నేడు పవార్‌తో జగన్ భేటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు పవార్‌తో జగన్ భేటి

నేడు పవార్‌తో జగన్ భేటి

Written By ysrcongress on Tuesday, December 20, 2011 | 12/20/2011

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల సుడిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌తో భేటీకానున్నారు. సాయంత్రం 4.10కి ఆయనతో సమావేశమై రాష్ర్టవ్యాప్తంగా అన్నదాతల దుస్థితిని ఏకరువు పెట్టనున్నారు. కష్టనష్టాల బారినపడి కుంగిపోతున్న రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా పవార్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.

పార్లమెంట్ సమావేశాలకు హాజరు 

జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో జగన్ సెంట్రల్ హాలుకెళ్లినపుడు రాష్ట్ర ఎంపీలు, ఇతర రాష్ట్రాల ఎంపీలు పలువురు ఆయనను పలకరించారు. పార్లమెంట్ నుంచి నివాసానికి తిరిగివెళ్లడానికి బయటికి వచ్చే సమయంలో కొందరు తెలుగు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, రైతు సమస్యలపై తాను పవార్‌ను కలుస్తానని చెప్పారు. అలాగే, 377 నిబంధన కింద రైతు సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించడానికి కూడా నోటీసు ఇచ్చానని, స్పీకర్ అనుమతిస్తే సభలో వాటిని లేవనెత్తుతానని తెలిపారు.

ఈడీ నుంచి కొత్తగా వచ్చిన నోటీసుల్లేవు...


ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఎదుట హాజరు అవుతున్నారా? లేదా? అని సదరు మీడియా ప్రతినిధులు గుచ్చిగుచ్చి అడిగిన ప్రశ్నలకు జగన్ జవాబిస్తూ, ఇప్పుడు తనకు కొత్తగా వచ్చిన నోటీసులు ఏవీ లేవన్నారు. ఈడీ లోగడ నోటీసులు పంపిందని, తనను కానీ తన తరఫున ప్రతినిధిని కానీ వచ్చి కలవాలని వాటిలో ఉందని, ఆ ప్రకారం తన ప్రతినిధి ఈడీ అధికారులను కలుస్తున్నారని, ఆ ప్రక్రియ సాగుతోందన్నారు. అంతేతప్పించి, తనకు కొత్తగా వచ్చిన నోటీసులేం లేవని స్పష్టంచేశారు. అయినా ఆ మీడియా ప్రతినిధులు మళ్లీ అవే ప్రశ్నలనే రెట్టించి అడగ్గా, తనను రమ్మని పిలవకుండా తాను వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. మీరు రాసుకునే వార్తలతో సంబంధం లేదని, వాస్తవాలు అందరికీ తెలుసని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించి నివాసానికి బయల్దేరారు.
Share this article :

0 comments: