త్వరగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల వినతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల వినతి

త్వరగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల వినతి

Written By ysrcongress on Tuesday, December 27, 2011 | 12/27/2011

త్వరగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల వినతి
చిత్తశుద్ధితో అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చాం.. 
స్పీకర్ సమక్షంలోనే.. అసెంబ్లీ సాక్షిగా.. ప్రజలు వీక్షిస్తుండగానే ఓటేశాం
అసెంబ్లీలో సభాపతికి లిఖితపూర్వక వివరణలిచ్చిన ఎమ్మెల్యేలు
ఈనెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల మనోహర్‌కు వినతి..
ఉప ఎన్నికలతో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పుతాం.. 
వైఎస్ సంక్షేమ కార్యక్రమాలే మా ప్రచారాస్త్రాలు
మాపై విమర్శలు చేయడం రాష్ట్రంలోని రైతులను కించపరచడమే
రైతుల కోసం ఏ ఒక్కరైనా రాజీనామా చేయండి.. 
ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలే తేలుస్తారు..
తప్పుడు ప్రచారాలకు మేం సమాధానం చెప్పం: ఎమ్మెల్యేలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రైతుల సంక్షేమం కోసమే తాము అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశామని వైఎస్‌ఆర్ అభిమాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు స్పష్టంచేశారు. విప్ ఉల్లంఘన కారణంగా అనర్హత ఫిర్యాదును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్‌ను కలిసి తమ వివరణ ఇచ్చారు. తమపై ‘అనర్హత’ నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని కోరారు. ‘‘స్పీకర్ సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలంతా వీక్షిస్తుండగానే మేము అవిశ్వాసానికి ఓటువేశాం. రైతులకోసం చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకున్నాం. రైతులు కష్టాల్లో మునిగి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల గోడును సర్కారు చెవికెక్కించడానికే మేము శాసనసభ్యత్వాలనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఉప ఎన్నికల ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం’’ అని ఆ ఎమ్మెల్యేలు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అనంతరం వైఎస్‌ఆర్ అభిమాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరాజు, గొల్లబాబూరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జి.గురునాధరెడ్డి, చెన్నకేశవరెడ్డి, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, భూమా శోభానాగిరెడ్డి స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. తరువాత కొద్దిసేపటికి కొండా సురేఖ అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్‌ను కలసి నోటీసులపై వేర్వేరుగా లిఖిత పూర్వక వివరణలు ఇచ్చారు. 

తాము రైతులకోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించామని తేల్చి చెప్పారు. శాసనసభలోనే జరిగిన ఈ వ్యవహారాన్ని మీరూ చూశారని, ప్రజలూ వీక్షించారని స్పీకర్‌కు వివరించారు. తమపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయవచ్చంటూ వస్తున్న ప్రచారాలను ఎమ్మెల్యేలు ప్రస్తావించగా... అవి సరికాదని, అన్నీ పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కె.శ్రీనివాసులు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కార్యాలయానికి వివరణలు పంపించారు. ఎమ్మెల్యే ఎం.సుచరిత అసెంబ్లీకి చేరుకొనే సమయానికి స్పీకర్ అక్కడినుంచి వెళ్లిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి స్పీకర్‌తో భేటీ అయినప్పటికీ తన వివరణ లేఖను అందించలేకపోయారు. సుచరిత, బాలినేనితోపాటు... అసెంబ్లీకి రాలేకపోయిన మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మంగళవారం తమ వివరణ లేఖలను స్పీకర్ కార్యాలయానికి అందించనున్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి కూడా అదేరోజు శాసనసభాపతిని కలసి వివరణ ఇవ్వనున్నారు. ఓదార్పుయాత్ర వల్ల రాలేకపోయిన శ్రీకాంత్‌రెడ్డి కూడా త్వరలోనే వివరణ అందిస్తారని తెలిపారు. 

రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నాం

రైతులకోసమే విప్‌ను ధిక్కరించి తమ చిత్తశుద్ధిని చాటామని వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు చెప్పారు. రైతులపక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్తామని, ప్రజల ద్వారా తగిన గుణపాఠం నేర్పుతామని స్పీకర్‌ను కలిసిన అనంతరం వారు తెలిపారు. తమపై విమర్శలు చేయడం రాష్ట్రంలోని రైతులను కించపర్చడమేనని ధ్వజమెత్తారు. ‘‘మాపై విమర్శలు చేసే నాయకులకు ఒక్కటే సవాల్ చేస్తున్నాం. రైతులపై చిత్తశుద్ధి ఉంటే మీలో ఏ ఒక్కరైనా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడండి. ఎవరి చిత్తశుద్ధి ఏమిటో ప్రజలే తేలుస్తారు’’ అని ప్రసాద్‌రాజు సవాల్ విసిరారు. ‘‘స్పీకర్‌కు ఓపెన్‌గా లెటర్ ఇచ్చాం. ఎవరో చేసే తప్పుడు ప్రచారాలకు మేము సమాధానం చెప్పబోము. వాటిని ప్రజలు నమ్మబోరు’’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనర్హతపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు కనుక న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదన్నారు. స్పీకర్ సమక్షంలోనే తాము విప్ ఉల్లంఘించినందున నిర్ణయంలో జాప్యమెందుకో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. 30వ తేదీలోపల నిర్ణయం తీసుకోమని కోరామన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, అవే తమ ప్రచారాస్త్రాలని వివరించారు. రైతులకోసం తమ పోరాటం నిరంతరంగా సాగుతుందని వారు తెలిపారు.
Share this article :

0 comments: