ఉద్యమించిన రైతుదండు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉద్యమించిన రైతుదండు

ఉద్యమించిన రైతుదండు

Written By ysrcongress on Saturday, December 24, 2011 | 12/24/2011

ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతన్నలు

కలెక్టరేట్లు, తహశీల్దార్, ఆర్‌డీవో ఆఫీసులు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ఆందోళనలు
పాల్గొన్న వైఎస్సార్ అభిమాన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలను భరించలేక, అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్న రైతాంగం ఆగ్రహంతో రోడ్డెక్కింది. తమను గాలికొదిలేసిన సర్కారుపై మండిపడింది. ఇప్పటికైనా తమను ఆదుకోవాలంటూ ముక్త కంఠంతో నినదించింది. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. లక్షలాది మంది రైతులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందూ, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ జరిగిన ఈ ధర్నాల్లో.. అన్నదాతలు చేతగాని సర్కారుపై మండిపడ్డారు. వైఎస్‌ను అభిమానిస్తున్న ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ శ్రేణులు ధర్నాల్లో పాల్గొని అధికారులకు రైతు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పలువురు తమ సొంత జిల్లాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

కోస్తా జిల్లాల్లో..


తూర్పుగోదావరి జిల్లాలో ధర్నాలకు అనూహ్య స్పందన లభించింది. జగ్గంపేటలో ఎడ్లబళ్లతో భారీర్యాలీ, ఎండిపోయిన చెరకు, పత్తి తదితర పంటల దుబ్బులతో వినూత్నంగా నిరసన చేపట్టారు. అమలాపురంలో ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి నేతలను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఆలమూరులో జరిగిన నిరసనల్లో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేశారు. గుడివాడలో పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆందోళనలు జరిగాయి. నరసాపురం, పోలవరం ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం గునుపూడి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. చింతలపూడిలో నియోజకవర్గ నాయకులు మానవహారంగా ఏర్పడి సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గ కేంద్రాలతోపాటు, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. చిలకలూరిపేటలో నాలుగువేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. పార్టీ నాయకులు చుట్టుగుంట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ రైతు ఆందోళనలు విజయవంతమయ్యాయి. 11 కేంద్రాల్లో జరిగిన ఈ ధర్నాలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి భీమిలి, మాడుగుల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నాలు జరిగాయి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితర ప్రముఖులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, ఉదయగిరి నియోజకవర్గాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. అద్దంకి, పర్చూరు, చీరాల, త్రిపురాంతకంలలో రాస్తారోకోలు చేపట్టారు. సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. విజయనగరం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా విజయవంతమైంది. శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. తొలుత ర్యాలీలు నిర్వహించి, అనంతరం తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు.

తెలంగాణలో..
వరంగల్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించారు. హన్మకొండ ఆర్డీఓ కార్యాలయం, వరంగల్ ఎమ్మార్వో కార్యాలయం, డోర్నకల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, మంగపేట, కురవి, చేర్యాల కేంద్రాల్లో రైతులు ధర్నాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. బాల్కొండలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. బైపాస్ రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు, కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. మెదక్ జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ సహా 11 నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సిరిసిల్ల, జగిత్యాల, మంథని, పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగాయి. ఆలేరులో రాస్తారోకోతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలకు రైతులు భారీ ఎత్తున కదిలారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో చేపట్టిన ధర్నాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాయలసీమలో..

వైఎస్‌ఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయి. వేలాది మంది రైతులు ధర్నాలో పాల్గొని సమస్యలపై నినదించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పులివెందులలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు 63 మండలాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. 200మందిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు అన్ని మండలాల నుంచి అన్నదాతలు తరలివచ్చారు. నంద్యాలలో 1,500 మంది స్థానిక సిటీ కేబుల్ ఆఫీసు నుంచి శ్రీనివాస సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులో తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన భారీ ధర్నాలో 1,500 మందికిపైగా పాల్గొన్నారు.

ధర్నాలకు భారీ స్పందన: గట్టు రామచంద్రరావు

తమ పార్టీ పిలుపునిచ్చిన ధర్నాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి భారీగా స్పందన లభించిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు హైదరాబాద్‌లో వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ధర్నాలు జరగడాన్నిబట్టి రైతులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోందన్నారు. సమస్యలను పట్టించుకోని ప్రభుత్వంపైన, తమ కోసం పోరాడని ప్రతిపక్ష టీడీపీపైన రైతులకు విశ్వాసం సన్నగిల్లిందని ఆయన అన్నారు.
Share this article :

0 comments: