ప్రస్తుతం ఈ ఏడాది బకాయిలు రూ.3,200 కోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రస్తుతం ఈ ఏడాది బకాయిలు రూ.3,200 కోట్లు

ప్రస్తుతం ఈ ఏడాది బకాయిలు రూ.3,200 కోట్లు

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

* ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నేడు ఒంగోలులో ధర్నాలో పాల్గొననున్న జగన్
* రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు
* నిధుల విడుదలలో కావాలనే సర్కారు తాత్సారం.. వేల కోట్లకు చేరుతున్న బకాయిలు
* విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలైనా రూపాయి ఇవ్వలేదు
* ఈ ఏడాది బడ్జెట్.. పాత బకాయిలకే సరి.. గతేడాది స్కాలర్‌షిప్‌లకూ దిక్కులేదు
* ప్రస్తుతం ఈ ఏడాది బకాయిలు రూ.3,200 కోట్లు

ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదివి డాక్టరో.. ఇంజనీరో అయితే వారింట పేదరికం పోతుంది
- దివంగత మహానేత వైఎస్‌ఆర్ స్వప్నం

నా బిడ్డ గొప్ప చదువులు చదవాలి. ఉద్యోగం చేయాలి.. అప్పుడు మా కట్టాలు పోతాయి. కన్నీళ్లు పోతాయి
- పేద తల్లిదండ్రుల ఆశ

బాగా చదివి డాక్టరో.. కలెక్టరో అయ్యి అమ్మానాన్నలకు అండగా నిలవాలి
- పేద విద్యార్థి కల

ఈ ఫీజు నిధులు మిగుల్చుకోవాలి.. మొదట ఇది వర్తించే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గించాలి.. తర్వాత ఈ పథకం ప్రభుత్వానికి ఓ గుదిబండ అని అందర్నీ నమ్మించాలి.. పథకాన్ని ఎత్తేయాలి. తద్వారా పేదల మది నుంచి వైఎస్ పేరు తుడిచేయాలి
- ఇదీ ప్రస్తుత రాష్ట్ర సర్కారు లక్ష్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: పేదింట్లో విద్యా కుసుమాలు వికసించాలని.. పేదరిక కష్టాలు పోవాలని మహానేత వైఎస్ కలలుగంటే.. ఈ రాష్ట్ర సర్కారు మాత్రం ఆ కలల్ని కల్లలుగా మార్చేస్తోంది. పెద్ద చదువులు చదవాలన్న తలపు పేదింట రావాలంటేనే భయంపట్టుకునే చంద్రబాబు పాలనా కాలాన్ని తీసుకొచ్చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ముప్పై ఆంక్షలు-అరవై పరిమితులతో.. అది వర్తించే విద్యార్థుల సంఖ్యను ఘోరంగా కుదించేసిన ప్రభుత్వం.. సకాలంలో నిధులు విడుదల చేయకుండా బడ్జెట్‌ను పేరుకుపోయేలా చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమయి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయీ చెల్లించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వారి బాధను రాష్ట్ర సర్కారుకు వినిపించి.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట బుధవారం ధర్నా నిర్వహించనున్నారు.

ఈ ఏటి బడ్జెట్.. పాత బకాయిలకే సరి
వైఎస్ మరణించాక ఫీజుల పథకానికి వరుసగా ఆంక్షలు పెట్టి.. విద్యార్థులకు నష్టం కలిగించే పనులు తప్ప లాభం కలిగించే ఒక్క నిర్ణయమూ తీసుకోని రాష్ట్ర సర్కారు పథకానికి డబ్బులు చెల్లించకుండా కళాశాలల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మనోవేదనకు గురిచేస్తోంది. గతేడాది అంటే 2010-11కు సంబంధించి బడ్జెట్‌లో ప్రభుత్వ పెద్దలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,700 కోట్లు చూపెట్టారు కానీ కేవలం రూ.999 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అంతకుముందు 2008-09, 2009-10కి సంబంధించిన బకాయిలు కూడా కలిపి మొత్తం రూ.3,600 కోట్లు వెచ్చించాల్సి ఉండగా, 2010-11లో విడుదల చేసిన రూ. 999 కోట్లు పోను మిగిలినదంతా 2011-12 బడ్జెట్ నుంచి ఖర్చు చేశారు. అంటే రూ. 2,913.47 కోట్ల ఈ ఏడాది బడ్జెట్‌లో దాదాపు 2,600 కోట్ల రూపాయలు పాత బకాయిలకే చెల్లయిపోయాయి. దీంతో ఈ ఏడాదికి ఫీజుల చెల్లింపునకుగాను కేవలం రూ. 313 కోట్లే మిగిలాయి. 

ఈ ఏడాదికి రూ.3,500 కోట్ల వరకు ఖర్చవుతుందన్న ప్రభుత్వ అంచనా మేరకుఈ ఏడాదికి ఇంకా రూ.3,200 కోట్ల పైచిలుకు నిధులు కావాలి. మరి ఆ డబ్బులు ఎక్కడినుంచి ఇస్తారన్నదే అసలు సమస్య. ఈ ఏడాది నిధులు వచ్చే ఏడాది చెల్లించాలంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరం 2012 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడుగానీ ఫీజుల చెల్లింపు ప్రారంభం కాదు. అప్పటివరకు రూపాయి చెల్లించని పరిస్థితుల్లో అటు కళాశాలల యాజమాన్యాలు ఏం చేస్తాయన్నది అర్థంకాని పరిస్థితి.

మళ్లీ సుప్రీంకెళ్లాలా?
గత ఏడాది ఫీజుల చెల్లింపు జాప్యం జరిగిన పరిస్థితుల్లో ఏకంగా కళాశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలు మూసివేస్తామని బెదిరించాయి. కళాశాలలను బుజ్జగించి వారికి బకాయిలతో సహా చెల్లించింది సర్కారు. ఇక, ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి కూడా ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలు.. విద్యార్థులను ఫీజులు అడగడం మొదలు పెట్టాయి. గత ఏడాది పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈఏడాది ఫీజుల కింద చెల్లించేందుకు ఇంకా రూ.3,200 కోట్లకుపైగా అదనంగా కేటాయించాల్సిందే. ఈ ఏడాదికి ఏదో విధంగా కొంత సర్దుబాటు చేసినా వచ్చే ఏడాది నాటికి ఫీజుల కష్టాలు తీరాలంటే రూ.7,000 కోట్లు బడ్జెట్‌లో పెట్టి, మొత్తం ఖర్చు చేయాల్సిందే. ఇక విద్యార్థుల స్కాలర్‌షిప్ విషయానికొస్తే గత ఏడాది వాటికీ దిక్కులేకుండా పోయింది. ఎప్పుడో ఐదు నెలల క్రింత స్కాలర్‌షిప్‌లకు రూ. 900 కోట్లు విడుదల చేసినా విద్యార్థుల ఖాతాల్లోకి రూపాయి కూడా రాలేదు.

కోర్టు తీర్పు అదనుగా..
ఫీజుల పథకం అమలులో జాప్యం చేసేందుకు, నిధులు విడుదల చేయకుండా తప్పించుకునేందుకు సర్కారుకు అనుకోని అస్త్రం లభించింది. వృత్తివిద్యా కళాశాలల్లో మేనేజ్‌మెంట్, కన్వీనర్ కోటాల కింద వేర్వేరు ఫీజులు కాకుండా ఏకీకృత ఫీజు ఉండాలంటూ ప్రస్తుతం అమలవుతున్న ఫీజుల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు గత అక్టోబర్‌లో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం ఎగిరి గంతేసింది. ఏకీకృత ఫీజు అమలు ఈ ఏడాది సాధ్యం కాదని తెలిసినా వ్యూహాత్మకంగా కోర్టు తీర్పును సవాల్ చేయడంలో జాప్యం ప్రదర్శించింది. తీర్పు వచ్చిన నెలన్నరకు సుప్రీంలో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయగా.. ఇప్పటివరకు ఆ కేసు కనీసం విచారణకు కూడా రాలేదు. రాష్ట్రంలో ఫీజుల పథకానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వీలున్నంత త్వరగా తమ పిటిషన్‌ను పరిష్కరించాలని సుప్రీంను అభ్యర్థించడంలో కూడా సర్కారు విఫలమయింది. కోర్టు నెపంతో ఫీజుల పథకానికి నిధులివ్వకుండా ఉండవచ్చని, అందుకే ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న వాదనలు కూడా ఉన్నాయి.

కొత్త బకాయిలు అడిగితే.. పాత బకాయిల మాటేల..
విద్యార్థుల భవిష్యత్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) స్పందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద పూర్తిగా చెల్లింపులు చేశామని, 2010-11 వరకు ఎలాంటి బకాయిలూ లేవని పేర్కొంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి.. వాస్తవాలకు మసిపూయడానికి యత్నించింది. వాస్తవానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది(2011-12)కి సంబంధించిన నిధుల విడుదల కోసం ఆందోళన చేస్తుండగా.. పాత సంవత్సర బకాయిలు చెల్లించేశామంటూ సీఎంవో ప్రకటన ఇచ్చింది. 

ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫీజులు చెల్లించలేదని, ఒక్క విద్యారికీ స్కాలర్‌షిప్ ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ స్పష్టంచేసింది. సీఎంవో ఇచ్చిన ప్రకటనలో ఈ ఏడాది ఫీజుల ప్రస్తావన ఎక్కడాలేదు. ఈ ఏడాది బడ్జెట్ ఎంత కేటాయించారు? ఖర్చైంది ఎంత? మిగిలింది ఎంత? ఈ ఏడాదికి ఎంత బడ్జెట్ అవసరం? వాటిని ఎప్పుడు చెల్లిస్తారు? అనే విషయాలను సీఎంవో దాటవేసింది. విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల ప్రస్తావన అసలే లేదు. 

ఇక 2010-11 సంవత్సరం వరకు రూ.5,260 కోట్లు చెల్లించామని సీఎంవో చెపుతున్న లెక్కలు... బడ్జెట్ లెక్కలతో పోలిస్తే పచ్చి అబద్ధాలని తేలిపోతోంది. కొసమెరుపు ఏమంటే.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇటీవలే ముగిసిందని, త్వరలోనే వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి ఫీజుల చెల్లింపు ప్రారంభిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. కానీ, దరాఖాస్తు ప్రక్రియ ఇంకా ముగియనేలేదు. ఈ నెల 15 వరకు గడువు పొడిగిస్తున్నట్లు సంబంధిత మంత్రి పితాని సత్యనారాయణ గతంలో చెప్పారు. ఇదేవిషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ మంగళవారం పత్రికా ప్రకటన రూపంలో తెలియజేశారు. సీఎంవో మాత్రం దరఖాస్తు ప్రక్రియ ముగిసిందని పేర్కొనడం బట్టి చూస్తే ఈ పథకం అమలుపట్ల ప్రభుత్వానికి ఏమేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.

అన్నీ ఆంక్షలు... 
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు విధించిన ఆంక్షల్లో ముఖ్యమైనవి..

* ఈ పథకం నుంచి సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులను తొలగించడంతో ఆంక్షలను మొదలుపెట్టారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సు ఫీజు ఎంత ఉన్నా గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు.

* డబుల్ పీజీలకు కూడా గతంలో ఫీజు తిరిగిచెల్లిస్తుండగా, ఇప్పుడు డిగ్రీ తర్వాత ఒక్క పీజీకే వర్తింపజేస్తున్నారు.

* వయోపరిమితిని కుదించారు. 70 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పథకం కింద చదువుకుంటున్నారని, ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం వయోపరిమితి నిబంధన విధిస్తామంటూ కోర్సుల వారీగా వయసును వర్గీకరించారు.

* గత ఏడాది వరకు పారా మెడికల్ విభాగంలో 26 కోర్సులకు పథకం వర్తిస్తుండగా, దానిని 17కు కుదించారు. ఫ్యాషన్‌టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్ (వృత్తివిద్య), కలినరీ ఆర్ట్ వంటి సర్టిఫికెట్ కోర్సులను జాబితా నుంచి ఎత్తివేశారు.

* అసలు ఈ పథకం నుంచి ఏకంగా పీజీ కోర్సులన్నింటినీ తీసేయాలని, డిగ్రీ కోర్సుల వరకే పరిమితం చేయాలని సర్కారు వేసిన పాచిక పారలేదు. ఈ విషయాన్ని పత్రికలు వెలుగులోనికి తీసుకురావడంతో తాత్కాలికంగా ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

* గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధి పొందిన వీరి నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నారు. పీహెచ్‌డీ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచి తొలగించనున్నారు. పీహెచ్‌డీ చేస్తున్న కొందరు విద్యార్థులకు ఫెలోషిప్ వస్తుందన్న సాకుతో పరిశోధన చేస్తున్న అందరు విద్యార్థులనూ మినహాయించడం గమనార్హం.

* ఇతర రాష్ట్రాల్లో చదివే మన రాష్ట్ర విద్యార్థులకు కూడా కోతలు పెట్టారు. భారత ప్రభుత్వం గుర్తించిన 183 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ చేయాలని, మిగిలిన వారికి ఇవ్వకూడదని నిర్ణయించారు.

* అఫిడవిట్, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ ఉంటేనే అర్హులని నిబంధనలు పెట్టిన సర్కారు ఈ ఏడాది మార్చి 31కల్లా ఆధార్ కార్డు పొందిన వారినే అర్హులుగా పరిగణిస్తామంది.

* గతంలో పైతరగతులకు ప్రమోటైన అభ్యర్థులకూ అవకాశమిస్తుండగా... ఇకపై అన్నీ పాసయితేనే రెన్యువల్‌చేస్తారు.

* ఆదాయ, కుల ధ్రువపత్రాల్లో అక్రమాలు నిరోధించాలన్న సాకుతో విజిలెన్స్ తనిఖీలు చేయనున్నారు. ఈ పత్రాలను నిరోధించడం ద్వారా లబ్ధిదారులను తగ్గించవచ్చన్నది వ్యూహం.
Share this article :

0 comments: