రైతు సమస్యలపై 23న ధర్నాలు,4న జిల్లా కేంద్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు సమస్యలపై 23న ధర్నాలు,4న జిల్లా కేంద్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు

రైతు సమస్యలపై 23న ధర్నాలు,4న జిల్లా కేంద్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు

Written By ysrcongress on Sunday, December 18, 2011 | 12/18/2011

* 4న జిల్లా కేంద్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు
* ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఫీజులపై ధర్నాలో పాల్గొననున్న జగన్
* సంక్షేమ, ఆరోగ్య పథకాలు నీరుగారడంపై ఆందోళన
* స్థానిక సంస్థలకు తక్షణం ఎన్నికలు జరపాలని డిమాండ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. ఈ నెల 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి నిర్ణయించింది. అలాగే జనవరి నాలుగో తేదీన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చుతున్నందుకు నిరసనగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం పార్టీ పాలకమండలి సమావేశం జరిగింది. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. భేటీ అనంతరం పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారం పట్ల, వ్యవసాయ రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అన్నదాతల బాధలను ఎలుగెత్తి చాటేందుకే ధర్నాలు చేపడుతున్నామని చెప్పారు. 

వ్యవసాయ రంగం సరిగాలేక రైతు కూలీల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిందనీ, వారికి కొన్ని ప్రాంతాల్లో రూ.50, వంద మాత్రమే కూలీ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నడూ లేనివిధంగా పంటలు పండించలేమని రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారనీ, దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సమావేశం ఆవేదన వ్యక్తం చేసినట్లు రాంబాబు వివరించారు. ‘ఓ వైపు పంటలు పండించలేని దుస్థితి, మరో వైపు కరెంటు కోతతో పంట నష్టం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఎరువులు, రసాయనాల ధరలు ఆకాశానికి అంటడం వంటి అంశాలన్నీ పాలకమండలి చర్చించింది’ అని ఆయన తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే
స్థానిక సంస్థలు అధికారుల పాలనలోకి వెళ్లి పోయాయనీ, ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడేకరువయ్యాడని అంబటి అన్నారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం చెబుతోందే గానీ, ఆ దిశగా సన్నాహాలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సమావేశం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ఎపుడొచ్చినా ఎదుర్కోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 

ఇదిలావుండగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద, బడుగువర్గాల ఆరోగ్యం కోసం చేపట్టిన 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు క్రమంగా నీరుగారుతుండటం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. డీజిల్ లేక 108, మందుల్లేక 104 పథకాలకు తూట్లు పడ్డాయని అంబటి పేర్కొన్నారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కిరణ్ సర్కారు 104లో పనిచేసే వేలాది మంది ఉద్యోగాలను తొలగించి వారిని రోడ్డున పడేసిందని విమర్శించారు.

రీయింబర్స్‌మెంట్ అధ్వానం
విప్లవాత్మకమైన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం ప్రస్తుతం అధ్వానంగా తయారైందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో గప్పాలు కొడుతున్నారని రాంబాబు ధ్వజమెత్తారు. ఈ పథకం కింద ఈ ఏడాది ఇంతవరకూ నిధులు విడుదల చేయలేదన్నారు. ఈ పథకంపై భరోసాతో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల్లో చేరారనీ, ఇప్పుడు నిధులు విడుదల కాకపోతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండటంపై పాలకమండలి ఆవేదన వ్యక్తం చేసినట్లు రాంబాబు చెప్పారు. 

ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పార్టీ ఆధ్వర్యంలో జనవరి 4న ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులో జరిగే ధర్నాలో పాల్గొనే జగన్.. 5 నుంచి గుంటూరులో మలివిడత ఓదార్పుయాత్రలో పాల్గొంటారని చెప్పారు. వైఎస్ చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తన పొరపాట్లు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో వీటి విషయమై కూడా పార్టీ పోరాట కార్యక్రమం రూపొందిస్తుందని తెలిపారు.

ఎమ్మెల్యేలకు అభినందనలు
కిరణ్ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని తాము భావిస్తున్నామనీ, వారి స్థానాల్లో వచ్చే ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా పార్టీ సర్వ సన్నద్ధంగా ఉందని రాంబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలను అభినందిస్తూ పాలకమండలి తీర్మానం చేసినట్టు తెలిపారు. 

ఈ సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ప్రసాదరాజు, బాలమణెమ్మ, బాజిరెడ్డి గోవర్థన్, రోజా, రెహ్మాన్, కేకే మహేందర్‌రెడ్డి, రవీంద్రనాయక్, మదన్‌లాల్ నాయక్, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, గంపా వెంకటరమణ, పెనుమత్స సాంబశివరాజు, గిరిరాజ నగేష్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ కోశాధికారి పి.ఆర్.కిరణ్‌కుమార్‌రెడ్డి, తోపుదుర్తి కవిత, జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: