మునిసిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మునిసిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

మునిసిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Written By ysrcongress on Thursday, December 29, 2011 | 12/29/2011

రెండు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సమావేశాలు
స్థానిక సమస్యల పరిష్కారానికి 
పోరాటాలు చేయాలని నేతలకు సూచన

హైదరాబాద్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఇతర రాజకీయ పక్షాలకన్నా ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రె ండు రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, పరిశీలకులు, ముఖ్య నాయకులతో జరుగుతున్న సమావేశాల్లో మునిసిపల్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్త్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా రెండు మూడు నెలల్లో ఎన్నికలొస్తే పార్టీ టికెట్‌పై పోటీ చేయాల్సిన అభ్యర్థులపైన కూడా ప్రాథమిక చర్చ జరిగింది. పురపాలక, నగర పాలక సంఘాల పాలక వర్గాల పదవీ కాలం ముగిసినందున రాష్ట్రమంతా ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉంది. దీంతో పౌర సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. అందువల్ల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు పోరాటం సాగించాలని, ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని సమావేశాల్లో పాల్గొంటున్న ఆయా జిల్లాల నాయకులకు సూచనలు అందాయి. ప్రజల్లో పార్టీకి ఉన్న ప్రతిష్టకు తోడుగా స్థానికంగా పలుకుబడి గల అభ్యర్థులకు టికెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని, అలాంటి వారినే సిఫార్సు చేయాలని కూడా సమావేశం సూచించింది. జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై పార్టీ కూడా ఎప్పటికపుడు సర్వేలు జరిపించి, నివేదికలు తెప్పించుకుంటోంది. స్థానిక నాయకుల అభిప్రాయాలు, సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలిరోజు సమావేశాల్లో తెలంగాణ జిల్లాల నాయకులతో చర్చించింది. బుధవారం ఏడు కోస్తా జిల్లాల నేతలతో సమావేశమైంది. చివరి రోజైన గురువారం రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమావేశాలు విడివిడిగా జరుగుతాయి. కొణతాల రామకృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.





హైదరాబాద్, న్యూస్‌లైన్: జనాభా దామాషా ప్రకారం గిరిజనుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లో గిరిజనులకు కేంద్రంలో 7.5 శాతం, రాష్ట్రంలో రెండు శాతం కేటాయించాల్సి ఉండగా ఆ కోటాను ఎందుకు భర్తీ చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. లంబాడీల మనుగడకై లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంజీవ్‌నాయక్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మూడు రోజుల ఉపవాస దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని రవీంద్రనాయక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల్లో మంచినీరు, కరెంట్, రహదారులు, మందు బిళ్లలు కూడా దొరకనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని, పౌష్టికాహారం, పారిశుద్ధ్య లోపంతో రోగాల బారినపడి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

తెలంగాణ లంబాడీలను ఎస్టీలుగా గుర్తించాలని 1976లో తొలి ఉద్యమం జరిగితే, తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంజీవ్‌నాయక్ చేపట్టిన ఉద్యమం రెండవదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పారని, ఆ హామీని అమలు చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పాండు నాయక్, గిరిజన లాయర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనాయక్, రవీందర్ నాయక్, వికలాంగుల పోరాట సమితి నాయకులు లింగయ్య యాదవ్, లంబాడ హక్కుల పోరాట సమితి పొలిట్ బ్యూరో సభ్యులు రాజేష్ నాయక్, ప్రేమ్‌చంద్ నాయక్, రామారావు నాయక్, హరినాయక్, చిన్నబాబు నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
Share this article :

0 comments: