కిలో టమాటా ధర అర్ధ రూపాయా? ఉల్లిగడ్డకు రెండు రూపాయలే దిక్కా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిలో టమాటా ధర అర్ధ రూపాయా? ఉల్లిగడ్డకు రెండు రూపాయలే దిక్కా?

కిలో టమాటా ధర అర్ధ రూపాయా? ఉల్లిగడ్డకు రెండు రూపాయలే దిక్కా?

Written By ysrcongress on Sunday, December 25, 2011 | 12/25/2011

కన్నబిడ్డలా సాకిన పంటను రైతు గిట్టుబాటు లేక మట్టిపాలు చేస్తున్నాడు.. 
కిలో టమాటా ధర అర్ధ రూపాయా? ఉల్లిగడ్డకు రెండు రూపాయలే దిక్కా? 
ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగేలా ఉద్యమిస్తాం
వేల రూపాయలు అప్పుచేసి పెట్టుబడి పెడితే.. కోత కూలీ దక్కటం లేదు 
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు పారవేస్తున్న దుస్థితి 
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్న ఉరే శరణ్యమనుకుంటున్నాడు

‘‘మన ఖర్మ ఏమిటంటే ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వలేని దుస్థితిలోకి ప్రభుత్వం దిగజారిపోయింది. రైతులు పండించిన పంటను పారేస్తున్నా, పొలంలోనే వదిలేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. పట్టించుకునే నాథుడు లేడు. గత పది నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయశాఖకు మంత్రి లేడు. విత్తన నాణ్యత పరీక్షించే వ్యవసాయ పరిశోధన యూనివర్సిటీకి వైస్‌చాన్స్‌లర్ లేడు.. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు’’. 
-జగన్‌మోహన్‌రెడ్డి

కడప / మైదుకూరు (వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: ‘‘లక్షల రూపాయలు అప్పులు చేసి.. ఇంటిల్లిపాదీ పగలూ రాత్రీ నడుములు విరిగేటట్టు శ్రమించి.. నారు పోసి నీరు పెట్టి.. కలుపు తీసి ఎరువు వేసి.. కన్నబిడ్డలా పైరును పెంచి.. కోత కోసిన పంటకు మార్కెట్‌లో కనీసం అర్ధ రూపాయి కూడా పలకటం లేదు. కడుపున పెట్టుకుని పెంచిన పైరును, పంటను రోడ్డు పాలు చేయాల్సిన దయనీయ పరిస్థితి అన్నదాతకు దాపురించింది. 

ఇదెక్కడి న్యాయం? ఇదేమి రాజ్యం? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, పరిపాలన అనేది అసలు ఉన్నదా? అన్నం పెట్టే రైతన్న పంట చూసుకుని, దానికి పలుకుతున్న ధరను చూసుకుని కన్నీళ్లపాలవుతుంటే.. ఆదుకోవాల్సిన సర్కారుకు అసలు మనసనేది ఉన్నదా? పేరుకుపోయిన అప్పులు తీర్చలేక దిక్కుతోచని రైతన్న ఆత్మహత్యే ఉన్న దారని రోదిస్తోంటే.. ఆదుకునే దిక్కెవరు? మేమున్నామని భరోసా ఇచ్చేది ఎవరు? ఎవరూ ఆదుకోకపోతే రైతన్న ఎక్కడికి పోవాలి? ఏమైపోవాలి?’’- టమాటా పంటకు అర్ధ రూపాయి కూడా పలకటం లేదంటూ ఓ రైతు తను పండించిన పంట మొత్తాన్నీ కళ్ల నీళ్లతో గొర్రెలకు ఆహారంగా పారేస్తోంటే చూసి చలించిపోయిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన ఇది! 

కోత కోసి మార్కెట్‌కు తీసుకెళితే కనీసం రవాణా చార్జీలు కూడా రావటం లేదన్న కారణంతో కేపీ ఉల్లి తోటను గుంటకతో దున్నేస్తున్న సంఘటన చూసి నిశ్చేష్టుడైన జగన్ ఆక్రోశమిది!! ‘‘ఏ పంట వేసినా రైతుకు కన్నీళ్లు, కడగండ్లు తప్పటం లేదు. మనసుంటే మార్గముంటుంది... ఈప్రభుత్వానికి మనసు లేదు.. మానవత్వం లేదు. అందుకే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. విషమ పరిస్థితుల్లో చిక్కుకున్న రైతుకు భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తక్కువే’’ అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్‌ఆర్ జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించి రైతుల దుస్థితిని పరిశీలించారు. మైదుకూరు మండలం భూమయ్యగారిపల్లె చండ్రాయుడు అనే రైతు టమాటా పొలంలో ఏపుగా కాసినా ధరలు లేకపోవటంతో టమాటా కాయలు గొర్రెలకు మేతగా మారిన దృశ్యం కనిపించింది. 

సుబ్బరాయుడు అనే మరో రైతును జగన్ కదలించగా.. ‘‘ఆరు ఎకరాల్లో టమాటా సాగు చేశాను. రూ. 1.5 లక్షలు పెట్టుబడి అయింది. పంట బాగా పండినా ధరలు లేవు. 30 కిలోల టమాటా బుట్ట మార్కెట్‌కు తీసుకెళ్తే రూ. 15 ధర పలుకుతోంది. కిలోకి అర్ధ రూపాయి ఇస్తున్నారు. ఆ అర్థ రూపాయితో అప్పులెలా తీర్చాలి? ఇంట్లో పిల్లా పాపా ఏం తినాలి? కుటుంబం ఎలా బతకాలి సామీ? ఏమి చేయాలి సామీ మేము..? మీ నాయన చనిపోయాక వ్యవసాయం మానుకోవాల్సి వస్తోంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే దారిన వెళుతుండగా శెట్టివారిపల్లె గ్రామంలో సాంబశివారెడ్డి అనే రైతు పండించిన పంటకు ధరలేదన్న బాధతో కేపీ ఉల్లి తోటను గుంటకతో దున్నేస్తున్న సంఘటన సైతం కనిపించింది. ‘‘ఎకరాకు దాదాపు రూ. 15,000 పెట్టుబడి పెట్టి కేపీ ఉల్లి సాగుచేశాం. కోతకు మరో రూ. 5,000 అవుతుంది. ఎకరాకు 30 నుంచి 50 క్వింటాళ్లు దిగుబడి ఉండేది. రెండేళ్ల కిందట క్వింటాల్‌కు రూ. 2,700 నుంచి రూ. 3,200 వరకు ధరలు ఉండేవి. ఇప్పుడు దిగుబడి 15 క్వింటాళ్లకు పడిపోయింది. మార్కెట్‌లో ధర క్వింటాలుకు రూ. 500 పలికితే గగనంగా ఉంది. కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంక పంటను కోసి ఏం చేసుకోవాలి సామీ?’’ అని ఆ రైతు జగన్‌కు వివరించారు. 

ఏ పంటకూ గిట్టుబాటు ఇవ్వలేదు... 

రైతుల దయనీయ పరిస్థితులను స్వయంగా చూసి తెలుసుకున్న జగన్ చలించిపోయారు. వ్యవసాయమే జీవనాధారమైన రైతన్నకు.. పండిన పంటకు కనీస గిట్టుబాటు ధరను కల్పించాల్సిన ప్రభుత్వానికి కాస్త కూడా మనసు లేకుండా పోయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మన ఖర్మ ఏమిటంటే ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వలేని దుస్థితిలోకి ప్రభుత్వం దిగజారిపోయింది. రైతులు పండించిన పంటను పారేస్తున్నా, పొలంలోనే వదిలేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. పట్టించుకునే నాథుడు లేడు. విదేశాలకు ఎగుమతి చేసే కేపీ ఉల్లిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనా ఈ సర్కారుకు లేదు. ఇవాళ రైతన్నలు ఉరి వేసుకోవటమే మేలు అనే పరిస్థితి ఉత్పన్నమయింది. ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో రైతు ఉన్నాడనే కనీస ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. 

రైతన్న అత్మహత్యలకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తోంది. అసలు గత పది నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయశాఖకు మంత్రి లేడు. విత్తన నాణ్యత, దిగుబడిని పరీక్షించే వ్యవసాయ పరిశోధన యూనివర్సిటికీ వైస్‌చాన్స్‌లర్ లేడు.. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఓ మంత్రి సొంత నియోజకవర్గంలోని రైతుల పరిస్థితిని పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రాంతంలో రైతు పరిస్థితి ఇలా ఉండిపోయింది’’ అని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

ఉల్లి కిలో రెండు రూపాయలా? 

‘‘రైతుల కష్టాలను కళ్లారా చూస్తున్న ప్రభుత్వానికి కనీస మానవత్వం లేకుండా పోయింది. రెండేళ్ల కిందట బుట్ట రూ. 900 పలికిన టమాటా పంట.. ఇప్పుడు కిలో రూ. 50 పైసలు పలకటం లేదు.. రైతు ఎకరాకు రూ. 30,000 వరకూ పెట్టుబడి పెట్టాడు. కేవలం రెండు కోతలు కోసి మార్కెట్‌కు తరలించే లోగా దళారీ వ్యవస్థ ఫలితంగా ధరలు అమాంతం పడిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట కోతకు కూలీ డబ్బులు రావటం లేదు. అందుకే ఇక రైతులు చేసేది ఏమీలేక పంట ఉత్పత్తులను పొలంలోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులు మరో పంట వేసుకునేందుకు గొర్లకు ఇచ్చేశారు. పెద్ద బళ్లారి ఉల్లి గడ్డలు ఎకరాకు 80 క్వింటాళ్లు దిగుబడి కావాల్సి ఉండగా.. 15 క్వింటాళ్లకు పడిపోయాయి. నాడు క్వింటాలు రూ. 3,200 దాటిన యర్రగడ్డలను వ్యాపారులు ఇప్పుడు కేజీ రూ. 2కు కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎకరాకు రూ. 5,000 కూడా రైతుకు దక్కటం లేదు. పెట్టుబడులు ఎకరాకు రూ. 15,000 అయ్యాయి. పసుపు రైతుదీ ఇదే దుస్థితి. రైతు పంట సాగు చేయటం వల్ల వేలకు వేలు అప్పులు మాత్రమే మిగులుతున్న రోజులు వచ్చాయి. ఇలాంటి రైతు దిక్కులేక ఆకాశం వైపు చూస్తున్నా ప్రభుత్వానికి పట్టటం లేదు’’ అని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. కేపీ ఉల్లి రైతులను సత్వరమే ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగేలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతుల కోసం, రైతు కూలీల కోసం పదవులు పోతాయని తెలిసినా 17 మంది ఎమ్మెల్యేలు అండగా నిలిచి, ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆయన గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డి బ్రదర్స్, ఇ.వి.మహేశ్వరరెడ్డి, దనపాల జగన్ తదితరులు పాల్గొన్నారు.


పండిన ఉల్లిని దున్నేశారు!

ఖరీఫ్‌లో సాగు చేసిన విదేశీ ఎగుమతి రకం పంట కేపీ ఉల్లి (అగ్రిపౌండ్‌రోజ్) రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, బీమఠం, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బీకోడూరు మండలాల్లోనే కాకుండా.. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 10,550 ఎకరాల్లో అధికంగా రైతులు కేపీ ఉల్లి సాగు చేశారు. కానీ.. రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు పడిపోయాయి. విదేశీ మార్కెట్లో కేపీ ఉల్లి క్వింటాల్ రూ. 1,723 (గ్రేడింగ్ లేకుండా) ధర ఉండగా.. చెన్నైలో క్వింటాల్‌కు రూ. 600 ధర పలుకుతోంది. దీంతో ప్రయివేటు వ్యాపారులు రైతులకు క్వింటాల్‌కు రూ. 400 నుంచి రూ. 500 మాత్రమే చెల్లిస్తున్నారు. ఉల్లిగడ్డల సైజు తక్కువగా ఉంటే కొనటమేలేదు. పంట సాగుకు ఎకరాకు రూ. 15,000 వరకు రైతు ఖర్చు చేశాడు. పంట కోసేందుకు మరో రూ. 5,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రాలేదు. ఈ పరిస్థితుల్లో క్వింటాల్‌కు రూ. 2,500 ధర పలికితే గానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ.. మార్కెట్ ధరలతో పంట కోత కూలీ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేకపోవటంతో దువ్వూరు, మైదుకూరు మండలాల్లో రైతులు పంటను దున్నేస్తున్నారు.

టమాటాపై దళారుల రాజ్యం

మైదుకూరు, వనిపెంట, జీవీ సత్రం, కేశలింగాయపల్లె ప్రాంతాల్లో టమాటా కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి రోజూ ఇక్కడి నుంచి 500 టన్నులు చెన్నై, గుంటూరు, విజయవాడ, నెల్లూరు తదితర మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. కానీ.. దళారుల దోపిడీ ఫలితంగా టమాటా రైతు కుదేలవుతున్నాడు. పంట పండించి మార్కెట్‌కు తీసుకువచ్చేవరకే ఉత్పత్తులపై రైతుకు హక్కు ఉంటోంది. మార్కెట్‌లోకి పంట ఉత్పత్తులు చేరితే.. ఇక వ్యాపారులదే హవా. పంటను బట్టి ధరల్లో భారీ కోత కోయటం పరిపాటిగా మారింది. టమాటా పచ్చిసరుకు కావటంతో నిల్వ ఉంచుకునే అవకాశం లేక.. వ్యాపారులు అడిగిన కాడికి రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి. 2010-11లో బాక్స్(28 కిలోలు) టమాటా ధర రూ. 890 పలికింది. కనిష్ట ధర రూ. 100 కు చేరింది. 2011-12 సీజన్ ప్రారంభంలో టమాటా బాక్స్ ధర (28 కిలోలు) రూ. 300 పలికింది. ఇప్పుడు ఆ ధర రూ. 15 కి పడిపోయింది. ఆ ధరకు కొనేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావటం లేదు. గత ఎడాది రోజుకు 700 టన్నులు ఎగుమతి అవుతున్నా ధర ఇంత దారుణంగా పడిపోలేదు. దీంతో.. రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తునానరు. కోసిన వాటిని పారేస్తున్నారు.

దగా పడ్డ పసుపు రైతు

పసుపు పంటదీ ఇదే దుస్థితి. ఎకరాకు లక్ష రూపాయల నుంచి రూ. 1.25 లక్షల వంతున ఖర్చు చేయాల్సి వస్తోంది. 2010-11 ఖరీఫ్‌లో పసుపు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2009-10 సీజన్‌లో పసుపు ధరలు ఆకాశాన్ని అంటాయి. అదే ధర ఈ ఏడూ ఉంటుందని రైతు ఆశపడ్డాడు. జిల్లాలో ఎన్నడూ లేనంతగా ఖరీఫ్‌లో పసుపు విస్తీర్ణం 5,475 హెక్టార్లకు పెరిగింది. విత్తనానికి రూ. 12,000 వ్యయంతో పాటు ఇతర ఖర్చులు కలిపి ఎకరాకు రూ. 1.25 లక్షల వరకూ రైతు పెట్టుబడి పెట్టాడు. కానీ ఆది నుంచే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. తెగుళ్లు వ్యాప్తి చెంది నాణ్యత దెబ్బతింది. దిగుబడి తగ్గిపోయింది. దీంతో ధరలు పడిపోయాయి. రెండు నెలల కిందటి వరకు వట్టి పసుపు ధర క్వింటాలుకు రూ. 7,500 గా ఉంటే.. ఇప్పుడది రూ. 4,000 కు పడిపోయింది. ఆ ధర కూడా నాణ్యత వంద శాతం ఉంటేనే ఇస్తున్నారు. నాణ్యత తగ్గితే క్వింటాలు పసుపు రూ. 3,000 లోపే అమ్ముకోవల్సి వస్తోంది. అటు దిగుబడులు తగ్గి, ఇటు ధరలు లేక.. పసుపు రైతు దిగాలు చెందుతున్నాడు. కొందరు పచ్చి పసుపును ఉడికించి వట్టి పసుపు తయారు చేసి నిల్వ ఉంచుకున్నారు. నిల్వ చేయటం వల్ల పంట తూకం తగ్గటమే కాకుండా ఖర్చులు పెరిగాయి. పైగా ధరలూ తగ్గిపోతుండటంతో వట్టి పసుపునూ తెగనమ్ముకోవల్సి వస్తోంది.
Share this article :

0 comments: