అప్పట్లో చంద్రబాబు కుటుంబ ఆదాయం రూ.1,500.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పట్లో చంద్రబాబు కుటుంబ ఆదాయం రూ.1,500..

అప్పట్లో చంద్రబాబు కుటుంబ ఆదాయం రూ.1,500..

Written By ysrcongress on Wednesday, December 7, 2011 | 12/07/2011

హైకోర్టులో లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్
చంద్రబాబు ఆస్తులపై నా వాదనలూ వినండి
రూ.1,500 ఆదాయం నుంచి ఆయన కోట్లకు పడగలెత్తారు
ఆదాయానికి మించిన ఆస్తులకు ఆధారాలున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం, దాని దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదు
బాబుపై ఫిర్యాదులో స్టే ఎత్తివేయాలని మరో పిటిషన్

హైదరాబాద్, న్యూస్‌లైన్: చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో తననూ ఇంప్లీడ్ చేసుకొని, తన వాదనలూ వినాలని ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి హైకోర్టును అభ్యర్థించారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో తాను దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే చంద్రబాబునాయుడు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టి, పలు కంపెనీలు ఏర్పాటు చేశారని, ఇదంతా చట్టబద్ధంగా సంపాదించి కాదని ఆమె తన పిటిషన్లలో పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదు...

‘‘చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరపాలని కోరుతూ నేను 2004, నవంబర్ 18న అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశాను. అయితే ఏ కారణంవల్లో ఏసీబీ అధికారులు నా ఫిర్యాదుపై స్పందించలేదు. ఏసీబీ అధికారుల చర్యలను సవాలు చేస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశాను. దీనిపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదనలను వినాలంటూ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రత్యేక న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. కేసు నమోదు సమయంలో నిందితుని వాదనలు వినాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు స్వయంగా 2005లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో నా ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ నేను ఓ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశాను. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు 2005 జూన్ ఆరో తేదీన తోసిపుచ్చింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు.. స్పీకర్‌కు సమర్పించిన ఆస్తుల వివరాలు.. రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఆస్తుల వివరాలను హైకోర్టు ముందు ఉంచాను. ఇవన్నీ కూడా చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని నిరూపించే ఆధారాలే. నా అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేశాను. దీనిని విచారించిన ధర్మాసనం.. నా అప్పీల్‌ను కొట్టివేస్తూ.. చంద్రబాబు రిట్ పిటిషన్‌పై తుది విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. 2005 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సాగుతూనే ఉంది. స్టే ఉత్తర్వులు కూడా కొనసాగుతున్నాయి. ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను చంద్రబాబు ప్రతివాదిగా చేర్చనందున.. వారిని నిరోధించే ఉత్తర్వులు ఏవీ లేవు. చంద్రబాబు అవినీ తిపై సీపీఎం ‘బాబు జమానా-అవినీతి ఖజానా’ పేరుతో పుస్తకం ప్రచురించింది. తెహల్కా పత్రిక కూడా దేశంలో ధనిక రాజకీయవేత్త చంద్రబాబు అంటూ కథనం ప్రచురించింది. 

కేవలం రెండెకరాల భూమితో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు.. అనతికాలంలోనే కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసి, దేశ, విదేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా.. చాలా పలుకుపడి ఉన్న వ్యక్తి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆస్తులపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి న్యాయాన్ని నిలబెడతారనే నమ్మకం ప్రస్తుతం నాకు రాష్ట్ర ప్రభుత్వం, దాని దర్యాప్తు సంస్థలపై లేదు’’ అని లక్ష్మీ పార్వతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా రాష్ట్ర ప్రభుత్వం, దాని దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేక, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని కోర్టుకు తెలిపారు. 

అప్పట్లో చంద్రబాబు కుటుంబ ఆదాయం రూ.1,500..

‘‘చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబ వ్యవసాయ ఆదాయం కేవలం రూ.1,500. ఆయన తల్లి అమ్మణ్ణమ్మ పాలు, పెరుగు అమ్మి కుటుంబాన్ని పోషించారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మోటార్ మెకానిక్. తద్వారా చంద్రబాబు కుటుంబ వార్షిక ఆదాయం రూ.12 వేల నుంచి 15వేల వరకు ఉండేది. రాజకీయాల్లోకి వచ్చే సమయానికి చిన్న ఇల్లు, వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమి, తల్లికి చెందిన ఎకరా భూమి, ఓ సైకిల్ మినహా... ఎటువంటి ఆస్తులు గానీ, వ్యాపారాలు గానీ లేవు. ఎమ్మెల్యేగా చంద్రబాబు నెలకు రూ.350 జీతం పొందేవారు. తరువాత పలుశాఖలకు మంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నెలకు రూ.2,500 జీతం పొందేవారు. 1978 నుంచి 1983 వరకు చంద్రబాబు ఆదాయం ఎమ్మెల్యేగా రూ.350, 33 నెలల పాటు, మంత్రిగా జీతం రూ.2,500 చొప్పున 25 నెలల జీతం మొత్తం కలిపి రూ.74,050. 1983లో టీడీపీలో చేరిన తరువాత, 1998లో హైకోర్టులో కేసు సందర్భంగా ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తన కుటుంబానికి 77 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఈ భూములన్నీ చంద్రబాబు రాజకీయాల్లో వచ్చిన తరువాతే కొనుగోలు చేసినవి. అంతేకాక వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.36 వేలుగా తెలిపారు. దీని ప్రకారం 1983 నుంచి 1989 వరకు చంద్రబాబు చట్టబద్ధ ఆదాయం సంవత్సరానికి 36వేలు చొప్పున 6 సంవత్సరాలకు రూ.2.16 లక్షలు. 1992లో చంద్రబాబు హెరిటేజ్‌ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. 

1999లో చంద్రబాబు తన ఆస్తుల వివరాలను స్పీకర్‌కు సమర్పించారు. చంద్రబాబు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ మొత్తం రూ.5.36 కోట్లు. దీనికి తోడు తన మైనర్ కుమారుడు లోకేష్ పేరు మీద ఉన్న రూ.2.45 కోట్లను కూడా చూపారు. మొత్తం కలిపి 1999 నాటికి చంద్రబాబు ఆస్తులు రూ. 7.82 కోట్లు. 2004లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఆస్తుల అఫిడవిట్‌లో తన ఆస్తులు రూ.1.58 కోట్లుగా చంద్రబాబు చూపారు. కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తులను చూపాల్సి ఉన్నా, వాటిని అఫిడవిట్‌లో పొందుపరచలేదు. 1978 నుంచి 2004 వరకు చంద్రబాబు చట్టబద్ధ ఆస్తులు (జీతభత్యాలు) రూ.7.38 లక్షలు. దీనిని బట్టి స్పీకర్, రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లను పరిశీలిస్తే, చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని స్పష్టమవుతోంది. కాబట్టే వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు అవసరమని భావిస్తున్నా. అందుకే విజయమ్మ పిటిషన్‌లో నన్నూ ఇంప్లీడ్ చేసుకోవాలని కోరుతున్నా’’ అని లక్ష్మీపార్వతి తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో తన ఫిర్యాదుపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేయాలని ఆమె ఈ సందర్భంగా మరో అనుబంధ పిటిషన్‌లో కోర్టును కోరారు.
Share this article :

0 comments: