ఆర్నెల్ల కిందటే పెట్టి ఉంటే జల్ తుపానులో కొట్టుకుపోయేది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్నెల్ల కిందటే పెట్టి ఉంటే జల్ తుపానులో కొట్టుకుపోయేది..

ఆర్నెల్ల కిందటే పెట్టి ఉంటే జల్ తుపానులో కొట్టుకుపోయేది..

Written By ysrcongress on Monday, December 12, 2011 | 12/12/2011

*ఈ ఉపఎన్నికల ద్వారా రైతన్న కన్నీళ్లను ఢిల్లీ పెద్దలకు చూపుతాం
*నాకు రాజకీయాలు చేయడం రాదు.. చేతనైనంతలో సాయపడటమే తెలుసు
*విలువలు, విశ్వసనీయత వైపు నిలవాలని మా ఎమ్మెల్యేలను కోరా
*వాటికే పట్టం కట్టినందుకు వారికి సెల్యూట్ చేస్తున్నా
*రైతులపై చంద్రబాబువి మొసలి కన్నీళ్లు
*అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టి వైఎస్ గురించి మాట్లాడారు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాకు రాజకీయాలు చేయడం తెలియదు.. నాది కల్మషం లేని మనసు.. చేతనైనంతలో సాయపడటమే తెలుసు. ఇవాళ రైతన్న పరిస్థితి, రైతు కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు, పేదల కోసమే ఉప ఎన్నికలకు సిద్ధమై ప్రజల్లోకి వెళ్తాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఈ ఉపఎన్నికల ద్వారా నా రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను, ప్రతి పేదవాడు పెడుతున్న కన్నీళ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలకు చూపిస్తామని చెప్పారు. ఆదివారం గుంటూరు జిల్లాలో 39వ రోజు ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ పత్తిపాడు నియోజకవర్గం పెదకాకాని మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 14 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఒక్క నంబూరు గ్రామంలోనే ఐదు వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో జగన్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే...

విలువల కోసం నిలబడాలని చెప్పా..
చంద్రబాబునాయుడుగారు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా.. నేను ఇక్కడ్నుంచి (గుంటూరు) హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడే చెప్పి పోయా. అవిశ్వాస తీర్మానం జరుగుతోంది.. నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు తెలిపితే డిస్‌క్వాలిఫై అవుతారు.. డిస్‌క్వాలిఫై అయితే ఉప ఎన్నికలు జరగుతాయని! ఇది కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కై జగన్ వర్గం ఎమ్మెల్యేలను సింగిల్ డిజిట్‌కే కట్టడి చేయాలనే కుళ్లు, కుతంత్రంతో పెట్టిన అవిశ్వాసం అని తెలుసు. అన్నీ తెలిసి కూడా నాకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లా. వాళ్లను పిలిపించుకొని మాట్లాడా. వాళ్లకు ఒక్క విషయం చెప్పా. 

మనం ప్రజల్లో ఉన్నాం.. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు.. విలువల్లేని.. విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థలో మనం విశ్వసనీయత నింపాలి.. విలువల కోసం నిలబడాలి అని. ఈరోజు రైతన్న పరిస్థితి దారుణంగా ఉంది.. రైతు కూలీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీళ్ల కోసం మనం తోడుగా నిలబలేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ ఉండటమే దండగ అని చెప్పా. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు పోదాం అన్నా. రైతుల కోసం ఎన్నికలకు పోదామని చెప్పా. నేను చెప్పిన ప్రతి మాటను కూడా ఎమ్మెల్యేలు గౌరవించారు. పదవులు పోతాయని తెలిసి, ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిసి కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో గౌరవాన్ని సంపాదించే విధంగా అవిశ్వాసానికి ఓటు వేశారు. వాళ్లకు సెల్యూట్ చేస్తున్నా.

ఆర్నెల్ల కిందటే పెట్టి ఉంటే జల్ తుపానులో కొట్టుకుపోయేది..
ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబునాయుడు అసెంబ్లీని వేదిక చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఆవేళ నాకు బాగా గుర్తుంది. లైలా తుపాను వచ్చింది.. జల్ తుపాను వచ్చింది. రైతుల బతుకులు అతలాకుతలంగా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు సుప్రీంకోర్టు దాకా వె ళ్లి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అయితే వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజు అందక ఆత్మహత్య కూడా చేసుకుంది. ఆరునెలల కిందటి పరిస్థితికి ఇవాళ్టి రోజులకు పెద్దగా తేడా లేదు. ఇదే చంద్రబాబు ఆరు నెలల కిందట చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకముందే అవిశ్వాస తీర్మానం పెట్టి ఉంటే ఈ చేతగాని ప్రభుత్వం కూడా జల్ తుపానులో కొట్టుకొనిపోయి ఉండేది.

వాళ్ల కష్టాలు వింటే గుండె పగిలినంత బాధనిపించింది..
నేను ఇక్కడకు వస్తున్నపుడు వరి కోస్తున్న అక్కాచెల్లెమ్మలు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిలో కొందరు అవ్వలు కూడా ఉన్నారు. మీరు కూడా పని చేస్తున్నారా అవ్వా? అని అడిగితే.. ఆకలి తీరాలి కదా నాన అని అన్నప్పుడు నాకు గుండె పగిలినంత బాధనిపించింది. ఎకరం పొలంలో వరి కోస్తే కేవలం రూ.1,000, మరికొన్ని చోట్ల రూ.1,200 ఇస్తున్నారని వారు చెప్పారు. కూలి గిట్టాలని పది మంది పని చేయాల్సిన చోట ఐదు మందిమే పని చేస్తున్నామని ఆ అక్కాచెల్లెమ్మలు చెప్పినపుడు బాధనిపించింది. రైతులకు కూడా అంతకన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితులు లేవని అక్కాచెల్లెళ్లు చెప్పిప్పుడు ఇంకా బాధనిపించింది. 

ఇవాళ చంద్రబాబు మొసలి కన్నీళ్లు కారుస్తూ రైతులకు తాను తోడున్నానని అబద్ధాలు చెప్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్న తర్వాతే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టారు. జగన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలను సింగిల్ డిజిట్‌కు కట్టడి చేయాలనే అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు రైతుల గురించి, కూలీల కష్టాల గురించి మాట్లాడాల్సిందిపోయి.. చనిపోయి రెండున్నరేళ్లు అయిన దివంగత నేత వైఎస్సార్ గురించి మాట్లాడారు.
Share this article :

0 comments: