బిల్లులు కట్టలేకపోతే 25 వేల పల్లెల్లో వీధి దీపాలు వెలగవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లులు కట్టలేకపోతే 25 వేల పల్లెల్లో వీధి దీపాలు వెలగవు

బిల్లులు కట్టలేకపోతే 25 వేల పల్లెల్లో వీధి దీపాలు వెలగవు

Written By ysrcongress on Wednesday, January 18, 2012 | 1/18/2012

విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ పంచాయతీలకు హుకుం 
లేదంటే కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని నోటీసులు 
మొత్తం పంచాయతీలపై రూ. 529 కోట్లకు పైగా భారం
గతంలో ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని హామీ ఇచ్చిన వైఎస్ 
ఆ బాధ్యత నుంచి తప్పుకున్న ప్రస్తుత ప్రభుత్వం 
ఇప్పటికే నిధులు లేక పంచాయతీలు సతమతం 
బిల్లులు కట్టలేకపోతే 25 వేల పల్లెల్లో వీధి దీపాలు వెలగవు
రాష్ట్రంలోని పల్లె సీమల్లో చీకట్లు అలుముకోనున్నాయి. గ్రామ పంచాయతీలన్నీ ఏళ్లనాటి విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నోటీసులు జారీచేస్తున్నాయి. బకాయిలు చెల్లించని పంచాయతీలకు కరెంటు కనెక్షన్‌ను కట్ చేస్తామని ఈ నోటీసుల్లో స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు రూ. 529.36 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని 21,807 మైనర్ పంచాయతీలు రూ. 360 కోట్లు, 1,245 మేజర్ పంచాయతీలు రూ. 170 కోట్ల వరకూ కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే నిధుల లేమితో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలు.. కరెంటు బిల్లులు కూడా చెల్లించలేక చీకట్లో మగ్గాల్సిన దుస్థితికి సర్కారు నెట్టివేస్తోంది. 

సర్కారే చెల్లిస్తుందని వైఎస్ హామీ...: వాస్తవానికి.. అంతంత మాత్రం నిధులతో సతమతమయ్యే గ్రామ పంచాయతీలపై కరెంటు భారం వేయటం సరికాదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు. పంచాయతీల కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని 2009లో హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పుకుంది. ఇప్పటివరకు ఉన్న కరెంటు బకాయిలతో పాటు.. ఇకపై ప్రతి నెలా కరెంటు బిల్లులను కూడా ఆయా పంచాయతీలే చెల్లించాలని గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలంటూ తాజాగా పంచాయతీలకు డిస్కంలు నోటీసులు జారీచేస్తున్నాయి. 

ఇక పంచాయతీల్లో చీకట్లే... 

పంచాయతీల కరెంటు బిల్లులను గత ఏడాది ఏప్రిల్‌లోనే ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వం మంజూరు చేసే నిధుల్లో మొదటి ప్రాధాన్యతగా కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా గత నవంబర్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఆదేశించింది. పెరిగిన కరెంటు బిల్లులతోనే పంచాయతీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పనులకే నిధులు లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఈ బకాయిలు చెల్లించాల్సి రావటం మరింత భారంగా మారనుంది. నిధులు లేక కరెంటు బిల్లులు చెల్లించని పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిచిపోనుంది. దీంతో ఇప్పటికే గ్రామాల్లో ఇళ్లకు గంటల తరబడి విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పంచాయతీలకు కూడా కరెంటు సరఫరా నిలిచిపోతే గ్రామాల్లో వీధి దీపాలు వెలగవు. పల్లెలన్నీ చీకట్లో మగ్గాల్సి వస్తుంది. తాగునీటికీ ఇబ్బందులు తలెత్తనున్నాయి. అదే జరిగితే రానున్న వేసవి కాలంలో గ్రామీణ ప్రజలకు తాగునీరు దొరకటమే గగనంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 

కరెంటు ఫస్ట్... కాంట్రాక్టర్లు నెక్ట్స్... 

రాష్ట్రంలోని మునిసిపాలిటీలు కూడా కరెంటు బకాయిల సమస్యను ఎదుర్కొంటున్నాయి. మొత్తం రూ. 146.21 కోట్ల మేర మునిసిపాలిటీలు బకాయిలు పడి ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని మునిసిపల్‌శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేసైనా సరే.. కరెంటు బిల్లులు కట్టాలంటూ ఈ ఆదేశాల్లో అన్ని మునిసిపాలిటీలకూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కరెంటు బకాయిలను మునిసిపాలిటీలు చెల్లిస్తున్నాయి. ఇది మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Share this article :

0 comments: