నిజామాబాద్‌లో 40 శాతం తగ్గిన దిగుబడి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజామాబాద్‌లో 40 శాతం తగ్గిన దిగుబడి..

నిజామాబాద్‌లో 40 శాతం తగ్గిన దిగుబడి..

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012


40 శాతం పడిపోయిన దిగుబడి
ధరలు కూడా పతనమవుతుండటంతో దిక్కుతోచని రైతన్నలు
పెట్టుబడి ఖర్చుల్లో సగమైనా దక్కని పరిస్థితి... పట్టించుకోని ప్రభుత్వాలు
ఇష్టారాజ్యంగా ధరలను నియంత్రిస్తున్న వ్యాపారులు

నిజామాబాద్ ప్రతినిధి, న్యూస్‌లైన్: ప్రకృతి ప్రకోపానికి సర్కారు నిర్లక్ష్యం తోడైంది. పచ్చని పంటల ఆశలన్నీ కరెంటు కోతలతో ఆవిరయ్యాయి. ఫలితం.. సిరుల పంట అయిన పసుపు నేడు రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది! నిన్నటిదాకా లాభాలు ఆర్జించి పెట్టిన పంట.. ఇప్పుడు రైతన్నను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రభుత్వం అడ్డగోలుగా విధించిన కరెంటు కోతల కారణంగా పంట దిగుబడి గణనీయంగా పడిపోయింది. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు ధరలూ పతనమవుతుండటంతో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. లాభాలు కాదు కదా.. పెట్టిన పెట్టుబడి ఖర్చుల్లో సగమైనా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. గిట్టుబాటు ధర కోసం ఢిల్లీ దాకా వెళ్లి ఆందోళన చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. వ్యాపారులే ఇష్టారాజ్యంగా ధరలను నియంత్రిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు!

నిజామాబాద్‌లో 40 శాతం తగ్గిన దిగుబడి..

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు ప్రాంతంలో పసుపు బాగా పండిస్తారు. ఈ ఖరీఫ్‌లో 35 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ఆర్మూరుతో పాటు రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి, విజయనగరం తదితర జిల్లాల్లోనూ పసుపు సాగవుతోంది. ఆర్మూరు ప్రాంతంలోని ఎర్రనేలలు పసుపు పంటకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ పెద్దఎత్తున రైతులు పసుపు వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా 20 వేల ఎకరాలకే పరిమితమయ్యే పసుపు విస్తీర్ణం... రెండేళ్ల క్రితం మంచి ధర పలకటంతో ఈసారి 35 వేల ఎకరాలకు చేరింది. అయితే ప్రస్తుతం రైతు ఆశలన్నీ తలకిందులయ్యాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సరిగ్గా పడలేదు. పంట ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. మొదట్లో వానల్లేక నష్టపోతే.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు ముంచెత్తి పంటను దెబ్బతీశాయి. పొలాల్లో నీళ్లు నిలిచిపోయి తెగుళ్లు సోకాయి. ఇలా రెండు గండాలు దాటుకుని నిలిచిన పంటపై కరెంటు కోతల రూపంలో మూడో దెబ్బపడింది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలోనే విద్యుత్ కోతలు విధించడంతో పంటకు నీరందక దుంపకుళ్లు వ్యాధి సోకింది. ఫలితంగా దిగుబడి 40 శాతం తగ్గిపోయింది.

వ్యాపారులు ఆడిందే ఆట...

సీజన్ ముగిసిన తర్వాత ఆకాశాన్నంటే పసుపు ధర రైతుల చేతికి పంట వచ్చే సమయానికి మాత్రం పాతాళానికి పడిపోతోంది. వ్యాపారులు ధరలను నియంత్రిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం రైతులు పసుపు పంటను పూర్తిగా అమ్ముకున్న తర్వాత క్వింటాలు పసుపు ధర ఒక్కసారిగా రూ.17 వేలకు ఎగబాకింది. పసుపు నిల్వ చేసుకున్న వ్యాపారులు కోట్లకు పడగలెత్తగా.. ముందుగా పంటను అమ్ముకున్న రైతు నిండా మునిగాడు. పసుపు సుగంధ్ర ద్రవ్యపంటల కిందకు వస్తుందన్న కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంటకు గిట్టుబాటు ధరను నిర్ణయించలేకపోతున్నాయి. దీంతో వ్యాపారులు సిండికేటుగా మారి ధరలను శాసిస్తున్నారు. పసుపు ఎగుమతులు చేసే వ్యాపారులు దిగుబడి వచ్చే సమయంలో ధరను తగ్గించి, దళారుల చేతికి చేరగానే ధరలు పెంచేస్తున్నారు. గత ఏడాది రూ.5,000 వరకు చేరిన ధర ప్రస్తుతం రూ.4,300 నుంచి 4,800 వరకు మాత్రమే పలుకుతోంది. పంటను నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌స్టోరేజీ లాంటి సౌకర్యాలు లేకపోవటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. జిల్లాలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి కొత్త వంగడాలను అభివృద్ధి చేయాలని, పసుపు ఆధార పరిశ్రమలను నెలకొల్పాలని రైతులు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నా ఫలితం లేదు. నాలుగేళ్ల కిందట క్వింటాలు ధర ఏకంగా 2,000కు పడిపోవటంతో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.

రైతులు ఏమడుగుతున్నారు..?

క్వింటాలుకు 15 వేల ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, పసుపు కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు ఎప్పట్నుంచో కోరుతున్నారు. అధిక దిగుబడినిచ్చే విత్తన కొమ్ములను సబ్సిడీపై అందించాలని, బిందుసేద్యాన్ని ప్రోత్సహిస్తూ 90 శాతం సబ్సిడీపై పరికరాలను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొలాల్లో నీటి తొట్టెల నిర్మాణానికి 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని, పసుపు పండించే అన్ని గ్రామాల్లో ప్రభుత్వం గోదాములు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు యూనిట్‌గా బీమా వర్తింప చేయాలని. పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు.
Share this article :

0 comments: