క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని దాచేసి, జడ్జిగా ఎంపికైన ఓ హైకోర్టు న్యాయమూర్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని దాచేసి, జడ్జిగా ఎంపికైన ఓ హైకోర్టు న్యాయమూర్తి

క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని దాచేసి, జడ్జిగా ఎంపికైన ఓ హైకోర్టు న్యాయమూర్తి

Written By ysrcongress on Tuesday, December 27, 2011 | 12/27/2011

బస్సుపై రాళ్లు రువ్వి మారణాయుధాలతో దాడి చేసి ప్రయాణికులను గాయపరిచినట్లు ఆయనపై ఆరోపణలు
ఐపీసీ 147, 148, 342, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు
‘ఆ వ్యక్తి’కి ఇతోధిక సాయం చేసిన అప్పటి ప్రభుత్వాధినేత
న్యాయమూర్తి అయ్యే నాటికి పెండింగ్‌లోనే ఉన్న క్రిమినల్ కేసు... జడ్జీ కాగానే ఆ కేసు ఉపసంహరించిన నాటి సర్కార్

(యర్రంరెడ్డి బాబ్జీ - న్యూస్‌లైన్)
క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని దాచేసి, జడ్జిగా ఎంపికైన ఓ హైకోర్టు న్యాయమూర్తి విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సుపై రాళ్లతో దాడి చేసి మారణాయుధాలతో ప్రయాణికులను గాయపరచినందుకు ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు వివరాలను ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు తెలియజేయకుండా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి అయ్యారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. న్యాయమూర్తి అయ్యే నాటికి ఆయనపై పలు సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్ కేసు స్థానిక కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసు గురించి ఆయన నిర్భయంగా.. నిజాయతీగా కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు తెలియజేసినా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించినా.. ఆయన ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండేవారే కాదు. ఈ విధంగా వాస్తవాలను దాచిపెట్టి పదవిలోకి రావడం చట్టరీత్యా నేరం.
చట్టం నిర్దేశించిన విధంగా కాకుండా మరో రకంగా న్యాయమూర్తి అయిన ఆ వ్యక్తి.. న్యాయమూర్తి అయిన వెంటనే తనపై ఉన్న క్రిమినల్ కేసును అప్పటి ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేయగలిగారు. ఆ న్యాయమూర్తిపై ఉన్న క్రిమినల్ కేసును లాంగ్ పెండింగ్ కేసుగా మార్చడమే కాకుండా.., దానిని ఉపసంహరించుకుంటూ అప్పటి ప్రభుత్వం 2001లో జీవో జారీ చేసింది. సరిగ్గా ఆయన న్యాయమూర్తి అయిన ఏడాదిన్నరకు ఇది జరిగింది. ఎలాగైనా న్యాయమూర్తి అయి తీరాలన్న ఆశ.., ఆలోచనతో వాస్తవాలను పాతర వేసిన ఆ వ్యక్తి.. ఆనాటి ప్రభుత్వాధినేతకు ఆదినుంచీ సన్నిహితుడు. నేర చరిత్రను దాచి పెట్టి చిన్న వయస్సులోనే హైకోర్టు న్యాయమూర్తి అయిన ఆయన, భవిష్యత్తులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వాధినేత చేసిన ఇతోధిక సాయంతో న్యాయమూర్తిగా నియమితులైన ఆయన ఇప్పుడు హైకోర్టులో ఆ నేతకు, ఆ నేతకు చెందిన పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారని హైకోర్టు వ్యవహారాలు తెలిసిన వారందరూ అనుకునే మాటే. 

ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర హైకోర్టులో ఆనాటి ప్రభుత్వాధినేత, సన్నిహితులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఇప్పటికీ ఆయనే తెర వెనుక నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఈయనను సంప్రదించకుండా ఆనాటి ప్రభుత్వాధినేత, ఆయన సన్నిహితులు అడుగు తీసి అడుగు వేయరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆనాడు తనకు చేసిన సాయానికి కృతజ్ఞతగా.. తన శక్తివంచన లేకుండా అప్పటి ప్రభుత్వాధినేతకు అనేక రకాలుగా సాయపడుతుంటారు. ఈ విషయాలను అటు హైకోర్టులోనే కాదు.. న్యాయ వ్యవస్థను దగ్గరగా పరిశీలించే వారెవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు.

ఇదీ క్రిమినల్ కేసు...

కోస్తా ఆంధ్రాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించే సమయంలో ఆయన, తన మిత్రులతో కలిసి.. 1981, ఫిబ్రవరి 13న యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వెళుతున్న ఓ బస్సుపై రాళ్లు రువ్వి మారణాయుధాలతో దాడి చేసి, అందులోని ప్రయాణికులను గాయపరిచారు. ఆ బస్సు డ్రైవర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు అదే రోజున క్రైమ్ నంబర్ 55/81తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఐదుగురిని నిందితులుగా పేర్కొనగా, వారిలో ఆయన నాలుగో నిందితుడిగా ఉన్నారు. ఈ ఐదుగురిపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 147 (అల్లర్లు), 148 (మారణాయుధాలతో దాడి చేసి గాయపరచడం), 149 (చట్టవ్యతిరేకంగా గుమికూడటం), 342 (అక్రమ నిర్భంధం), 427 (రూ.50 కంటే విలువ కలిగిన ఆస్తులకు నష్టం కలిగించడం), 511 (జీవిత ఖైదు లేదా ఇతర శిక్షలు పడే విధంగా చేసే నేరం) వంటి నేరాలపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక కోర్టులో విచారణ కూడా మొదలైంది. ఈ నిందితులు విచారణలకు హాజరుకాకపోవడంతో స్థానిక కోర్టు వారంట్లు కూడా జారీ చేసింది. అయితే అప్పట్లో స్థానిక పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వారంట్లను అమలు చేయలేదని తెలిసింది. అప్పటి ప్రభుత్వం ఆయనపై కేసును ఉపసంహరించుకుంటూ జీవో జారీ చేసింది. ఆ జీవోకు అనుగుణంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు.. అంటే 2002 వరకు కేసు నడిచింది. 

ప్రయాణికులపై మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచిన కేసులో నాలుగో నిందితునిగా ఉన్న ఆయన, 2000 సంవత్సరంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిన్నరకు (2001, డిసెంబర్ 11న) ఆయనపై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకుంటూ అప్పటి ప్రభుత్వం జీవో 1961 జారీ చేసింది. జీవో వచ్చిన నాలుగు రోజులకు ఈ విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్ హీరాలాల్ సమారియా దృష్టికి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ జీవో ఆధారంగా ఆయనపై కేసును ఉపసంహరించుకునేందుకు వీలుగా స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అప్పటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను 2002 జనవరి 30న జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు రాక ముందే అప్పటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థానిక కోర్టులో 2001, నవంబర్ 5న కేసు ఉపసంహరణ కోసం ఓ మెమో దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ సమారియా ఆదేశాల ప్రకారం 2002 జనవరి 31న పిటిషన్ దాఖలు చేసి.. కేసు ఉపసంహరణకు అనుమతినివ్వాలంటూ అసిస్టెంట్ పీపీ స్థానిక కోర్టును కోరారు. దీంతో స్థానిక కోర్టు అదే రోజున ఆ వ్యక్తిపై ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల జారీ సమయంలో అప్పటి స్థానిక కోర్టు సైతం ఎక్కడ లేని ఉత్సాహం చూపింది. ఈ కేసు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. కేసును ఉపసంహరించుకుంటూ పిటిషన్ దాఖలు చేయగానే.. స్థానిక కోర్టు ఈ కేసును సుమోటోగా నిర్ణీత తేదీకన్నా ముందుగానే విచారించి, కేసు ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యమెంట్లు ‘సాక్షి’ సంపాదించింది.

నిజాయితీగా చెప్పుంటే.. అంతటితో సరి...: క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం న్యాయమూర్తి అయ్యేందుకు అనర్హుడు. అందుకే ఒక న్యాయవాది లేదా న్యాయాధికారిని న్యాయమూర్తిగా నియమించే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటెలిజన్స్ వర్గాల ద్వారా ఆ వ్యక్తి లేదా వ్యక్తులకు సంబంధించిన అన్ని వివరాలను తెప్పించుకుంటాయి. ఈ సమాచార సేకరణలో రాష్ట్ర ప్రభుత్వానిదే కీలకపాత్ర. ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. కేంద్రం దానిని సుప్రీం కోర్టుకు పంపుతుంది. ఈ వివరాల ఆధారంగా సుప్రీం కోర్టు.. న్యాయమూర్తిగా నియమితులయ్యే వారి విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ న్యాయమూర్తి విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని నిఘావర్గాలు ధ్రువీకరించాయి. ప్రభుత్వాలు తెప్పించిన ఇంటెలిజెన్స్ నివేదికల్లో ఎవరైపైనయినా గతంలో క్రిమినల్ కేసుల వంటివి ఉన్నా, అప్పటికి ఆ కేసులు పెండింగ్‌లో ఉన్నా.. ఆ వ్యక్తి పేరును న్యాయమూర్తుల పదవికి పరిగణనలోకి తీసుకోరు. ఈ న్యాయమూర్తి విషయంలో కూడా వాస్తవానికి ఆదే జరగాలి. కాని అలా జరగనేలేదు. ఎందుకంటే తనపై ఉన్న కేసు వివరాలను ఆయన స్వచ్ఛందంగా, నిజాయితీగా సుప్రీం కోర్టుకు తెలియజేయలేదు. తన వివరాలు తెలియజేసేందుకు న్యాయమూర్తిగా నియమితులయ్యే ప్రతి వ్యక్తికి ఓ ఫారం లాంటిది ఇస్తారు. అందులో తనపై ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల గురించి తెలియజేసేందుకు ఓ కాలమ్ ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి తనపై ఉన్న కేసుల గురించి తెలియజేయాలి. కేసులేవీ లేకుంటే లేవని రాయాలి. కానీ, ఈ ఫారంను నింపే సమయంలో.. తనపై ఉన్న క్రిమినల్ కేసు గురించి ఆయన ప్రస్తావించలేదని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పెపైచ్చు కేసులేమీ లేనట్లు పేర్కొన్నారని సమాచారం. దీంతో ఆయన మీద క్రిమినల్ కేసు ఉన్న విషయం సుప్రీం కోర్టుకు తెలిసే అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ, హైకోర్టు న్యాయమూర్తి కాగలిగారు. ఇలా నేరచరిత్ర ఉన్న ఓ వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తి అయిన దాఖలాలు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకు దాదాపు లేవనే చెప్పాలి. సాధారణంగా ఎవరిపైనయినా చిన్న కేసున్నా, ఆ వ్యక్తి న్యాయమూర్తి పదవిని స్వీకరించేందుకు విముఖత చూపుతారు. ప్రస్తుతం హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న ఒకరికి గతంలో న్యాయమూర్తి పదవి స్వీకరించే ప్రతిపాదన హైకోర్టు నుంచి వచ్చింది. కానీ ఆ న్యాయవాది నిజాయితీగా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. అందుకు కారణం ఆ న్యాయవాదిపై ఉన్న ఓ చిన్న సివిల్ కేసే కారణం. కానీ, ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఇంతటి నిజాయితీని ప్రదర్శించి ఉంటే.. కథ మరోలా ఉండేది.

చర్చ జరుపుతారా..

క్రిమినల్ కేసును దాచి న్యాయమూర్తి అయిన ఆయనపై రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా స్పందిస్తాయన్న విషయం ఆసక్తికరంగా మారింది. న్యాయవాదిగా ఉన్న సమయంలో ఒకప్పటి తన క్లయింట్ అయిన గుప్తాపై ఉన్న కేసును కేంద్ర మంత్రి చిదంబరం ఉపసంహరింపచేశారంటూ పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న ప్రస్తుత సమయంలో.. ఇప్పుడు ఈ న్యాయమూర్తి చేసిన వాస్తవాల పాతరపై చర్చ జరుగుతుందా..? లేదా..? చూడాలి. నేరచరితను దాచి హైకోర్టు న్యాయమూర్తి అయిన ఆయన, రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే..?! ఇప్పుడు అందరి మెదళ్లను తోలుస్తున్న ప్రశ్న ఇదే.
Share this article :

0 comments: