17 స్థానాలకూ ఒకేసారి ఉప ఎన్నికలు పెట్టాలి. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 17 స్థానాలకూ ఒకేసారి ఉప ఎన్నికలు పెట్టాలి.

17 స్థానాలకూ ఒకేసారి ఉప ఎన్నికలు పెట్టాలి.

Written By ysrcongress on Wednesday, December 7, 2011 | 12/07/2011

ఎమ్మెల్యేల విజ్ఞతను చూసి గర్విస్తున్నా... 
రాజకీయ విలువలకిది కొత్త నిర్వచనం
పదవులు పోతాయని తెలిసీ విలువలకు కట్టుబడి విప్‌ను ధిక్కరించారు
సర్కారుకు దమ్మూ ధైర్యముంటే వారిపై అనర్హత వేటు వేసి 17 స్థానాలకూ ఒకేసారి ఉప ఎన్నికలు పెట్టాలి... మా తడాఖా చూపుతాం
ప్రభుత్వ ప్రలోభాలు, బాబు కుటిల నీతిని మా ఎమ్మెల్యేలు దీటుగా ఎదుర్కొన్నారు... వారిని రెచ్చగొట్టి ఓటేయకుండా చేసేందుకు బాబు ఎత్తు
టీడీపీ అవిశ్వాసం రైతుల కోసమా, వైఎస్‌పై విమర్శలకా?
బాబు రాజకీయ నాయకుడినని చెప్పుకునే అర్హతే కోల్పోయారు
కిరణ్ సర్కారుకు పాలించే నైతిక హక్కు పోయినట్టే
రైతు సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్, టీడీపీ దొందూ దొందే

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు రాజకీయ విలువలకే కొత్త నిర్వచనం చెప్పారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. పదవులు పోతాయని తెలిసి కూడా ఒక విధానానికి, విలువలకు కట్టుబడి విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలకు తాను జేజేలు పలుకుతున్నానంటూ అభినందించారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేలతో కలిసి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడే విడిగా జాతీయ మీడియాతోనూ సంభాషించారు. తమ ఎమ్మెల్యేల విజ్ఞతకూ, వారు తీసుకున్న నిర్ణయానికీ తనకు గర్వంగా ఉందన్నారు. ‘‘ఇది చరిత్రాత్మక ఘట్టం. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద సంఖ్యలో అధికార పక్షాన్ని ఎమ్మెల్యేలు ధిక్కరించి బయటకు రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. 

ఓ రకంగా చూస్తే కిరణ్ సర్కారు పాలించే హక్కును నైతికంగా కోల్పోయినట్టేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా దమ్మూ ధైర్యముంటే విప్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించి, 17 నియోజకవర్గాల్లోనూ ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు! ‘‘ఒకసారి 2, మరోసారి 4 స్థానాల చొప్పున ఇష్టానుసారంగా, దశలవారీగా కాకుండా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలి. దశలవారీగా ఎన్నికలతో, మంత్రులను ప్రయోగించి, ధనబలాన్ని ఉపయోగించే కుటిల నీతి ప్రదర్శించొద్దు’’ అని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారని ప్రశ్నించగా, ‘రెండు పార్టీలకూ.. అంటే టీడీపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవు’ అని జగన్ బదులిచ్చారు. తనవెంట ఎందరు ఎమ్మెల్యేలు వచ్చారన్నది ముఖ్యం కాదని, ఎంతమంది విలువలకు కట్టుబడి వ్యవహరించారనేదే ప్రధానమని ఒక ప్రశ్నకు బదులుగా వివరించారు.

బొత్స బెదిరించారు: సుచరిత

ఓవైపు నుంచి అధికార పక్షం ప్రలోభాలు, బెదిరింపులు; మరోవైపు నుంచి చంద్రబాబు చిత్తశుద్ధి లేని రాజకీయాలు, కుటిల నీతి... వీటన్నింటినీ తమ ఎమ్మెల్యేలు అధిగమించారని జగన్ వివరించారు. ‘‘పాయకరావుపేటలో అడుగు పెట్టనీయబోమంటూ గొల్ల బాబూరావును బెదిరించారు. మా సోదరి సుచరిత భర్తపై సీబీఐ విచారణ వేయిస్తామని బెదిరించారు. బాలరాజు నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా కూంబింగ్ తరహాలో పోలీసులను దింపుతామంటూ భయపెట్టారు. కానీ మా వారెవరూ కించిత్ బెదరలేదు. అందుకు గర్విస్తున్నా! మరికొందరు ఎమ్మెల్యేలనైతే, బయట కారు డిక్కీలో భారీగా నగదుంచాం.. మీరు ఊ అంటే బయటికెళ్లి అటునుంచి అటే తీసుకెళ్లవచ్చునంటూ మంత్రులే ప్రలోభ పెట్టి నీచ రాజకీయాలు చేశారు’ అని తెలిపారు. ఎవరెవరు భయపెట్టారో చెప్పాల్సిందిగా ఎమ్మెల్యేలను జగన్ కోరారు. 

తనను బొత్స బెదిరించారనీ సుచరిత వివరించారు. వసంత్‌కుమార్ తనను హెచ్చరించారని బాలరాజు స్పష్టం చేశారు. ఈ మొత్తం ఉదంతంలో చంద్రబాబు రాజకీయ నాయకుడినని చెప్పుకునే అర్హతను కూడా కోల్పోయారంటూ తూర్పారబట్టారు.

సంఖ్య కాదు.. విలువలే ముఖ్యం

రైతులు, రైతు కూలీలపై ప్రేమాభిమానాలతో చంద్రబాబు ఈ అవిశ్వాసం పెట్టలేదని జగన్ అన్నారు. అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై, కేవలం తమ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి ఈ ఎత్తు వేశాయనివ్యాఖ్యానించారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని, రాజకీయాలను ఎన్ని రకాలుగా దిగజార్చాలో అన్నీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అసలు చంద్రబాబు అవిశ్వాసాన్ని ఎందుకు పెట్టినట్టు? రైతుల కోసమేనా, లేక రెండున్నరేళ్ల కిందట మరణించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అదే పనిగా విమర్శించడానికా? అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్‌ను ఉద్దేశపూర్వకంగానే విమర్శించి మా ఎమ్మెల్యేలను బాబు రెచ్చగొట్టజూశారు. అసలు వారు ఓటింగే చేయకుండా వెళ్లిపోవాలని కుటిల నీతి ప్రదర్శించారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. తమ ఎమ్మెల్యేలు మాత్రం ఎలాంటి కవ్వింపు చర్యలకూ ప్రభావితం కాకుండా, సంయమనం పాటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని గుర్తు చేశారు.

‘‘ఎమ్మెల్యేల ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం పడిపోవడం,దాన్ని కాపాడటం వంటివేమీ జరగలేదు. కేవలం చిత్తశుద్ధితో, రాజకీయ విలువల కోసం మా ఎమ్మెల్యేలు ఓట్లేశారు. చంద్రబాబు ఇదే అవిశ్వాస తీర్మానాన్ని ఓ ఎనిమిది నెలల ముందు, కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కాకముందు పెడితే ప్రభుత్వం కూలిపోయేది. మధ్యంతర ఎన్నికలు వచ్చి ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ సర్దుకున్నాక అవిశ్వాసం పెట్టడంలో అంతర్యమేమిటో అందరికీ తెలుసు’’ అని జగన్ ఎద్దేవా చేశారు. ‘దేవుడన్నీ చూస్తున్నాడు.. ప్రజలూ అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికలకు పోదాం రండి! ప్రజల్లోకి వెళ్దాం. వారెవరిని ఆదరిస్తారో చూద్దాం’ అని అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ‘‘రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. చెరుకు, పత్తి, ధాన్యం.. ఏ పంట తీసుకున్నా ధరల్లేవు. క్వింటాలు ధాన్యానికి 680 రూపాయలకు మించి గిట్టడం లేదు. రైతు కూలీలకు వంద రూపాయలకు మించి కూలీ వచ్చే పరిస్థితి కూడా లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారంపై అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ చిత్తశుద్ధి లేదని, అవి దొందూ దొందేనని విమర్శించారు.

ఒక వర్గం మీడియా వివక్ష..

‘‘మీడియాలో ఒక వర్గం వివక్షతో వ్యవహరిస్తోంది. ఆ పత్రికల్లో గతంలో చంద్రబాబుకు కావాలనుకునే కోణాన్ని మాత్రమే ప్రచురించేవారు. సాక్షి ఆవిర్భవించాక రెండో కోణం కూడా ప్రజలకు తెలుస్తోంది’’ అని జగన్ గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు, ఎమ్మెల్యేలు సుచరిత, కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన కృష్ణదాస్, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, ఎం.ప్రసాదరాజు, చెన్నకేశవరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: