ఫిబ్రవరి 11నే వీఆర్వో పరీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫిబ్రవరి 11నే వీఆర్వో పరీక్షలు

ఫిబ్రవరి 11నే వీఆర్వో పరీక్షలు

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012


గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి రాత పరీక్షలను ఫిబ్రవరి 11న నిర్వహించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. వాస్తవంగా ఫిబ్రవరి 12న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూలు ఖరారైంది. అయితే ఫిబ్రవరి 12న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ (గేట్)తోపాటు మరికొన్ని పరీక్షలు కూడా ఉన్నాయి. అదేరోజు వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు ఇతర పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అభ్యర్థుల ప్రయోజనార్థం పరీక్ష తేదీని మార్చాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జె.సత్యనారాయణ ఈ విషయాన్ని ‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించారు. ‘10 లక్షల మందికిపైగా వీఆర్వో పరీక్షకు హాజరవుతున్నారు. అదే రోజు ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల కేటాయింపు, బందోబస్తు సమస్య తలెత్తుతుంది. విద్యార్థులు ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అధికారులతో సమీక్షించిన అనంతరం పరీక్ష ను ఫిబ్రవరి 11నే నిర్వహించాలని నిర్ణయించాం’ అని సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు ఈనెల 9న జిల్లా కలెక్టర్లు విడుదల చేసే అనుబంధ నోటిఫికేషన్లలో షెడ్యూలు విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.

బీసీలు, వికలాంగులకు వీఆర్వో పోస్టుల్లో వయోపరిమితి సడలింపు

వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకునే బీసీ, వికలాంగ అభ్యర్థులకు వయోపరిమితిని సడలిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీఆర్వో పోస్టులు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల జాబితా కిందకు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్-1996, రూల్ 12 ప్రకారం బీసీ, వికలాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపునిస్తున్నట్లు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి అశుతోష్‌మిశ్రా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా వీఆర్వో/వీఆర్‌ఏ అభ్యర్థుల కోసం సాక్షి ప్రత్యేక వెబ్‌పోర్టల్ ప్రారంభించింది. శనివారం సాయంత్రం సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ ఎస్.రామకృష్ణారెడ్డి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. వీఆర్వో/వీఆర్‌ఏ పరీక్షలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడమెలాగో తెలిపే ప్రిపరేషన్ ప్లాన్.. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూలు.. సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌కు బిట్ బ్యాంక్‌లు.. మోడల్ కొశ్చన్స్.. గ్రాండ్ టెస్ట్‌లతోపాటు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ ప్రత్యేక పోర్టల్‌లో సాక్షి పొందుపరిచింది. లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనార్థం సాక్షి దినపత్రిక ఇప్పటికే ప్రతిరోజూ ‘విద్య’లో ఒకటిన్నర పేజీ మెటీరియల్‌ను అందిస్తోం ది. అలాగే ప్రతి వారం భవితలో రెండుపేజీల్లో వీఆర్వో, వీఆర్‌ఏ గ్రాండ్‌టెస్ట్‌లను ఇస్తోంది. చాలాకాలం తర్వాత నిర్వహిస్తున్న వీఆర్వో/వీఆర్‌ఏ పరీ క్షకు ప్రామాణిక మెటీరియల్ లభించక.. గ్రామీణ అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించినట్లు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సిలబస్‌లోని ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో అందించినట్లు తెలిపారు. 

అలాగే పరీక్షపై అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూలు.. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు మోడల్ కొశ్చన్స్, గ్రాండ్ టెస్ట్‌లను ఇస్తున్నట్లు చెప్పారు. సాక్షి వీఆర్వో/వీఆర్‌ఏ ప్రత్యేక పోర్టల్‌ను భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) జె.సత్యనారాయణ పరిశీలించారు. ఈ వెబ్‌పోర్టల్ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉందని ప్రశంసించారు. తక్కువ కాలంలోనే వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థుల ప్రయోజనార్థం సాక్షి ఉచితంగా అందిస్తున్న మెటీరియల్, నమూనా ప్రశ్న పత్రాలు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పరీక్షను తొలిసారిగా నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సందేహాలను నివృత్తిచేసేందుకు.. సాక్షి సరైన గెడైన్స్ అందిస్తోందన్నారు. 

ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12న రాతపరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ.. అదే రోజున గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) ఉండడంతో ఫిబ్రవరి 11నే పరీక్షలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సోమవారం వెలువడనున్న అనుబంధ నోటిఫికేషన్‌లో వివరాలుంటాయని చెప్పారు. గ్రామీణ అభ్యర్థుల ప్రయోజనార్థం సాక్షి త్వరలో వీఆర్వో/వీఆర్‌ఏ ఆన్‌లైన్ టెస్టులు, మాక్‌టెస్టులనూ అందించనుంది. వీఆర్వో/వీఆర్‌ఏ ప్రత్యేక పోర్టల్ కోసం www.sakshieducation.com ను క్లిక్ చేయండి.
Share this article :

0 comments: