సాగు నీటి కోసం విజయమ్మ ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాగు నీటి కోసం విజయమ్మ ఆందోళన

సాగు నీటి కోసం విజయమ్మ ఆందోళన

Written By ysrcongress on Tuesday, December 20, 2011 | 12/20/2011

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు రైతులతో వెళ్లిన విజయమ్మ 
అధికారుల చర్చలు.. 30 నుంచి నీటి విడుదలకు అంగీకారం.. రైతుల ఆనందం

లింగాల(వైఎస్సార్ జిల్లా), అనంతపురం, న్యూస్‌లైన్: 

పంటలకు మంచి సీజన్.. తుంగభద్రలోనూ నీళ్లున్నాయ్.. ఇంకేం ఈ సారి మన పంట పండిందని పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) ఆయకట్టు రైతులు ఆశ పడ్డారు. కానీ నీళ్లు వదలకుండా అధికారులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇది సీజనైనా.. కాకున్నా మా రికార్డుల ప్రకారం ఏ తేదీల్లో ఇవ్వాల్సి ఉంటే అప్పుడే ఇస్తామంటూ గుడ్డి లెక్కలతో కృత్రిమ కరువు సృష్టించబోయారు. ఈ విషయం తెలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రైతుల పక్షాన సోమవారం ఆందోళనకు దిగారు. పీబీసీకి కేటాయించిన నీటిని తక్షణమే విడుదల చేయాలంటూ విజయమ్మ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, పీబీసీ ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) వద్దకు చేరుకున్నారు. ఇది తెలిసి ఆగమేఘాలపై తరలివచ్చిన అధికారులు వారితో చర్చలు జరిపి.. డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రతి రోజూ 350 క్యూసెక్కుల చొప్పునవిడుదల చేయడానికి అంగీకరించారు.

లక్ష ఎకరాలకు ముప్పు

ఈ ఏడాది తుంగభద్ర హెచ్చెల్సీ ప్రధాన కాలువ ద్వారా పీబీసీకి 2.45 టీఎంసీల నీటిని కేటాయించారు. కానీ.. ఆ మేరకు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో పీబీసీ కింద 96,900 ఎకరాల్లో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పులివెందులకు తాగునీటి అవసరాలను తీర్చే నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు కూడా అడుగంటిపోయాయి. ఇదే అంశంపై కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మలు పలు మార్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వి.దుర్గాదాస్, హెచ్చెల్సీ ఎస్‌ఈ టీబీ రవిలతో పలుమార్లు చర్చించారు. విజయమ్మ మూడు సార్లు లేఖలు కూడా రాశారు. పీబీసీకి ఆలస్యంగా నీటిని విడుదల చేయడం, ఆ జలాలను ఎగువ ప్రాంత రైతులు మోటార్ల ద్వారా తోడేసుకోవడంతో పీబీసీ ఆయకట్టుకు నీరు అందక అన్నదాతలు ఇబ్బందుల పాలవుతున్నారని, దీన్ని అరికట్టాలని ఆమె కోరారు. కానీ.. ఇంజనీర్లలో స్పందన కరువైంది. మరోవైపు ఇటు సీజన్‌లో పంటలకు నీళ్లు అందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే విజయమ్మ ఆందోళనకు దిగడంతో పీబీసీ ఈఈ మునిరెడ్డి, హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రవి.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు.

అప్పటిదాకా ఆగితే పంటలు ఎండిపోతాయి

ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు విజయమ్మకు వివరించారు. ఈ ఏడాది పీబీసీకి 2.46టీఎంసీల నీటిని కేటాయించామని, గత జూలైలో రెండు విడతలుగా 0.56 టీఎంసీల నీటిని విడుదల చేశామని, మిగతా 1.9 టీఎంసీల నీటిని త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. ‘మీరు ఇచ్చేదాకా వేచి ఉంటే.. పంటలు ఎండిపోయే పరిస్థితి. ఆ నీటిని త్వరగా ఇవ్వాలి. ఎప్పుడు విడుదల చేస్తారో లిఖిత పూర్వక హామీ ఇవ్వండి’ అంటూ విజయమ్మ, పీబీసీ మాజీ నీటి సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి పట్టుబట్టారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రవి ససేమిరా అన్నారు. దీంతో రైతులు అధికారులపై మండిపడ్డారు. తమకు కేటాయించిన నీటిని విడుదల చేసేవరకూ ఇక్కడి నుంచి అధికారులను కదలనివ్వబోమన్నారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు తెలిపేందుకు ఎస్‌ఈ రవి ప్రయత్నించగా కలెక్టర్ అనారోగ్యం కారణంగా అందుబాటులోకి రాలేదు. చివరకు రాతపూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతపురంలోని హెచ్చెల్సీ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక హామీ పంపుతానని ఎస్‌ఈ చెప్పారు. ఆయన వెంట అవినాష్‌రెడ్డిని విజయమ్మ అనంతపురానికి పంపారు. ఆ కార్యాలయానికి వెళ్లి అవినాష్‌రెడ్డి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పులివెందుల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం కృషి చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించిన అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

పీబీసీ కష్టాలు వైఎస్‌కు ముందే తెలుసు: విజయమ్మ

పీబీసీ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ముందే తెలుసని, అందుకే కృష్ణానది మిగులు జలాలను చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్)కు మళ్లించేందుకు పనులు చేపట్టారని ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రైతులతో అన్నారు. మహానేతే ఉంటే ఈ పాటికి కృష్ణానది జలాలు సీబీఆర్‌కు చేరి ఉండేవన్నారు. తుంగభద్ర నుంచి పీబీసీకి నీటిని విడుదల చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ విషయమై డీఆర్‌సీ మీటింగ్‌లో ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో చర్చించానన్నారు. అయితే ఇంతవరకూ పీబీసీ నీటిని విడుదల చేయలేదన్నారు. ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నోసార్లు అధికారులతో చర్చించారన్నారు. అయినా అధికారులు స్పందించలేదన్నారు. అనంతపురం జిల్లాకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసిన అధికారులు.. పులివెందుల ప్రాంత రైతులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. రైతుల ఓర్పును చేతగానితనంగా భావించి అధికారులు నీరు విడుదల చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విజయమ్మ హెచ్చరించారు.
Share this article :