శ్రీరాములు భారీ ఆధిక్యతతో ఘన విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీరాములు భారీ ఆధిక్యతతో ఘన విజయం

శ్రీరాములు భారీ ఆధిక్యతతో ఘన విజయం

Written By ysrcongress on Monday, December 5, 2011 | 12/05/2011

మట్టికరచిన కమలం..కాంగ్రెస్‌కు పరాభవం
దేశవ్యాప్త ‘ఉప’పోరులో కాంగ్రెస్‌కు 2, బీజేపీకి 1
దక్షిణ కోల్‌కతా లోక్‌సభ స్థానం తృణమూల్‌కే

బళ్లారి (కర్ణాటక), న్యూస్‌లైన్: జాతీయ స్థాయిలో ఉత్కంఠ భరితంగా సాగిన బళ్లారి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి శ్రీరాములు భారీ ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి లోకాయుక్త నివేదికలో తన పేరిట అభియోగాలు నమోదవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శ్రీరాములు, బీజేపీకి రాం రాం చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గాది లింగప్ప, కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్‌ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. హోరాహోరీ ప్రచారం అనంతరం నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 

స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు సాగింది. మొత్తం 17 రౌండ్లు లెక్కింపు సాగగా, ప్రతి రౌండ్‌లోనూ శ్రీరాములు హవా కొనసాగింది. శ్రీరాములుకు 74,527 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రామ్‌ప్రసాద్‌కు 27,737 ఓట్లు దక్కాయి. శ్రీరాములు 46,790 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి శశికాంత్ సెంథిల్ ప్రకటించారు. శ్రీరాములుకు గత 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 60,611 ఓట్లు లభించగా, ఆ ఎన్నికల్లో ఆయన 25,716 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈసారి ఆయన మరింత ఆధిక్యత సాధించి రికార్డు సృష్టించారు. అధికార బీజేపీ అభ్యర్థికి 17,366 మాత్రమే రావడంతో డిపాజిట్ గల్లంతైంది. శ్రీరాములును ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులంతా బళ్లారిలో మకాం వేసి, తమ శాయశక్తులా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.

శ్రీరాములుకు అభిమానుల క్షీరాభిషేకం

శ్రీరాములు ఘన విజయంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు డిక్లరేషన్ ఫారం తీసుకుని శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల నుంచి వెలుపలకు వచ్చిన వెంటనే ఆయనకు క్షీరాభిషేకం చేశారు. శ్రీరాములును బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ముద్దాడి తన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నగరంలో జరిపిన ఊరేగింపులో ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎంపీ సన్న పక్కీరప్ప తదితరులు అభిమానులు, కార్యకర్తలతో కలసి కాసేపు డ్యాన్స్ చేశారు. శ్రీరాములు అభిమానులు ఫ్యాన్లు చేత పట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. 
Share this article :

0 comments: