గ్యాస్‌పై రూ.25 సబ్సిడీ రద్దు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్యాస్‌పై రూ.25 సబ్సిడీ రద్దు!

గ్యాస్‌పై రూ.25 సబ్సిడీ రద్దు!

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

ఆర్థిక శాఖ ప్రతిపాదనలు
బడ్జెట్‌లో ‘భారం’ తగ్గించుకునే యోచన
నాడు ఒక్కో సిలిండర్‌కు రూ.50 చొప్పున భారం భరించిన వైఎస్ ప్రభుత్వం
పన్ను పోట్లు.. విద్యుత్ వాతలతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా వంట గ్యాస్ వినియోగించే కోటి కుటుంబాలకు గట్టి షాక్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రూ.25 సబ్సిడీ రద్దుకు రంగం సిద్ధం చేస్తోంది. తెల్లకార్డులు ఉన్న వారికి మినహా ఇతరులకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ భావిస్తోంది. కొత్త బడ్జెట్‌లో ఈ సబ్సిడీని పేదలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.53 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లుండగా అందులో పేదల (దీపం పథకం) కనెక్షన్లు 40 లక్షలు ఉన్నాయి. వీరికి మినహా మిగతా కోటికిపైగా కుటుంబాలకు వంట గ్యాస్ సబ్సిడీ రద్దు కానుంది. ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగదారులందరికీ ఒక్కో సిలిండర్‌పై ఇస్తున్న రూ.25 రాయితీకి గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.204 కోట్లు కేటాయించారు. ఇప్పుడు పేద కుటుంబాలకే రాయితీని పరిమితం చేస్తే కొత్త బడ్జెట్‌లో వంట గ్యాస్ రాయితీ భారం గణనీయంగా తగ్గిపోనుంది.

2008 నుంచీ కొనసాగుతున్న సబ్సిడీ

2008 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ.50 పెంచింది. దీంతో సిలిండర్ ధర రూ.305.88 నుంచి రూ.355.88కి చేరింది. రాష్ట్ర ప్రజలపై ఒకేసారి ఇంత భారీగా భారం పడటంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెరిగిన రూ.50 రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ధనిక, పేద, మధ్యతరగతి తేడా లేకుండా మహిళలందరికీ మేలు చేకూరేవిధంగా రూ.50 సబ్సిడీ ఇచ్చారు. దీంతో అప్పట్లో అందరికీ పెను భారం తప్పింది. కొంతకాలం తర్వాత కేంద్రం సిలిండర్ ధరను రూ.330.88కి తగ్గించింది. దాంతో అప్పటినుంచి రూ.25 సబ్సిడీ కొనసాగుతోంది. అయితే 2010 జూన్‌లో కేంద్రం మరోసారి సిలిండర్ ధర పెంచింది. దీనితో అది రూ.343.45కు చేరింది. రోశయ్య ప్రభుత్వం ఆ మేరకు పెరిగిన ధరను సబ్సిడీగా భరించడానికి నిరాకరించింది. తర్వాత 2011లోనూ కేంద్రం గ్యాస్ ధరను పెంచింది. ఈ పెంపు తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.400 (రూ.25 సబ్సిడీతో)గా ఉంది. కేంద్రం పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తే బాగుంటుందని పలువురు మంత్రులు కోరినా కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు 2008 నుంచి కొనసాగుతున్న ఆ రూ.25 సబ్సిడీ కి కూడా కత్తెర వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

చర్చించి తుది నిర్ణయం: మంత్రి ఆనం

వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలపై ఇటీవల పౌరసరఫరాల శాఖతో నిర్వహించిన సమీక్షలో.. వంట గ్యాస్, కందిపప్పులపై కొనసాగుతున్న సబ్సిడీ అంశం చర్చకు వచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనలపై సీఎం సమక్షంలో గానీ, కేబినెట్ సమావేశంలో గానీ చ ర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం వంట గ్యాస్ సబ్సిడీ మంత్రులు, ప్రతిపక్షనేత, ఉన్నతాధికారులందరికీ వర్తిస్తోందని, దీన్ని కేవలం పేదలకే పరిమితం చేయాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిపారు. 

కందిపప్పుకూ ‘కోత’

మహిళలపై ఎక్కువగా ప్రభావం చూపే గ్యాస్ సబ్సిడీ కోతపై దృష్టి సారించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం.. అదే కోవలో మరో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. సబ్సిడీపై కందిపప్పు సరఫరా కూడా ప్రస్తుతం అవసరం లేదని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో 50 రూపాయలకే లభిస్తున్నందున కొత్త బడ్జెట్‌లో సబ్సిడీ కందిపప్పు కోసం నిధులు కేటాయింపులు అవసరం లేదని ఆర్థిక శాఖ భావిస్తోంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో వంద రూపాయలున్న సమయంలో సబ్సిడీపై సరఫరా చేసినా, బడ్జెట్ కేటాయించినా అర్థం ఉంటుందని, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లోనే కిలో కందిపప్పు రూ.50 లభిస్తున్నప్పుడు సబ్సిడీ అవసరం లేదనేది ఆర్థిక శాఖ ఉద్దేశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కందిపప్పు సబ్సిడీకి బడ్జెట్‌లో రూ.257 కోట్లు కేటాయించామని, ఇప్పుడు కందిపప్పు ధర తక్కువగా ఉన్నందున కొత్త బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపు అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే కంది పప్పు కిలో ధర రూ.50 ఉంది. బహిరంగ మార్కెట్‌లో కూడా అంతే ధర ఉన్నందున రేషన్ దుకాణాల నుంచి కందిప్పును ఎవరూ తీసుకోవడం లేదనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేస్తోంది. అయితే రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకు కందిపప్పు సరఫరా చేస్తున్నందునే బహిరంగ మార్కెట్లో ధర నియంత్రణలో ఉందనే విషయాన్ని ఆర్థిక శాఖ గమనించడం లేదనే వాదన బలంగా ఉంది.
Share this article :

0 comments: