బాబు అక్రమాస్తుల కేసులో మరో మలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు అక్రమాస్తుల కేసులో మరో మలుపు

బాబు అక్రమాస్తుల కేసులో మరో మలుపు

Written By ysrcongress on Saturday, December 10, 2011 | 12/10/2011

మరో ధర్మాసనానికి అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తికి నివేదన
జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగింత, సోమవారం విచారణ
‘నాట్ బిఫోర్’పై విజయమ్మ తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ అభ్యంతరం
ఆ విధానం రాజ్యాంగ విరుద్ధం, ఏ అధికరణ కింద అమలు చేస్తున్నారు?
దానివల్లే కేసు మీ ముందుకొచ్చింది, అందుకే మీ ముందు వాదించను
సీబీఐ విచారణకు ఉత్తర్వులిచ్చిన ధర్మాసనమే కేసును విచారించాలి
జస్టిస్ ఈశ్వరయ్య ధర్మాసనానికి సుశీల్‌కుమార్ స్పష్టీకరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ బాబు, ఆయన బినామీలు వేర్వేరుగా దాఖలు చేసుకున్న అనుబంధ పిటిషన్లను విచారించేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కూడా నిరాకరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.లోకూర్‌కు విజ్ఞప్తి చేసింది. దాంతో న్యాయమూర్తులు జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనానికి ఈ కేసు విచారణ బాధ్యతలను సీజే అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం గం. 2.15కు విచారణ జరగనుంది. బాబు కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రిలయన్స్‌లో తనకు వాటాలున్నాయని సీజే పేర్కొనడం, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నుంచి వైదొలగడం, జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి కేసును అప్పగించడం తెలిసిందే. దాంతో బాబు అక్రమాస్తుల కేసు శుక్రవారం ఉదయం జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ కె.ఎస్.అప్పారావులతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. విజయమ్మ పిటిషన్ దాఖలు నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ ధర్మాసనం ముందుంచారు. ‘‘నిజానికి ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన (జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన) ధర్మాసనమే వాటి రద్దు పిటిషన్‌ను పరిశీలించాలే తప్ప, మరో ధర్మాసనం కాదు. పైగా సీబీఐ విచారణ ఉత్తర్వులపై రామోజీరావు, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా కోర్టు వారికి స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు ఉత్తర్వులిచ్చిన ధర్మాసనం ముందుకు వెళ్లి తేల్చుకోవాలని చెప్పిందే తప్ప, మరో ధర్మాసనం వద్దకు వెళ్లమనలేదు’’ అని చెప్పారు. జస్టిస్ ఈశ్వరయ్య, సుశీల్‌కుమార్‌ల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన సంభాషణలు ఇలా ఉన్నాయి...

జస్టిస్ ఈశ్వరయ్య: ఈ రోజు ఓ పత్రికలో (సాక్షి) వార్తా కథనం ప్రచురితమైంది. నేను దాన్ని చదివాను. మీరు దానిని చదివారా? మీ వాదనలు ఆ కథనానికి కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. ఈ కేసును మా ధర్మాసనానికి ఎందుకు నివేదించారన్న విషయం మీకు తెలుసా?

(టీడీపీతో జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబానికున్న ప్రత్యక్ష సంబంధాలను గురువారం నాటి ఆ కథనంలో సాక్షి ప్రచురించింది. ఆయన భార్య శ్యామలాదేవి గతంలో టీడీపీ జడ్పీటీసీగా, మహిళా అధ్యక్షురాలిగా చేయడాన్ని, ఆయన కుటుంబ సభ్యులు పలువురు ఇప్పటీకీ నల్లగొండ జిల్లాలో పార్టీలో క్రియాశీలంగా ఉండటాన్ని ప్రస్తావించింది).

సుశీల్‌కుమార్: ఆ వార్తా కథనాన్ని నేను చదవలేదు. దాని గురించి ఇప్పుడే ఎవరో చెబితే విన్నాను. వాస్తవానికి నాకు తెలుగు రాదు. నేను ఆంగ్ల పత్రికలు మాత్రమే చదువుతాను. ఈ కేసు ఈ ధర్మాసనం ముందు విచారణకు రాబోతోందని రెండు ఆంగ్ల పత్రికలు చదివాకే తెలిసింది. కేసును మరో ధర్మాసనానికి నివేదిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న (గురువారం) చెప్పారు. అందుకు గల కారణాలకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు.

జస్టిస్ ఈశ్వరయ్య: ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల వల్ల ఈ కేసు మా ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసుతో సంబంధమున్న న్యాయవాదులు పలు ధర్మాసనాల్లోని న్యాయమూర్తుల ముందు నాట్ బిఫోర్‌గా ఉండటంతో మా ధర్మాసనానికి నివేదిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సుశీల్‌కుమార్: ఒక న్యాయమూర్తి ముందు నాట్ బిఫోర్ అన్న కారణంతో సదరు న్యాయవాది కేసును విచారించబోమనడం రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు. నా ఉద్దేశం ప్రకారం అది రాజ్యాంగ విరుద్దం. అసలు రాజ్యంగంలోని ఏ అధికరణ కింద ఈ నాట్‌బిఫోర్ విధానం అమలవుతోంది? ఈ విధానానికి చట్టపరంగా ఎలాంటి విలువా లేదు.

జస్టిస్ ఈశ్వరయ్య: మీరు ప్రధాన న్యాయమూర్తిని నిందిస్తున్నారా? ఏ కేసును ఎక్కడ వేయాలన్న విషయంలో ఆయనదే అంతిమ నిర్ణయమని మీకు తెలుసు కదా!

సుశీల్‌కుమార్: ప్రధాన న్యాయమూర్తిని నేను నిందించడం లేదు. అలా ఎన్నటికీ చేయను. ఏ కేసును ఎక్కడ వేయాలన్న అంతిమ నిర్ణయం ఆయనదేనని నాకు తెలుసు. కానీ నాట్ బిఫోర్ విధానం ఆధారంగా కేసులను ధర్మాసనాలకు నివేదించరాదు. అలా చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. ఈ విషయాన్ని ఎన్నిసార్లైనా చెప్పగలను.

జస్టిస్ ఈశ్వరయ్య: సీజే ఈ కేసును పాలనపరమైన ఉత్తర్వుల ద్వారా పారదర్శకంగా మా ముందుంచారు.

సుశీల్‌కుమార్: ఈ కేసును విచారిస్తామని మీరంటే అందుకు మాకు అభ్యంతరం లేదు. మా వాదనలు వినిపించే ముందు నాట్ బిఫోర్ విధానాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం. పిటిషనర్ రూ.2 వేలు డిపాజిట్ చేస్తే తప్ప కేసును విచారించరాదని 1963కు ముందు సుప్రీంకోర్టులో ఓ నిబంధన ఉండేది. దాన్ని సవాలు చేయగా, ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టే దాన్ని కొట్టివేసింది. ఈ ధర్మాసనం ఇప్పటికీ నాట్ బిఫోర్ విధానాన్ని సమర్థించుకుంటే, నేను మీ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించను.

జస్టిస్ ఈశ్వరయ్య: మీరు నన్ను భయపెడుతున్నారు?

సుశీల్‌కుమార్: లేదు, లేదు. నేను భయపడుతున్నాను. నా కేసు గురించి, నా హక్కుల గురించి మీకు వివరిస్తున్నాను. ఈ కేసును మీ ముందు వాదించబోనని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. రాజ్యాంగ నిబద్ధత గురించే నేను ఆందోళన చెందుతున్నాను. నాట్ బిఫోర్ విధానం రాజ్యాంగ విరుద్ధం. అంతర్గత సౌలభ్యం కోసమే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీబీఐ విచారణ ఉత్తర్వులను బాబు తదితరులు సవాలు చేస్తున్నారు. మొదట ఈ కేసును విచారించి ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనమే తన ఉత్తర్వుల్లోని తప్పొప్పులను నిర్ణయించగలదు. అలాంటప్పుడు ఆ ధర్మాసనమే విచారించాలి. అంతేకానీ రోస్టర్ ద్వారా కాదు. రెండు రోజుల క్రితం 2జీ స్పెక్ట్రం కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వచ్చింది. వెంటనే ఆయన ఆ కేసును అంతకు ముందు విచారించిన ధర్మాసనానికే నివేదించాలని రిజస్ట్రీని ఆదేశించారు. మరోసారి చెబుతున్నాను.. నాట్ బిఫోర్ విధానం రాజ్యాంగ విరుద్ధం. ఒకసారి వాదనలు విని ఉత్తర్వులు జారీ చేసిన తరువాత, మరోసారి మరో ధర్మాసనం ముందు కారణం లేకుండా వాదనలు వినిపించడం ఎంతమాత్రం సరికాదు. కావాలంటే రిట్ నిబంధనలు చూసుకోండి.

దీంతో జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు 10 నిమిషాల పాటు ఉత్తర్వులు వెలువరించింది. కేసును తామెందుకు విచారించడం లేదో వాటిలో వివరించింది. కేసును మరో ధర్మాసనానికి నివేదించాలని సీజేను కోరుతున్నట్టు అనంతరం ఇరుపక్షాల న్యాయవాదులకు తెలిపింది. తరవాత కేసు ఫైళన్నింటినీ రిజిస్ట్రీ వర్గాలు సీజే ముందుంచాయి. విచారణ బాధ్యతలను జస్టిస్ రోహిణి ధర్మాసనానికి ఆయన అప్పగించారు.
Share this article :

0 comments: