రౌడీషీట్లు తెరుస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రౌడీషీట్లు తెరుస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు

రౌడీషీట్లు తెరుస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు

Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011


* అధికారపక్షం, పోలీసులు కుమ్మక్కై పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారు
* రౌడీషీట్లు తెరుస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు
* పులివెందులలో 41 మందిపై రౌడీషీట్లు తెరవడం ఇందుకు నిదర్శనం
* ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందంటే పరిస్థితి అర్థమవుతోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లాలో అధికారపక్షం, పోలీసులు కుమ్మక్కయి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను వెంటాడి వేధిస్తున్నారని జిల్లా పార్టీ నాయకుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ కడప పోలీసులు అధికారపక్షం అండతో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ కార్యకర్తలపై రౌడీషీట్లు తెరుస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్వస్థలమైన పులివెందులలో ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా 41 మంది పార్టీ కార్యకర్తలపై రౌడీషీట్లు తెరిచారని ఆయన తెలిపారు. 

వీరిలో 19 మంది 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో జరిగిన స్వల్ప ఘర్షణలో నిందితులని, విచారణ అనంతరం ఆ కేసు నుంచి వారంతా విముక్తులు కూడా అయ్యారని వివరించారు. అలాంటి వారికి అదనంగా మరికొందరిని కలిపి రౌడీలుగా చిత్రీకరించడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. వివాదాస్పదుడైన శంకరయ్య అనే సీఐకి ఎక్కడా రెగ్యులర్ పోస్టింగ్ ఇవ్వరని, కానీ తమ పార్టీని సర్వనాశనం చేయాలనే దురుద్దేశంతోనే పులివెందులలో నియమించి తమ కార్యకర్తలు, అభిమానుల్ని అణచివేయాలని చూస్తున్నారని రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 

ఉప ఎన్నికల్లో పులివెందుల ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యతను ఇవ్వడం వారు చేసిన నేరమా? అని ఆయన ప్రశ్నించారు. శంకరయ్య వేధింపులపై పలు ప్రైవేటు కేసులున్నాయని, మానవహక్కుల కమిషన్‌కూ ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయని, అయినా ప్రభుత్వం చర్య తీసుకోలేదంటే.. కావాలనే చూస్తూ ఊరుకుంటోందనేది స్పష్టమవుతోందని చెప్పారు. తమపై జరుగుతున్న అణచివేత చర్యలపై ముఖ్యమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు కూడా చేశామన్నారు. క్రికెట్ బుకీగా గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో పలుమార్లు పోలీసులకు చిక్కిన మధుసూదనరెడ్డి అనే నాయకుడిని పులివెందుల పోలీసులు స్వేచ్ఛగా తిరుగనిస్తూ.. తమ కార్యకర్తలను మాత్రం వేధిస్తున్నారని చెప్పారు. 

ఓ అమాయకుడిని చావుదెబ్బలు కొడితే అందుకు నిరసనగా గతంలో పులివెందుల పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగిన జగన్‌పైనా కేసులు పెట్టడమేకాక మరికొందరిని నాన్‌బెయిలబుల్ కేసుల్లో ఇరికించారని ఆయన విమర్శించారు. రైతులకు ఏడు గంటలు కరెంటు సరఫరా చేయాలని, తెలుగుగంగ కాలువలకు సాగునీటిని వదలాలని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, తాను కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ దుశ్చర్యలన్నింటినీ ప్రజలు చూస్తున్నారని, త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
Share this article :

0 comments: