ఫిబ్రవరిలో మునిసిపల్ ఎన్నికలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిబ్రవరిలో మునిసిపల్ ఎన్నికలు!

ఫిబ్రవరిలో మునిసిపల్ ఎన్నికలు!

Written By ysrcongress on Friday, December 9, 2011 | 12/09/2011

*పావులు కదుపుతున్న ప్రభుత్వం
*రెండు విడతల్లో నిర్వహణకు ప్రణాళిక
*తొలివిడత 99 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు
*వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మలిదశ 
*ప్రత్యక్ష ఎన్నికల వైపు సర్కారు మొగ్గు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటిని వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా నిర్వహించేందుకు వీలుగా పావులు కదుపుతోంది. రెండు దశల్లో వీటిని జరపడానికి వీలుగా ప్రణాళిక రూపొందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫిబ్రవరి ద్వితీయార్ధంలోగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, వచ్చే సంవత్సరంలో పాలక మండళ్ల పదవీ కాలం ముగియనున్న వాటికి రెండో దశలో వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 

2011 జనాభా లెక్కల పబ్లికేషన్ వచ్చే సంవత్సరం ఏప్రిల్‌కు కాని జరిగే అవకాశాలు లేనందున.. 2001 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని గురువారం సచివాలయంలో పురపాలక మంత్రి మహీధర్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పదవీకాలం ముగిసిన 99 మునిసిపాలిటీలు, పన్నెండు కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పాలక మండళ్లు ఉన్న విశాఖపట్టణం, రాజమండ్రి కార్పొరేషన్లు, హిందూపురం మునిసిపాలిటీ పాలక మండళ్ల పదవీ కాలం వచ్చే ఫిబ్రవరిలో పూర్తి కానుంది. ఇవి కాకుండా ఆర్మూరు, పలాస-కాశీబుగ్గ, కందుకూరు పాలక మండళ్ల పదవీకాలం జూన్‌తో ముగియనుంది. వీటిని కొత్త మునిసిపాలిటీలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. 

పురపాలక సంఘాలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఒకే విధమైన ఎన్నికల విధానాన్ని అనుసరించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యక్ష ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, రాజాం మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2001 జనాభా లెక్కలతో ఎన్నికలకు వెళ్తే ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న పక్షంలో వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త వహించాలని సూచించారు.

బడ్జెట్ సమావేశాలకు ముందే ఎన్నికలు: మంత్రి
ప్రత్యేకాధికారుల పదవీ కాలం మార్చితో ముగియనున్నందున, ఆలోపుగా ఎన్నికలు నిర్వహించాలనే విధాన నిర్ణయం తీసుకున్నామని, బడ్జెట్ సమావేశాలకు ముందు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి మహీధర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ప్రత్యక్షమా..? పరోక్ష ఎన్నికలా.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. స్థానిక సంస్థలకు ఒకే తరహా ఎన్నికలు ఉంటాయన్నారు. ఇదిలావుండగా రీజియన్ డెరైక్టరేట్‌లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్‌లకు కొత్త భవనాలు, వాహనాలు సమకూర్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. వీరు ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు జిల్లాలను పర్యవేక్షించాల్సి ఉందని తెలిపారు.
Share this article :

0 comments: