కరువు పరిస్థితుల నేపథ్యంలో ఒకటి నుంచి రెండు మీటర్ల మేర తగ్గిన భూగర్భ జలాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరువు పరిస్థితుల నేపథ్యంలో ఒకటి నుంచి రెండు మీటర్ల మేర తగ్గిన భూగర్భ జలాలు

కరువు పరిస్థితుల నేపథ్యంలో ఒకటి నుంచి రెండు మీటర్ల మేర తగ్గిన భూగర్భ జలాలు

Written By ysrcongress on Sunday, December 25, 2011 | 12/25/2011

గతేడాది 1,800 పల్లెల్లోనే ఈ దుస్థితి
కరువు పరిస్థితుల నేపథ్యంలో ఒకటి నుంచి రెండు మీటర్ల మేర తగ్గిన భూగర్భ జలాలు
బోరుమంటున్న బావులు, బోర్లు.. 50 వేల చేతి పంపులు పనిచేయని వైనం 
నిధులు విడుదల చేయని అధికారులు... కరెంటు కోతలతో నీటి సరఫరా అస్తవ్యస్తం


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇది వేసవి చిత్రం కాదు.. రాష్ట్రంలో మంచినీటికి ఏర్పడిన కరువు చిత్రం.. ఇంకా వేసవి రానేలేదు.. అప్పుడే పల్లెల్లో నీళ్లు లేక బావులు బోరుమంటున్నాయి.. చేతి పంపులు చేతులెత్తేస్తున్నాయి.. రాష్ట్రంలోని కరువు పరిస్థితుల నేపథ్యంలో మంచి నీటికీ కరువు ఏర్పడటంతో జనం గుక్కెడు నీటి కోసం నీటి చెలమల వద్ద ఇలా పడరాని పాట్లు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఏకంగా నాలుగు వేలకు పైగా గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. గతేడాది 1,800 గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉండగా.. డిసెంబర్ నెలలో ఏ గ్రామానికీ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసే దుస్థితి ఏర్పడలేదు. కానీ ఈసారి దాదాపు 300 గ్రామాల్లో ఇప్పటికే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా జరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న గ్రామాల సంఖ్య రోజురోజుకీ పెరిగే అవకాశం ఉందని గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రంలో సమగ్ర మంచినీటి రక్షి త పథకాలతో 35 శాతం ప్రజలకే మంచి నీరు సరఫరా అవుతోంది. వేలాది గ్రామాల్లో మంచి నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. 22 జిల్లాల్లో దాదాపు 3.20 లక్షల చేతి పంపులు ఉంటే.. వాటిల్లో 10 నుంచి 15 శాతం పంపులు పనిచేయడం లేదు. అంటే భూగర్భ జలాలు ఎండిపోవడం లేదా పరికరాల కొరత వల్ల దాదాపు 50 వేల బోర్లు పనిచేయకున్నా.. పట్టించుకునే వారే లేరు. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ తాగు నీటి పథకాలను నిర్మించే వరకే బాధ్యత వహిస్తోంది. వాటి నిర్వహణ బాధ్యత పంచాయతీలు, జిల్లా పరిషత్‌లదే. వారు నిధులు విడుదల చేస్తేనే.. నిర్వహణ సాధ్యమవుతుంది. 

అత్యవసర సేవలకు అవసరమైన నిధులపై ఎలాంటి ఫ్రీజింగ్ లేదని ప్రభుత్వం చెబుతున్నా.. ట్రెజరీ నుంచి నిధులు విడుదల కాని పరిస్థితి ఉంది. అదీగాక ప్రస్తుతం ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నిధుల ఖర్చుకు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఇటు తీవ్రమైన విద్యుత్ కోతలు కూడా మంచి నీటి సరఫరాను అస్తవ్యస్తం చేస్తున్నాయి. గతేడాది 1800 గ్రామాల్లోనే మంచి నీటి ఎద్దడి ఉండటంతో అక్కడ ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకుని నీరు సరఫరా చేశారు. ఈసారి 4 వేలకు పైగా పల్లెలు గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుండటంతో ముందస్తుగా వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతోపాటు చేతి పంపులు, సబ్‌మెర్సిబుల్ పంపు బోర్లను మరింత లోతుగా తవ్వాల్సిన పరిస్థితులున్నాయి. అయితే, వాటి పరిస్థితీ అరకొరగానే ఉండటంతో ఈసారి తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

విచ్చలవిడి బోర్ల తవ్వకాలే కారణం..

చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, కడప, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మంచి నీటి సమస్య అధికంగా ఉంటుంది. ఈసారి అది మరింత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశముంది. రాబోయే వేసవిలో తాగునీటి సరఫరా విషయంలో అధికారులు అశ్రద్ధతో ఉండరాదని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో తాగునీటి సమస్యను అధిగమించడానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్లు ఫ్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా.. విచ్చలవిడిగా బోర్లను తవ్వడంతోపాటు భూగర్భ నీటి వినియోగం బాగా పెరగడం వల్ల మంచినీటి సమస్య తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తాగునీటి వనరులు బాగున్న పరిసరాల్లో లెక్కకు మించి బోర్లు వేసేస్తున్నారని, దీంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. దీనికితోడు ఈసారి సాధారణంతో పోలిస్తే.. 20 శాతానికి పైగా తక్కువ వర్షపాతం నమోదైందని, ఒకటి నుంచి రెండు మీటర్ల మేరకు భూగర్భ జలాలు తగ్గాయని గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ట్యాంకర్లతో సరఫరా చేయడం మినహా ప్రస్తుతానికి మార్గం లేదని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. లక్షలాది మంది పల్లెవాసులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.
Share this article :

0 comments: