జగన్ సీఎం సీటు అడగలేదు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సీఎం సీటు అడగలేదు..

జగన్ సీఎం సీటు అడగలేదు..

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011



అసెంబ్లీలో విజయమ్మ తొలి ప్రసంగం
వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలనేదే వీరి కుతంత్రం..
అయినాసరే.. విలువలకు కట్టుబడే ఉంటాం
రైతులు, రైతు కూలీల కోసం అవిశ్వాసానికి మద్దతిస్తాం
వైఎస్‌ను అభిమానించే ఎమ్మెల్యేలు
ఉప ఎన్నికలకూ సిద్ధంగా ఉన్నారు
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి
వైఎస్ ఎంతో కష్టపడ్డారు.. సుదీర్ఘ పోరాటం చేశారు
ఈ రోజు చంద్రబాబు ఆయన్ను నానా మాటలు అంటుంటే..
ఈ కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం బాధనిపించింది
రైతుల పేరుతో అవిశ్వాసం పెట్టి బాబు మొత్తం వైఎస్ గురించే మాట్లాడారు
అసలు అవిశ్వాసం ప్రభుత్వంపైనా..? లేక వైఎస్‌పైనా?
మహానేతను గుర్తుతెచ్చుకుని భావోద్వేగానికి గురైన విజయమ్మ

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ, ఆయన ప్రతిరూపాన్ని ప్రజల గుండెల్లో నుంచి శాశ్వతంగా దూరం చేయాలని కుట్ర పన్నిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ.. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. తొలిసారి సభలో మాట్లాడిన ఆమె గద్గద స్వరంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘2009లో ప్రతిపక్షాలన్నీ ఏకమైనప్పుడు.. గెలిచినా ఓడినా బాధ్యత నాదే అని చెప్పి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ను రెండోసారి గెలిపిం చారు. ఆయన గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవి శ్వాసం గురించి మాట్లాడాల్సి రావడం బాధగా ఉంది.. నాకు మాటలు రావడంలేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

వైఎస్ పథకాలను నిర్వీర్యం చేయడం, రైతులకు బాసటగా నిలవాలన్న ఆయన ఆశయాలకు విరుద్ధంగా సర్కారు పనితీరు ఉండటంవల్లే ఈ రోజు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సి వస్తోందని స్పష్టం చేశారు.

రైతుల పేరుతో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఓ వింత అని, అయినా రైతులు, రైతు కూలీల కోసం ఈ తీర్మానానికి మద్దతిస్తున్నామని చెప్పారు. ‘కాంగ్రెస్ అంటే వైఎస్.. వైఎస్ అంటే కాంగ్రెస్ అన్నవిధంగా మహానేత కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడ్డారు. అయినా ఆయనకు ఆ పార్టీ ఇచ్చిన బహుమానం ఏమిటి? ఆయనపై సభా సంఘం వేయడం, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చడం, ఆయన కుటుంబాన్ని వెలివేసినట్లు చేయడమా?’ అని నిలదీశారు.

విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే...

అవిశ్వాసం రైతుల కోసమా? లేక వైఎస్‌పైనా?

‘ఎప్పుడూ అసెంబ్లీలో ఆయన (వైఎస్సార్) మాట్లాడేటప్పుడు ఇంట్లో కూర్చుని వినేదాన్ని. విధిలేని పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడకు వచ్చి మాట్లాడటం బాధగా ఉంది. 2009 ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలన్నీ ఏకమైనప్పుడు గెలిచినా ఓడినా తనదే బాధ్యతని వైఎస్ చెప్పి గెలిపించుకున్న ఈ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసం మీద మాట్లాడాల్సి రావడం బాధాకరం. నాకు మాట్లాడేందుకు మాటలు కూడా రావడం లేదు. నేను అసెంబ్లీ సమావేశాలను ఇక్కడ కూర్చుని మొదటిసారి వింటున్నాను. ఉదయం నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వైఎస్‌ను తలచుకుంటూనే ఉన్నాయి. చంద్రబాబు అయితే అంతా వైఎస్ మీదే మాట్లాడారు. ఆయన అవిశ్వాసం వైఎస్‌పై పెట్టారా? రైతుల కోసం పెట్టారా? అర్థం కావడం లేదు. చంద్రబాబు కూడా తొమ్మిదేళ్లు పాలించారు. ఆయన చేస్తే మంచి, వేరే వాళ్లు చేస్తే కాదా? వేరేవాళ్లు చేస్తే అవినీతా? అని నేను ప్రశ్నిస్తున్నాను. పచ్చకామెర్ల వారికి అంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు మాట్లాడారు చంద్రబాబు.

వైఎస్ పెట్టినన్ని పథకాలు ఎవరూ పెట్టలేదు..

వైఎస్ గారు చనిపోయి రెండున్నరేళ్లవుతోంది. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పనిలేదు. ఆయనపై ఇప్పటికే ఎంక్వైరీలు నడుస్తున్నాయి. కోర్టులో కేసులున్నాయి. దయచేసి ఇక్కడ ఉన్నవారందరికీ చెపుతున్నా.. ఆయన గురించి ఏదైనా ఉంటే కోర్టుకు, సీబీఐకి అందజేయండి. చంద్రబాబునాయుడు వైఎస్సార్‌ను తిడుతుంటే కాంగ్రెస్ వాళ్లు స్పందించడం లేదు. వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. 25 ఏళ్ల సుదీర్ఘపోరాటం ఆయనది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. వందల మైళ్లు పాదయాత్ర చేశారు. ఆయన పడ్డ కష్టం భార్యగా నాకు తెలుసు. ఆయన పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని విధంగా రూపకల్పన చేశారు. ఎవరూ పెట్టనన్ని పథకాలు పెట్టారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి..

ఈ రోజు అవిశ్వాసానికి ఎందుకు మద్దతిస్తున్నామో చెపుతున్నాను. ‘ఈ ప్రభుత్వం వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను నడిపించడం లేదు. అన్యాయం జరుగుతోంది. మా పార్టీకి బలం లేదు. కాబట్టి ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తాం’ అని జగన్ తాను చేసిన దీక్షల సందర్భంగా చెప్పాడు. దానికి కట్టుబడే.. అవిశ్వాసం ఎవరు పెట్టారనేది కాకుండా రైతులు, రైతు కూలీలు, పేదల పక్షాన దానికి మద్దతిస్తున్నాం.

వైఎస్ హయాంకీ.. నేటికీ ఎంత తేడా!

రైతుల పక్షపాతిగా వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, బకాయిల రద్దు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన ప్రభుత్వంలోనే రుణమాఫీ జరిగింది. ఆయన హయాంలోనే గిట్టుబాటు ధర లభించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించారు. సకాలంలో వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తోంది? అప్పుడు వరికి ధర రూ.1400 - 1500 వస్తే ఇప్పుడు రూ.700 లోపే వస్తోంది. పత్తి అప్పుడు రూ.6 వేలు తాకితే ఇప్పుడు రూ.3500 వస్తోంది. పసుపు పంటకు అప్పుడు 16 వేల ధర లభిస్తే ఇప్పుడు ఐదు వేలే వస్తోంది. పొగాకు అప్పుడు 13,500 పలికితే ఇప్పుడు 6,500 వస్తోంది. చెరకు ధర అప్పుడు ఇప్పుడూ అటూ ఇటూ 2,200-2,300గా సమానంగానే ఉన్నా చక్కెర ధర అప్పుడు రూ.23 ఉంటే ఇప్పుడు రూ.34 అయింది.

ఇచ్చింది రెండు హామీలే.. అవి ఏమయ్యాయి?

ఎన్నికల సమయంలో వైఎస్‌గారు రెండు హామీలే ఇచ్చారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వం దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు లక్ష ఎకరాల్లో క్రాప్‌హాలిడే ప్రకటించారు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు పెరిగిపోయాయి. వైఎస్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. ఇప్పుడు పెంచుతామంటున్నారు. రైతుల పక్షపాతి వైఎస్సార్ ఉంటే ఆయన ఉన్నారన్న భరోసా రైతులకు ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇక ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన రెండో హామీ రూ.2 కిలో బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామన్నారు. ఈ ప్రభుత్వం రూపాయికి కిలోబియ్యం ఇస్తామంటోంది. చాలా సంతోషం. అదయినా సరిగా జరిపించాలి.

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..

చంద్రబాబు ఆ రోజు వ్యవసాయం దండగన్నారు. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నవారు ఉచిత విద్యుత్ కావాలంటే వైర్లమీద బట్టలారేసుకోవడానికా? అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వమంటే అలా ఇస్తే ఇంకా ఆత్మహత్యలు ఎక్కువవుతాయన్నారు. అంత కరువు వచ్చినా కూడా చంద్రబాబు ఒక్క ఏడాది కూడా రుణమాఫీ గురించి ఆలోచించలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పెద్దగా ఆలోచన కూడా చేయలేదు. అలాంటి చంద్రబాబు ఈ రోజు రైతుల కోసం అవిశ్వాసం పెట్టడం ఒక వింత. అయినా రైతుల కోసం, రైతు కూలీల కోసం మేం మద్దతిస్తున్నాం. చంద్రబాబు ఆరు నెలల క్రితమే అవిశ్వాసం పెడతానన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో కలవనప్పుడు పెట్టిఉంటే ఈ ప్రభుత్వం పడిపోయి ఉండేది. (ఈ సమయంలో టీడీపీ సభ్యులు అభ్యం తరం చెప్పడంతో.. ‘ఇంతసేపూ మీరు వైఎస్ గురించి మాట్లాడుతుంటే మేం వింటూ కూర్చోలేదా?’ అని విజయమ్మ ప్రశ్నించారు) చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతోంది.
కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న నాటకం

ఇప్పుడు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలని కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఏదిఏమైనా, ఎవరెన్ని రాజకీయాలు చేసినా, నైతిక విలువలు, విశ్వసనీయత, సిద్ధాంతానికి కట్టుబడి వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వైఎస్ ఆశయాలను నిర్వీర్యం చే స్తున్న ఈ పార్టీకి, ప్రభుత్వానికి వైఎస్ సహచరులు ఓటుతో బుద్దిచెప్పాలి. 10 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. హృదయ అంతరంగాలను చూసే దేవుడు చూస్తున్నాడు. ఓటు వేసే ముందు వైఎస్ సహచరులు తమ మనస్సాక్షిని అడిగి వేయాలి. ఇదో చరిత్రాత్మక సంఘటన. రాష్ట్ర చరిత్రలో మొదటిది. విలువలు, విశ్వసనీయత, సిద్ధాంతానికి కట్టుబడి.. తాము అనర్హతకు గురైనా ఫర్వాలేదని, ఉప ఎన్నికలను కూడా లెక్కచేయకుండా ఓటేస్తున్న వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలందరికీ హృదయపూర్వక అభివందనాలు. వారిని ప్రజలు కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులు, రైతు కూలీలు, పేదల పక్షాన నిలుస్తుందని, ప్రజల హృదయాలను తాకిన వైఎస్ పథకాలను కొనసాగిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను.



వైఎస్ పథకాలన్నింటినీ నీరుగారుస్తున్నారు

ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉన్నవారికీ, లేనివారికీ ఒకే వైద్యం అందించేందుకు వైఎస్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పథకం నుంచి ఎన్నో జబ్బులను తీసేసింది. 108 వాహనాలు ఆ రోజు ప్రాణదాతగా ఉండేవి. ఇప్పుడు ఫోన్ చేస్తే డీజిల్ లేదంటున్నారు. 104 సంచార వాహనాలు ఏమయ్యాయి? పింఛన్ల విషయానికొస్తే.. మహానేత పాదయాత్ర చేసినప్పుడు ఇంటికొచ్చి బాధపడ్డారు. పింఛన్ కావాలంటే ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారెవరయినా చనిపోతే ఇస్తామని చెపుతున్నారని చాలా బాధపడ్డారు. అప్పుడు తెలుగుదేశం హయాం పరిస్థితి అది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు ఇచ్చారు. రూ.75 నుంచి రూ.200కు పెంచారు. వికలాంగులకు రూ.500 వరకు ఇచ్చారు. ఒకటో తేదీన జీతమిచ్చినట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎన్ని పింఛన్లు రద్దు చేశారు? 1.85 లక్షల వికలాంగ పింఛన్లు రద్దు చేశారు. కార్డులు కూడా తీసేశారు. ఇందిరమ్మ ఇళ్లయితే అప్పుడు కట్టిన వాటికీ ఇప్పటివరకు బిల్లులివ్వలేదు. మహిళల్ని లక్షాధికారులను చేయాలని ఆయన తపించారు. ఇప్పుడు పాలకులు వడ్డీలేని రుణాలిస్తామంటున్నారు. సంతోషం. సక్రమంగా నడిపించండి. పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై భరోసా ఉండేది. ఈరోజు అది లేదు. పరిమితులు పెట్టి చాలామందిని పథకం నుంచి తీసేస్తున్నారు.

ఒక్కరి దగ్గరకైనా వెళ్లి పలకరించారా?

కాంగ్రెస్ వాళ్లు వైఎస్సార్ మా నాయకుడు అని పదేపదే అంటున్నారు. మరి వైఎస్సార్ చనిపోయినప్పుడు ఎంతో మంది అభిమానులు ప్రాణాలు వదిలారు. ఏ ఒక్కరి దగ్గరికయినా వీళ్లు వెళ్లి పలకరించారా? కాంగ్రెస్ అంటే వైఎస్సార్, వైఎస్సార్ అంటే కాంగ్రెస్ అనే విధంగా కష్టపడ్డారాయన. ఇంకా రెండు, మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే పటిష్ట స్థితికి వైఎస్సార్ తీసుకెళ్లారు. మరి కాంగ్రెస్ ఆయనకు ఏమి బహుమానం ఇచ్చింది? ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చడం, ఆయనపై హౌస్ కమిటీ వేయడం బహుమానమా? ఆయన కుటుంబాన్ని బయటకు పంపడం... మమ్మల్ని వెలివేసినట్లు చేయడం బహుమానమా? పొమ్మనలేక పొగబెట్టడం బహుమానమా? అయినా ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం జగన్ బయటకు వెళ్లాడని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ప్యాకేజిలిస్తున్నారని అంటున్నారు. ఉదయం నుంచి నేను వింటున్నాను. నాకు చాలా బాధేస్తోంది. ఎందుకలా నిందలేస్తున్నారు? ఆయన పెట్టిన పథకాలను నీరుగారుస్తున్నారు. జనం గుండెల్లోంచి ఆయన ప్రతిరూపాన్ని తీసేయాలనుకుంటున్నారు. ఇది నీచమైన సంస్కృతి అని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఒక వర్గం మీడియాతో కలిసి ఆయన ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారు. చాలా బాధాకరం.

జగన్ సీఎం సీటు అడగలేదు..

విజయమ్మ ప్రసంగం ముగిసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ సీఎం పదవి కోసమే పార్టీ నుంచి బయటకెళ్లారని ఆరోపించారు. దీనికి స్పందించిన విజయమ్మ జగన్ ఏనాడూ ముఖ్యమంత్రి సీటు అడగలేదని స్పష్టం చేశారు. ‘ ఆ సీటు కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ అడిగింది లేదు. సోనియా దగ్గరికెళ్లినప్పుడు కూడా అడగలేదు. దయచేసి ఆ మాటను విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన అడిగింది కేవలం ఓదార్పుయాత్రకు అనుమతి మాత్రమే. దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. వైఎస్ మీద హౌజ్ కమిటీ వేసినప్పుడు, ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు వీరంతా ఏం చేశారు?’ అని ఆమె ప్రశ్నించారు.
Share this article :

0 comments: