మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా బాధ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా బాధ లేదు

మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా బాధ లేదు

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011



లొంగదీసుకోవడానికి అడ్డదారులు తొక్కిన కాంగ్రెస్
ఒక్కో ఎమ్మెల్యేకు నలుగురేసి మంత్రుల రాయబారాలు
తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు, ప్రలోభాలు.. లొంగని వారిపై బెదిరింపులు
కనీసం ఓటింగుకన్నా దూరంగా ఉండాలంటూ తుది వేడుకోళ్ళు
ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులపైనా ఒత్తిడి తెస్తూ కుటిలయత్నాలు!
అయినా ఎంతమాత్రమూ లొంగని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు
మాటకు నిలబడతామని, పదవులు తృణప్రాయమని స్పష్టీకరణ
మంత్రిగా బెర్తు ఖరారైందంటూ బాలరాజుకు ప్రలోభాలు
వైఎస్ ఆశయాల కోసం కట్టుబడతానన్న ఎమ్మెల్యే

హైదరాబాద్, న్యూస్‌లైన్:స్వతంత్ర భారతావనితో పాటు బహుశా ప్రపంచ చరిత్రలోనూ ఎన్నడూ కనీవినీ ఎరగని చరిత్రాత్మక ఘట్టం సోమవారం అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు నిరుపమాన రీతిలో నిరూపించారు. ‘మాట తప్పను, మడమ తిప్పను’ అన్న వైఎస్ ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచారు. నమ్మిన విలువల కోసం పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారు. తమ శాసనసభ్యత్వాలు పోతాయని.. ఇదంతా తమను లక్ష్యంగా చేసుకుని అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ కలసికట్టుగా పన్నిన కుట్ర అని తెలిసి కూడా.. అడుగు ముందుకే వేశారు. రైతులకు, రైతు కూలీలకు బాసటగా నిలుస్తామన్న మాటపైనే గట్టిగా నిలబడ్డారు. వారి కోసం... అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. తమను లొంగదీసుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలన్నిటినీ ఛేదించారు! అధికార పక్షం బెదిరింపులను, బేరసారాలను, టీడీపీ దన్నుతో తెర వెనుక అమలవుతూ వచ్చిన లెక్కలేనన్ని కుట్రలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. వైఎస్‌ను పదేపదే విమర్శించడం ద్వారా తమను రెచ్చగొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆద్యంతం సంయమనంతోనే వ్యవహరించారు. వాటి మూకుమ్మడి ఎత్తులను, జిత్తులను చెల్లాచెదురు చేశారు. నయానో, కుదరని పక్షంలో భయానో తమను ‘దారిలోకి’ తెచ్చుకోవడానికి కొద్ది రోజులుగా జరిగిన ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేశారు. ‘‘జగనే మా నాయకుడు. ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం. ఎన్ని కష్టాలొచ్చినా జగన్ వెంటే నడుస్తాం’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘జగన్ వెంట ఐదారుగురు ఎమ్మెల్యేలు తప్ప ఇంకెవరూ ఉండరు. మిగతా వారంతా ప్రభుత్వానికి అండగానే ఉన్నారు’ అంటూ నిన్నటిదాకా కాంగ్రెస్ అధిష్టాన పెద్దల వద్ద గొప్పలు పోయిన సీఎం కిరణ్‌కు ఈ పరిణామాలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వారికి ఏమని వివరణ ఇచ్చుకోవాలా అని ఇప్పటినుంచే ఆయన మథనపడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలేచెప్పుకుంటున్నాయి!

అసెంబ్లీ సాక్షిగా ఆద్యంతమూ ఒత్తిళ్లు

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ నుంచి విపరీతమైన ఒత్తిళ్లు! అయినా వాటన్నిటినీ వారు బేఖాతరన్నారు! ‘మీరేం చేసుకున్నా మాకు పర్వాలేదు. ఎమ్మెల్యే పదవులు కూడా మాకవసరం లేదు. రైతులను, రైతు కూలీలను విస్మరించి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిన ఈ ప్రభుత్వానికి సహకరించేది మాత్రం లేదు’ అంటూ కరాఖండిగా చెప్పేశారు. ‘రైతుల కోసం, రైతు కూలీల కోసం మాట తప్పం... మడమ తిప్పం...’ అంటూ సమష్టిగా నినదించారు. ఒకే మాట, ఒకే బాటగా కదిలారు. నిజానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందు నుంచే వారిని తమవైపు తిప్పుకొనేందుకు అధికార పెద్దలు, వారి విపక్ష మిత్రులూ విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. సమావేశాలు మొదలయ్యాక వాటిని మరింత ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా ఎమ్మెల్యేలను మానసికంగా కూడా వే ధించేలా అనేకానేక ఎత్తుగడలకు దిగారు! ఎలాంటి ఒత్తిళ్లకూ తాము లొంగబోమని పదేపదే చెబుతున్నా, ఒక్కో ఎమ్మెల్యే చుట్టూ ఏకంగా ఆరేడుగురు మంత్రులు మోహరించారు. ఎలాగోలా వారిని లొంగదీసుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. బలవంతంగా సీఎం చాంబర్‌కు లాక్కొని వెళ్లి, ఆయనతో మాట్లాడించజూశారు. అయినా వారి ప్రయత్నాలేవీ నెరవేరలేదు. రైతులు, రైతు కూలీల కోసమంటూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన టీడీపీ, తీరా సభలో అసలు సమస్యను పక్కన పెట్టింది! తీర్మానానికి మద్దతు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి మాట్లాడింది! తద్వారా, కాంగ్రెస్‌కు సహకరించాల్సిందిగా ఎమ్మెల్యేలపై పరోక్షంగా ఒత్తిళ్లు తెచ్చినా, వారు సహనం కోల్పోలేదు.

ఈ ఎమ్మెల్యేలంతా కొంతకాలంగా ఒక్కతాటిపై నడుస్తున్న తీరును గమనించిన కాంగ్రెస్ నేతలు ఆదివారం చివరి అస్త్రంగా బెదిరింపులకు కూడా దిగారు! పలురకాలుగా బెదిరింపులకు దిగారు! సోమవారం వారికి మరింతమంది తోడై ప్రయత్నాలకు మరింత పదును పెట్టారు. ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ , కావూరి సాంబశివరావు తదితరులు కూడా ఎమ్మెల్యేలను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నించారు. సర్కారుకు వ్యతిరేకంగా ఓటేసే వారి సంఖ్యను తగ్గించేందుకు అన్నిరకాలా యత్నించారు. ఎమ్మెల్యేలను ‘దారిలోకి’ తెచ్చుకునేందుకు వారి కుటుంబ సభ్యులపైనా ఒత్తిడికి యత్నించారు. ఎమ్మెల్యేలు ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో, సంబంధిత జిల్లా మంత్రులే నేరుగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు! మంగళవారం ఉదయాన్నే అసెంబ్లీకి చేరుకొని, మంత్రి వట్టి వసంతకుమార్ చాంబర్‌కు ఆయా ఎమ్మెల్యేలను బలవంతంగా రప్పించి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వట్టి, డీఎల్ రవీంద్రారెడ్డి తదితర మంత్రులంతా అక్కడికి వచ్చారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసేందుకు ఒప్పుకోవాలంటూ వారందరినీ తీవ్రంగా ఒత్తిడి చేశారు. మరోపక్క అసెంబ్లీ లోపల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి, వారిని బయటకు రప్పించారు. ఇన్నర్ లాబీల్లో వారి చుట్టూ మూగి, ‘అవిశ్వాసానికి మద్దతిచ్చి పదవులెందుకు పోగొట్టుకుంటారు? మీకు కావలసినవన్నీ సమకూరుస్తాం. తొందరపడొద్దు’ అంటూ చివరి ప్రయత్నాలుగా ఒత్తిడి పెంచారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ కూడా అక్కడికి చేరుకొని ఒక్కో ఎమ్మెల్యేతో చర్చించారు. ఎమ్మెల్యేలు బాలరాజు, ప్రసాదరాజులను ఒప్పించేందుకు ఎమ్మెల్యేలు రాజేశ్, జోగి రమేశ్‌లతో పాటు మరికొందరు నేతలు కూడా ఎంతగానో ప్రయత్నించారు.

ఓటింగ్‌కు దూరంగా ఉండండి

సామ దాన దండోపాయాలను ప్రయోగించినా ఎమ్మెల్యేలు లొంగకపోవడంతో అధికార పెద్దలు మరో రూట్లో వచ్చారు. ‘మీరు జగన్‌కు మద్దతుగా ఉన్నా బాధ లేదు. కనీసం ఓటింగ్‌కన్నా దూరంగా ఉండండి’ అని ప్రతిపాదించారు! ‘లేదంటే మేం అధిష్టానం పెద్దల వద్ద తలెత్తుకు తిరగలేం. మీకూ ఎన్నికల్లోకి వెళ్లే బాధ తప్పుతుంది’ అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు కూడా దిగారు! ఎమ్మెల్యేల్లో కొందరికి భారీగా డబ్బును ఎర చూపినట్టు కూడా తెలుస్తోంది. కాంట్రాక్టుల గురించీ ప్రస్తావించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, టి.బాలరాజు, ప్రసాదరాజు, గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, వై.బాలనాగిరెడ్డిలపై అన్నివైపుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ‘‘వైఎస్ బతికుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయనెప్పటికీ కాంగ్రెస్ వ్యక్తిగానే ఉండేవారు. జగన్ పిల్లాడు. ఆవేశంతో తొందరపడ్డాడు. మీలాంటి వాళ్లు ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకు రావాల్సింది పోయి ఆయన వెంట ఉండటం సరికాదు’’ అంటూ అనునయించజూశారు. ‘‘మీకు ఇబ్బందులు తప్పవు. ఆలోచించండి’’ అంటూ మెత్తగా బెదిరింపులకు దిగారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఓటేయకండి. మేం చెప్పినట్టు చేస్తే మీకెలాంటి సమస్యలూ రానివ్వం. మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాం’’ అని హామీలిచ్చారు. నియోజకవర్గ నేతలతో, బంధువులతో కూడా వారికి ఫోన్లు చేయించి, మనసు మార్చే ప్రయత్నం చేశారు.

బాబు, కాంగ్రెస్ కుమ్మక్కు

మంత్రుల తీరుపై వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమపై అన్యాయంగా ఒత్తిడి పెంచుతున్నారని, ఇంత దారుణమైన పరిస్థితి తామెన్నడూ చూడలేదని ఆవేదన చెందారు. రెండు రోజులుగా తమను అనుక్షణం వెన్నాడుతూ, మానసికంగా వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. ‘‘వైఎస్ కార్యక్రమాలన్నిటినీ ప్రభుత్వం తుం గలో తొక్కుతోంది. పైగా ఒక్కో పథకాన్ని రద్దు చేస్తోంది. తద్వారా వైఎస్‌ను ప్రజల హృదయాల్లోంచి దూరం చేయజూస్తోంది. రైతులు, కరువు అంటూ చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టినా.. సభలో వాటిని వదిలి, వైఎస్‌పై నిరాటంకంగా విమర్శలు గుప్పించడానికే పరిమితమయ్యారు. అందుకాయనకు నిరాటంకంగా మైకు అందటం వెనక అధికార పార్టీ హస్తముంది’’ అని ఆరోపించారు. వైఎస్‌ను బాబు విమర్శిస్తుంటే కొందరు మంత్రులు ఏదో ఖండించినట్టు నటించి కూర్చోవడం వెనక కుట్ర దాగుందన్నారు. బాబు అడ్డగోలు విమర్శలను నిరసిస్తూ, వాటిని ఖండించేందుకు వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు లేచినా వారికి అవకాశం లేకుండా పోయింది. దాన్నే సాకుగా చూపుతూ మంత్రులు వారిపై ఎదు రుదాడికి దిగడం టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కుకు పరాకాష్టగా నిలిచింది. ఎందుకంటే, సభలో బాబు ప్రసంగం కాగానే బొత్స హడావుడిగా బయటున్న విలేకరుల వద్దకొచ్చి ఆ విషయాన్ని ఆవేశంగా చెప్పారు. ‘‘వైఎస్‌పై విమర్శలను మేం అడ్డుకుంటుంటే, వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోలేదు. దీన్ని ఆన్ రికార్డుగా తీసుకోండి’’ అని చెప్పడమే కాకుండా విలేకరులను మళ్లీ తన చాంబర్లోకి పిలిచి కూడా అదే విషయం చెప్పారు. అసెంబ్లీలో ఇలా యాక్షన్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని కృష్ణదాస్ స్పందించారు. వైఎస్‌పై ప్రేమ ఉందంటే రైతు సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలన్నారు.

మంత్రుల మైండ్‌గేమ్

ముందస్తు వ్యూహం ప్రకారమే టీడీపీ నేతలు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా వైఎస్‌పై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రులు దాన్ని సాకుగా చూపుతూ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేపై మానసిక ఒత్తిళ్లు మొదలుపెట్టారు. ‘టీడీపీ వాళ్లు వైఎస్‌ను అంతగా తిడుతుంటే అవిశ్వాసానికి మద్దతెలా ఇస్తారు?’ అంటూ మైండ్‌గేమ్‌కు తెర తీశారు. కొందరు మంత్రులైతే అర్ధరాత్రి సమయంలో కూడా ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపారని సమాచారం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం, ‘‘రైతుల కోసం, ఒక సూత్రబద్ధ నిర్ణయం మేరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామే తప్ప, ప్రభుత్వాన్ని పడగొట్టడం మా అభిమతం కాదు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అసలు అంశాన్ని బాబు పక్కన పెట్టినా.. రైతుల కోసం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అవిశ్వాసానికి మద్దతిస్తామని మేం చెప్పాం. దానికే కట్టుబడి ఉంటాం’’ అని స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినా, ఇలాంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదంటూ ఓ ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేశారు. ‘‘తీర్మానానికి అనుకూలంగా లేని ఎమ్మెల్యేలను ఇంతగా వెంటాడి వేధించడమా! నేరుగా మంత్రులు మమ్మల్ని పదేపదే వెంటాడారు. కాకుల్లా, గద్దల్లా పొడుచుకు తిన్నారు’’ అని చెప్పారు.

గైర్హాజరన్నా కావాలంటూ వేడుకోలు..


వైఎస్ ఆశయాలే తన కర్తవ్యమని, రైతులు, రైతు కూలీల ప్రయోజనాల పరిరక్షణలో ముందుంటానని చెబుతూ వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, మరో సభ్యుడు ప్రసాదరాజులను తమవైపు తిప్పుకునేందుకు చిట్టచివరి వరకు ప్రయత్నాలు సాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ సభ్యులతో కలసి అసెంబ్లీ సెంట్రల్ హాలులో కాసేపు సమావేశమయ్యారు. అక్కడినుంచి విజయమ్మ సభలోకి వెళ్లిపోతున్న తరుణంలో జోగి రమేశ్, రాజేశ్ అక్కడికొచ్చి వారిద్దరితో మళ్లీ మాట్లాడారు. ‘మంత్రివర్గంలో నీకు బెర్తు ఖరారైంది, చాన్సు వదులుకోవద్దు. ఇదే మంచి అవకాశం. వెనక్కు వచ్చెయ్’ అంటూ బాలరాజుపై ఒత్తిడి తెచ్చారు. రైతుల కోసం ఎమ్మెల్యే పదవినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నానని బాలరాజు వారికి గుర్తు చేశారు. మంత్రి పదవిచ్చినా వైఎస్ ఆశయాలను వదులుకోనంటూ నిష్కర్షగా చెప్పారు. వారం రోజులుగా తమనింతలా వేధించడం సరికాదన్నారు. ఇదేం పద్ధతంటూ నిలదీశారు. బాలరాజు, ధర్మాన కృష్ణదాస్ అయితే, అమాత్యుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఒక దశలో కంటనీరు పెట్టినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలైతే, ‘‘మీరెంత చెప్పినా మేం మాత్రం జగన్ వెంటే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయాం. మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా బాధ లేదు. కానీ మాట తప్పి జీవితంలో మాత్రం మచ్చ తెచ్చుకోలేం. కష్టమైనా, నష్టమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని కుండబద్దలు కొట్టారు.

ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా వారు లొంగకపోవడంతో.. మధ్యేమార్గంగా ఓటింగ్‌కు గైర్హాజరన్నా కావాలంటూ అమాత్యులు కాళ్లబేరానికి వచ్చారు. ‘‘ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయకపోయినా బాధలేదు. ఓటింగ్‌కు గైర్హాజరైతే చాలు. మీకూ మాకూ ఇబ్బంది ఉండదు. లేకుంటే మేం తలెత్తుకోలేం. మీరు కూడా ఎమ్మెల్యేలుగా అనర్హులవుతారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వం పెట్టే భారీ ఖర్చును తట్టుకుని నిలబడలేరు. మీ రాజకీయ జీవితమే శూన్యమవుతుంది. ఓటింగ్‌కు దూరం గా ఉండి ఉభయతారకంగా ఇద్దరి పరువు నిలబెట్టుకుం దాం’’ అని ప్రతిపాదించినట్టు తెలిసింది. వారెంత బతిమాలినా, ప్రాధేయపడినా, ప్రలోభపెట్టినా, కాళ్లబేరానికొచ్చినా వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు మాత్రం లొంగలేదు. ‘‘మాట తప్పం. జగనే మా నాయకుడు. ఎన్ని కష్టాలొచ్చినా ఆయన వెంటే నడుస్తాం’’ అని కుండబద్దలు కొట్టారు.
Share this article :

0 comments: