దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

80 ఏళ్లు దాటిన వారికి రూ. 500 పెన్షన్ ఇస్తామన్న కేంద్రం 
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు... వయోవృద్ధులపై కేంద్రం కనికరం చూపినా రాష్ట్ర సర్కారు మాత్రం నిర్లక్ష్య వైఖరినే అవలంబిస్తోంది. రాష్ట్ర ఖజానా నుంచి పైసా ఖర్చు అయ్యే అవకాశం లేకున్నా పండుటాకులపై కాసింతైనా దయ చూపడం లేదు. 80 ఏళ్లు దాటిన పండుటాకులకిచ్చే పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.500కు పెంచి ఇచ్చేందుకు కేంద్రం ఏప్రిల్‌లోనే ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. రాష్ట్రంలో దాదాపు 93 వేల మందికిపైగా వయోవృద్ధులు ఉన్నట్లు కేంద్రం అంచనాకు వచ్చింది. 

ఆ మేరకు లబ్ధిదారులను గుర్తించి సమాచారం ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్ర ఫ్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా గడచిన ఎనిమిది నెలలుగా వయోవృద్ధులకు రావాల్సిన రూ.20 కోట్ల పెన్షన్ చేజారిపోయింది. ఢిల్లీలో గత నెల జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించినా ప్రభుత్వం మాత్రం ఆ జాబితాను ఇవ్వలేకపోయినట్లు సమాచారం. సామాజిక భద్రత పింఛన్ కింద కేంద్రం పింఛన్ పొందడానికి లబ్ధిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు కుదించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయకుండా అభయహస్తంలో ఇదివరకే పెన్షన్ పొందుతున్న 4.18 లక్షల మందిని కేంద్ర పథకంలోకి మార్చేసి ఏటా వందకోట్లను మిగుల్చుకునే ఎత్తుగడను అమలు చేయడం గమనార్హం. 

తప్పించుకోవడమే లక్ష్యం: రాష్ట్రంలోని వయోవృద్ధులకు సంతృప్తస్థాయిలో పెన్షన్లు ఇవ్వాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 18 లక్షలు ఉన్న పెన్షన్లను 71 లక్షల వరకు తీసుకెళ్లారు. అప్పటివరకు కేవలం రూ.75 ఉన్న పెన్షన్‌ను రూ.200కు పెంచారు. అయితే ఈ మొత్తం సరిపోదని భావించిన కేంద్ర ప్రభుత్వం రూ.500కు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించారు. అయితే రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటికీ వయోవృద్ధులకు రూ.200 పెన్షన్‌తోనే సరిపుచ్చుతోంది. 

సామాజిక భద్రత పెన్షన్లపై కేంద్రం ఎప్పుడు సమావేశాలు నిర్వహించినా రాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకోలేదు. కేంద్రం ఇచ్చే పెన్షన్‌కు తోడు మరో రూ.200 అదనంగా కలిపి లబ్ధిదారులకు ఇవ్వాలని సూచించినా పట్టించుకోలేదు. కేంద్రమే ముందుకు వచ్చి 80 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించినా.. రాష్ట్రం అమలు చేయకపోవడం గమనార్హం. కేంద్ర అంచనామేరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వయోవృద్ధులు 93,640 మంది ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారని తెలుస్తోంది. కేంద్రం సూచనలు పాటిస్తే వారందరికీ రూ.500 ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతోనే రాష్ట్రం అమలు చేయడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తనపై భారం పడకుండా ఉండడానికే రాష్ట్రం ఇలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Share this article :

0 comments: