30 లక్షల టన్నులు తగ్గిపోనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 30 లక్షల టన్నులు తగ్గిపోనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి

30 లక్షల టన్నులు తగ్గిపోనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012

పెను సంక్షోభంలో వ్యవసాయం
30 లక్షల టన్నులు తగ్గిపోనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి
ఒక్క బియ్యం ఉత్పత్తే 24 లక్షల టన్నుల తగ్గుదల
సజ్జలు, మొక్కజొన్నలు, రాగుల ఉత్పత్తిలోనూ భారీ క్షీణత
7 లక్షల టన్నులు తగ్గనున్న నూనె గింజల ఉత్పత్తి
అర్థగణాంక శాఖ రెండో ముందస్తు అంచనాలు
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయరంగం వాటా గణనీయంగా తగ్గిపోయే అవకాశం
 అటు కరువు.. ఇటు ధరల దరువు.. ఓవైపు కరెంటు కోతలు.. మరోవైపు క్రాప్ హాలిడేలు.. వీటన్నింటికీ మించి సర్కారు నిర్లక్ష్యం! ఫలితంగా రాష్ట్రంలో సాగు పెను సంక్షోభంలో పడిపోయింది. వ్యవసాయోత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గత ఏడాది రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ పరిస్థితి అంతా తలకిందులైంది. రాష్ట్రంలో ప్రధానమైన వరి, వేరుశనగ, మొక్కజొన్నలతోపాటు అన్ని పంటల ఉత్పత్తులు తగ్గిపోయాయి. పంటల సాగు, ఉత్పత్తి, దిగుబడులపై అధ్యయనం చేసి సాక్షాత్తూ రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన నివేదికనే ఈ వాస్తవాలను వెల్లడించింది. ఈ శాఖ తాజాగా రూపొందించిన రెండో ముందస్తు అంచనాల నివేదికను శనివారం ప్రభుత్వానికి నివేదించింది. 

ఈ నివేదికను పరిశీలిస్తే రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఒక్క బియ్యం ఉత్పత్తే ఏకంగా 24.66 లక్షల టన్నులు తగ్గిపోనుంది. మొత్తమ్మీద బియ్యం, సజ్జలు, మొక్కజొన్నలు, రాగులు వంటి పూర్తిస్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే ఏకంగా 30 లక్షల టన్నులు తగ్గనుందని అంచనాలు చెబుతున్నాయి. అడ్డగోలు కరెంటు కోతలతో ఈ ఏడాది 85.60 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో సాగు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అన్ని పంటల ఉత్పత్తి పడిపోవడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో వ్యవసాయ వాటా తగ్గిపోయే ప్రమాదం తలెత్తింది. ఇలా జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా తగ్గిపోవడం గడిచిన ఏడేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు విశ్లేషిస్తున్నారు!

దిగుబడి దిగదుడుపే...

ఖరీఫ్, రబీల్లో కలిపి రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం దాదాపు మూడు కోట్ల ఎకరాలు. కానీ గిట్టుబాటు ధర దక్కక కడుపు మండిన అన్నదాత చాలాచోట్లా క్రాప్ హాలిడే ప్రకటించాడు. సర్కారు ప్రాథమ్యాలు మరిచి వ్యవసాయానికే ముందుగా కరెంటు కోతలు విధించింది. కరువు కోరలు చాచింది. ఫలితంగా ఈ ఏడాది 2.50 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో 2.24 కోట్ల ఎకరాల్లో పంటలు వేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నా.. 1.94 కోట్ల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. సరిగ్గా పంటలు పూత, కాత దశకు వచ్చిన సెప్టెంబరు నుంచి రాష్ట్రంలో వర్షాల్లేవు. ఇలాంటి సమయంలో వ్యవసాయానికి సరిపడా కరెంటు ఇవ్వాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 

దీంతో లక్షల ఎకరాల్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇవిపోను మిగిలిన విస్తీర్ణంలోని పంటల దిగుబడి సైతం బాగా తగ్గిపోయింది. బియ్యం, సజ్జలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలుఇలా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గనుందని అంచనాలు చెబుతున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో బియ్యం (క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యం వ స్తుంది) ఉత్పత్తి 143.85 లక్షల టన్నులు ఉండగా ఇప్పుడు ఇది 119.19కి పడిపోయింది. అలాగే మొక్కజొన్న ఉత్పత్తి గత ఏడాది 40 లక్షల టన్నులు కాగా ఇప్పుడు ఇది 35 లక్షలకు తగ్గిపోయింది. ఇక వేరుశనగ గతేడాదితో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయి 7 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతుందన్నది అర్థ గణాంక శాఖ అంచనా! అలాగే నూనెగింజల ఉత్పత్తి కూడా 19 లక్షల టన్నుల నుంచి 12 లక్షల టన్నులకు పడిపోయింది.

రబీ ఆశలు అంతంతే...!

ఈసారి ఖరీఫ్ పరిస్థితి దారుణంగా ఉండగా రబీలో అస్సలు వర్షాలే లేవు. రబీలో వ్యవసాయ శాఖ.. కోటి ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 50 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కరువుతో వరి సాగు చేసే పరిస్థితి లేకపోవడం, మిగిలిన పంటల సాగు పూర్తి కావడంతో ఇక సాగు విస్తీర్ణం పెరిగే సూచనలు కనిపించడంలేదు. దీంతో సగటు ఉత్పత్తి మరింత తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.

కరువుపై ముందే మేల్కొని ఉంటే..

రాష్ట్రవ్యాప్తంగా 1076 గ్రామీణ మండలాలు ఉండగా తీవ్రమైన వర్షాభావం కారణంగా 876 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ పని కూడా దశలవారీగా చేయడంతో పంట నష్టం అంచనా నివేదిక రూపొందించడంలో ఆలస్యమైంది. మూడు నెలల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు పూర్తయినా.. దీంతో పెద్దగా ఒరిగేది ఉండదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. నష్టం అంచనాల నివేదిక కేంద్రానికి చేరి అధికారుల బృందం పరిశీలించి వెళ్లిన కొన్ని నెలలకుగానీ రాష్ట్రానికి సాయం రాదు. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరిగినా రైతులకు కరువు పరిహారం పంపిణీ మొదలయ్యేసరికి కనీసం మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో సర్కారు ముందుగానే మేల్కొని, నష్టం అంచనాలను సేకరించి, రైతులను ఆర్థికంగా ఆదుకొని ఉంటే పంటల విస్తీర్ణం కాస్తయినా పెరిగి ఉండేది. కానీ ప్రభుత్వం అలా చేయకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది.
Share this article :

0 comments: