి వెళ్లడానికి ప్రయత్నించి జనసంద్రం దాటలేక ఆగిపోయింది. ఆ చిన్నారి పేరు ఎం.జ్యోతి. రేపల్లె ఐదో డివిజన్‌లోని పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఓదార్పుయాత్రలో భాగంగా లూథరన్ చర్చిలో ప్రార్థనలకు హాజరై జగన్ తిరిగివస్తుండగా జ్యోతి పరుగున వెళ్లి ఆయనతో కరచాలనం చేసింది. 

ఈ సందర్భంగా జగన్ చిన్నారి పేరును అడిగి ఏం చదువుతున్నావని తెలుసుకున్నారు. ఇంత ఎండలో చెప్పులు లేకుండా తిరిగితే ఎలా అమ్మా అని ప్రశ్నించగా మిమ్మల్ని చూడ్డానికి వచ్చానన్నా.. అని చిన్నారి బదులిచ్చింది. దీంతో జగన్ చిన్నారి భుజంపై చెయ్యి వేసి నడిచారు. 
 



నిలువెల్లా అభిమానం



పేటేరు (రేపల్లె రూరల్), న్యూస్‌లైన్: ఆయన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. మొదటి నుంచి వైఎస్సార్ అభిమాని. ఆయన మరణంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడగానే పార్టీ కార్యకర్తగా మారిపోయారు. ఆయన పేరు ఎస్‌కే సలీమ్‌ఖాన్. ఊరు రేపల్లె.. పార్టీ జెండా రంగులతో కూడిన ప్యాంటు, షర్టు ధరించి బుధవారం జరిగిన ఓదార్పుయాత్రలో జగన్ కాన్వాయ్ ముందు నడిచారు. వైఎస్ జగన్ ఆయనతో కరచాలనం చేసి యోగక్షేమాలు విచారించడంతో సలీమ్‌ఖాన్ ఆనందానికి అవధుల్లేవు. అనంతరం వైఎస్‌తో ఉన్న అనుబంధాన్ని న్యూస్‌లైన్‌కు వివరించారు. 2009లో హైదరాబాద్‌లో మహానేతను కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించారని గుర్తుచేసుకున్నారు.

జగనన్న.. మా ఊరు ఎప్పుడొస్తావు!
రేపల్లె, న్యూస్‌లైన్: ‘అన్నా.. మా ఊరు ఎప్పుడొస్తావు’ అంటూ భట్టిప్రోలు మండలం ఓలేరులోని వెంకట్రాజునగర్‌కు చెందిన మహిళలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఓదార్పులో భాగంగా బుధవారం పేటేరు నుంచి పట్టణానికి వస్తున్న సమయంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద వేచిఉన్న మహిళలను చూసి జననేత ఆగారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తమ గ్రామం రావాలని మహిళలు జగన్‌ను కోరగా ‘తప్పనిసరిగా ఏదో ఒకరోజు వస్తాను’అని సమాధానమిచ్చారు. గ్రామంలో ఈరోజు కనికరపు పండుగ జరుపుకొంటున్నామని, వైఎస్ తనయుడు వస్తున్నారని తెలిసి ఎక్కడి పనులు అక్కడే వదిలి వచ్చామని గ్రామస్తులు జయలక్ష్మి, కృపావరం, మేరుగ మరియమ్మ, నాగరత్నం, సరోజిని ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.

కవలల పుట్టినరోజు వేడుక
ఓల్డ్‌టౌన్ వద్ద బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కవలల పుట్టినరోజు జరుపుకొన్నారు. పేటేరు నుంచి మునుసుబువారిపాలేనికి వెళుతున్న జగన్‌ను ఆపి కవలలు హేమ, హేమనందిని స్వీట్లు తినిపించారు. వారిద్దరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. జగన్ సమక్షంలో తమ పుట్టినరోజు వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని చిన్నారులు చెప్పారు.
-న్యూస్‌లైన్, రేపల్లె రూరల్

జగన్ సీఎం అయ్యాకే ఇంటికెళతా!
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఇంటిముఖం చూడనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వైఎస్సార్ వీరాభిమాని షేక్ ఖాజామీరా అలియాస్ ఎస్‌కేఎం రెడ్డి చెప్పారు. అప్పటివరకు రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బుధవారం ఆయన పేటేరులో ప్రారంభమైన ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ‘నేను ఆర్టీసీలో పనిచేసేవాడిని. 2009 సెప్టెంబర్ రెండున వైఎస్సార్ హెలికాప్టర్ కనిపించడం లేదని టీవీలో చూసినప్పట్నించి డ్యూటీకి వెళ్లలేదు. వైఎస్సార్ ఆశయ సాధకుడు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ ప్రచారం చేస్తూ గ్రామం నుంచి బయల్దేరి ఇప్పటివరకు ఇంటిముఖం చూడలేదు. నా కుమార్తెకు 2009 ఆగస్టు ఒకటిన వివాహం చేశాను. కుమారుడు సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. పొలంపై వస్తున్న కౌలు సొమ్ముతో కుటుంబ బాధ్యతను నా భార్య షేక్ హిమాంబీ చూసుకుంటోంది. వారి యోగక్షేమాలను ఫోన్‌లోనే తెలుసుకుంటున్నా. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇంటికెళతాను...’ అంటూ వివరించారు.
-న్యూస్‌లైన్, రేపల్లె

గాడ్ బ్లెస్ యూ..
పేటేరు (రేపల్లె రూరల్), న్యూస్‌లైన్: ‘జగన్‌గారు... గాడ్‌బ్లెస్ యూ అండీ. మీ నాన్నకు కోట్లాదిమంది ప్రజలు తోడుగా ఉన్నారు. మీరు రాజకీయాల్లో ఎవరు ఊహించని రీతిలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు’ అంటూ రేపల్లె మండలం తుమ్మల గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గరికపాటి వెంకటనారాయణదొర జగన్‌ను ఆశీర్వదించారు. 30 ఏళ్లు గ్రామ సర్పంచిగా, ఐదేళ్ల పాటు జెడ్పీటీసీ సభ్యుడిగా క్రియాశీలక రాజకీయాల్లో పనిచేసిన నారాయణ బుధవారం పేటేరులో జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నారాయణదొరను ఆయనకు పరిచయం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన నారాయణ జగన్‌తో మాట్లాడుతూ ‘లక్షలాది మంది ప్రజలకు మీరు గుండెచప్పుడుగా మారారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మీరొక్కరే తీసుకురాగలరు. ఆ దిశగా కోట్లాది మంది సైన్యంతో పనిచేస్తున్నారు’ అని కొనియాడారు. జగన్‌మోహన్‌రెడ్డి చిరునవ్వుతో ‘అందరికీ నేనున్నాను’ అంటూ భరోసా ఇచ్చారు.

బిడ్డా.. నువ్ సల్లగుండాల..
రేపల్లె, న్యూస్‌లైన్: ‘నెల నెలా పింఛన్ పంపి పెద్ద కొడుకు మాదిరి ఆసరాగా నిలిచిన మీ తండ్రిలా నీకూ మంచి మనసుంది.. నువ్వు సల్లంగుండాల..’ అంటూ వృద్ధులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీ ర్వదించారు. వయసు పైబడినవారు కనిపించిన ప్రతి చోటా జగన్ కారుదిగి వారిని ఆప్యాయంగా పలకరిం చారు. ఆ పలకరింపుతో వృద్ధులు పులకించిపోయారు.

యువత కేరింత
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్: పట్టణంలో జగన్‌కు ఇండియన్ రూరల్ ఇవాంజిలికల్ ఫెలోషిప్ చర్చి వద్ద పెద్దఎత్తున విద్యార్థులు స్వాగతం పలికారు. స్థానికుల కోరిక మేరకు ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. యువతులు కరచాలనం చేసి ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

శతాధిక వృద్ధురాలికి పలకరింత
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్: శతాధిక వృద్ధురాలు దామెర్ల సరోజిని గంట సేపటికి పైగా ఎండలో జగన్ కోసం నిరీక్షించింది. వైఎస్సార్ పుణ్యమా అని వచ్చిన పింఛన్ పొందుతున్న ఆమె జగన్‌ను కలసి కృతజ్ఞతలు తెలపాలనుకుంది. పేటేరు రోడ్డులోని ఓల్డుటౌన్ సెంటర్‌లో ఆమెను జగన్ పలకరించారు. అవ్వా ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగుందా? అంటూ కుశలప్రశ్నలు వేశారు. ఆరోగ్యం జాగ్రత్త బాబూ.. అంటూ ఆమె దీవించింది.

వైఎస్ వల్లే చదువుకోగలుగుతున్నా..
పేటేరు (రేపల్లె రూరల్), న్యూస్‌లైన్: ‘వైఎస్ వల్లే చదువుకోగలుగుతున్నా. బీఎస్సీ చదివిన నేను ఆర్థిక ఇబ్బం దులతో ఇక చదువుకోలేనేమోనని భయపడ్డాను. మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎమ్మెస్సీ చదువుతున్నా’అని రేపల్లె రూరల్ మండలం పేటేరుకు చెందిన అనిల్‌కుమార్ చెప్పారు. గ్రామంలో బుధవారం జరిగిన వైఎస్ విగ్రహావిష్కరణ సభలో అనిల్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘పేటేరు నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఇదంతా వైఎస్ పుణ్యమే. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన నేత ఆయనే’ అని వ్యాఖ్యానించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ మహానేత వల్ల అనేకమంది చదువుకోగలిగారని చెప్పారు. 

బాబుకు నామకరణం
పేటేరు (రేపల్లె రూరల్), న్యూస్‌లైన్: పేటేరుకు చెందిన వడ్లమూ డి దుర్గాంజనేయులు, సుజాత దంపతుల ఆరు నెలల బాబుకు బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి నామకరణం చేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడి రాజశేఖర్ అని పేరు పెడుతున్నట్లు చెప్పడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అన్నా.. ఈ బిడ్డ పరిస్థితి చూడవా..
పేటేరు (రేపల్లె రూరల్), న్యూస్‌లైన్: ‘అన్నా.. మా బిడ్డ పరిస్థితి చూడండి. మెదడువాపు వ్యాధితో బాధపడుతోంది..’ అంటూ పెదపులివర్రుకు చెందిన జొన్న బాబూరావు యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి తమ కుమార్తె 18 ఏళ్ల రోజీని చూపారు. ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పినట్లు వాపోయాడు. వారి బాధ విన్న జగన్.. త్వరలోనే మంచిరోజులొస్తాయని చెప్పారు.

బైబిల్ బహూకరణ
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్: పట్టణంలోని లూథరన్ చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ కె.ఆశీర్వాదం, జగన్‌ను సాదరంగా చర్చిలోకి ఆహ్వానించారు. పరిశుద్ధ తైలం తో అభిషేకించి అనంతరం బైబిల్‌ను బహూకరించారు.

వెల్‌కమ్.. జగన్ సార్..
రేపల్లె రూరల్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక పాఠశాల చిన్నారులకు పండుగలా మారింది. జగన్ సార్‌ను కలవాలి.. కరచాలనం చేయాలి... రేపల్లెలో పలుచోట్ల విద్యార్థులు పోటీపడ్డారు. నిజాంపట్నం రోడ్డులోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్ చిన్నారులు దోసిళ్లతో పూలు పట్టుకుని రోడ్లపై బారు లు తీరారు. జగన్ వారిని చూసి కాన్వాయ్ ఆపి హాయ్ అంటూ పలక రించారు. ‘జగన్ సార్.. వెల్‌కమ్ టూ రేపల్లె’ అంటూ పూలవర్షం కురిపించారు. పూలదండ వేయబోగా, జగన్ చిరునవ్వుతో దానిని చిన్నారులకే వేశారు. టీచర్లతో ముచ్చటించి, అభివాదం చేసి యువనేత బయలుదేరారు.

మారాజు.. మరిక లేడని..
నేటి ‘ఓదార్పు’ కుటుంబం
పేరు: దండుప్రోలు రమేష్ (22)
గ్రామం: తాళ్ళతిప్ప, నిజాంపట్నం మండలం
తల్లి: పార్వతమ్మ 
వృత్తి: వ్యవసాయ కూలీ
దండుప్రోలు రమేష్ వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక పురుగుమందు తాగి, 2009 సెప్టెంబర్ ఆరున మృతి చెందాడు. రమేష్ తండ్రి పోతురాజు 1996లో పసికర్ల వ్యాధితో, సోదరుడు కోటేశ్వరరావు 2003లో హృద్రోగంతో మృతి చెందారు. రమేష్ తల్లి పార్వతమ్మ వితంతు పింఛను తీసుకునేది. రమేష్ వైఎస్సార్‌కు వీరాభిమాని. వైఎస్ మరణంతో తల్లికి పింఛన్ ఆగిపోతుందని కలతచెంది పురుగుమందు తాగి మృతిచెందాడు. దీంతో కుటుంబీకులందరినీ కోల్పోయి పార్వతమ్మ తాళ్ళతిప్పలో ఒంటరిగా ఉంటూ కూలికి వెళుతోంది. ఇటీవల ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గొంతు కింద కణతికి శస్త్రచికిత్స చేయించుకుంది.


 
Share this article :

0 comments: