లీజు అద్దె ఏటా 10% పెంచాల్సి ఉండగా 5% చాలన్న బాబు సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లీజు అద్దె ఏటా 10% పెంచాల్సి ఉండగా 5% చాలన్న బాబు సర్కారు

లీజు అద్దె ఏటా 10% పెంచాల్సి ఉండగా 5% చాలన్న బాబు సర్కారు

Written By ysrcongress on Monday, December 12, 2011 | 12/12/2011

* చంద్రబాబు తలంటిన శాసనసభా కమిటీ
* సుప్రీంకోర్టే కాదన్నా శిఖం భూమి కేటాయింపు
* మారుతుండే మార్కెట్ విలువను పట్టించుకోలేదు
* 33 ఏళ్లపాటు లీజు సమీక్ష ఉండదని రాసిచ్చేశారు
* లీజు అద్దె ఏటా 10% పెంచాల్సి ఉండగా 5% చాలన్న బాబు సర్కారు
* ఐదేళ్ల పాటు వినోదపు పన్ను మినహాయింపు
* కేబినెట్ నిర్ణయాలకు ముందే బాబు ప్రకటనలు
* కేబినెట్ వద్దన్నా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు

వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా వడ్డన బాగానే ఉంటుందన్నది సామెత. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆశ్రీతులకు అడ్డగోలు కేటాయింపులు జరపడానికి, ఉదారంగా మినహాయింపులివ్వడానికి ఏ మేరకు తెగబడ్డారో తెలుసుకునేందుకు రాజధాని నడిబొడ్డున నెక్లెస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ప్రసాద్ ఐమ్యాక్స్ ధియేటర్ కాంప్లెక్స్‌పై 2004 ఆగస్టు 30న వేసిన శాసనసభా కమిటీ 2006 జూన్ 4న స్పీకర్‌కు నివేదికను సమర్పించింది. ప్రసాద్ ఐమ్యాక్స్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారంటూ చంద్రబాబుకు ఈ కమిటీ తలంటింది. చంద్రబాబు నిర్వాకాలన్నిటినీ కడిగేసింది. నివేదికలో ముఖ్యాంశాలివీ..

ఈ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున లూటీ చేశారు. 2000 నుంచి 2033 వరకూ ఐమ్యాక్స్ స్థలాన్ని లీజుకిచ్చారు. 2000 సంవత్సరంలో గజం మార్కెట్ విలువ రూ.11,000 ఉంది. మారుతుండే మార్కెట్ విలువను బట్టి లీజును సమీక్షించాల్సి ఉండగా.. 33 ఏళ్లపాటు లీజును సమీక్షించబోమంటూ రాయితీ ఇచ్చారు? ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ఓ ప్రైవేటు వ్యక్తికి లాభం చేకూర్చడానికే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.


*ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు 15 సంస్థలు ఆసక్తి చూపాయి. కానీ రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే రాయితీలు/మినహాయింపులు ఏమిటో తెలియక అందరూ వెనక్కి తగ్గారు. వారీ ప్రాజెక్టులో పాల్గొనకుండా నిరుత్సాహపరిచేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారికి రాయితీల గురించి తెలియనివ్వలేదు.

*ఈ భూమి ‘శిఖం’ భూమి అని తెలిసీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. శిఖం భూమి కేటాయించరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నా చంద్రబాబు సర్కారు దానిని ఖాతరు చేయలేదు.

*స్థలాన్ని అప్పగించిన నాటి నుంచి కాకుండా ఆమోదం పొందిన తేదీ నుంచి లీజు అద్దె వసూలు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కావాలనే తిరస్కరించింది. దానివల్ల ఖజానాకు నష్టం వాటిల్లింది.

*లీజు అద్దెను ఏటా 10 శాతం పెంచాలన్న ప్రతిపాదనను కూడా బాబు సర్కారు అంగీకరించలేదు. ఏటా 5 శాతం పెంచితే చాలని ప్రతిపాదించింది.

*చివరగా పోటీలో రెండు సంస్థలు మిగిలాయి. వివిధ కారణాలు చూపి ప్రసాద్ ప్రొడక్షన్ లిమిటెడ్ వైపు చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. పోటీలో ఉన్న మరో సంస్థ ఈసిటీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌ను ఈ ప్రాజెక్టు ప్రక్రియ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు నాటి రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అదే ఈసిటీ సంస్థకు సికింద్రాబాద్‌లోని యాత్రీనివాస్ వద్ద ప్రభుత్వ భూమిలో మల్టీప్లెక్స్ ధియేటర్లు కట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. మరి.. ఐమ్యాక్స్ విషయంలో పనికిరాకుండా పోయిన ఈసిటీ సంస్థ అక్కడెలా పనికివచ్చింది? అంటే ఐమ్యాక్స్ స్థలానికి పోటీలో లేకుండా, ఎటువంటి అభ్యంతరమూ చెప్పకుండా ఉండేందుకే ఈసిటీ ఎంటర్‌టెయిన్‌మెంట్ లిమిటెడ్ సంస్థను చంద్రబాబు అలా నేర్పుగా పక్కకు తప్పించారన్నమాట! 

*ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే 2000 సెప్టెంబర్ 12న టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు సమావేశంలో అప్పటి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రసాద్ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థకు ఐదేళ్లపాటు వినోదపు పన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించేశారు. నెల రోజుల తర్వాత అంటే... 2000 అక్టోబర్ 9న కేబినెట్ సమావేశంలో ప్రసాద్ సంస్థకు ఈ భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రసాద్ సంస్థకు భూమి కేటాయిస్తున్నట్లు బాబుకు ముందే తెలుసా? కేబినెట్ ఆమోదం పొందకుండానే సీఎం ఈ విషయాన్ని ఎలా ప్రకటిస్తారు?

*ఐమ్యాక్స్ థియేటర్‌కు మాత్రమే ఐదేళ్లపాటు వినోదపు పన్ను మినహాయింపు ఉంది. అయితే, 2002 మే 22న జరిగిన టూరిజం ప్రమోషన్ బోర్డు సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రసాద్ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థకు చెందిన మల్టీప్లెక్స్‌లకు కూడా ఐదేళ్లపాటు వినోదపు పన్ను మినహాయింపునిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి చంద్రబాబు ప్రసాద్ సంస్థ మల్టీప్లెక్స్‌లకు మినహాయింపు ఎందుకు ఇచ్చినట్లు?

ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థకు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు నివ్వాలన్న ప్రతిపాదనను 2000 అక్టోబర్ 9న జరిగిన కేబినెట్ సమావేశం తిరస్కరించింది. అయితే 2000 నవంబర్ 25, 2002 మే 22 నాటి టూరిజం బోర్డు సమావేశాలలో సీఎం చంద్రబాబు.. ప్రసాద్ సంస్థకు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ తిరస్కరించిన ప్రతిపాదనలను చంద్రబాబు ఎలా ఆమోదిస్తారు?

*పార్కింగ్ స్థలం, ప్రమాదం సంభవిస్తే సురక్షితంగా తరలించే మార్గం లేవంటూ ఐమ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ నిర్మాణాలపై వివాదం నడుస్తున్నా... ఇవే కారణాలపై ఆ కాంప్లెక్స్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్/ఫైర్ సర్వీసుల సర్టిఫికెట్ లభించకపోయినా... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2003 జూలై 23న ఆ కాంప్లెక్స్‌కు ప్రారంభోత్సవం చేశారు. 

*లీజు తొలుత 25 సంవత్సరాలకే అనుకున్నా చంద్రబాబు ప్రభుత్వం 33 ఏళ్లకు పెంచేసింది. 

*ఐమ్యాక్స్‌కు ముందు ఇచ్చిన స్థలం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం మరో 737 చదరపు మీటర్లను అదనంగా కేటాయించింది. 

*ఐమ్యాక్స్ థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు 2004 ఏప్రిల్ 2న అనుమతి లభించింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2003 జూలై 23న కాంప్లెక్స్‌కు ప్రారంభోత్సవం చేయగానే.. అప్పటికీ అనుమతి లేకున్నా.. చలనచిత్రాల ప్రదర్శన ప్రారంభమైపోయింది.
Share this article :

0 comments: