సీబీఐ చూపు ఇంత వంకరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ చూపు ఇంత వంకరా?

సీబీఐ చూపు ఇంత వంకరా?

Written By news on Thursday, November 17, 2011 | 11/17/2011

*ప్రధాన ఆరోపణలైన ‘క్విడ్ ప్రొ కొ’ను గాలికొదిలిన సంస్థ
*దివంగత వైఎస్, జగన్‌లపై బురదజల్లుడే లక్ష్యంగా విచారణ
*దర్యాప్తును అత్యంత గోప్యంగా ఉంచాలంటున్న నిబంధనలు
*వ్యక్తులు, సంస్థల ప్రతిష్ట దెబ్బతినేలా సీబీఐ వ్యవహరించరాదు
*కానీ వైఎస్, జగన్‌లను అప్రతిష్టపాలు చేసేలా పథకం ప్రకారం పావులు
*ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకవుతున్న తప్పుడు కథనాలు
*కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులు
*అప్రూవర్లుగా మారాలంటూ వాటి ప్రతినిధులపై ఒత్తిళ్లు
*లేదంటే ‘ఇతరత్రా’ ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులు
*సొంత పైత్యం జోడించి చెలరేగిపోతున్న ఎల్లో మీడియా

‘‘అవాంఛనీయ సమాచారాన్ని క్రికెట్, షేర్ మార్కెట్ మాదిరిగా ప్రజలకు, మీడియాకు బహిరంగంగా వెల్లడించకూడదు. మీడియాకు ఉద్దేశపూర్వకంగా లీకులివ్వకూడదు. ఒక వ్యక్తి, సంస్థ ప్రయోజనాలు, ప్రతిష్ట, సామాజిక స్థాయి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినే, దర్యాప్తు వల్ల సామాజికంగా ఆశాంతియుత పరిస్థితుల్లో జీవించే పరిస్థితులను కల్పించకూడదు’’ 
- ఇవీ సీబీఐకి కేంద్రహోంశాఖ, సీవీసీ జారీచేసిన మార్గదర్శకాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రస్తుత సీబీఐ దర్యాప్తు మాత్రం మూడు బెదిరింపులు.. ఆరు లీకులుగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ విచారణ తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. ముందే తమంత తాముగా ఒక నిర్ణయానికి వచ్చి, ఆ మేరకు తామనుకున్న వ్యక్తులను ఎలాగైనా కేసులో ఇరికించడమే లక్ష్యమన్నట్టుగా సాగుతున్న తంతు ఆసాంతం విమర్శల పాలవుతోంది.సీబీఐ విచారణ నిష్పాక్షికంగా, నిజాలను శోధిస్తూ, ముఖ్యంగా రహస్యంగా సాగాలని కేంద్ర హోం శాఖ, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. దర్యాప్తు అంశాలపై సీబీఐ అత్యంత గోప్యంగా వ్యవహరించాలని అవి స్పష్టంగా పేర్కొంటున్నాయి. జగన్, ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో సీబీఐ విచారణ తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది. 

దర్యాప్తు వివరాల పేరుతో ఏ రోజుకు ఆ రోజు మీడియాలోని ఒక వర్గానికి ఎప్పటికప్పుడు లీకులు అందుతున్నాయి. పైగా ఎవరెవరిని విచారించాలి, ఎలా విచారించాలనే అంశాలను కూడా కొన్ని పత్రికలు పతాక శీర్షికల్లోనే ముందస్తుగా నిర్దేశిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా సీబీఐ విచారణ కూడా అచ్చుగుద్దినట్టుగా అదే తరహాలో ముందుకు సాగుతోంది. రహస్యంగా, నిజాలను రాబట్టేలా జరగాల్సిన విచారణ ప్రక్రియ ఇలా లీకవడం పట్ల సీబీఐలో ఉన్నతస్థాయిలో పని చేసినవిశ్రాంత అధికారి ఒకరు తీవ్ర ఆశ్చర్యం వెలిబుచ్చారు. సీబీఐ విచారణ మునుపెన్నడూ ఈ రకంగా సాగలేదని అభిప్రాయపడ్డారు. 

వైఎస్ హయాంలో ప్రభుత్వం ద్వారా జరిగిన మేలుకు ప్రతిఫలంగా సాక్షి పత్రిక, టీవీల్లో పెట్టుబడులు పెట్టారన్న (క్విడ్ ప్రొ కొ) అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ పిటిషన్లపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు క్విడ్ ప్రొ కొ పైనే ప్రధానంగా విచారణ జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఏదైనా పొరపాటు దాగుందా, ఏవైనా సంస్థలకు రాయితీలు, భూ కేటాయింపులు తదితరాల్లో నిబంధనలను ఉల్లంఘించారా, అర్హత లేనివాటికి కట్టబెట్టారా అన్న కోణంలో నిజానిజాల్ని వెలికి తీయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అవసరమైన ఫైళ్లు ఇప్పుడు సీబీఐ దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 

నిజానికి వాటన్నింటినీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు అవసరమైన సిబ్బంది కూడా ప్రస్తు తం సంస్థకు లేరు! అయినా సరే, ప్రధాన విచారణాంశమైన క్విడ్ ప్రొ కొకు ఆధారాలను సేకరించే అంశాన్ని పక్కన పెట్టి మరీ, వైఎస్, జగన్‌లపై బురదజల్లే కార్యక్రమానికి సీబీఐ దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది! ఆ క్రమంలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను బెదిరించే ధోరణికి సీబీఐ దిగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది! ‘‘ఆరోపణలపట్ల నమ్మకం కలి గించే రీతిలో ప్రజాభిప్రాయాన్ని మలిచే విధంగా సీబీఐ వ్యవహరించకూడదు. తప్పుడు ఆరోపణలకు బలం చేకూర్చేలా తప్పుడు సాక్ష్యాలను సృష్టించరాదు. వ్యక్తులు/సంస్థలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అనువైన వాతావరణం నెలకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి’’అన్న హోం శాఖ, సీవీసీ నిర్దేశకాలను కూడా అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా సీబీఐ దర్యాప్తు సాగుతోంది!

వీటినేమంటారు...?
విచారణ పేరుతో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చెప్పాలంటూ తన క్లయింట్‌ను సీబీఐ వేధిస్తోందని గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ తరఫు లాయర్ బహిరంగంగా వెల్లడించడం గమనార్హం! ఓఎంసీ కేసులోనూ ఇదే తంతు! ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా సీఆర్‌పీసీ సెక్షన్ 160(1) కింద జగన్‌ను సీబీఐ విచారించింది. మైనింగ్ లీజు దరఖాస్తులో 2,3 స్థానాల్లో ఉన్న వారు ఫిర్యాదు చేస్తే విచారించారంటే అర్థముంది. కానీ దరఖాస్తుదారులో 15వ స్థానంలో ఉన్న కొండారెడ్డి సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని జగన్‌ను విచారించడమేమిటని పదవీ విరమణ చేసిన ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రశ్నించారు. 

జగన్ తనను బెదిరించాడంటూ సతీశ్ అనే వ్యక్తి సీబీఐకి తెలిపాడంటూ మీడియాలో వచ్చింది. అయితే, జగన్‌ను తాను అస్సలు కలవనేలేదని ఆ వ్యక్తే స్వయంగా వెల్లడించారు. సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపినట్టు కూడా వివరించారు! ఓఎంసీ వ్యవహారంలో సీబీఐ ముందు జగన్ సాక్షిగా హాజరైన సందర్భంగా.. ఆ లీజు చంద్రబాబు హయాంలోనే ఓఎంసీకి బదిలీ అయిందని పేర్కొంటూ సంబంధిత జీవోను కూడా సీబీఐకిచ్చారు. కానీ, అప్పుడు ఓఎంసీకి గాలి జనార్దనరెడ్డి డెరైక్టర్ కాదని అదే సాయంత్రం సీబీఐ జేడీ ఓ ఆంగ్ల పత్రికకు ఫోన్ చేసి మరీ చెప్పారు. నిజానికి తాము లీజులను గాలికే అప్పగించామని గనుల పూర్వ యజమాని అయిన రామ్మోహన్‌రెడ్డి భాగస్వామి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత స్పష్టంగా వెల్లడించారు. 

ఇలా జగన్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎల్లో మీడియాకు ఎప్పటికప్పుడు వెళ్తున్న లీకులు, ఆయనపై ఆరోపణలు చేసిన వారి తరఫున వకాల్తా పుచ్చుకున్న తరహాలో దర్యాప్తు సంస్థ తరఫున వెలువడుతున్న వ్యాఖ్యలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి? ఇక హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఏకంగా ఏడెనిమిది రోజుల పాటు సీబీఐ అధికారులు ‘తాపీ’గా కొలతలు తీసుకున్నారు! వాటికి సంబంధించి ఎల్లో మీడియాలో అడ్డూఅదుపూ లేకుండా పచ్చి అబద్ధాలను వండివారుస్తూ కథనాలు వచ్చేందుకు పరోక్షంగా దోహదపడ్డారు! అంతేకాదు... 2000లో, అంటే వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు నాలుగేళ్ల ముందు, ఆయనకు ఏ సంబంధమూ లేని, ఒక లీజును ఇతరులకు బదలాయించి నందుకు కడప జిల్లాకు చెందిన ఒక కుటుంబాన్ని కుటుంబంతో సహా వచ్చి హైదరాబాద్‌లో తమ విచారణకు అందుబాటులో ఉండాలంటూ సీబీఐ తాజాగా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. 

ఇలా చేయాలని ఏ దర్యాప్తు నిబంధనలు చెబుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ప్రశ్నించారు. పైగా ‘‘ఎమ్మార్ చైర్మన్‌తో వైఎస్ భేటీ అంటూ నిత్యం ఉషోదయంతో పాటుగా పచ్చి అబద్ధాలను మాత్రమే నినదించే ‘ఈనాడు’ బుధవారం పతాక శీర్షికన ఒక కథనాన్ని వండివార్చింది. షరామామూలుగా జరిగే సీఎం-పారిశ్రామికవేత్తల భేటీకి కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ గుండెలు బాదుకుంది. ఆంగ్ల పత్రికల్లోనూ యథాతథంగా ఇదే విషయంతో కథనం వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థే స్వయంగా లీక్ చేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి. అతి సాధారణమైన ఈ అంశాన్ని కూడా నేరంలా చిత్రించడం, ఒక వర్గం మీడియాకు లీక్ చేయడాన్ని ఏమంటారు’’ అంటూ ఆయన మండిపడ్డారు. 

బాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఎమ్మార్ చైర్మన్ ఆయనను పలుమార్లు కలిశారని, పలు ఒప్పందాలపై ఇద్దరూ సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. నిజానికి విల్లాల నిర్మాణం తదితరాలపైనా ప్రభుత్వం అదనపు పెట్టుబడి పెట్టడం అనవసరమని రోశయ్య, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ప్రభుత్వంపై అదనపు భారాన్ని తగ్గించుకోవాలన్న ఆ కమిటీ సూచన మేరకే నిర్మాణ పనులన్నింటినీ ఎమ్మారే చేపట్టాలని పేర్కొంటూ, ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 49 శాతం నుంచి 26 శాతానికి వైఎస్ ప్రభుత్వం తగ్గించుకుంది. సైబర్ సిటీ తదితర విషయాల్లో బాబు హయాంలో పాటించిన విధానాలనే ఈ విషయంలో అనుసరించింది. కానీ వీటిని పట్టించుకోకుండా విచారణలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును న్యాయ నిపుణులు కూడా తప్పుబడుతున్నారు. 

సీబీఐ అధికారులు అత్యంత నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఉండాలని, ఇతరులను తృప్తిపరిచే ఉద్దేశాలు, ప్రతీకార వైఖరి లేకుండా పనిచేయాలని ఉన్న నిర్దేశకాలను తుంగలో తొక్కి... ఎవరితోఏం చెప్పించాలో ముందే నిర్ధారణకు వచ్చి... అందుకనుగుణంగా విచారణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరుగుతూ వస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సీబీఐ తీరు విచారణ సంస్థల పనితీరుపై మచ్చగా మిగిలే ప్రమాదమూ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఒప్పుకోవాలంటూ ఒత్తిళ్లు..!
జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై సీబీఐ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తోంది. దివంగత నేత వైఎస్ ద్వారా లాభపడ్డాం కనుకనే అందుకు ప్రతిఫలంగా సాక్షి పత్రిక, టీవీల్లో పెట్టుబడులు పెట్టామని పేర్కొంటూ అప్రూవర్లుగా మారాల్సిందిగా తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోంది. అంగీకరించకపోతే వాటికి సంబంధించిన ఇతర వ్యాపార లావాదేవీల్లోని అవకతవకలను బయటికి లాగుతామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది! ‘వ్యాపారమన్నాక అక్రమాలు చేయకుండా ఎలా ఉంటారు? ఏ చిన్న తప్పునైనా పట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు పెద్ద లెక్కలోది కాదు’ అంటూ కంపెనీల ప్రతినిధులను హెచ్చరిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి! 

రికార్డులన్నీ తమ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి తామేదైనా చేయగలమనే రీతిలో విచారణ సందర్భంగా వారితో సీబీఐ వ్యవహరించిన ఘటనలున్నాయి. విచారణ పేరుతో కంపెనీల ప్రతినిధులను 15 నుంచి 20 రోజుల పాటు పిలిపించడం, రోజంతా ఊరికే కూర్చోబెట్టడం, చివర్లో విచారణ పేరుతో మొక్కుబడిగా కాసేపు కొన్ని ప్రశ్నలడిగి పంపించేయడం.. వంటి వ్యూహాలను అమలు చేస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా కంపెనీలను ఎలాగోలా ‘దారికి’ తెచ్చుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్న వైనం విచారణ తీరును బట్టే తెలిసిపోతోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ కన్సల్టెంట్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తమకనుకూలంగా సాక్ష్యం చెప్పించుకున్నారు. కొందరి విషయంలో అయితే వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి! జగన్ చెబితేనే ప్రభుత్వం తమకు భూ కేటాయింపులు చేసిందని అంగీకరించాలంటూ ఓ కంపెనీని బెదిరించారు. మరో కంపెనీనైతే... ఏకంగా జగన్ తన సొంత డబ్బులనే తమకిచ్చి పెట్టుబడులు పెట్టించారని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారు! 

జగన్‌ను ఎలాగైనా దోషిగా నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ తతంగమంతా నడుస్తోందని దర్యాప్తు రంగంలో అపార అనుభవమున్న అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి విచారణల తంతును ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెబుతున్నారు. ‘‘మామూలుగా అయితే పెద్ద ఎత్తున ప్రాణహాని తలపెట్టిన వారి విషయంలో మాత్రమే విచారణ కఠినంగా సాగుతుంది. ఇలాంటి వివాదాల్లో మాత్రం ఆధారాలే ముఖ్యం. కొందరిని అప్రూవర్లుగా మార్చుకుని తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నంత మాత్రాన అది చట్టం ముందు నిలవదు’’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు విశ్లేషించారు.
Share this article :

0 comments: