హైదరాబాద్ నుంచి ఆర్మూరుకు 11 గంటల పాటు సాగిన యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైదరాబాద్ నుంచి ఆర్మూరుకు 11 గంటల పాటు సాగిన యాత్ర

హైదరాబాద్ నుంచి ఆర్మూరుకు 11 గంటల పాటు సాగిన యాత్ర

Written By ysrcongress on Wednesday, January 11, 2012 | 1/11/2012


హైదరాబాద్ నుంచి ఆర్మూరుకు 11 గంటల పాటు సాగిన యాత్ర
ఉదయం 8.30కు పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి ప్రారంభం
తిలకం దిద్దిన కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి
రైతన్నల ఆత్మీయ స్వాగతం, సమస్యలు తెలుసుకుంటూ సాగిన జగన్
రాత్రి 8 గంటలకు దీక్షాస్థలికి 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలన్న డిమాండ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించడానికి మూడు రోజుల నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. రైతుల కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న తన దీక్షను అర్థం చేసుకోవాలని, రాజకీయం చేయొద్దని ఆయన చేసిన విజ్ఞప్తికి వారు పెద్ద ఎత్తున స్పందించారు. మంగళవారం ఉదయం 8.30కు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం ఆర్మూరు చేరేదాకా మార్గమధ్యంలో అడుగడుగునా జగన్‌కు పెద్దఎత్తున ఘనస్వాగతం లభించింది. దాంతో మధ్యాహ్నానికే ఆర్మూరు చేరాల్సిన ఆయన, రాత్రి 8 గంటలకు గానీ దీక్షా స్థలిని చేరుకోలేకపోయారు.

హైదరాబాద్ నుంచి బయల్దేరిన జగన్ రంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా నిజామాబాద్‌లో ప్రవేశించి ఆర్మూరు చేరారు. 

ప్రతి చోటా ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో పా టు జెండా ఆవిష్కరణలు ఏర్పాటు చేయడంతో ప్రయాణం నిర్దేశిత సమయాని కన్నా ఆరేడు గంటల ఆలస్యంగా సాగింది. దాని పొడవునా కార్యకర్తల కోలాహలమే కనిపించింది. మార్గమధ్యం లో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు జగన్ దీక్షకు మద్దతు ప్రకటించారు. జగన్ రాక ఆరేడు గంటలు ఆలస్యమైనా ప్రతిచోటా ప్రజలు ఆయన కోసం నిరీక్షిం చారు. వాస్తవానికి మార్గమధ్యంలో ఎక్కడా ఎలాంటి ముందస్తు కార్యక్రమాలూ లేవు. అయినా దాదాపుగా అన్ని చోట్లా కార్యకర్తలు జగన్‌ను ఆపి, జెండాను ఆవిష్కరించాల్సిందిగా పట్టుబట్టారు. ప్రతి చోటా జనం జాతరలా పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జగన్ దీక్షా స్థలానికి చేరుకోవాల్సి ఉండగా, అడుగడుగునా జనం జేజేలు పలుకుతుండటంతో 230 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మొత్తంగా 11 గంటలకు పైగా పట్టింది!

అంతకుముందు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ పంజాగుట్ట వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి జగన్‌కు తిలకం దిద్ది, దీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి తదితరులతో కలిసి జగన్ ఆర్మూరుకు బయలుదేరి వెళ్లారు.

కొలన్ శ్రీనివాస్‌రెడ్డి చేరిక

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొంపల్లి మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొలన్ శ్రీనివాస్‌రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన తన అనుచరులతో భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. కొంపల్లి చంద్రారెడ్డి గార్డెన్స్ సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్న జగన్, శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆలింగనం చేసుకున్నారు. పార్టీ నేతలు జనార్దనరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి నేతృత్వంలో కొలన్‌తో పాటు జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆంజనేయులు ముదిరాజ్ కూడా పార్టీలో చే రారు. అంతకు ముందు కొంపల్లి చౌరస్తా వద్ద స్థానిక నేత బెంబిడి శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు.

మేడ్చల్‌లో ఘనస్వాగతం

మేడ్చల్‌లో కార్యకర్తలు భారీగా బాజా భజంత్రీలతో జగన్‌కు స్వాగతం పలికారు. దాంతో వీలు లేకున్నా, అభిమానుల కోరిక మేరకు ఆయన అక్కడ కాసేపు ఆగారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళి ఘటించి, 10.20కి ముందుకు కదిలారు. జగన్ రాక తెలిసి శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్ మండలాల నుంచి వైఎస్సార్ అభిమానులు భారీగా మేడ్చల్ పట్టణానికి చేరుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద రెండు గంటలకు పైగా నిరీక్షించారు. జగన్‌ను కలిసేందుకు జాతీయ రహదారికిరువైపులా బారులు తీరారు.

చర్చిలో ప్రార్థనలు

మెదక్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త ఆది శ్రీనివాస్, పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, కన్వీనర్ బట్టి జగపతి తదితరులు జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. టీఎన్‌టీయూసీకి ఇటీవలే రాజీనామా చేసిన టీడీపీ నేత నర్ర భిక్షపతికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జిల్లాలో జగన్ పర్యటన 51 కిలోమీటర్ల మేర సాగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాయి. వడియారం వద్ద పోస్‌నెట్ పాఠశాల విద్యార్థులు పార్టీ జెండాలూపుతూ స్వాగతం పలికారు. ప్రపంచ ప్రఖ్యాత మెదక్ సీఎస్‌ఐ చర్చిని సందర్శించిన జగన్, సుమారు 15 నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ప్రెస్బిటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ నేతృత్వంలో ఫాదర్లు జగన్‌ను ఆశీర్వదించారు. రైతు దీక్ష జయప్రదానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి కట్టడం గురించి ఆయనకు వివరించారు. జగన్ సూచనల మేరకు పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు చర్చి సందర్శకుల పుస్తకంలో అభిప్రాయాన్ని రాశారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. రామాయంపేట మీదుగా తిరిగి 44వ జాతీయ రహదారిపైకి చేరుకున్న జగన్, బస్వాపూర్ మీదుగా నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు.

నిజామాబాద్‌లో అడుగడుగునా నీరాజనం

నిజామాబాద్ జిల్లా సరిహద్దు నుంచి దారిపొడవునా జగన్‌కు జనం నీరాజనం పలికారు. ‘జై జగన్’, ‘వైఎస్సార్ అమర్ రహే’ నినాదాలతో హోరెత్తించారు. తొలిసారిగా జిల్లాకు వచ్చిన మహానేత బిడ్డపై అపూర్వ రీతిలో ఆదరణ చూపారు. ఆయన రాక ఆరు గంటలు ఆలస్యమైనా ఆనందంగా వేచి చూశారు. భారీ కాన్వాయ్‌తో జిల్లాలో అడుగుపెట్టిన జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అన్ని వర్గాల వారూ సమరోత్సాహంతో నినదించారు. క్యాన్వాయ్ వెంట పరుగులు తీశారు. జగన్‌ను కలిసేందుకు, కరచాలనం చేసేందుకు దూసుకొచ్చారు. దాంతో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ, దీక్షాస్థలికి చేరాల్సి ఉందని సూచిస్తూ ముందుకుసాగారు. బస్వాపూర్, సదాశివనగర్ పద్మాజివాడి చౌరస్తా, గాంధారి కూడళ్లలో జగన్‌పై ప్రజలు పూల వర్షం కురిపించారు. వారికి అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్‌తో కదిలి వెళ్లారు.

చెరకు రైతుల సమస్యలు తెలుసుకుంటూ...

బస్వాపూర్ వద్ద పార్టీ జెండావిష్కరణ అనంతరం చెరకు రైతుల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన గౌరిగారి భూంరెడ్డి, రాజిరెడ్డి ఎండిపోయిన చెరకు గడలను చూపుతూ తమ ఇక్కట్లు వివరించారు. గిట్టుబాటు ధర పెంచక, పర్మిట్లు దొరక్క దిక్కుతోచడం లేదంటూ వాపోయారు. బెల్లం వండుదామన్నా నానాటికీ దాని ధర పడిపోతోందంటూ వాపోయారు. రైతుల కోసమే దీక్ష చేపట్టానని, చెరకు రైతుల సమస్యల కోసం పోరాడతానని వారికి జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కన్వీనర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ నేత పెద్దపటోళ్ల సిద్ధార్థరెడ్డి, భిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల కన్వీనర్లు తదితరులు బస్వాపూర్ వద్ద జగన్‌కు స్వాగతం పలికారు.

ఇసుకేస్తే రాలని జనం...

బస్వాపూర్ నుంచి నిజామాబాద్ దాకా అన్ని గ్రామాల్లోనూ జననేత కోసం ప్రజలు బారులుదీరారు. కామారెడ్డి, చంద్రయాన్‌పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, ధర్మారం మీదుగా ఆయన సాగారు. ఇక అక్కడి నుంచి ప్రజలు అడుగడుగునా కాన్వాయ్ వద్దకొచ్చి, జగన్‌ను కలిసేందుకు, తమ బాధలు చెప్పుకునేందుకు పోటీపడ్డారు. ఆయన వారికి ఓపికగా సమాధానమిస్తూ సాగారు. నిజామాబాద్ నగరంలో మహిళలు, పాఠశాల విద్యార్థులు కడప ఎంపీకి మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. కలెక్టరేట్ వద్ద 104 సిబ్బంది ధర్నాకు జగన్ సంఘీభావం తెలిపారు. వినతిపత్రం స్వీకరించారు.

పసుపు రైతుల పరామర్శ

నిజామాబాద్ నుంచి ఆర్మూరు వెళ్లే మార్గంలో మాణిక్‌బండార్, మునిపల్లి, అంకాపూర్ మీదుగా వెళుతున్నప్పుడు రైతుల నుంచి భారీగా స్పందన లభించింది. మునిపల్లి వద్ద పసుపు రైతులు ఆయనను పొలాల్లోకి తీసుకెళ్లి తమ దుస్థితిని వివరించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం వద్ద మహిళలు జగన్‌కు మంగళారతులతో స్వాగతం పలికారు. సమీపంలోని లుర్ధు మాత చర్చికి రావాల్సిందిగా క్రైస్తవ సోదరులు, గ్రామస్తులు ఆహ్వానించారు. అక్కడి నుంచి మాధవనగర్ సాయిబాబా అలయం వద్ద జగన్‌కు పూజారి పూలమాల వేసి ఆశీర్వదించారు. ఇక ఆర్మూరులో పట్టణవాసులు అడుగడుగునా పూలవర్షం కురిపించారు. పట్టణంలో దోబీఘాట్ నుంచి గోల్‌బంగ్లా వరకు రోడ్ షో సాగింది. స్థానిక చేనేత కార్మికులు జగన్‌ను పట్టు శాలువాతో సత్కరించారు. బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంత రం మామిడిపల్లి చౌరస్తా మీదుగా వైఎస్సార్ రైతు దీక్షా ప్రాంగణానికి రాత్రి 8 గంటలకు జగన్ చేరుకున్నారు!

మాజీ ఎంపీ గంగారెడ్డి చేరిక

మాజీ ఎంపీ కేశుపల్లి గంగారెడ్డి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక లక్ష్మీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీలో చేరారు. గంగారెడ్డి తదితరులకు జగన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ‘జై జగన్’, ‘వైఎస్సార్ అమర్ రహే’ నినాదాలు మిన్నంటాయి.
Share this article :

0 comments: