షెడ్లలో లక్ష కోట్ల వ్యాపారం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షెడ్లలో లక్ష కోట్ల వ్యాపారం?

షెడ్లలో లక్ష కోట్ల వ్యాపారం?

Written By ysrcongress on Saturday, December 17, 2011 | 12/17/2011

100 డాలర్ల ఈక్విటీ సంస్థకు 3 కోట్ల డాలర్ల రుణం ఇచ్చారట! 
మారిషస్ మార్గంలో నల్లధనం తీసుకొస్తున్న సుజనా గ్రూపు సంస్థలు 
విదేశీ సబ్సిడరీల నుంచి మాతృ సంస్థలకు రూ. 850 కోట్లు బదిలీ 
ఆ సంస్థల టర్నోవర్, విదేశీ బ్యాంకులు, రుణమూ అన్నీ బూటకమే! 
రుణం పేరుతో నల్లడబ్బు తెచ్చి తెల్లడబ్బుగా చలామణి చేస్తున్న వైనం
బినామీ బంధం: సుజనా సంస్థ కోసం చంద్రబాబు హెరిటేజ్ భూమి తాకట్టు..
చౌదరి ‘సేవలకు’ ప్రతిఫలంగా రాజ్యసభ సీటు.. దీని భావమేమి?

నిర్జీవ పదార్థం నుంచి జీవం పుట్టిందని సైన్స్ చెప్తుంది! కానీ.. ఆయన శూన్యం నుంచి వేల కోట్ల రూపాయల సొమ్ములు సృష్టించారు. శూన్యం నుంచే లక్ష కోట్ల రూపాయల రుణాలు పుట్టించారు. అదే శూన్యం నుంచి లక్ష కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు. ఆ శూన్య సామ్రాజ్యాన్ని విదేశాలకూ విస్తరించారు. అలా.. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశంలోకి తెల్లధనంగా ప్రవహింప చేసుకోవటానికి రాజమార్గం వేసుకున్నారు. ఆ మార్గంలో వందలు, వేల కోట్ల రూపాయలు రప్పిస్తున్నారు కూడా! ఇంత మేజిక్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరైనా కొమ్ములు తిరిగిన మెజీషియనా అంటే.. కాదు. కేవలం కాగితాలపై రాతలతో ఇంత గిమ్మిక్కు చేస్తున్న సదరు మహా మాయావి మరెవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా.. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుకు బినామీగా జనమెరిగిన సుజనాచౌదరి! చంద్రబాబుకు చేస్తున్న ‘సాయానికి’ ప్రతిఫలంగా టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్న సుజనా చౌదరి.. అన్ని రకాల చట్టాలనూ తుంగలో తొక్కుతూ.. సెబీని, స్టాక్ ఎక్స్ఛేంజీలను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను ఏమారుస్తూ.. ఏళ్ల తరబడి నిరాఘాటంగా సాగిస్తున్న ఘరానా మోసమిది.

సుజనా గ్రూపు మాయాజాలంపై చాలా కాలం కిందటే అనేక దర్యాప్తు సంస్థల కన్నుపడింది. పలు సంస్థల నుంచి నోటీసులు, సమన్లు అందుకున్న చరిత్ర కూడా సుజనా వారికి ఉంది. అలా అందిన వాణిజ్య పన్నుల శాఖ నోటీసులకు గతంలో సమాధానం ఇస్తూ.. తాము చేసే వ్యాపారమంతా ఉత్తుత్తి వ్యాపారమేనని, కేవలం కాగితాలపై ఘనంగా చూపించుకోవటానికి రాసుకున్న బూటకపు పద్దులు మాత్రమేనని సుజనా గ్రూపు సంస్థలు స్వయంగా వెల్లడించాయి. కానీ.. ఏ దర్యాప్తు సంస్థ చర్యలూ కాగితాల పరిధి దాటలేదు. 

డి. శివరామిరెడ్డి, బిజినెస్ బ్యూరో: 

సత్యం కంప్యూటర్స్ మంచి వ్యాపారమే చేస్తుండగా.. దానిని మరింత పెద్దదిగా చూపేందుకు ఆ సంస్థ అధినేత రామలింగరాజు కాగితాల్లో టర్నోవర్ పెంచి చూపించారు. ఆ నేరానికి ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలులో ఉన్నారు. ఇంకా ఆ కేసు కొనసాగుతోంది. కానీ.. సుజనాచౌదరి అసలు ఏ వ్యాపారమూ లేకుండానే.. పదుల సంఖ్యలో బోగస్ సంస్థలు సృష్టించి, ఆ సంస్థల మధ్యే లక్ష కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు టర్నోవర్ చూపించారు. విదేశాల్లో తమ సబ్సిడరీ సంస్థలకు కూడా ఇలాంటి బూటకపు టర్నోవర్ చూపి.. అక్కడి బ్యాంకులు తమకు రుణాలు ఇచ్చాయంటూ కోట్లాది రూపాయల నల్లధనాన్ని దర్జాగా తెల్లధనంగా దేశంలోకి తెస్తున్నారు. ‘సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన సుజనా మాయాజాలం వివరాలివీ... 

రూ. 5 వేల సంస్థలకు.. రూ. 850 కోట్ల రుణాలట! 

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనా టవర్స్, సుజనా మెటల్స్.. అనే సంస్థలు సుజనాచౌదరిగా తెలిసిన వై.సత్యనారాయణచౌదరివి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన ఈ సంస్థలు ప్రధానంగా చేసే వ్యాపారం.. ఇనుము కొని అమ్మటం. అది కూడా రాష్ట్రంలోను, తమిళనాడులోనూ గల తమ గ్రూపు సంస్థలతోనే. ఆ సంస్థల వార్షిక నివేదికలు చూస్తే ఈ విషయం వెల్లడవుతుంది. సుజనా యూనివర్సల్‌కు వంద శాతం సబ్సిడరీ సంస్థగా 2007లో మారిషస్‌లో హెస్తియా హోల్డింగ్స్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేశారు. హెస్తియాలో సుజనా యూనివర్సల్‌కు ఒకే ఒక్క వాటా ఉంది. ఆ వాటా ముఖ విలువ 100 అమెరికన్ డాలర్లు. అంటే.. ఇది మన కరెన్సీలో 5,200 రూపాయలకు సమానం. ఈ 100 డాలర్ల విలువైన సంస్థకు.. మూడు విదేశీ బ్యాంకులు మూడు కోట్ల డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) రుణం ఇచ్చాయని చెప్తున్నారు. ఇందులో.. కోటి డాలర్ల రుణాన్ని మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), మరో రెండు కోట్ల డాలర్ల రుణాన్ని స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా)లు అందించాయట. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది. 

మాతృ సంస్థల ఖాతాలకు మళ్లింపు... 

హెస్తియా హోల్డింగ్స్ 2011 మార్చి నాటికి రూ. 46.33 కోట్ల వ్యాపారం చేసిందని టర్నోవర్ నమోదు చేశారు. నిజానికి దేశీయంగా తమ కంపెనీలు నమోదు చేసిన టర్నోవరే ఉత్తుత్తిదని సుజనా సంస్థలు అధికారికంగా అంగీకరించాయి. అలాంటిది వారు విదేశాల్లో నెలకొల్పిన సంస్థలు స్వదేశంలోని వారి బోగస్ కంపెనీలతో ఏ వ్యాపారం చేస్తాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంటే.. విదేశాల్లోనూ బూటకపు టర్నోవర్ చూపారన్నది స్పష్టమవుతోంది. హెస్తియా నమోదు చేసిన రూ. 46 కోట్ల టర్నోవర్ చూసి.. విదేశీ బ్యాంకులు రూ. 150 కోట్లు రుణంగా ఇచ్చాయని సుజనా సంస్థలు చెప్తున్నాయి. ఇదే తరహాలో సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ సంస్థలకు సబ్సిడరీ కంపెనీలుగా ఏర్పాటైన సుజనా హోల్డింగ్స్ (దుబాయ్), ఆల్ఫా వెంచర్స్ (కేమాన్ ఐలాండ్స్) కూడా విదేశీ బ్యాంకుల నుంచి రూ. 400 కోట్లు రుణం తీసుకున్నాయి. ఆ విదేశీ రుణానికి మాతృసంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చాయి. ఆల్ఫా వెంచర్స్ సంస్థ మారిషస్ బ్యాంకు నుంచి మరో రూ. 300 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా టవర్స్ కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చింది. మొత్తం కలిపితే.. దాదాపు రూ. 850 కోట్లకు పైగా సొమ్ము విదేశీ రుణం పేరుతో సుజనా సంస్థల సబ్సిడరీ కంపెనీల ఖాతాల్లో చేరింది. ఆ సొమ్ము.. అక్కడి నుంచి.. గ్రూపు సంస్థల మధ్య క్రయవిక్రయాల పేరుతో హైదరాబాద్‌లోని మాతృ సంస్థలకు వచ్చి చేరింది. 

అది రుణమా? నల్లధనమా? 

విదేశీ రుణాల పేరుతో అక్కడి సబ్సిడరీ సంస్థలకు.. అక్కడి నుంచి లావాదేవీల పేరుతో స్వదేశంలోని మాతృ సంస్థలకు వచ్చి చేరుతున్నది.. నల్లడబ్బు అని, అది క్రయవిక్రయాల రూపంలో రావటంతో తెల్లడబ్బుగా మారిపోయిందని ఇట్టే అర్ధమవుతుంది. ఎందుకంటే.. కేవలం వంద డాలర్ల ఈక్విటీ ఉన్న సంస్థకు.. ఏకంగా మూడు కోట్ల డాలర్ల రుణాలు జారీ చేసినపుడు.. మారిషస్ బ్యాంకులు కనీస నిబంధనలు కూడా పాటించిన దాఖలాలు లేవు. ఏదైనా సంస్థ తమ గ్రూపులోని ఇతర సంస్థలకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తు (కార్పొరేట్ గ్యారంటీ) ఇవ్వాలంటే.. ముందుగా వాటాదారుల అనుమతి తీసుకోవాలి. కంపెనీల చట్టం 1956 లోని సెక్షన్ 372ఎ ప్రకారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా ఈ తీర్మానం ప్రతి ఆధారంగానే సదరు సంస్థకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయి. అయితే.. మారిషస్ బ్యాంకులు ఇలా వాటాదారుల అనుమతి సూచించే తీర్మానం లేకుండానే సుజనా సబ్సిడరీ సంస్థలకు దాదాపు రూ. 850 కోట్ల రుణాన్ని మంజూరు చేశాయట. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (హెస్తియా), స్టాండర్డ్ బ్యాంక్ (సెలీనా), ఆఫ్రేసియా బ్యాంక్ (సెలీనా) నుంచి హెస్తియా హోల్డింగ్స్ రూ. 150 కోట్ల రుణం తీసుకోవటానికి కార్పొరేట్ గ్యారంటీ సుజనా యూనివర్సల్ ఇచ్చింది. కానీ ఆ సంస్థ ఈ గ్యారంటీకి సంబంధించి తన వాటాదారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోలేదు. దానికి సంబంధించిన తీర్మానమూ చేయలేదు. రుణం మంజూరయిన తర్వాత సుజనా యూనివర్సల్ దానికి అనుమతి కోరుతూ వాటాదారుల తీర్మానం కోరటమే దీనికి సాక్ష్యం. సుజనా టవర్స్, సుజనా మెటల్స్ కూడా ఇలాగే వ్యవహరించాయి. అంటే.. ఆయా సంస్థల గ్యారెంటీకి సంబంధించి వాటాదారుల ముందస్తు అనుమతి, తీర్మానం లేకుండానే విదేశీ బ్యాంకులు రుణాలు ఇచ్చేశాయట! 

ఆ బ్యాంకులూ బోగస్సేనా? 

ఇదంతా చూస్తే.. అసలు వంద డాలర్లు, రెండు వందల డాలర్లు ఈక్విటీ గల సంస్థలకు.. ముందూ వెనుకా చూడకుండా కోట్లకు కోట్లు రుణాలిచ్చేసే బ్యాంకులు ఉన్నాయా అన్న అనుమానం కలగకమానదు. సదరు సంస్థలు చూపుతున్న టర్నోవర్ వాస్తవమైనదా కాదా అన్నది పరిశీలించుకోకుండానే.. చూపిన టర్నోవర్‌కూ మూడింతలు రుణాలు మంజూరు చేసే బ్యాంకులూ ఉంటాయా అన్న ఆశ్చర్యం కలగక మానదు. దీనినిబట్టి చూస్తే.. ఇక్కడ రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి.. సుజనా సంస్థలు చూపిన టర్నోవర్ లాగానే.. అవి చెప్తున్న విదేశీ బ్యాంకులు కూడా బోగస్‌వై ఉండాలి. అంటే.. లేని బ్యాంకులు ఉన్నట్లుగా చూపి.. ఆ బ్యాంకులు ఇవ్వని రుణాన్ని ఇచ్చినట్లుగా చూపి.. నల్లధనాన్ని రుణం పేరుతో చెలామణిలోకి తెచ్చుండాలి. లేదంటే.. ఒకవేళ అలాంటి బ్యాంకులంటూ ఉంటే.. అవికూడా నల్లడబ్బు లావాదేవీలకు, దళారీతనానికి కేరాఫ్ అడ్రస్‌లై ఉండాలి. నల్లధనానికి అడ్డాలైన కేమాన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్స్‌లలోని బ్యాంకుల్లో నల్లధనం దాచి.. ఆ బ్యాంకులతో కుమ్మక్కై.. ఆ నల్లధనాన్నే తమ సంస్థలకు రుణం రూపంలో తెచ్చుకుంటూ ఉండాలి. ఈ రెండు రకాలుగా కాకుండా.. సుజనా బోగస్ సంస్థలకు అన్ని వందల కోట్ల రూపాయలు రుణం లభించే అవకాశమే లేదు. ప్రస్తుతం ‘సాక్షి’ దృష్టికి వచ్చిన ఉదంతంలో రూ. 850 కోట్లు ఇలా విదేశాల నుంచి సుజనా సంస్థల్లోకి ప్రవహించినట్లు వెల్లడైంది. అయితే.. ఇలాంటి ‘నల్ల’కోణాలు మరిన్ని ఉన్నాయని.. వేల కోట్ల రూపాయలు ఈ మార్గం ద్వారా సుజనా సంస్థల్లోకి ప్రవహిస్తోందని సమాచారం. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించి, లోతుగా దర్యాప్తు చేస్తే కానీ.. ఎన్ని వేల కోట్ల నల్లధనానికి ఇలా తెలుపు రంగు వేసుకుని తెచ్చారన్నది తేటతెల్లంకాదు.


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సుజనాచౌదరిల మధ్య గల బంధం ఎలాంటిదో.. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆ సంస్థ ఆస్తులను ఏ విధంగా కాజేశారో.. గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు అనుబంధ సంస్థగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే సబ్సిడరీ కంపెనీని సృష్టించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో హెరిటేజ్ ఫుడ్స్‌కు ఉన్న విలువైన 3.42 ఎకరాల భూమిని కేవలం రూ.2.73 కోట్లకు హెరిటేజ్ ఇన్‌ఫ్రాకు బదలాయించారు. ఈ వ్యవహారం జరిగే రోజుల్లో అంటే 2005 ప్రాంతాల్లో కొండాపూర్‌లో ఎకరా భూమి విలువ రూ.12 కోట్లు పైమాటే. అయితే హెరిటేజ్ ఇన్‌ఫ్రాలో చంద్రబాబు భార్య భువనేశ్వరికి 49 శాతం వాటా ఉంది. అందుకే కారుచౌకగా హెరిటేజ్ భూమిని ఇన్‌ఫ్రాకు బదలాయించారు. ఇక సుజనాచౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ లిమిటెడ్ పెద్దగా కార్యకలాపాలు లేని సంస్థ. తమిళనాడులో రూ.600 అద్దె దుకాణమే దీని కార్యాలయం. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక రుణాల సంస్థ సికామ్ లిమిటెడ్ దగ్గర సుజనా రూ.60 కోట్లు అప్పు తీసుకుంది. దీనికి హామీగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా తన దగ్గరున్న 3.47 ఎకారాలను హామీగా పెట్టింది. అంటే.. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన భూమిని.. సుజనా సంస్థల కోసం.. చంద్రబాబు తన సతీమణి ద్వారా తాకట్టుపెట్టించారన్న మాట. భూమి విలువ కూడా హెరిటేజ్ ఇన్‌ఫ్రా ఖాతాల్లో ఉన్నంత వరకు రూ.2.73 కోట్లుగా పేర్కొని, రుణ సంస్థ సికామ్ లిమిటెడ్ వద్ద తాకట్టు పెట్టినపుడు భూమి విలువను రూ. 85 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం తర్వాతే సుజనాచౌదరికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని కానుకగా ఇచ్చారు. అంటే.. ఆ 60 కోట్లు ఎక్కడికి చేరాయో.. సుజనాచౌదరికి రాజ్యసభ సభ్యత్వం ఏ సేవకు ప్రతిఫలమో అర్థం చేసుకోవచ్చు!


మా టర్నోవర్ అంతా బూటకమే

వాణిజ్య పన్నుల శాఖ ఎదుట సుజనా గ్రూపు అంగీకారం



చిన్న చిన్న షెడ్లలో మామూలు మెషీన్లు పెట్టుకుని నట్లు, బోల్టులు, టీఎంటీ బార్లు వంటి ఉక్కు ఉప ఉత్పత్తులను తయారు చేసుకునే సుజనా గ్రూప్ సంస్థలు.. రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు కర్మాగారమైన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో పోటాపోటీగా వ్యాపారం చేస్తున్నట్లు పద్దులు సృష్టించాయి. 2011 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సుజనా గ్రూపు సంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్, సుజనా టవర్స్ అనే మూడు సంస్థల మొత్తం టర్నోవర్ రూ. 10,000 కోట్లు దాటినట్లు చెప్తున్నాయి. వైజాగ్ స్టీల్‌తో పోలిస్తే.. ఏ మూలకూ సరితూగని ఈ సుజనా సంస్థలకు అన్ని వేల కోట్ల టర్నోవర్ ఎలా సాధ్యమైంది? ఆ సంస్థల 2011 బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తే.. కంపెనీల సంస్థాపక సామర్థ్యానికి, అవి నమోదు చేసిన టర్నోవర్లకు ఎక్కడా పొంతన లేదు. ఉదాహరణకు.. సుజనా యూనివర్సల్ సంస్థలో బేరింగ్స్ స్థాపక సామర్థ్యం కోటి బేరింగ్‌లుగా ఉంటే.. నిజానికి ఒక్క బేరింగ్ కూడా ఉత్పత్తి చేయలేదు. స్టీల్ ఉత్పత్తుల విషయంలో ట్రేడింగ్ ద్వారా పది లక్షల టన్నుల వ్యాపారం చేసినట్లు లెక్కచూపారు. ఇతర ఉత్పత్తులు అంటూ మరో 40 లక్షల టన్నులు నమోదు చేశారు. ఈ ఇతర ఉత్పత్తులు ఏమిటనేది ఎవరికీ అంతుపట్టనిది. నిజానికి తాము కాగితాల్లో చూపే వ్యాపారమంతా ఉత్తుత్తిదేనని సుజనా సంస్థలే గతంలో స్వయంగా వాణిజ్య పన్నుల శాఖ వద్ద అంగీకరించాయి. ఈ విషయాన్ని హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ తన కౌంటర్ అఫిడవిట్‌లో వెల్లడించగా.. 2009లో ఇచ్చిన ఆ కేసు తీర్పులోనూ ధర్మాసనం యథాతథంగా ప్రస్తావించింది. ‘‘... షోకాజ్ నోటీస్‌కు పిటిషనర్ (సుజనా గ్రూపు సంస్థలు) సమాధానం ఇస్తూ.. తమ కొనుగోళ్లు, అమ్మకాలు కేవలం ఊహాజనితమని.. మంచి ఫలితాలు చూపటానికి, కంపెనీ టర్నోవర్‌ను పుస్తకాల్లో ఎక్కువగా చూపటానికి చేసిందేనని అంగీకరించారు. అంతేకాకుండా.. తాము వాణిజ్య పద్దు పద్ధతిని అనుసరిస్తామని.. ఎలాంటి విక్రయాలు జరగకుండానే, సరకుల రవాణా లేకుండానే అమ్మకపు బిల్లులు జారీచేస్తామని కూడా పేర్కొన్నారు. తమ కంపెనీలు ప్రకటించిన వ్యాపార సామర్థ్యాన్ని అందుకున్నట్లు చూపించేందుకు, తమ సంస్థల ఈక్విటీలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు.. వాస్తవంగా ఎలాంటి సరకులు తెచ్చిందీ, పంపించిందీ లేకపోయినా.. కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినట్లు లావాదేవీలు నమోదు చేశామని వారు వెల్లడించారు’’ అన్న విషయాన్ని ఉటంకించింది. సుజనా గ్రూపు సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించి కోట్ల రూపాయల్లో వాణిజ్య పన్నులు ఎగవేశాయని సంబంధిత శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులపై.. ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ విషయాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ అఫ్జల్‌పుర్కార్‌లతో కూడిన ధర్మాసనం 2009 జనవరిలో సుజనాచౌదరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వటం కొసమెరుపు!
 
లక్ష కోట్ల రెడీ క్యాష్..!





విదేశాల నుంచి రుణాల పేరుతో నల్లధనం తెచ్చుకుంటున్న సుజనాచౌదరి.. బోగస్ సంస్థలు, బూటకపు వ్యాపారాలతో స్వదేశంలోనూ బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయల మేర టెండర్ పెట్టారు! వ్యాపార రుణాల పేరుతో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సమకూర్చుకున్నారు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని వందల కోట్లు కావాలంటే అన్ని వందల కోట్లు బ్యాంకుల నుంచి సమకూరేలా నెట్‌వర్క్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. అదెలాగంటే... 

సుజనా గ్రూపు సంస్థలు వాస్తవ లావేదేవీలేవీ లేకుండానే.. మొత్తం లక్ష కోట్ల మేర టర్నోవర్‌ను సృష్టించాయి. ఈ లావాదేవీలన్నీ కూడాగ్రూపులోని దాదాపు పాతిక సంస్థల మధ్యే నడిచినట్లు చూపాయి. ఈ సంస్థలన్నీ బోగస్ సంస్థలే. వాటికి వేర్వేరు చిరునామాలున్నా కూడా.. అన్ని సంస్థల కార్యకలాపాలు సుజనా గ్రూప్ కార్పొరేట్ కార్యాలయం నుంచే జరుగుతాయి. అంటే.. ఒక సంస్థ ఉత్పత్తులు తయారు చేయటానికి అవసరమైన ముడి సరుకును.. తన గ్రూపులోని మరో సంస్థ నుంచి కొన్ని వందల కోట్లు వెచ్చించి కొన్నట్లు కొనుగోలు బిల్లులు సృష్టిస్తారు. తయారు చేసిన ఉత్పత్తులను తమ గ్రూపులోనిదే మరో సంస్థకు విక్రయించినట్లు అమ్మకం బిల్లులు సృష్టిస్తారు. ఇదంతా ఒకే కార్యాలయంలో జరిగిపోతుంది. ఇలా లక్ష కోట్ల టర్నోవర్ చూపించారు. మంచి వ్యాపారం చేసే సంస్థలకు.. వాటి టర్నోవర్‌కు సరిసమానంగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. అంటే.. లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ చూపుతున్న సుజనా గ్రూపు సంస్థలకు.. అంత మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. అంటే.. సుజనా వారికి ఎప్పుడైనా ఓ వంద కోట్ల రూపాయలు కావాలంటే.. నేరుగా నడుచుకుంటూ వచ్చేస్తాయన్నమాట! అందుకు చేయాల్సిందల్లా.. తమ కంపెనీల మధ్య వంద కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు సింపుల్‌గా బిల్లులు పుట్టించటమే. వాటిని బ్యాంకులకు చూపి.. ఆ మొత్తాన్ని రుణం పేరుతో తెచ్చేసుకోవచ్చు. దానిని తీర్చాలంటే.. గడువు సమయానికల్లా మరో వంద కోట్ల రూపాయలకు బిల్లు పుట్టించి, ఆ బిల్లుతో మరో బ్యాంకు నుంచి వంద కోట్ల రుణం తెచ్చుకుని తీర్చేయవచ్చు. ఇలా మొత్తం లక్ష కోట్ల రూపాయల రెడీ క్యాష్! ఇది రిజర్వ్ బ్యాంకుకు కూడా అసాధ్యం. కానీ సుజనా వారికి అది జస్ట్.. కొన్ని బిల్లుల పని..! 
 
నాలుగేళ్ల కిందటే బయటపడ్డ బండారం...





సుజనా గ్రూపు బోగస్ సంస్థలను సృష్టించి.. వాటితో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసినట్లు నకిలీ పద్దులు రూపొందించి.. వాటితో బ్యాంకులను బురిడీ కొట్టించి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వైనాన్ని ప్రాంతీయ ఆర్థిక నిఘా మండలి నాలుగేళ్ల కిందటే కనిపెట్టింది. అలాంటి ఒక బ్యాంకు రుణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) స్థానిక అధికారులు కూడా తమ వంతు ‘సాయం’ అందజేసిన విషయమూ బయటపడింది. సుజనా గ్రూపుకు చెందిన హెండమ్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు నిధులు సమకూర్చేందుకు నాఫెడ్ హైదరాబాద్ శాఖ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. హెండమ్ కోసం ఒమిక్రాన్ బయోజెనిసిస్, గోదావరి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థల (ఇవీ కూడా సుజనా గ్రూపువే) నుంచి ఇనుము, ఉక్కు కొంటున్నట్లు నాఫెడ్ రికార్డులు చూపింది. అలా నాఫెడ్ ‘సహకారం’తో సుజనా గ్రూపు సంస్థలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (అబిడ్స్), ఐసీఐసీఐ (బేగంపేట), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సైఫాబాద్)ల నుంచి దాదాపు రూ. 300 కోట్ల వరకూ రుణం కొట్టేశాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రాంతీయ ఆర్థిక నిఘా మండలి నోడల్ అధికారుల సమావేశంలో తీవ్ర చర్చ కూడా జరిగింది. దీనిపై సీఐడీ దర్యాప్తు జరపాలని కూడా ఆ మండలి కోరింది. సుజనా మోసాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లూ వర్తాలొచ్చాయి. 
 
సర్కారు సొమ్మునూ దోచుకున్నారు...





సుజనా గ్రూపు సంస్థలు వేల కోట్లలో టర్నోవర్ చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించటం ద్వారా సర్కారును కూడా మోసం చేసి.. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో దాదాపు రూ. 600 కోట్లకు పైగా సొమ్ము కాజేశాయని అప్పట్లోనే వాణిజ్య పన్ను శాఖ అధికారులు బట్టబయలు చేశారు. అలా మోసం చేసి కొట్టేసిన సొమ్మును తక్షణమే తిరిగి చెల్లించాలని ఆ సంస్థలకు తాఖీదులు కూడా జారీచేశారు. అంతేకాదు.. ఇలా సర్కారును మోసం చేసినందుకు అంతకు రెండింతలు.. అంటే దాదాపు రూ. 1,200 కోట్లు జరిమానా కూడా ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. వాణిజ్య పన్నుల శాఖ నోటీసులపై హైకోర్టుకు వెళ్లిన సుజనా సంస్థలు.. వాటిపై స్టే తెచ్చుకోగలిగాయి. ఇక సుజనా గ్రూపు సంస్థ అయిన హెండమ్ ఇండస్ట్రీస్ సర్కారు కన్నుగప్పి ఉక్కు దిగుమతులపై కోట్ల రూపాయల్లో పన్నులు ఎగవేసిందని, ఆ పన్నును మొత్తం వడ్డీతో సహా చెల్లించటంతో పాటు.. అదే స్థాయిలో జరిమానా కూడా కట్టాలని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్న సుజనాచౌదరికి రూ. 25 లక్షల జరిమానా కూడా విధించింది.
 
సుజనాగ్రూపు సంస్థలు వాస్తవంగా లేని క్రయవిక్రయాలు పద్దుల్లో చూపుతూ, బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకోవటం, సర్కారు నుంచి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందటం వంటి వ్యవహారాల్లో.. వాణిజ్య పన్నుల శాఖ, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీఐడీ, సీబీఐ వంటి సంస్థలన్నీ ఏదో ఒక స్థాయిలో చర్యలు, దర్యాప్తులు మొదలుపెట్టాయి. కానీ.. ఏ చర్యా తీసుకోలేకపోయాయి. కొన్ని అంశాలపై సుజనా సంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ.. సీఐడీ, సీబీఐ దర్యాప్తు వంటివి ఎటుపోయాయో, ఎందుకు ఆగిపోయాయో ఎవరికీ తెలియదు! ఉన్న వ్యాపారాన్నే ఎక్కువగా చూపిన సత్యం రామలింగరాజు.. దాదాపు రెండేళ్ల పాటు బెయిల్ కూడా దొరక్క జైలులోనే ఉన్నారు. సుజనాచౌదరికి మాత్రం.. రాజ్యసభ సభ్యత్వం వంటి అందలాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనాచౌదరి అన్న విషయం బహిరంగ వాస్తవం. టీడీపీలో కనీసం సభ్యత్వం లేని సుజనాచౌదరిని.. చంద్రబాబు ఏకంగా ఎంపీని చేశారు. నిజానికి బాబు ప్రాభవంతో పాటే సుజనాచౌదరి ప్రాభవం పెరిగింది. బాబుకు ఆయన బినామీ అని.. చౌదరి లావాదేవీలన్నీ చంద్రబాబు సృజనేని జనంలో నాటుకుపోయింది. సుజనా గ్రూపు లావాదేవీలన్నింటిపై.. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తే తప్ప వాస్తవాలు నిగ్గుతేలవు. 
 
 

వాస్తవంగా కూడా.. సుజనా గ్రూపు సంస్థలకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యూనిట్లలో.. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం ఔత్సాహిక యువ పారిశ్రామికవే త్తలు నిర్వహించే కొన్ని వర్క్‌షాప్‌ల వంటి షెడ్లు కనిపిస్తాయే తప్ప ఫ్యాక్టరీ స్థాయి నిర్మాణాలేవీ కనిపించవు. నిజానికి ఫ్యాక్టరీ నిర్మాణం అవసరం కూడా ఆ సంస్థలకు లేదు. ఎందుకంటే అవి చేసేది కేవలం ద్వితీయ మార్కెట్‌లో స్టీల్ కొనుగోలు చేయటం, విక్రయించటం. సంస్థ తాజా ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. టర్నోవర్‌లో 80 శాతం స్టీల్ ట్రేడింగ్ ద్వారా సమకూరగా, కేవలం 20 శాతం మాత్రమే స్టీల్ ఉత్పత్తుల విక్రయాల ద్వారా సమకూరింది. అయినా బ్యాంకులు లోన్లు ఇస్తూనే ఉన్నాయి. 

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన సంస్థ చేస్తున్న ప్రధాన వ్యాపారం కేవలం ట్రేడింగ్! తయారీ రంగం కోసం మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన సుజనా యూనివర్సల్.. తన ప్రధాన వ్యాపార లక్ష్యాన్ని విస్మరించి కేవలం ట్రేడింగ్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవటం నిబంధనలకు విరుద్ధం. అలా చేసే సంస్థ మార్కెట్ నుండి నిధులు సమీకరించకుండా చట్టప్రకారం నిషేధం విధించవచ్చు. కానీ అలా జరగదు. కారణం.. సుజనా వారికి గల రాజకీయ పలుకుబడేనన్నది జగమెరిగిన సత్యం! 
 

Share this article :

0 comments: