అనర్హత వేటేయండి... ప్రజల వద్దకెళతాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనర్హత వేటేయండి... ప్రజల వద్దకెళతాం!

అనర్హత వేటేయండి... ప్రజల వద్దకెళతాం!

Written By ysrcongress on Thursday, December 22, 2011 | 12/22/2011

శాసనసభలో మేం, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడాన్ని మీరే (స్పీకర్) కళ్లారా చూశారు...రైతుల, రైతుకూలీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేం వ్యతిరేకించాం...స్పీకర్ సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇంకా నోటీసులు ఇవ్వడం ఎందుకు? మమ్మల్ని వివరణ కోరడం ఎందుకు? వెంటనే అనర్హులుగా ప్రకటించండి. మా స్థానాలు శాసనసభలో ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపండి’ అని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన అనంతరం బోస్ మీడియాతో మాట్లాడారు. 

దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, ఎం.ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబుతో కలిసి బోస్ మాట్లాడుతూ స్పీకర్ సాక్షిగా తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినా ఇంకా నోటీసులు ఇవ్వడమనేది ధర్మం కాదు, ఇది కాలయాపన చేసే ఎత్తుగడలే (డిలే టాక్టిక్స్) తప్ప మరొకటి కాదని అన్నారు. స్పీకర్ సాధ్యమైనంత త్వరగా తమను అనర్హులుగా ప్రకటి స్తే మార్చిలో ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు వస్తాయనీ అపుడు తాము పోటీ చేయడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రైతుల కోసం, విశ్వసనీయత కోసం, ఇచ్చిన మాటకు కట్టుబడి మేమంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశాం, ఇంకా మా నుంచి తెలుసుకునే వివరణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ‘నోటీసులు ఇవ్వడం, వాద ప్రతివాదాలు చేయడం అన్నీ అనవసరం, గౌరవ సభాపతి ఇలా జాప్యం చేయడం తగదు’ అని ఆయన అన్నారు. 

తమ స్థానాల్లో జరిగే ఎన్నికలు రైతుల పక్షాన ఉన్న వారికీ, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికీ మధ్య జరిగే పోరాటమని ఆయన అభివర్ణించారు. స్పీకర్ నోటీసును అనుసరించి తాము తప్పకుండా ఆయనకు సమాధానం ఇస్తామని అన్నారు. అనర్హులుగా ప్రకటించండి, మేం ప్రజలదగ్గరకు వెళ్లదల్చుకున్నాం అని తేల్చి చెబుతామని బోస్ అన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓట్లేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒకే సారి కాకుండా విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాలన్న కుట్ర పూరిత ఆలోచన వల్లనే జాప్య పూరిత విధానాన్ని అనుసరిస్తున్నారనీ ఇలాంటి వాటికి స్పీకర్ తావివ్వకుంటే మంచిదని ఆయన అన్నారు. 

ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోనూ తమ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సర్వే నివేదికలూ సానూకూలంగా ఉన్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యల విషయంలో నిరంతరం పోరాడుతూనే ఉన్నామనీ ఆ విషయంలో తాము వెనుకబడలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా రాజకీయ పార్టీ అన్నాక అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందనీ తాము కూడా అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతామని ఆయన అన్నారు. తమ పార్టీ మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేసి తీరుతుందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Share this article :

0 comments: