రూ. 2,500 కోట్ల భారం నుంచి ఊరట!ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ. 2,500 కోట్ల భారం నుంచి ఊరట!ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం

రూ. 2,500 కోట్ల భారం నుంచి ఊరట!ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

రూ. 2,500 కోట్ల భారం నుంచి ఊరట!
2008-09 సర్‌చార్జీల వసూళ్లకు డిస్కంలను అనుమతిస్తూ
ఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
డిస్కంల ప్రతిపాదనల్లో ఆలస్యాన్ని మాఫీ చేసే అధికారం 
ఈఆర్‌సీకి లేదు.. కాల వ్యవధిని పెంచే అధికారం కూడా లేదు
2008-09కి సంబంధించి డిస్కంల ప్రతిపాదనలు చెల్లుబాటు కావు.. 
అవి కాలపరిమితి దాటిన ప్రతిపాదనలు
ఈఆర్‌సీ ఏకపక్షంగా వ్యవహరించింది: హైకోర్టు ధర్మాసనం
2009-10 సర్‌చార్జీలపై కూడా తీర్పు ప్రభావం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఇంధన సర్దుబాటు చార్జీల బాదుడు నుంచి వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) గట్టి షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి 2008-09 సంవత్సరానికి సంబంధించి రూ.1,649 కోట్ల సర్‌చార్జీలను వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2010లో ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. సర్‌చార్జీ వసూలు ప్రతిపాదనలను డిస్కంలు నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తరువాత సమర్పిస్తే.. ఆ ఆలస్యాన్ని మాఫీ చేస్తూ సర్‌చార్జీల వసూలుకు అనుమతినిచ్చే అధికారం ఈఆర్‌సీకి లేదని తేల్చి చెప్పింది. అలాగే ప్రతిపాదనల సమర్పణ కాలవ్యవధిని పెంచే అధికారం కూడా ఈఆర్‌సీకి ఎంత మాత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 2008-09కి సమర్పించిన ప్రతిపాదనలు చెల్లుబాటుకావని, అవి కాలపరిమితి దాటిన ప్రతిపాదనలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి.లోకూర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ‘స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈఆర్‌సీ వినియోగదారులు, డిస్కంల ప్రయోజనాలను కాపాడేలా సమతుల్యతతో వ్యవహరించాలి. 

డిస్కంలు సహేతుకమైన పద్ధతిలో చార్జీలు వసూలు చేసుకునేలా చూడాలి. కానీ ఈ కేసులో ఈఆర్‌సీ ఏకపక్షంగా వ్యవహరించింది’ అని ధర్మాసనం ఆక్షేపించింది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకొకసారి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాలి. కానీ వెయ్యిరోజులు, ఐదు వందల రోజుల అసాధారణ జాప్యంతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నాయి. ఇదే విధంగా 2008-09 సంవత్సరానికి గృహ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచి రూ.1649 కోట్ల సర్‌చార్జీ వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిస్తూ ఈఆర్‌సీ 2010 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు కంపెనీలు, రైస్ మిల్లర్లు, తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రతిపాదనలు సరైన పద్ధతిలోలేవని, బహిరంగ విచారణ అనంతరం మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంటూ తీర్పునిచ్చారు. నిర్ణీతకాల వ్యవధిలోపు డిస్కంలు ప్రతిపాదనలను సమర్పించలేని పక్షంలో.. కాల వ్యవధిని పెంచే అధికారం ఈఆర్‌సీకి ఉందని పేర్కొన్నారు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు వేర్వేరుగా 153 అప్పీళ్లు దాఖలయ్యాయి. వినియోగదారుల తరఫున న్యాయవాది డి.వి.నాగార్జునబాబు, చల్లా గుణరంజన్, దూళిపాళ్ల రవిప్రసాద్ తదితరులు వాదనలను వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.

కొత్త నిబంధన ప్రకారం కాలవ్యవధి పొడిగింపు కుదరదు: ‘నిర్ణీత కాల వ్యవధిని పొడిగించే అధికారం నిబంధన 59 ప్రకారం ఈఆర్‌సీకి ఉంది. అయితే దీనిని సవరిస్తూ ప్రభుత్వం కొత్త నిబంధన (45-బి(4) తీసుకొచ్చింది. కొత్త నిబంధన ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలోపు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించకుంటే.. కాల వ్యవధి పొడిగించే అధికారం అసలు ఈఆర్‌సీకి లేదు. అందువల్ల కాల వ్యవధిని పొడిగించే అధికారం ఈఆర్‌సీకి ఉందన్న సింగిల్ జడ్జి వాదనతో మేం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో 2008-09 సంవత్సరానికి డిస్కంలు సమర్పించిన సర్‌చార్జీల వసూలు ప్రతిపాదనలు కాలవ్యవధి దాటినవే అవుతాయి’ అని ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది. 

ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు 2009-10 సంవత్సరానికి రూ.1,407 కోట్లు వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ప్రభావం చూపనున్నది. 2009-10 ఆర్థిక సంవత్సరపు సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను కూడా డిస్కంలు ఆలస్యంగా సమర్పించాయి. అందువల్ల రూ.1,407 కోట్లను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేసుకునే అవకాశం డిస్కంలకు ఉండదు. ఫలితంగా గృహ వినియోగదారుల నుంచి యూనిట్‌కు అదనంగా 33.88 పైసలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి యూనిట్‌కు 78 పైసలు చొప్పున ఫిబ్రవరి నుంచి వసూలు చేయాల్సిన మొత్తం రూ.3 వేల కోట్ల సర్దుబాటు చార్జీలకు బ్రేక్ పడినట్లయింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్‌సీ 2008-09, 2009-10 సర్దుబాటు చార్జీలకు అనుమతినిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2008-09 సంవత్సరానికి సంబంధించిన మొత్తం చార్జీల్లో.. గృహ వినియోగదారులకు సంబంధించిన రూ.502 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు.
Share this article :

0 comments: