నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసు

నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసు

Written By news on Saturday, November 26, 2011 | 11/26/2011

తనిఖీలకు సీబీఐ ప్రత్యేక బృందాల ఏర్పాటు 
ప్రభుత్వం నుంచి చంద్రబాబు హయాం రికార్డులు కోరే అవకాశం 
బినామీల సంస్థలు, లావాదేవీలపై ఐటీ, ఆర్‌ఓసీల నుంచి సమాచారం విశ్లేషణ 
దర్యాప్తుకు సన్నద్ధమవుతున్న రాష్ట్ర పోలీసుశాఖ, సీఐడీకి కేసు అప్పగింత! 
బాబు, బినామీల అక్రమాస్తులపై ఇప్పటికే రంగంలోకి దిగిన ఈడీ

 మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. హైకోర్టు నుంచి పిటిషనర్ కాపీలను సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ స్వయంగా తీసుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా సీల్డ్ కవర్‌లో నివేదిక అందిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పిటిషనర్ కాపీలను పరిశీలించిన అనంతరం దర్యాప్తుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుంటామని చెప్పారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావులతోపాటు చంద్రబాబు బినామీల అక్రమాలు, చర్యలపై స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని హైకోర్టు ఈ నెల 14వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు వేర్వేరుగా దర్యాప్తు జరిపి మూడు నెలల్లో నివేదిక అందించాలని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే రంగంలోకి దిగింది. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ, టీడీపీ ఉపాధ్యక్షుడు సి.ఎం.రమేష్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావులకు ఈడీ నోటీసులు జారీచేసింది. విదేశాలతో లావాదేవీలు జరిపిన వీరందరి వ్యవహారాన్ని ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) కింద ఈడీ విచారించనుంది. 

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ కూడా శుక్రవారం నుంచి రంగంలోకి దిగింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బినామీల అక్రమ ఆస్తుల గుట్టును సీబీఐ రట్టుచేయనుంది. పిటిషనర్ హైకోర్టులో దాఖలుచేసిన 2,424 పేజీల కాపీని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం సీబీఐ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను రూపొందిం చుకోనున్నారు. సోమవారం నుంచి దర్యాప్తు ప్రారంభించి చంద్రబాబుతోపాటు ఆయన బినామీలకు సీబీఐ నోటీసులు జారీచేయనుంది. అక్రమ ఆస్తుల సంపాదన, అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారనే అంశాలపై సీబీఐ దృష్టిసారించనుంది. వారి ఆదాయ వనరులు ఏమిటి? ఏవిధంగా సంస్థలను ఏర్పాటుచేశారు? వాటికోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా? అనే అంశాలపై ప్రతివాదులు సమాధానం ఇవ్వాల్సి ఉంది. నోటీసులతోపాటు ప్రతివాదులను సీబీఐ బృందాలు నేరుగా విచారించనున్నాయి.

సమాచార సేకరణలో భాగంగా సీబీఐ ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగనున్నాయి. ప్రతివాదుల నివాసాలు, వారికి సంబంధించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిపే అవకాశం ఉంది. అవసరానికి అనుగుణంగా సీబీఐ కేంద్ర కార్యాలయంతోపాటు ఇతర యూనిట్‌ల నుంచి అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు. చంద్రబాబు, ఆయన బినామీల అక్రమ ఆస్తుల సమాచారం సేకరించేందుకు కొన్ని బృందాలు విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉండొచ్చని సీబీఐ వర్గాల సమాచారం. చంద్రబాబు, ఆయన బినామీలకు మలేసియా, సింగపూర్‌లలో హోటల్ ఇతర వ్యాపారాలకు సంబంధించి కూడా సీబీఐ ఆరా తీయనుంది. సింగపూర్‌లో పార్క్ హోటల్ క్లార్క్‌క్వే అనే పేరుతో ఈగిల్ ఫోర్స్ ప్రాఫిట్స్ లిమెటెడ్ కంపెనీ పేరుతో చంద్రబాబు ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై సీబీఐ సమాచారం సేకరించనుంది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ విదేశీ చదువులు, ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఎన్‌ఆర్‌ఐల విరాళాలపై కూడా ఆరా తీయనున్నారు. అత్యంత ఖరీదైన భూమిని ట్రస్ట్ పేరుతో తీసుకుని పార్టీ కార్యకలాపాలకు వినియోగించటంపై కూడా చంద్రబాబు సీబీఐ దర్యాప్తులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

13 మంది ప్రతివాదులు వీరే... 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన బినామీలందరికీ సీబీఐ నోటీసులు జారీ చేయనుంది. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్, అహోబలరావు, వి.నాగరాజనాయుడు, టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, మధుకాన్ సుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు, టీడీపీ నేత మురళీమోహన్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు, టీడీపీ ఉపాధ్యక్షుడు సి.ఎం.రమేశ్‌లు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నారు. వీరికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై ఆదాయపన్ను శాఖ నుంచి కూడా వివరాలను సేకరించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది. ఆదాయపన్ను శాఖకు వారు ఇచ్చిన వార్షిక నివేదికలను కూడా సేకరించనుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) నుంచి ఆయా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, లావాదేవీల వివరాలను సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. 

ప్రభుత్వ రికార్డులను పరిశీలించనున్న సీబీఐ 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఆయన అనుయాయులకు, బినామీలకు మేలు చేసే విధంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను సీబీఐ కోరనుంది. కాకినాడ సీ పోర్టు ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అప్పటి రికార్డులను స్వాధీనం చేసుకోనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు రంగంలో ఎనిమిది విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు).. అటు ప్రమోటర్లకు, ఇటు తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే ప్రహసనంగా మార్చుకున్న వ్యవహారానికి సంబంధించిన రికార్డులను కూడా సీబీఐ కోరనుంది. 

చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు సీఐడీకి? 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల ఆస్తుల వ్యవహారంపై దర్యాప్తు జరపాల్సిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. పోలీసుశాఖ అందుకు సన్నాహాలు చేస్తోంది. హైకోర్టుకు సంబంధించిన ఉత్తర్వులను పరిశీ లించాల్సి ఉందని పోలీసుశాఖ ఉన్నతస్థాయి వర్గాలు శుక్రవారం తెలిపాయి. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ద్వారా దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. సీబీఐ, ఈడీతోపాటు పోలీసుశాఖ కూడా వేరొక నివేదికను హైకోర్టుకు అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ ఆర్థిక నేరాల విభాగం అధికారులతోపాటు చార్టెర్డ్ అకౌంట్లు, ఆర్థిక నిపుణుల సహకారంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయనున్నారు.


పార్టీ సీనియర్ నేతలతో బాబు సమాలోచనలు 
వారి సూచనల మేరకే కోర్టుకెళుతున్నట్లు చెప్పాలని సూచన 
బినామీల వరకే కోర్టుకువెళితే.. తనకు ప్రయోజనం ఉండదని బాబు యోచన
సోమ, మంగళవారాల్లో వెకేట్ పిటిషన్ దాఖలుకు కసరత్తు 
కోర్టులో ఉపశమనం లభించకున్నా.. 
దర్యాప్తు సమయంలో సర్కారు సాయం చేస్తుందని బాబు భరోసా 

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైకోర్టు తనతో పాటు బినామీల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని కోరుతూ వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సోమ లేదా మంగళవారాల్లో వెకేట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్న చంద్రబాబు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, రేవంత్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. సీబీఐ దర్యాప్తుపై కోర్టుకు వెళ్లవద్దని తాము తొలి నుంచీ చెప్తున్నామని, ఇపుడు కూడా అదే విధంగా ఉంటే బాగుంటుందని పలువురు నేతలు ఈ సందర్భంగా పార్టీ అధినేతకు సూచించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం కోర్టును ఆశ్రయిస్తానని, వారందరి ఒత్తిడి మేరకే తాను కోర్టుకు వెళ్లటానికి అంగీకరించానని మీడియాకు చెప్పాల్సిందిగా సూచించారు. 

బాబుతో పాటు ఆయన బినామీల ఆస్తులపై విచారణకు ఆదేశించాల్సిందిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించబోనని, ప్రజాకోర్టులో తేల్చుకుంటానని, తనపై 23 విచారణ కమిషన్‌లు, సభా సంఘాలు వేశారని, తన జీవితం తెరిచిన పుస్తకమని, తను ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని, ఏ దర్యాప్తుకూ భయపడేది లేదని చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే బాబు బినామీలు సి.ఎం.రమేష్, నామా నాగేశ్వరరావు, రామోజీరావులు సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టులో తేల్చుకోవాల్సిందిగా సూచించిన విషయం తెలిసిందే. తాను కోర్టును ఆశ్రయించకపోతే సీబీఐ, ఈడీ, డీజీపీ, హోంశాఖ కార్యదర్శుల విచారణ యథాప్రకారం కొనసాగుతుందని, బినామీలు మాత్రమే కోర్టును ఆశ్రయించి తాము బాబు బినామీలం కాదని చెప్తే వారికే ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని.. తనకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని టీడీపీ అధినేత చెప్తున్నారు. దీంతో సుప్రీం తీర్పును సాకుగా చూపి హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. శుక్రవారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో తన నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. ఏదైనా ఒక కేసులో సింగిల్ జడ్జి లేదా ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్‌ను వెకేట్ పిటిషన్ అంటారు.

సర్కారు సాయం చేస్తుంది..!: హైకోర్టులో వేయాల్సిన వెకేషన్ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఒకవేళ హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా సీబీఐ దర్యాప్తు సమయంలో ప్రభుత్వం తమకు తగిన సహకారం అందిస్తుందని చంద్రబాబు పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం. 


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని గుర్తు చేస్తూ.. తన విషయంలో అలా చేయకపోవచ్చని, ఈ మధ్య జస్టిస్ కక్రూను మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమించేందుకు తాము సహకరించటం, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకారం అందిస్తుండటం వంటి వాటిని కాంగ్రెస్ పెద్దలు కూడా అర్థం చేసుకుంటారని బాబు చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించే విషయమై పార్టీ నేత ఎర్రన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అయితే అది ఎప్పుడనేది నిర్ణయించలేదన్నారు. 

తెలంగాణ జిల్లాల్లో పర్యటన వాయిదా: రైతు పోరుబాటలో భాగంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో చేపట్టాల్సిన పాదయాత్రను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. సీబీఐ దర్యాప్తుపై హైకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఇదే అంశంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు. అయితే పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు నేత కిషన్‌జీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారని పార్టీ నేతలు చెప్పారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆయన ఆయా జిల్లాల్లో పాదయాత్ర చేస్తారని సమాచారం.
Share this article :

0 comments: